Pension Rights: పీఆర్‌సీ జాప్యంతో పెన్షనర్లకు అన్యాయం
ABN , Publish Date - Jan 09 , 2026 | 05:18 AM
ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్‌సీల అమలులో జరుగుతున్న తీవ్రమైన ఆలస్యాలు, పెన్షనర్లను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. 1958లో తొలి పీఆర్‌సీ నుంచి 1999లో అమలైన ఏడవ పీఆర్‌సీ వరకు సమయానికి...
ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్‌సీల అమలులో జరుగుతున్న తీవ్రమైన ఆలస్యాలు, పెన్షనర్లను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. 1958లో తొలి పీఆర్‌సీ నుంచి 1999లో అమలైన ఏడవ పీఆర్‌సీ వరకు సమయానికి ఏర్పాటై, నివేదికలు సమర్పించిన ఒకటి, రెండు సంవత్సరాల్లోనే అమలయ్యేవి. కానీ 2005 తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎనిమిదవ పీఆర్‌సీ నుంచి మొదలైన ఆలస్యాల ధోరణి తొమ్మిది, పది పీఆర్‌సీలలో కొనసాగి, చివరకు పదకొండవ పీఆర్‌సీ వద్ద పరాకాష్ఠకు చేరింది.
11వ పీఆర్‌సీ అర్హత తేదీగా 2018 జూలై 1ని నిర్ణయించినా, నగదు ప్రయోజనాలు మాత్రం 2022 అక్టోబర్ 1 నుంచి అమలయ్యాయి. దాదాపు నాలుగేళ్లకు పైగా పెన్షనర్లు తమకు రావాల్సిన న్యాయమైన లాభాన్ని కోల్పోయారు. ఈ కాలంలో వేలాది పెన్షనర్లు మరణించారు. వారు ఎదురుచూసిన పీఆర్‌సీ ప్రయోజనాన్ని చూడకుండానే లోకాన్ని విడిచిపెట్టారు. ఇది కేవలం ఆర్థిక నష్టం కాదు, మానవీయ విషాదం.
2019–24 కాలంలో పీఆర్‌సీ ఆలస్యం కొనసాగడం పెన్షనర్లకు తీవ్రమైన ఆర్థిక, మానసిక ఒత్తిడిని కలిగించింది. ఈ నాలుగేళ్లలో ద్రవ్యోల్బణం పెరిగింది, వైద్య ఖర్చులు రెట్టింపయ్యాయి. పీఆర్‌సీని న్యాయబద్ధంగా అమలు చేయాల్సి ఉండగా, కేవలం కనీస పెంపు మాత్రమే ఇచ్చారు. పీఆర్‌సీ ఆలస్యం వల్ల పెన్షన్ నిజమైన విలువ క్రమంగా తగ్గిపోతోంది. ఖర్చులు, అవసరాలు పెరుగుతున్న ఈ కాలంలో, పాత పెన్షన్‌తో జీవించడం పెన్షనర్లకు సవాలుగా మారింది. బకాయిల చెల్లింపుల్లోనూ అన్యాయం కొనసాగుతోంది. విడతలుగా చెల్లింపులు, కొంత మొత్తాన్ని ఫ్రీజ్ చేయడం, కోతలు విధించడం వల్ల పెన్షనర్లకు రావాల్సిన మొత్తం పూర్తిగా అందడం లేదు. ఇది వారి ఆర్థిక భద్రతను దెబ్బతీస్తోంది.
11వ పీఆర్‌సీ కాలంలో మరో తీవ్రమైన అన్యాయం గ్రాట్యుటీ విషయంలో జరిగింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గ్రాట్యుటీ పరిమితి రూ.20 లక్షలకు పెరిగినా, ఆంధ్రప్రదేశ్‌లో 2018 జూలై 1 నుంచి 2022 మధ్య పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు ఈ ప్రయోజనం పూర్తిగా కల్పించలేదు. దాంతో ఒక్కో పెన్షనర్‌కు సుమారు నాలుగు లక్షల రూపాయల వరకు నష్టం జరిగింది.
పెన్షన్ కమ్యూటేషన్‌లో కూడా అన్యాయం జరుగుతోంది. ప్రస్తుతం కమ్యూట్ చేసిన పెన్షన్ మొత్తాన్ని 15 సంవత్సరాల పాటు రికవరీ చేస్తున్నారు. కానీ వాస్తవంగా ఆ మొత్తాన్ని అధిక వడ్డీతో కలిపి కేవలం 12 సంవత్సరాల లోపే ప్రభుత్వం తిరిగి పొందుతోంది. కనుక కమ్యూటేషన్ రికవరీ కాలాన్ని పన్నెండేళ్లకు పరిమితం చేయాలి. ఇది ఆర్థిక లెక్కల ఆధారంగా న్యాయమైన డిమాండ్. ప్రభుత్వాలు తరచూ ఖజానా లోటు, ఆర్థిక భారం పేరుతో పీఆర్‌సీలను ఆలస్యం చేస్తున్నాయి. ప్రభుత్వాలు మారినా ఈ కారణం మాత్రం మారడం లేదు. పెన్షన్– దయ కాదు, రాజ్యాంగ హక్కు అని సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో స్పష్టంగా చెప్పింది. 11వ పీఆర్‌సీలో జరిగిన అన్యాయాన్ని పరిగణనలోకి తీసుకుని, రాబోయే పీఆర్‌సీలో కనీసం 35శాతానికి తక్కువ కాకుండా పెంపు ఉండాలి. కొత్త పీఆర్‌సీని సమయానికి ఏర్పాటు చేసి, నివేదిక వచ్చిన వెంటనే అమలు చేయాలి.
-టి.ఎం.బి.బుచ్చిరాజు
జనరల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల సంఘం