భూ పోరాటాల యోధుడు
ABN , Publish Date - Aug 08 , 2026 | 01:32 AM
జీవితమంతా పీడిత ప్రజల అభ్యున్నతికే వెచ్చించిన కమ్యూనిస్టు యోధుడు దాసరి నాగభూషణరావు. ఆదర్శ కమ్యూనిస్టుగా, భూ పోరాటాల యోధుడుగా జగమెరిగిన వ్యక్తి ఆయన.
జీవితమంతా పీడిత ప్రజల అభ్యున్నతికే వెచ్చించిన కమ్యూనిస్టు యోధుడు దాసరి నాగభూషణరావు. ఆదర్శ కమ్యూనిస్టుగా, భూ పోరాటాల యోధుడుగా జగమెరిగిన వ్యక్తి ఆయన. విద్యార్థి దశలోనే ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించారు. 1926 ఆగస్టు 10న అప్పటి కృష్ణా జిల్లా నూజివీడు తాలూకా దిగవల్లి గ్రామంలో ధనిక రైతు కుటుంబంలో జన్మించారు. హైస్కూలులో చదువుకుంటూ జాతీయ భావాలకు ప్రభావితులయ్యారు. జాతీయ సేవాసమితి అనే సంస్థను ఏర్పరచి విద్యార్థులలో జాతీయ భావాలను పెంపొందించారు. తమ్మారెడ్డి సత్యనారాయణ ప్రోత్సాహంతో ఏఐఎస్‌ఎఫ్‌లో చేరి, తరువాత జిల్లా అధ్యక్షునిగా పని చేశారు. గుంటూరు ఎ.సి కాలేజీలో చేరి, ప్రిన్సిపాల్ సైప్స్ డిటెన్షన్ విధానానికి, జాతీయ నాయకుల పట్ల చులకన భావానికి నిరసనగా ఆగస్టు 15న జాతీయ జెండా ఎగురవేయబోతున్న సైప్స్‌ను ప్రతిఘటించారు.
ఏఐఎస్‌ఎఫ్ ప్రధాన కార్యదర్శిగా కలకత్తా నుంచి కార్యకలాపాలను నిర్వహించారు. 1952లో పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్షకు మద్దతుగా విద్యార్థి ఉద్యమానికి దాసరి నాయకత్వం వహించారు. 1955 నుంచి పార్టీ నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు. 1964 వరకు పార్టీ కార్యదర్శిగా పనిచేశారు. సింబాలిక్ ఉద్యమాలకు దాసరి వ్యతిరేకం. ఒక సమస్యలో తలదూర్చితే చివరికంటా దాని అంతు చూడాలనే తత్వం దాసరిది. పనిలో సోమరితనం, వాయిదా వేసుకోవటం, ఉదాసీనంగా వ్యవహరించటాన్ని దాసరి తీవ్రంగా ఖండించేవారు. పార్టీ చర్చలలో నిర్మొహమాటంగా, స్పష్టంగా మాట్లాడేవారు. దాసరి వచ్చిన తరువాత నూజివీడు తాలూకాలో జమీందార్లు, మొఖసాదార్ల దౌర్జన్యాలకు ఫుల్‌స్టాప్ పడింది. సాగుకు లాయకైన బంజరు భూములు, అడవి బంజర్ల ఆక్రమణ ఉద్యమానికి ఆయన శ్రీకారం చుట్టారు. 1955 తరువాత భూ ఆక్రమణ ఉద్యమం దాసరి నాయకత్వంలో ద్విగుణీకృతంగా సాగింది. 1985లో దాసరి ప్రోత్సాహంతో చెట్టు పట్టాలకై ఉద్యమం జరిగింది.
దాసరి రాజకీయ జీవితంలో మరుపురాని ఘటనలు రెండు ఉన్నాయి. ఒకటి– 1975లో విజయవాడలో జరిగి సీపీఐ 10వ మహాసభల నిర్వహణ. ఈ సభలకు ఆహ్వానసంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన దాసరి ‘నభూతో న భవిష్యతి’ అన్నట్టుగా నిర్వహించారు. జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందారు. ముగింపులో జరిగిన మహాప్రదర్శన దాసరి నిర్మాణదక్షతకు గొప్ప ఉదాహరణ. పదివేల మంది సుశిక్షిత ఎర్రసేన మార్చింగ్ చూసి తరించవలసిందే. రెండు– 1973లో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం సందర్భంగా ఫాసిస్టు ఉద్యమాన్ని ప్రతిఘటించి రాష్ట్ర సమైక్యతకై అకుంఠిత దీక్షతో చేసిన పోరాటం చిరస్థాయిగా నిలుస్తుంది. 1998లో రాజ్యసభ అభ్యర్థిగా విజయం సాధించారు. ఒక పార్లమెంటు సభ్యుడు ఎంపీ నిధులను ఎలా ప్రజాప్రయోజనాలకు ఖర్చు చేయవచ్చో ఆచరణాత్మకంగా చూపించిన వ్యక్తి దాసరి నాగభూషణరావు. ఇక దాసరి కీర్తికిరీటంలో కలికితురాయి ‘చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్’. ప్రభుత్వం నుంచి ఐదెకరాలు సేకరించి హైదరాబాద్ కొండాపూర్‌లో వృద్ధాశ్రమం నిర్మించారు. నూజివీడు, విజయనగరం, శ్రీకాకుళంలలో ‘అమర్ భవన్’ల నిర్మాణానికి కృషి చేశారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతిని కాంక్షించే ప్రగతిశీల వ్యక్తులందరికీ దాసరి జీవితం ఆదర్శప్రాయం.
-కొమ్మన నాగేశ్వరరావు
అమర్‌భవన్ సొసైటీ అధ్యక్షులు, నూజివీడు
(ఆగస్టు 10న దాసరి నాగభూషణరావు
శతజయంతి సందర్భంగా నూజివీడు అమర్‌భవన్‌లో
కాంస్య విగ్రహావిష్కరణ)