Share News

Debate on Women Clothing: వస్త్రధారణ స్వేచ్ఛే.. మహిళా సాధికారతా?

ABN , Publish Date - Jan 04 , 2026 | 02:55 AM

నిండు సభలో ఒక మహిళ చీర లాగినందుకు మహాభారత సంగ్రామం జరిగింది. అది ద్వాపర యుగం. మహిళలు జన సమూహంలోకి వెళ్లినప్పుడు చీర కట్టుకుంటే మంచిది అన్నందుకు మాటల యుద్ధం జరుగుతోంది....

Debate on Women Clothing: వస్త్రధారణ స్వేచ్ఛే.. మహిళా సాధికారతా?

మన దేశంలో వైద్య వృత్తిలో ఉన్న వారికి భారతీయ వైద్య మండలి డ్రెస్‌ కోడ్‌ నిర్ణయించింది. పురుషులైతే జీన్స్‌ ప్యాంట్‌, టీ షర్టులు వంటి ఫ్యాషనబుల్‌ దుస్తులు ధరించకూడదు. మహిళలైతే మితి మీరిన అలంకరణ చేసుకోకూడదు. గోళ్లు పెంచుకొని నెయిల్‌ పాలిష్‌ వేసుకోకూడదన్న నిబంధనలూ ఉన్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. రోగులకు వైద్యులపై గౌరవ భావం ఏర్పడాలి. వైద్యో నారాయణో హరిః అంటారు. అంటే వారిలో దేవుడిని మాత్రమే రోగులు చూడాలన్న ఉద్దేశంతో ఇలాంటి నియమ నిబంధనలు పెట్టారు. యాప్రాన్‌ ధరించి కనపడే వైద్యుల పట్ల మనకు తెలియకుండానే గౌరవ భావం ఏర్పడుతుంది.న్యాయమూర్తులకూ డ్రెస్‌ కోడ్‌ ఉంది. న్యాయమూర్తులను చూడగానే లేచి నిలబడి గౌరవించాలన్న ఉద్దేశంతో డ్రెస్‌ కోడ్‌ పెట్టి ఉంటారు. వస్త్రధారణ విషయంలో మాకు స్వేచ్ఛ లేదా అని న్యాయమూర్తులు, వైద్యులు వంటి ఉన్నత వృత్తుల్లో ఉన్నవారు చిట్టి పొట్టి దుస్తులు ధరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి..


