‘ఆద్యకళ’ మ్యూజియాన్ని అడ్డుకోవద్దు
ABN , Publish Date - Jun 30 , 2026 | 12:15 AM
ప్రజల కళలను, అపురూప సాంస్కృతిక రూపాలను, భాష, సాహిత్యాల చిహ్నాలను, కళాఖండాలను పరిరక్షించడం వ్యవస్థల బాధ్యత. ప్రభుత్వ, ప్రభుత్వాధీన సంస్థలు ఈ విషయంలో ముందుకు వచ్చి వాటిని భవిష్యత్ తరాలకి అందించాల్సిన అవసరం ఉంది.
ప్రజల కళలను, అపురూప సాంస్కృతిక రూపాలను, భాష, సాహిత్యాల చిహ్నాలను, కళాఖండాలను పరిరక్షించడం వ్యవస్థల బాధ్యత. ప్రభుత్వ, ప్రభుత్వాధీన సంస్థలు ఈ విషయంలో ముందుకు వచ్చి వాటిని భవిష్యత్ తరాలకి అందించాల్సిన అవసరం ఉంది.
ప్రజలు సృష్టించిన కళలు, సంగీత వాద్యాలను, ప్రదర్శనలను చిన్నచూపు చూడడం వల్ల అవి అంతరించిపోతున్నాయి. వాటిని కాపాడాలనే ధ్యాసలేని సంస్థలు వాటి బాధ్యతను విస్మరించినట్లే. ప్రజలకు సంబంధించిన సంస్కృతిని చూస్తూ చూస్తూ పట్టించుకోకపోవడం నేరంగానే భావించాలి. దీనిని గమనించిన అలనాటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు తెలుగు విశ్వవిద్యాలయాన్ని 1985లో హైదరాబాదులోని నాంపల్లిలో ఏర్పాటు చేశారు. తెలుగు భాష, సాహిత్యం, సాంస్కృతిక రంగంలో ఉన్నతస్థాయి పరిశోధనా కేంద్రంగా పనిచేయాలని లక్ష్యంగా ఏర్పాటు చేశారు. పై అంశాలకు సంబంధించిన విషయాలపై అధ్యయనం జరగాలని ఆశించారు. కాని ఇప్పుడు ఆ అంశం పక్కనపడి సర్టిఫికెట్ కోర్సుల స్థాయికి చేరింది.
తెలుగు భాషా సాహిత్యాలు వివిధ జానపద అంశాలపై వివిధ రాష్ట్రాలలో ఉన్నవారికి, విదేశాలలో ఉన్న తెలుగువారికి శిక్షణ గరపడం విశ్వవిద్యాలయం లక్ష్యం. అంతేకాదు, తెలుగు ప్రజల సంస్కృతి కోసం చిత్రాలు, శిల్పం, సంగీతం, కళలకు సంబంధించిన మ్యూజియం ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. కాని కేవలం అది ఒక్క హాలుకే పరిమితమైంది. సుమారు నలభై ఏళ్ల నుంచి అదనంగా ఏ ఒక్క కళాఖండం కూడా సేకరణ కాలేదు. తెలుగు విశ్వవిద్యాలయం మొదటి దఫా అధ్యాపకునిగా ఎంపికైన ప్రొ. జయధీర్ తిరుమలరావు ఆ పనిని తన భుజాలకెత్తుకున్నారు. ఆనాటి నుంచి ఈనాటి దాక తన ఏభై ఏళ్ల కాలాన్ని వస్తు సేకరణకే అంకితం చేశారు. అలా సుమారు ఎక్కడా చూడని, వినని సంగీత వాద్యాలని, పెయింటింగ్స్‌ని, తాళపత్ర గ్రంథాలు, పాత కాగితం రాతప్రతుల్ని, కాగితం చుట్టలని ఆరు మ్యూజియంలకి సంబంధించిన కళాఖండాలను సేకరించారు. ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ సామాగ్రిని పెట్టుకోవడానికి ఖాళీగా ఉన్న తెలుగు విశ్వవిద్యాలయంలోని కొన్ని గదులను ఇచ్చింది. ఆ గదులలో పట్టని అతి పెద్ద పడవలు, పులిబోనులు, బండ్లు, రథాలను బయటే ఉంచారు. అవి పాడుకాక ముందే ఒక గూడు చూపించమని ఎక్కని గడప, దిగనిమెట్టు లేదు.
గత ఉపాధ్యక్షులు నాంపల్లి బిల్డింగ్ చిన్నదైనదని, విశాలమైన కేంపస్ ఏర్పాటు చేయాలని కోరారు. అందుకు స్పందించిన ప్రభుత్వం బాచుపల్లిలో వంద ఎకరాల స్థలంలో పర్మనెంట్ బిల్డింగులు కట్టించి విశ్వవిద్యాలయాన్ని అక్కడకు తరలించింది. అంత పెద్ద కేంపస్‌లో తెలుగు భాషా సంస్కృతుల మ్యూజియం ఏర్పాటు చేయాలన్న సంకల్పం ఏ వీసీకీ కలగలేదు. ఆచార్య తంగెడ కిషన్‌రావు వీసీగా ఉన్న కాలంలో ఈ విషయాన్ని అర్థం చేసుకుని ‘ఆద్యకళ’ మ్యూజియం వస్తువులు భద్రపరచుకోవడం కోసం కొన్ని గదులు కేటాయించారు. కానీ ప్రస్తుత ఉపాధ్యక్షులు వాటిని ఖాళీ చేయాలన్నారు. చివరికి ప్రభుత్వ పెద్దల జోక్యంతో వాటిని అక్కడే ఉంచారు.
