Share News

Maoist movement: యుద్ధం ఆపటం ద్రోహం కాదు!

ABN , Publish Date - Jan 04 , 2026 | 02:47 AM

హైదరాబాద్‌పై నాటి పోలీస్‌ చర్య తర్వాత తెలంగాణా సాయుధ పోరాటాన్ని కొనసాగించాలా వద్దా అన్న విషయంలో కమ్యూనిస్టు పార్టీ లోపలా వెలుపలా పెద్దగా చర్చ జరగలేదు......

Maoist movement: యుద్ధం ఆపటం ద్రోహం కాదు!

హైదరాబాద్‌పై నాటి పోలీస్‌ చర్య తర్వాత తెలంగాణా సాయుధ పోరాటాన్ని కొనసాగించాలా వద్దా అన్న విషయంలో కమ్యూనిస్టు పార్టీ లోపలా వెలుపలా పెద్దగా చర్చ జరగలేదు. కానీ నేడు ఆపరేషన్‌ కగార్‌ కారణంగా మావోయిస్టుల మరణాలు, లొంగుబాట్లూ తారస్థాయికి చేరిన నేపథ్యంలో సాయుధ పోరాటాన్ని విరమించాలా, విశ్రమించాలా, కొనసాగించాలా? అనే విషయాలపై విస్తారమైన చర్చ జరుగుతున్నది.

మావోయిస్టు పార్టీ నిర్మాణంలో భాగమై, కష్టనష్టాలు చవిచూస్తున్న వారిలో విరమణవాదం వైపు మొగ్గు ఎక్కువ ఉంది. బయట భద్రజీవితం గడుపుతున్న సానుభూతిపరులూ, మద్దతుదారులూ దీన్ని సమర్థించటం లేదు. ప్రస్తుత విషయం పక్కనపెట్టి పాత తెలంగాణా పోరాటం విషయానికొస్తే– 1946 నుంచి 1951 వరకు జరిగిన ఈ పోరాటంలో 1948 సెప్టెంబర్‌ 17న పోలీసు చర్య జరిగిన తర్వాతే కమ్యూనిస్టు పార్టీ సింహభాగం కార్యకర్తల్ని కోల్పోయింది. చివరకు నాలుగు వేలమంది ఆత్మార్పణ జరిగిన తర్వాత నాయకులు కళ్ళు తెరిచి, 1951 అక్టోబర్‌ 21న పోరాటాన్ని విరమించారు.

పోలీసు చర్య తర్వాత తీవ్ర ప్రాణనష్టం జరుగుతున్నప్పటికీ పోరాటాన్ని ఎందుకు కొనసాగించారు? పోరాట విజయాల్ని కాపాడుకోవటం కోసమే అన్న వాదన ఒప్పుకుందామన్నా– 1948 నుంచి 1951 దాకా ఎందరో యోధుల్ని నష్టపోవటం తప్ప కాపాడుకున్నది ఏమిటి? లీగల్‌గా ఉండి ఆ పని చేయలేం, అనేట్టయితే మరి 1951 నుంచి ఈనాటి వరకూ ఈ పార్టీలు చేస్తున్న లీగల్‌ పార్లమెంటరీ పనులకు అర్థం లేనట్టేనా? కనీసం 1952 తొలి ఎన్నికల్లో అభ్యర్థులు దొరక్క ఒకే వ్యక్తి మూడు నియోజకవర్గాల్లో నిలబడాల్సిన పరిస్థితి వుండేది కాదు కదా. 1948 నుంచి లీగల్‌గా పనిచేస్తే 1952 ఎన్నికల్లో హైదరాబాద్‌లో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చేది కదా. 1948నాటి స్థితికీ, నేటి స్థితికీ తేడా ఏమిటంటే– ఆనాడు ప్రజలూ, కార్యకర్తలూ చనిపోతే నేడు కార్యకర్తలతో పాటు నాయకులు కూడా చనిపోయారు. పోరాట విరమణ అంటే లొంగిపోవటమో, దిగజారిపోవటమో ద్రోహం చేయటమో కాదు. అననుకూల పరిస్థితుల్లో వేసే ఎత్తుగడ. అయితే లొంగిపోతున్న వారంతా ఉద్యమ ప్రయోజనాల కోసమే లొంగిపోతున్నారా? అనేది తేల్చగలిగినది కాదు. మావోల ఎర్ర దండులో తెల్లజెండాలెత్తటం ఇప్పుడు కొత్తగా వచ్చినదేమీ కాదు. లొంగిపోయినప్పటి వారి హావభావాలపై కూడా స్పష్టంగా వ్యాఖ్యానించలేం. లొంగిపోయినా బతకనిస్తారో లేదోననే అభద్రతాభావంలో వున్న వారి మానసిక స్థితిని అంచనా వేయటం కష్టం.