నిండు సభలో ఒక మహిళ చీర లాగినందుకు మహాభారత సంగ్రామం జరిగింది. అది ద్వాపర యుగం. మహిళలు జన సమూహంలోకి వెళ్లినప్పుడు చీర కట్టుకుంటే మంచిది అన్నందుకు మాటల యుద్ధం జరుగుతోంది. ఇది కలియుగం! యుగ ధర్మంలో ఎంత తేడా! మహిళల వస్త్రధారణపై సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం తెలుగునాట మాటల యుద్ధం జరుగుతోంది. శివాజీ చేయరాని తప్పు చేసినట్టుగా కొంతమంది అభినవ కందుకూరి వీరేశలింగం పంతుళ్లు కొద్ది మంది మహిళల తరఫున వత్తాసు పలుకుతున్నారు. సమాజంలో అత్యధికులు శివాజీకి మద్దతుగా నిలిచారు. మొత్తంగా సోషల్‌ మీడియాలో ఇదొక ప్రధానాంశంగా మారింది. ఒక ప్రారంభోత్సవ కార్యక్రమానికి పొట్టి దుస్తులతో వచ్చిన సినిమా నటి నిధి అగర్వాల్‌ అభిమానుల అత్యుత్సాహం వల్ల ఇబ్బందిపడ్డారు. ఆ సంఘటనను దృష్టిలో ఉంచుకొని మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. జన సమూహంలోకి వెళ్లినప్పుడు సినిమా హీరోయిన్లు ఒళ్లు కనపడకుండా చీర కట్టుకుంటే హుందాగా ఉంటుందన్నది ఆయన అభిప్రాయం. సినిమా అంటేనే గ్లామర్‌ ఫీల్డ్‌. ప్రారంభోత్సవాలకు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి హీరోయిన్లను పిలిచేది కూడా గ్లామర్‌తో వారు ప్రజలను ఆకర్షిస్తారనే. ఈ క్రమంలో కొన్ని అపశ్రుతులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా నిధి అగర్వాల్‌, సమంత వంటి వారు అభిమానుల అత్యుత్సాహంతో ఇబ్బందిపడ్డారు. దీంతో హీరోయిన్లు ఇబ్బంది పడకూడదంటే వస్త్రధారణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సినీ నటుడు శివాజీ ఉచిత సలహా ఇచ్చారు. అంతే... ‘మేం ఎలాంటి దుస్తులు ధరించాలో చెప్పడానికి నువ్వెవరు?’ అంటూ కొంత మంది సినిమా పరిశ్రమకు చెందిన మహిళలు మండిపడ్డారు. వారికి మద్దతుగా నాగబాబు, ప్రకాశ్‌రాజ్‌ వంటి అభినవ వీరేశలింగం పంతుళ్లు నోరు విప్పారు. ‘వస్త్రధారణ విషయంలో మహిళలను కట్టడి చేయడం ఏమిటి? ఎటువంటి దుస్తులు ధరించాలో నిర్ణయించుకొనే హక్కు మహిళలకు లేదా?’ అని మండిపడ్డారు. పురుషుల వక్ర, సంకుచిత దృష్టికి ఇదే నిదర్శనమని నిందించారు. మహిళా సాధికారత అంటే అంగాంగ ప్రదర్శనే అన్నట్టుగా శివాజీని విమర్శించినవాళ్లు మాట్లాడారు. దీంతో కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు? అని భావించిన శివాజీ ఇకపై తన నోటికి తాళం వేసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఎవరు తప్పు? ఎవరు ఒప్పు? అని తేల్చడం ఎలా?

