Share News

Public Health: మత్తులో తూగుతోంది ప్రజాస్వామ్యం!

ABN , Publish Date - Jan 09 , 2026 | 04:50 AM

గత ఒక్క ఏడాదే రాష్ట్ర ఖజానాలోకి రూ.30,188కోట్ల ఆదాయం మద్యం అమ్మకాల ద్వారా వచ్చిపడింది. ఇది కేవలం పది నెలల ఆదాయం మాత్రమే! ఒక మనిషి సంవత్సరంలో 11,351 రూపాయలు కేవలం...

Public Health: మత్తులో తూగుతోంది ప్రజాస్వామ్యం!

గత ఒక్క ఏడాదే రాష్ట్ర ఖజానాలోకి రూ.30,188కోట్ల ఆదాయం మద్యం అమ్మకాల ద్వారా వచ్చిపడింది. ఇది కేవలం పది నెలల ఆదాయం మాత్రమే! ఒక మనిషి సంవత్సరంలో 11,351 రూపాయలు కేవలం మద్యం కోసమే ఖర్చు చేస్తున్నాడు! ప్రభుత్వానికి 30శాతం ఆదాయం మద్యం నుంచే వస్తున్న పరిస్థితిలో, ఇదే బావుంది అని ఇలాగే కొనసాగితే, ప్రజల ప్రాణాలూ, కుటుంబాల భవిష్యత్తూ అంతా తాకట్టు పెట్టినట్లే.

దేశ జనాభాలో 75శాతం మంది దళిత–బహుజన, మైనార్టీ, పేద ప్రజలే. మద్యం విధ్వంసానికి గురయ్యేది వీరే. ధనికుడికి మద్యం ఒక అలవాటు; పేదవాడికి మద్యం ఒక జీవిత శిక్ష. అతని తాగుడులో కరిగిపోతున్నది తన పిల్లల చదువుతో పాటు, తన భార్య భద్రత, తన తల్లిదండ్రుల గౌరవం కూడా. మద్యం కుటుంబాలను కూల్చడమే కాదు– ప్రజాస్వామ్యాన్నే మత్తులో ముంచుతుంది. ప్రజలను ఆలోచించకుండా, నిజాయితీగల వారిని ఎన్నుకోకుండా చేసే స్థితికి నెట్టేస్తోంది. ఓటు అనే ఆయుధం బాటిల్‌కు లొంగుతున్న ఫలితంగా క్రిమినల్‌ కేసుల్లో ఇరుక్కున్నవారు చట్టసభలలోకి ప్రవేశిస్తున్నారు. ఇక, మద్యం వల్ల వచ్చే సమస్యలు, వ్యాధులు, ప్రమాదాలు, హింసలకు చికిత్స పేరుతో ఆసుపత్రుల్లో లక్షల బిల్లులు వేస్తున్నారు. మద్యం – వ్యాధి – అప్పు – పేదరికం– మళ్లీ మద్యం– ఈ చక్రం నుంచి పేద కుటుంబం బయటపడే దారే లేకుండా పోతోంది. మద్యం మత్తులో నేరాలు పెరుగుతున్నాయి. స్త్రీలపై అత్యాచారాలు, హత్యలు, కుటుంబ వ్యవస్థ పతనం... ఇవన్నీ ఈ విధ్వంసక వ్యవస్థ ఫలితాలే. ఈ మద్యం విధానం వెనుక మరో ఘోరమైన అన్యాయం ఉంది.


ఆదివాసీలు, గిరిజనులు తరతరాలుగా తయారుచేసే ఇప్ప సారా, గ్రామాలలో గీతకార్మికులు గీసే సంప్రదాయ కల్లు వంటివి ప్రజల ఆరోగ్యానికి హానికరం అన్నది అబద్ధం. ఆధునిక వైద్య పరిశోధనలు కూడా వాటి ఔషధ విలువలను గుర్తించాయి. కానీ అంతర్జాతీయ కంపెనీలు, అగ్రకుల ధనికవర్గ రాజకీయాలు కలిసి ఈ సంప్రదాయాలను ‘‘విషం’’గా ముద్ర వేసి నాశనం చేశాయి. ప్రపంచంలోని చాలా దేశాల్లో, ముఖ్యంగా సౌదీ అరేబియా, లిబియా, కువైట్‌, సోమాలియా, మౌరిటేనియా, సూడాన్‌, పాకిస్థాన్‌, బ్రూనై, మాల్దీవులు, బంగ్లాదేశ్‌ వంటి దేశాలలో మద్యం మీద పూర్తి నిషేధాలు లేదా తీవ్ర నియంత్రణలు అమల్లో ఉన్నాయి. కొన్ని దేశాలలో పరిమిత సడలింపులు ఉన్నా, ప్రజల ఆరోగ్యం, సమాజ భద్రతే ప్రభుత్వ విధానాల ప్రధాన లక్ష్యంగా ఉంది.

‘మద్యం లేకుండా పాలన సాధ్యం కాదు’ అనే వాదన అబద్ధం మాత్రమే కాదు– అది పాలకుల అలసత్వానికి, లాభపరత్వానికి కప్పిన ముసుగు. ఇది అభివృద్ధి కాదు, మెజారిటీ ప్రజలపై అమలవుతున్న శాంతమైన హత్యా విధానం. తుపాకీతో చంపితే నేరం, మద్యం విధానంతో సమాజాన్ని కూల్చితే పాలన– ఇదే ఈ వ్యవస్థ అసలు ముఖం.

పాపని నాగరాజు (సత్యశోధక మహాసభ)

Updated Date - Jan 09 , 2026 | 04:51 AM