Share News

చీకటి పడ్డాక

ABN , Publish Date - Oct 12 , 2026 | 03:31 AM

చీకటి పడుతుంది పగలంతా కురిసిన కాంతివాన వెలిసిపోతుంది సీతాకోకలా రెక్కలార్చిన సాయంత్రపు ఆకాశం చీకటి గూటిలోకి ఎగిరిపోతుంది.

చీకటి పడ్డాక

చీకటి పడుతుంది

పగలంతా కురిసిన కాంతివాన వెలిసిపోతుంది

సీతాకోకలా రెక్కలార్చిన సాయంత్రపు ఆకాశం

చీకటి గూటిలోకి ఎగిరిపోతుంది

ఇప్పుడిక కాలమంతా రాత్రికి చెందినది

దీపాలు వెలుగుతాయి ఒక్కటొక్కటిగా

చూస్తూ ఉండగానే ఇళ్ళ నిండా, వీధుల నిండా

దీపాల వాన, వెలుతురుల సీతాకోకలు

ఈ దీపాలంటే మోహం నీకు

వాటి చుట్టూ పసిపిల్లల్లా దాగుడుమూతలాడే

చీకటులన్నా, నీడలన్నా ఇష్టం

వాటిలోకి చూస్తావు, వాటి చుట్టూ చూస్తావు

వాటన్నిటినీ ఆవరించుకున్న జీవితాన్ని చూస్తావు

యజమానిలా నిను గమనించే

పగటికాంతి తరువాత

ప్రియమైన స్నేహితురాలిలా సమీపించే

చల్లని, మెల్లని రాత్రి,

రాత్రిలో ఆమె చూపులా వెలిగే చంద్రవంక,

ఆమె మాటల్లా మెరిసే నక్షత్రాల గుంపులు,

ఆమె స్పర్శలా తాకే మృదు పవన వీచికలు

నిన్ను ఒకింత సేద తీరుస్తాయి

ఇప్పుడిక జీవితం ఆశావహం కావటం మొదలవుతుంది

భయం లేదు, నేనున్నానని ఎవరో అంటున్నట్లు తోస్తుంది

మెల్లగా, చెరువుపైన అలల సర్దుకొన్నట్లు

నీ ఉద్వేగాలు చల్లబడతాయి

రేపంతా బావుంటుంది

దేవుడు నీ రేపటిని వెన్నెలబొమ్మలా తీర్చుతాడని నమ్ముతూ,

నిన్ను నిద్రలోకి విడిచి పెట్టుకొంటావు

- బివివి ప్రసాద్

90320 75415

Updated Date - Oct 12 , 2026 | 03:35 AM