మారుతున్న కాలం...

ద్వాపర యుగంలో ద్రౌపదిని నిండు సభకు ఈడ్చుకు వచ్చి దుర్యోధన, దుశ్శాసనులు వస్ర్తాపహరణకు పాల్పడినందుకు మహాభారత సంగ్రామం జరిగిందని చదివాం–విన్నాం. ఒక మహిళను అవమానించినందుకు కౌరవులు మూల్యం చెల్లించుకున్నారు. ద్వాపర యుగంలోనైనా, కలియుగంలోనైనా మహిళలను అవమానించినవారు మూల్యం చెల్లించుకోక తప్పదని అనేక సంఘటనలు రుజువు చేశాయి. వర్తమానంలోకి వస్తే, మహిళల వస్త్రధారణ గత కొంత కాలంగా వివాదమవుతోంది. పురుషులను రెచ్చగొట్టే విధంగా కాకుండా మహిళలు నిండుగా దుస్తులు ధరించాలని కొంతమంది వ్యాఖ్యానించడం, దానిపై అభ్యుదయ మహిళలుగా చెప్పుకునే వారు మండిపడటం, వారికి మద్దతుగా అభినవ కందుకూరి వీరేశలింగం పంతుళ్లు గొంతెత్తడం చూస్తున్నాం. కాలానుగుణంగా మనుషుల జీవన విధానంలో మార్పులు వస్తున్నాయి. అందులో వస్త్రధారణ కూడా ఒకటి. ఆది మానవులు దుస్తులే ధరించలేదు. ఆ తర్వాత శరీరాన్ని కప్పుకోవడానికి ఆకులు, జంతు చర్మాలు కట్టుకొనేవారు. నాగరికత అభివృద్ధి చెందిన కొద్దీ వస్త్రధారణలో మార్పులు వచ్చాయి. వస్త్రధారణ అనేది నాగరికతకు చిహ్నంగా మారింది. మన దేశంలో పురుషులు పంచెలు కట్టుకోవడం, మహిళలు చీరలు కట్టుకోవడం సంప్రదాయంగా చాలా కాలం పాటు పరిఢవిల్లింది. ఈ క్రమంలో వృత్తులలో మార్పులు వచ్చాయి. మరింత సౌకర్యవంతంగా ఉండటంకోసం పురుషులు పంచెకట్టుకు స్వస్తి చెప్పి ప్యాంట్లు ధరించడం మొదలు పెట్టారు. మహిళలు కూడా ఉద్యోగాలు, వ్యాపారాలలో పురుషులతో సమానంగా ఎదిగారు. దీంతో వారి వస్త్రధారణలో కూడా మార్పులు వచ్చాయి. మహిళలైనా, పురుషులైనా సౌకర్యంగా ఉండటం కోసం వస్త్రధారణలో మార్పులు ఎంచుకున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. ఇటీవలి కాలంలో కొంత మంది మహిళలు మరీ పొదుపుగా చిట్టి పొట్టి దుస్తులు ధరిస్తున్నారు. ఇది అడపా దడపా వివాదం అవుతోంది. వస్త్రధారణ వ్యక్తిగతం. ఎవరి ఇష్టం వారిది అనడంలో సందేహం లేదు. అయితే, సమాజంలోని స్థితిగతులు, మన దేశ సంస్కృతి సంప్రదాయాలను కొంచెమైనా పరిగణనలోకి తీసుకోవాలి.


