Share News

నాటి రాజులే ప్రజల మాట విన్నారు!

ABN , Publish Date - Oct 23 , 2026 | 02:26 AM

ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే యూరప్‌లో రాజులు ప్రజల ప్రతినిధుల మాట వినడం ప్రారంభించారు. మరి ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన నేటి ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ప్రజలకు..

నాటి రాజులే ప్రజల మాట విన్నారు!

ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే యూరప్‌లో రాజులు ప్రజల ప్రతినిధుల మాట వినడం ప్రారంభించారు. మరి ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన నేటి ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ప్రజలకు సమాధానం చెప్పడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? రాజరికంలోనే ప్రజాభిప్రాయానికి విలువ పెరిగితే, ప్రజాస్వామ్యంలో నాయకులు నయా రాజులుగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం?

1188లో స్పెయిన్‌లోని లియోన్ రాజు తొమ్మిదవ అల్ఫోన్సో ప్రజాప్రతినిధులను సభలో భాగస్వాములను చేశారు. 1789లో ఫ్రాన్స్ రాజు పదహారవ లూయీ ప్రజాప్రతినిధుల సభను సమావేశపరిచారు. అనంతరం ప్రజా ఉద్యమాలు రాజరికపు అధికారాలను మరింత పరిమితం చేశాయి. ప్రజల మాట వినని రాజరికాలు చివరకు చరిత్రలో కలిసిపోయాయి. 1992లో విండ్సర్ కోట అగ్నిప్రమాదానికి గురైనప్పుడు మరమ్మతుల ఖర్చును ప్రజలపై మోపడంపై విమర్శలు వచ్చాయి. ప్రజాభిప్రాయాన్ని గౌరవించిన రెండవ ఎలిజబెత్ 1993 నుంచి ఆదాయపు పన్ను చెల్లించడానికి అంగీకరించారు. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లోని కొన్ని భాగాలను సందర్శకులకు తెరిచి, ప్రవేశ రుసుముల ద్వారా విండ్సర్ కోట పునరుద్ధరణకు నిధులు సమకూర్చారు. వ్యక్తిగతంగా కూడా నిధులు అందించారు. రాజరిక వ్యవస్థలో ఉన్న రాణి ప్రజల అభిప్రాయానికి స్పందించగలిగినప్పుడు, ప్రజాస్వామ్య పాలకులు ఎందుకు స్పందించలేరు?


భారతదేశంలో రాజులు లేరు. కానీ రాజకీయ కుటుంబాల ఆధిపత్యం, వారసత్వ నాయకత్వం, పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం, ప్రజాధనంపై జవాబుదారీతనం కొరవడటం కొత్త రాజరికాన్ని తలపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, టీడీపీ, వైసీపీ నాయకత్వాలు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. రాజకీయ పదవులు కొన్ని కుటుంబాలకు, కొన్ని ఆధిపత్య కులాలకే ఎందుకు పరిమితమవుతున్నాయి? ఇప్పటివరకు ప్రాతినిధ్యం పొందని రెండువందలకు పైగా సామాజికవర్గాలకు అవకాశాలు ఎప్పుడు కల్పిస్తారు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రైస్తవ సమాజాలకు జనాభాకు తగిన రాజకీయ భాగస్వామ్యం ఎందుకు లేదు? డాక్టర్ బీఆర్‌ అంబేడ్కర్ హెచ్చరించినట్లు రాజకీయ ప్రజాస్వామ్యానికి సామాజిక ప్రజాస్వామ్యం తోడవకపోతే సమానత్వం సాకారం కాదు. ప్రజల అసంతృప్తిని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందో నేడు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేరుతో సాగుతున్న యువజన ఉద్యమం గుర్తుచేస్తోంది. నిరుద్యోగం, పరీక్షల అవకతవకలు, ఓటర్ల జాబితాలపై వివాదాలు, ప్రజల ప్రశ్నలకు స్పందన లేకపోవడం వంటి అంశాలపై యువత సంఘటితమవుతోంది. ఈ ఉద్యమం చేస్తున్న ఆరోపణలన్నీ నిర్ధారణ అయ్యాయని కాదు. కానీ ప్రజల ఆవేదనను నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరమనే సందేశం స్పష్టంగా కనిపిస్తోంది.


రాజకీయ పార్టీలు నాయకత్వాన్ని ప్రజాస్వామ్యీకరించాలి. అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం పాటించాలి. స్థానిక సంస్థలకు నిజమైన అధికారాలు ఇవ్వాలి. ప్రభుత్వ ఖర్చులను ప్రజల ముందు ఉంచాలి. రాజులు ప్రజల మాట విని మారారు. ప్రజాస్వామ్య నాయకులు మారకపోతే ప్రజలే వారిని మారుస్తారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు నాయకులను ఎన్నుకోవడం మాత్రమే కాదు; నాయకులు నిరంతరం ప్రజల మాట వినడం, వారికి జవాబుదారీగా ఉండటం. ప్రజల ఓటుకు విలువ, ప్రజల మాటకు గౌరవం, పాలనలో అందరికీ వాటా – ఇదే నిజమైన ప్రజాస్వామ్యం!

- డా. జె. పూర్ణచంద్రరావు, ఐపీఎస్ (రిటైర్డ్)

Updated Date - Oct 23 , 2026 | 02:29 AM