వంద సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో పార్టీ జరిపిన పోరాటాల్లో సాఫల్య వైఫల్యాలు రెండూ ఉండటం సహజం. ఎక్కువ తక్కువలు, వాటికోసం చెల్లించిన మూల్యం బేరీజు వేసుకొని కొనసాగటం విజ్ఞత. విషాదమేమిటంటే అన్ని కమ్యూనిస్టు గ్రూపుల్లోనూ తరతమ స్థాయిల్లో ఈ విజ్ఞత లోపించటం. జరిగిన ఎన్‌కౌంటర్లు నిజమా బూటకమా అన్న చర్చే అసంగతం. 1969 నుంచి 2025 వరకు జరిగిన ఎన్‌కౌంటర్లలో 95శాతానికి పైగా బూటకమే. ఆనాడు శ్రీకాకుళంలో గాని, ఈనాడు దండకారణ్యంలో గాని భద్రతా బలగాలు అడవి లోపలకు వెళ్లనంత వరకే గానీ– వారు ఎప్పుడైతే అడవిలోకి ప్రవేశించారో అప్పుడే మావోయిస్టులు ఓటమి పాలయ్యారు. ‘ఇంత జరుగుతున్నా నంబాల కేశవరావు లాంటి అగ్ర నాయకుడు కర్రెగుట్టలో ఉండటం సబబేనా?’ అని మావోయిస్టు పార్టీలోని ఒక పెద్ద నాయకుణ్ణి అడిగాను. దుర్భేద్యమైన బలగాల ముట్టడి నుంచి బయటపడే దారి లేకనే నంబాల దొరికిపోయాడని ఆయన చెప్పాడు.

అద్భుతమైన సాంకేతికత, అసంఖ్యాకమైన బలగాలు, వందల సంఖ్యలో లొంగుబాట్లు, మరణాలు, చేయూతనివ్వని జనం, నిర్లిప్తంగా చూస్తున్న మేధావులు, ఆంతరంగిక చర్చలు లేకుండా స్వంత నిర్ణయాలు తీసుకుంటున్న నాయకులు, అయోమయంలో కార్యకర్తలు... ఇలా అన్నీ విఫల సందర్భాలే. ‘మన’ అనే మమకారం స్థానంలో ఎవరికి వాళ్లు ‘నా’ అనే అహంకారం ప్రదర్శించారు. కలలన్నీ కల్లలవ్వటానికి ఈ ఒక్కటి చాలు. కేంద్ర కమిటీ సభ్యులే 14 మంది చనిపోయారు. ఒక్క 2025లోనే 317 మంది హతమయ్యారు! 862 మంది అరెస్టు అయ్యారు. 1,973 మంది లొంగిపోయారు. ప్రభావిత జిల్లాలు 126 నుంచి 11కు పడిపోయాయి. ఈ స్థితిలో లొంగిపోవటం సరైనదా? కాదా? అన్నదే సమస్య కానీ– ఆయుధాలతోనా, ఆయుధాలు లేకుండానా అన్న మీమాంస తర్కానికి నిలిచేది కాదు. ఆయుధాలు తిరిగి పార్టీకి ఇవ్వడమంటే ‘మేం భద్రజీవితాల్ని చూసుకున్నాం, మీరు పోరాడండి’ అని చెప్పడమే కనుక అది సరికాదని వారు భావించడంలో తప్పులేదు. స్వప్నాలు భగ్నమై, ఉద్యమం అస్థిపంజరానికి కప్పిన చిల్లుల దుప్పటిగా మారినప్పుడు ఎదురయ్యే ఒకే ఒక్క ప్రశ్న– మారటమా, మరణించటమా? దానికి జవాబు ఆలోచించటం ఎంతటి వారికైనా సులువు కాదు. కప్పదాట్లు, పిల్లిమొగ్గలు చాలా ఉద్యమాల్లో సహజమే. కానీ నిండు బతుకుల్ని నిప్పుల పాల్జేయడానికి సిద్ధపడినవారు– మారటమా, మరణించటమా? అనే ప్రశ్న ముందు నిలబడి తీసుకున్న నిర్ణయాలను ద్రోహచింతన అని తేల్చిపారేయటం సరైనదేనా? ‘‘అవసరమైనప్పుడు వెనకడుగు వేయటం, అవకాశం వచ్చినప్పుడు దెబ్బతీయటం’’ అనేది మావో ప్రవచిత గెరిల్లా సూత్రమేగా, మావోయిస్టులు పాటించటంలో తప్పేముంది?

మావోయిస్టుల ఈనాటి స్థితికి కేవలం నిర్బంధమే కారణమా? వారి వ్యూహం ఎత్తుగడల్లో లోపమేమన్నా ఉన్నదా? అన్నది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మజుందార్‌ కాలం నాటి బాల్యంలోనే వృద్ధాప్య ఛాయలు ఉన్నాయేమో కూడా పునశ్చరణ చేసుకోవాలి. త్యాగాల్ని పొగడలేని, వైఫల్యాల్ని విమర్శించలేని ఒక విచిత్ర పరిస్థితిని సృష్టించగలగటంలో మాత్రం మావోయిస్టులు విజయం సాధించారు. భిన్నాభిప్రాయానికి ‘ద్రోహం’ అన్న ముద్ర వేసినంత కాలం, చర్చకు బదులు చీలికే మార్గం అని భావించినంత కాలం మావోయిస్టు పార్టీయే కాదు, మరే కమ్యూనిస్టు పార్టీ మనజాలదు.

-చెరుకూరి సత్యనారాయణ

Updated Date - Jan 04 , 2026 | 02:47 AM