బాధ్యత ఎవరిది?

సినీ నటుడు శివాజీని విమర్శించిన వారి విషయానికి వద్దాం! ప్రారంభోత్సవ కార్యక్రమాలకు వెళ్లే హీరోయిన్లు దుస్తుల విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం లేదా? మహిళలు వారికి ఇష్టమైన దుస్తులు ధరించవచ్చు. కాకపోతే బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. స్వీయ రక్షణ ఏర్పాటు చేసుకోవాలి అని నాగబాబు కూడా సెలవిచ్చారు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకొనే ‘అడుసు తొక్కనేల కాలు కడగనేల’ అనే సామెత వచ్చి ఉంటుంది. సినిమా అంటేనే గ్లామర్‌ ఫీల్డు. అందునా మహిళా నటులు బయటికొస్తే వారిని చూడటానికి జనం ఎగబడతారు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ మాటల్లో చెప్పాలంటే, ఫ్యాన్స్‌ అనేవాళ్లు కొన్ని సందర్భాలలో దారుణంగా వ్యవహరిస్తారు. హీరోలను కూడా ఇబ్బందులపాలు చేస్తారు. పిసికేస్తారు. అందుకే తనపైకి ఎగబడే ఫ్యాన్స్‌ను ప్రముఖ హీరో బాలకృష్ణ కొడుతుంటారని పూరీ జగన్నాథ్‌ అన్నారు. ఈ క్రమంలో హీరోయిన్ల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాంటప్పుడు నాగబాబు చెబుతున్నట్టుగా స్వీయ రక్షణ చేసుకోవాల్సింది హీరోయిన్లే కదా? జరగరానిది జరిగితే బాధ పడాల్సింది ఎవరు? అభిమానం ముసుగులో ఎవరైనా హద్దు మీరి ప్రవర్తిస్తే ఇబ్బందిపడేది ఎవరో నాగబాబు, ప్రకాశ్‌రాజ్‌లకు తెలియదా? జన సమూహంలోకి వెళ్లినప్పుడు చీర కట్టులో వెళితే మంచిదని సలహా ఇవ్వడం తప్పు ఎందుకవుతుంది? చిట్టి పొట్టి బట్టలతో కనపడిన హీరోయిన్లపైకి జనం ఎగబడి అది తొక్కిసలాటలకు దారితీస్తే పరిస్థితి ఏమిటి? తొక్కిసలాటలో ఏమైనా జరగొచ్చు కదా? మహిళా సాధికారత అంటే ఏమిటి? వస్త్రధారణ విషయంలో కట్టుబాటు అవసరమా? లేదా? స్వేచ్ఛ అంటే ఏమిటి? వంటి అంశాలు శివాజీ పుణ్యమా అని మళ్లీ చర్చనీయాంశం అయ్యాయి. సృష్టి ధర్మం కారణంగా మహిళలు శారీరకంగా పురుషులకంటే బలహీనులు అయితే అయి ఉండవచ్చునుగానీ, మిగతా విషయాలలో కాదు. సమాన అవకాశాలు కల్పిస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణిస్తారని చరిత్ర రుజువు చేసింది. పాలనలో కూడా పురుషులకు తాము ఏం తీసిపోమని అనేక మంది మహిళా నాయకులు రుజువు చేసుకున్నారు. ఇందిరాగాంధీ, మార్గరెట్‌ థాచర్‌, సిరిమావో బండారునాయకే వంటి శక్తిమంతమైన మహిళా నాయకులను చూశాం. అంతర్జాతీయంగా పేరొందిన కంపెనీలకు మహిళలు సారథ్యం వహిస్తున్నారు. అవకాశం లభించాలేగానీ మహిళలు సమర్థంగా పనిచేస్తారని అనేక సందర్భాలలో రుజువైంది. దురదృష్టవశాత్తు మహిళా సాధికారతకు నిర్వచనాన్ని కొందరు మార్చివేస్తున్నారు. వస్త్రధారణకు, మహిళా సాధికారతకు సంబంధం ఏమిటి? శరీర భాగాలను... అది స్ర్తీలైనా, పురుషులైనా ప్రదర్శించడం వాంఛనీయమా? వస్త్రధారణలో విచ్చలవిడితనం సాధికారత, స్వేచ్ఛ ఎలా అవుతుంది? అదే నిజమైతే పర్యవసానాలకు కూడా సిద్ధం కావాలి కదా?