నిజానికి విశ్వవిద్యాలయం బాచుపల్లికి తరలిపోయినప్పుడు లేదా తరువాతనైనా నాంపల్లిలోని భవనాలను ప్రభుత్వానికి అప్పగించాలి. కాని అలా జరగలేదు. బయటనున్న ఇతర శాఖ కార్యాలయాలకు అద్దెకు ఇచ్చారు. విశ్వవిద్యాలయం అవసరాలకు, తెలుగు భాషా సంస్కృతి, కళలకు కేంద్రంగా ఉండాల్సిన భవనాలలో వీటికి సంబంధంలేని ఇతర సంస్థల కార్యాలయాలకు ఇచ్చారు. ‘ఆద్యకళ’ మ్యూజియం సందర్శించిన ప్రభుత్వ ఉన్నతాధికారులు ఏర్పాటు చేసిన కమిటీలు ఆది ధ్వని ఫౌండేషన్‌కు ఇవ్వడానికి సిఫారసు చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి, సాంస్కృతిక శాఖ మంత్రి కూడా సానుకూలంగా స్పందించారు.
తెలుగుభాషా సంస్కృతులు, కళలు, ప్రదర్శనలు ముఖ్యంగా లోకానికి తెలియని అపురూప ప్రదర్శనలు, సంగీతాలకు కాణాచి అయిన ‘ఆద్యకళ’ మ్యూజియం ఏర్పాటుకు గ్రౌండ్‌ఫ్లోర్ మాత్రమే ఇవ్వాలని జీవో ఇచ్చారు. మిగిలిన మొదటి, రెండవ అంతస్తులను విశ్వవిద్యాలయం అవసరాలకు వాడుకోవడానికి అంగీకరించారు. కానీ వీసీ, రిజిస్ట్రార్‌లు వారి ఛాంబర్‌లను ఇంకా ఇక్కడే ఉంచుకున్నారు. దశాబ్దాల క్రితం అచ్చేసిన పుస్తకాలను విక్రయించకుండా పెద్దపెద్ద హాళ్లను గోడౌన్లుగా అలాగే ఉంచారు.
ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన జీవోను అమలు చేయకుండా అధికారులు... బయట నుంచి విద్యార్థి సంఘాలతో గొడవలు పెట్టడం విచిత్రం. ‘ఆద్యకళ’ మ్యూజియం ఏర్పాటు చేయకుండా అడ్డుకొని ప్రభుత్వానికి తలవంపులు తెచ్చే విధంగా పావులు కదుపుతున్నారు. విశ్వవిద్యాలయం చేయవలసిన పని ఎవరో ఒకరు చేబూనితే వారికి సహకరించాల్సింది పోయి విఘాతం కలిగించడం సరికాదు. ఎన్టీఆర్ ఇప్పుడు బతికివుంటే రోడ్డు మీద ధర్నా చేసేవారనిపిస్తోంది. లోగడ వరంగల్‌లో గిరిజన జానపద విజ్ఞానపీఠం ఏర్పాటు చేశారు. ఆ పీఠం కొద్దిపాటి వస్తువులు సేకరించింది. కాని అవి వర్షాలకు కొట్టుకుపోయాయని చెప్పారు. ఇప్పుడు రెడీమేడ్‌గా సేకరించి ఉన్న భాండాగారానికి తలుపులు మూయడం సరికాదని మేధావులు, పరిశోధకులు భావిస్తున్నారు. ఆదివాసీ, జానపదుల సృజనాత్మక కళాఖండాలను వ్యతిరేకించడం అప్రజాస్వామికం. ఇది ఆ ప్రజలను వ్యతిరేకించడమే అవుతుంది. మనువాద ఆలోచనాధోరణి సరికాదని సబ్బండ వర్ణాల గౌరవచిహ్నాలే కాదు, ఆయా సమాజాల–సమూహాల ఆత్మగౌరవానికి సంబంధించిన వస్తుజాలాన్ని నిరాకరించవద్దని ప్రజలు కోరుతున్నారు.
భారతదేశ చరిత్రలో మొదటిసారి ఇన్ని రకాల అపురూప కళాఖండాలను ఒకచోట మ్యూజియంగా ఏర్పాటు కావడాన్ని స్వాగతించాలి. ఆద్యకళ ‘ఆదిధ్వని’ ఫౌండేషన్, హైదరాబాద్ వారు సేకరించిన ఆదివాసుల 170 కళాఖండాలు ప్రస్తుతం భారత రాష్ట్రపతి చొరవతో ఏర్పాటు చేసిన ‘జనజాతి దర్పణ్’ పేర న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్, మార్బుల్ హాలులో ప్రదర్శనకు ఉన్నాయి. పారిస్, లండన్, ఢిల్లీ వంటి పలుచోట్ల ఆద్యకళ మ్యూజియం వస్తువులు ప్రదర్శితమయ్యాయి. ఇంతటి కీర్తి కలిగిన ప్రదర్శనశాల ఏర్పాటును వ్యతిరేకించే విశ్వవిద్యాలయం అధికారులు మరోసారి ఆలోచించాలి. తాను జారీ చేసిన జీవోను అమలయ్యేలా ప్రభుత్వం చూడాలి. ప్రతిరోజు వందలాది మంది సందర్శకులతో మ్యూజియం కళకళలాడాలి. విద్యార్థులు, పరిశోధకులకు ప్రాథమిక పరిశోధన వనరుగా ఉండాలి.
- సన్నిధానం నరసింహశర్మ