సంస్కృతి.. సంబంధాలు!

పాశ్చాత్య దేశాల సంస్కృతి వేరు– మన దేశ సంస్కృతి వేరు. అనాదిగా మనకంటూ ఏర్పరుచుకున్న సంస్కృతి, కట్టుబాట్లకు అలవాటుపడిన మనం అంగ ప్రదర్శన చేసే వారి పట్ల చులకనభావంతో వ్యవహరిస్తాం. అంతే కాదు, మన దేశంలో వృత్తులను బట్టి డ్రెస్‌ కోడ్‌ పెట్టుకున్నాం. బహిరంగ ప్రదేశాలలో ఎలా ఉండకూడదో నిర్ణయించుకున్నాం. గ్లామర్‌ ఫీల్డుగా చెప్పుకొనే సినిమా రంగంలో కూడా చాలా కాలం పాటు ఈ కట్టుబాట్లు కొనసాగాయి. ఈ విషయంలో సినిమా నిర్మాతలు, దర్శకులు, రచయితలు, నటులు చాలా జాగ్రత్తలు తీసుకొనేవారు. ఈ సందర్భంగా ఒక సంఘటన గురించి చెప్పుకోవాలి. చాలా కాలం క్రితం ఒక సినిమాలో అమ్మాయిగారు, అంటే హీరోయిన్‌ ఏం చేస్తున్నారని ఒక పాత్రధారి ప్రశ్నించగా స్నానం చేస్తున్నారు అని మరో పాత్రధారితో చెప్పించారు. స్నానం చేస్తున్నారని మాటల రచయిత రాయడాన్ని సదరు సినిమా దర్శకుడు అభ్యంతరపెట్టారు. హీరోయిన్‌ స్నానం చేస్తున్నారంటే కొందరు ప్రేక్షకుల్లో మనో వికారాలు ఏర్పడతాయన్నది సదరు దర్శకుడి అభ్యంతరం. ఆ తరం వారు అంత ఉన్నతంగా ఆలోచించారు. ఇప్పుడు స్నానం చేయడాన్నే చూపించేస్తున్నారు. మనం కూడా చూస్తూ ఆనందిస్తున్నాము. శృంగార రస సన్నివేశాలలో కూడా హద్దులు చెరిగిపోయాయి. ఒకప్పటి హీరోయిన్లు కౌగిలించుకొనే సందర్భాలలో హీరో ఎదకు తమ ఎద తగలకుండా చేతులు అడ్డుపెట్టుకొనేవారు. ఇప్పుడు సెన్సార్‌ బోర్డు ఉందో లేదో తెలియని పరిస్థితి కొన్ని సినిమాల్లో చూస్తున్నాం. పాశ్చాత్య దేశాలలో ప్రేమికులు లేదా భార్యాభర్తలు నడి రోడ్డుపై ముద్దులు పెట్టుకుంటారు. అది వారి సంస్కృతిలో భాగం. స్వేచ్ఛ పేరిట దుస్తులు విప్పుకొని తిరగడం కూడా మన దగ్గర నిషేధం. ‘పబ్లిక్‌ న్యూసెన్స్‌’ని నియంత్రించటానికి చట్టమూ ఉంది. ఈ కారణంగానే శ్రీరెడ్డి అనే ఆమె కొంత కాలం క్రితం ఫిలిం చాంబర్‌ ముందు దుస్తులు విప్పడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు అడ్డుపడి అరెస్టు చేశారు. వృత్తులను బట్టి కూడా డ్రెస్‌ కోడ్‌ నిర్ణయించడానికి కారణం ఉంది. వైద్యుల విషయానికి వద్దాం! మన దేశంలో వైద్య వృత్తిలో ఉన్న వారికి భారతీయ వైద్య మండలి డ్రెస్‌ కోడ్‌ నిర్ణయించింది. పురుషులైతే జీన్స్‌ ప్యాంట్‌, టీ షర్టులు వంటి ఫ్యాషనబుల్‌ దుస్తులు ధరించకూడదు. మహిళలైతే మితిమీరిన అలంకరణ చేసుకోకూడదు. గోళ్లు పెంచుకొని నెయిల్‌ పాలిష్‌ వేసుకోకూడదన్న నిబంధనలూ ఉన్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. రోగులకు వైద్యులపై గౌరవ భావం ఏర్పడాలి. వైద్యో నారాయణో హరిః అంటారు. అంటే వారిలో దేవుడిని మాత్రమే రోగులు చూడాలన్న ఉద్దేశంతో ఇలాంటి నియమ నిబంధనలు పెట్టారు. యాప్రాన్‌ ధరించి కనపడే వైద్యుల పట్ల మనకు తెలియకుండానే గౌరవ భావం ఏర్పడుతుంది. అలా కాకుండా వైద్యులు కూడా చిట్టి పొట్టి దుస్తులు ధరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు నిక్కర్లు వేసుకొని వెళుతున్నారు. ఆ వృత్తిలో ఉన్న వారికి అలాంటి దుస్తులు సౌకర్యవంతంగా ఉంటాయేమో! వారికి ప్రజలతో సంబంధం ఉండదు. వారిని ఎవరూ కార్యాలయాలకు వెళ్లి కలవరు కూడా. న్యాయమూర్తుల విషయానికి వద్దాం! వారికి కూడా డ్రెస్‌ కోడ్‌ ఉంది. న్యాయమూర్తులను చూడగానే లేచి నిలబడి గౌరవించాలన్న ఉద్దేశంతో డ్రెస్‌ కోడ్‌ పెట్టి ఉంటారు. వస్త్రధారణ విషయంలో మాకు స్వేచ్ఛ లేదా అని న్యాయమూర్తులు, వైద్యులు వంటి ఉన్నత వృత్తుల్లో ఉన్నవారు చిట్టి పొట్టి దుస్తులు ధరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సమాజం పట్ల మనకు ఒక బాధ్యత ఉంటుంది. పుష్ప2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటనలో ప్రముఖ హీరో అల్లు అర్జున్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు కదా? నేను నటించిన సినిమా చూడటానికి థియేటర్‌కు వెళ్లే స్వేచ్ఛ నాకు లేదా? అని అర్జున్‌ ప్రశ్నించవచ్చు కదా? ఆయన వెళ్లడం వల్లనే అక్కడ తొక్కిసలాట జరిగింది. తగిన జాగ్రత్తలు తీసుకోకుండా జనంలోకి సినిమా నటులు వెళ్లకూడదని ఈ సంఘటన చెబుతోంది. నాగబాబు, ప్రకాశ్‌రాజ్‌ వంటి వారు చెబుతున్నట్టుగా తిండి, బట్ట విషయంలో ఎవరి ఇష్టం వారిదే అన్నది వాస్తవం. ‘జంక్‌ ఫుడ్‌ తింటే ఊబకాయం వస్తుంది. అనారోగ్య సమస్యలతో బాధపడతారు’ అని వైద్యులు చెబుతారు కదా! జంక్‌ ఫుడ్‌ తినవద్దని చెప్పడానికి మీరెవరు? అని ప్రశ్నించడం ఎంత అహేతుకంగా ఉంటుందో దుస్తుల విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించడాన్ని తప్పుపట్టడం కూడా అంతే అహేతుకం. జాగ్రత్తగా ఉండాలనడం మోరల్‌ పోలీసింగ్‌ అవుతుందని విమర్శించడం ఏమిటి? గ్రామాలలో తప్పు చేసే పిల్లలను వారితో ఏ సంబంధం లేని పెద్దవాళ్లు మందలించడం మనకు తెలిసిందే. మా పిల్లలు ఏం చేస్తే మీకెందుకని వారిని తల్లిదండ్రులు తప్పుపట్టరు. పిల్లలు చెడిపోకూడదన్న సదుద్దేశంతోనే మందలిస్తారు కనుక వారి తల్లిదండ్రులు కూడా అభ్యంతరం చెప్పరు. ఇది మన సంస్కృతి.


ముగియని వివాదం...

ఇప్పుడు మళ్లీ శివాజీ వ్యాఖ్యల విషయానికి వద్దాం! ఆయన రెండు పదాలను అనవసరంగా వాడారు. అందుకు క్షమాపణ చెప్పారు కూడా! అంతటితో ఆ వివాదం ముగిసిపోవాలి కానీ నాగబాబు, ప్రకాశ్‌రాజ్‌ వంటి వారి ప్రవేశంతో వివాదం మళ్లీ రాజుకుంది. ఆడవారి వస్త్రధారణ విషయంలో సుద్దులు చెప్పడానికి శివాజీ ఎవడు? అని ప్రశ్నించడమే ఆశ్చర్యంగా ఉంది. జన సమూహంలోకి వెళ్లేటప్పుడు దుస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, కొంత మంది హీరోయిన్ల వలె నిండుగా చీర కట్టుకొని వెళ్లాలని సూచించడం తప్పు ఎలా అవుతుంది? నగ్నంగా, అర్ధనగ్నంగా తిరగడం చట్టరీత్యా నేరం కూడా. శరీర భాగాలను ప్రదర్శిస్తూ జన సమూహంలోకి వెళ్లినప్పుడు ఏమైనా జరగొచ్చు. నాగబాబు, ప్రకాశ్‌రాజ్‌ వంటి ఉదాత్తభావాలు, ఉన్నత సంస్కారం ఒంటబట్టించుకున్న వాళ్లు అక్కడ ఉండకపోవచ్చు కదా! ఫ్యాన్స్‌ హద్దులు మీరిన అభిమానంతో హీరోలనే నలిపేస్తుంటారు. అందుకే కదా బౌన్సర్లను రక్షణగా పెట్టుకొంటారు. అలాంటప్పుడు హీరోయిన్లకు రక్షణ ఎలా ఉంటుంది? జరగరానిది ఏదైనా జరిగితే నిధి అగర్వాల్‌ వంటి వారు అల్లు అర్జున్‌లా కేసుల్లో ఇరుక్కోరా? నాలుగు గోడల మధ్య జరిగే సినిమా ఫంక్షన్లలో ఎలాంటి దుస్తులు వేసుకున్నా పెద్ద ఇబ్బంది ఉండదు. జనంలోకి వెళ్లినప్పుడే తంటా అంతా! దుస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించడానికి శివాజీ ఎవడు? అని ప్రశ్నించేవాళ్లు... ‘మీ ఇష్టం వచ్చినట్టు దుస్తులు వేసుకోండని చెప్పడానికి మేమెవరం?’ అని కూడా ప్రశ్నించుకోవాలి. మంచి చెప్పడానికి అర్హత, హోదా అవసరం లేదు. ఫ్యాషనబుల్‌గా ఉండాలనుకోవడం వేరు, వల్గర్‌గా ఉండాలనుకోవడం వేరు. మంచి మాటలను తప్పు పట్టే వారు ముందుగా మహిళా సాధికారతకు నిర్వచనం తెలుసుకోవాలి. ఆడపిల్ల అని వివక్షగా చూడటం తప్పు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో పురుషులకే రక్షణ లేదు. రక్షణ విషయంలో మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం తప్పు ఎలా అవుతుంది? స్మార్ట్‌ ఫోన్ల పుణ్యమా అని పురుషుల్లో మనోవికారాలు పెరిగిపోతున్నాయి. సంస్కారం లేని వాళ్లు మృగాలుగా మారుతున్నారు. ముక్కు పచ్చలారని పసి పిల్లల నుంచి పండుటాకుల వలె రాలిపోయే దశలో ఉన్న వృద్ధ మహిళలు కూడా ఈ మృగాల క్రూరత్వానికి బలవుతున్నారు. శృంగారపరమైన ఉద్రేకాలను రెచ్చగొట్టే వీడియోలు విచ్చలవిడిగా అందుబాటులో ఉండటంతో పాటు మద్యం, డ్రగ్స్‌ వినియోగం పెరగడం ఇందుకు కారణం కావొచ్చు. ఈ నేపథ్యంలో శివాజీ వంటి వారు చేసే సూచనలను, వ్యాఖ్యలను సదుద్దేశంతో అర్థం చేసుకోవాలి.


మంచి కోసమే నిబంధనలు..

అయినదానికీ కానిదానికీ మహిళలకు వత్తాసు పలకడం మహిళా సాధికారతను ప్రోత్సహించడం అనిపించుకోదు. స్వేచ్ఛ పేరిట పొట్టి దుస్తులు ధరించాలని అనుకోవడం మన సమాజం హర్షించదు. నాగబాబు వ్యాఖ్యలను అత్యధికులు ఆక్షేపిస్తున్నారు. మానవ జాతి పరిణామ క్రమంలో ఎన్నో మార్పులు వచ్చాయి. మరింత సౌకర్యంగా, ఆదర్శంగా, ఉన్నతంగా ఉండటానికే సదరు మార్పులు వచ్చాయి. ఆది మానవులలో వావి వరుసలు ఉండేవి కావు. దానివల్ల కలుగుతున్న అనర్థాలను గుర్తించి వావి వరుసలు ఏర్పరుచుకున్నారు. అలాగే శరీర భాగాలను కప్పుకోవాలన్న స్పృహ తెచ్చుకున్నారు. నాగరికత లేని దశ నుంచి ప్రస్తుత ఆధునిక యుగంలోకి వచ్చాం. పూర్వం వలె మహిళలు వంటింటికే పరిమితం కావడంలేదు. పురుషులతో సమానంగా ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సౌకర్యంగా ఉండటంకోసం ధరించే దుస్తుల్లో మార్పులు చేసుకున్నారు. ఆకర్షణీయంగా తయారవడం వేరు– ఆకర్షించే విధంగా తయారవడం వేరు! మనం ధరించే దుస్తులు, తయారయ్యే విధానాన్ని బట్టి అవతలి వారికి మన పట్ల ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. హుందాగా రెడీ అయితే అవతలివాళ్లు మనల్ని గౌరవిస్తారు. స్వేచ్ఛ ఉంది కదా అని స్ర్తీలైనా, పురుషులైనా శరీర ప్రదర్శనకు పాల్పడితే చీప్‌గా చూస్తారు. సినిమా రంగంలో ఉండే అమ్మాయిలు గ్లామర్‌గా కనిపించడం అవసరం. ఇతర రంగాలలో పనిచేసే అమ్మాయిలకు ఆ అవసరం లేదు. ఇతరులు తమను గౌరవించేలా వారు కనిపించడం ఉత్తమం. రాజకీయాలలో ఉన్న మహిళలు చీర కట్టులోనే ఎక్కువగా కనిపించడం గమనార్హం. ఎందుకంటే వారు నిత్యం జనంలో తిరుగుతుంటారు. తమను కలిసేవారు తమ పట్ల గౌరవ భావంతో మెలగాలని వారు చీర కట్టును ఎంచుకొని ఉండవచ్చు. చిట్టి పొట్టి దుస్తులతో ఒక మహిళా ప్రజాప్రతినిధి జనంలోకి వెళ్లడాన్ని ఊహించగలమా? వెళ్లకూడదా? అని గద్దిస్తే ఏం చెబుతాం? వెళ్లవచ్చు. కాకపోతే పర్యవసానాలకు కూడా సిద్ధం కావాలి. జరగరాని పరాభవం జరిగితే చింతించకూడదు. సినిమా హీరోయిన్లు కూడా సినిమాల్లో గ్లామర్‌గా కనిపించడం వేరు, జనంలోకి వచ్చినప్పుడు గ్లామర్‌గా కనిపించే ప్రయత్నంలో పొదుపుగా దుస్తులు ధరించడం వేరు. పాఠశాలల్లో ఇప్పుడు గుడ్ టచ్‌, బ్యాడ్ టచ్ అంటే ఏమిటో బోధిస్తున్నారు. దీంతో బాల్యం నుంచి పిల్లల్లో శరీర భాగాల విషయంలో అవగాహన ఏర్పడుతోంది. ప్రైవేట్‌ పార్ట్స్‌ను పబ్లిక్‌గా చూపించడాన్ని ఇప్పుడు పిల్లలు కూడా ఆమోదించే పరిస్థితి లేదు. వస్త్రధారణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని చెప్పడం సంకుచితంగా ఆలోచించడం ఎలా అవుతుంది? సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించడం, ఆచరించడం అంటే భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినట్టు కాదని ప్రకాశ్‌రాజ్‌ వంటి వారు గ్రహించాలి. మంచికి పోతే చెడు ఎదురైనట్టుగా ప్రస్తుతం శివాజీ పరిస్థితి తయారైంది. తనకు మాలిన ధర్మం అని ఆయన ఇప్పుడు వాపోతున్నారు. అయితే మంచి చెప్పడానికి ప్రయత్నించినందుకు చింతించాల్సిన అవసరం శివాజీకి లేదు. అభిప్రాయాలు చెప్పుకోవడానికి నాగబాబు, ప్రకాశ్‌రాజ్‌లకు ఎటువంటి స్వేచ్ఛ ఉందో శివాజీకి కూడా అంతే స్వేచ్ఛ ఉంది. కందకు లేని దురద కత్తి పీటకు ఎందుకని నోరు కట్టేసుకోవాల్సిన అవసరం లేదు. వస్త్రధారణ విషయంలో స్వేచ్ఛ అంటే అది కష్టాలు తెచ్చి పెట్టేదిగా ఉండకూడదు. తిండి, బట్ట విషయంలో స్వేచ్ఛ అనేది మనకు మేలు మాత్రమే చేయాలి. ఈ రెండు విషయాలలో నియమ నిబంధనలు పెట్టుకోవడం మనకే మంచిది!

Updated Date - Jan 04 , 2026 | 06:09 PM