Share News

సంక్షేమం, సంస్కరణల సంజీవయ్య

ABN , Publish Date - Feb 14 , 2026 | 01:08 AM

రాజకీయాల్లో ఎందరో నాయకులు పుట్టుకొస్తారు. వారిలో కొందరే చిరకాలం గుర్తుండిపోతారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తుల్లో మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఒకరు..

సంక్షేమం, సంస్కరణల సంజీవయ్య

రాజకీయాల్లో ఎందరో నాయకులు పుట్టుకొస్తారు. వారిలో కొందరే చిరకాలం గుర్తుండిపోతారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తుల్లో మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఒకరు. ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం. 38 ఏళ్లకే ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించి, భారతదేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా పార్టీలకు అతీతంగా గౌరవం అందుకున్నారు. అంతేకాదు– అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ(ఏఐసీసీ) అధ్యక్షుడిగా పనిచేసి, నీతీ నిజాయితీ, నిరాడంబరానికి చిరునామాగా నిలిచారు. తరతరాలు చర్చించుకునేలా సంక్షేమ పథకాలు అమలు చేసి, పాలనలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి అనివార్య కారణాల వల్ల పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. తదుపరి ముఖ్యమంత్రిగా సంజీవయ్య పేరును ఆయన సన్నిహితులు అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లారు. ఓ దళిత సామాజిక వర్గానికి చెందిన సంజీవయ్యను ముఖ్యమంత్రిని చేయడం ఇష్టం లేని కొందరు ఆయన అవినీతిపరుడంటూ ప్రధాని నెహ్రూకు ఫిర్యాదు చేశారు. ఒకప్పటి హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యశ్వంత్‌ సింగ్‌ పర్మర్‌తో నెహ్రూ రహస్యంగా విచారణ జరిపించారు. సంజీవయ్య స్వగ్రామం పెద్దపాడుకు వెళ్లి విచారించిన ఆయన, తిరిగి ఢిల్లీ వెళ్లి వాస్తవ పరిస్థితిని నెహ్రూకు వివరించారు. తర్వాత ఇంకెప్పుడూ సంజీవయ్యను నెహ్రూ శంకించలేదు. 1960 జనవరి 11న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండో ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య బాధ్యతలు స్వీకరించారు.


తక్కువ కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉండేలా సంజీవయ్య పాలన సాగించారు. అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. సామాన్యులకు సంక్షేమ పథకాలు ఆయన హయాంలోనే మొదలయ్యాయి. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), ఉపాధ్యాయులకు పెన్షన్‌ విధానం ఆయనే ఆరంభించారు. పేదలకు ఆరు లక్షల ఎకరాల బంజరు భూములు పంపిణీ చేశారు. భవన నిర్మాణ వ్యవహారాలు చూసేందుకు పరిశ్రమల శాఖలో ప్రత్యేక విభాగం, చిన్నతరహా పరిశ్రమల సంస్థ, ఆంధ్రప్రదేశ్‌ భూగర్భ గనుల సంస్థలు ఆయన పాలనలోనే పురుడు పోసుకున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు 14 నుంచి 17శాతానికి, బీసీలకు 24 నుంచి 33శాతానికి రిజర్వేషన్లు పెంచారు. తెలుగులోనే ఉత్తరప్రత్యుత్తరాలు ఉండాలని ఉత్తర్వులు ఇచ్చారు. సరోజినీదేవి కంటి ఆస్పత్రి, రవీంద్రభారతి, లలితకళల అకాడమీలను ఏర్పాటు చేశారు. మండల్‌ కమిషన్‌కు ముందే బీసీ రిజర్వేషన్లు అమలు చేసిన గొప్ప దార్శనికుడు సంజీవయ్య. ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్‌ అమలుకు 1961లో జీవో తీసుకొచ్చారు. ముఖ్యమంత్రిగా సొంతూరు పెద్దపాడుకు వచ్చి వెళ్తుండగా తన తల్లికి వంద రూపాయలు ఇచ్చారు. వృద్ధులైన తల్లిదండ్రులకు ప్రతి నెలా ఇలా ఎవరు డబ్బులు ఇస్తారు? అని తన తల్లి అడిగిన ప్రశ్నకు సమాధానంగా వృద్ధాప్య పింఛన్‌ ఆయన కాలంలోనే ప్రారంభించారు.

కర్నూలు జిల్లా గోనెగండ్ల వద్ద హంద్రీ నదిపై గాజులదిన్నె ప్రాజెక్టు (సంజీవయ్య సాగర్‌), ఆత్మకూరు సమీపంలో నల్లమల అటవీ ప్రాంతంలో వరదరాజస్వామి ప్రాజెక్టు సహా పులిచింతల, వంశధార ప్రాజెక్టులకు ముఖ్యమంత్రిగా శంకుస్థాపన చేశారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయడంలో సంజీవయ్య కృషి ఎంతో ఉంది. వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించిన ఆయన ఢిల్లీలో తనకున్న పరిచయాలు, నెహ్రూకు తనపై ఉన్న విశ్వసనీయతను ఉపయోగించుకుని ఎన్నో కేంద్ర ప్రభుత్వరంగ పరిశ్రమలు హైదరాబాద్‌కు తీసుకురావడంలో కృషి చేశారు.


సంజీవయ్య స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ మూడో ముఖ్యమంత్రిగా మళ్లీ నీలం సంజీవరెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో సంజీవయ్యను ప్రధాని నెహ్రూ ఏఐసీసీకి అధ్యక్షుడిని చేశారు. తొలిసారిగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సమయంలో ప్రధాని నెహ్రూ లేచి, సంజీవయ్యను పిలిచి ‘సర్‌ మీ ఈ కుర్చీని అలంకరించండి’ అంటూ ఆహ్వానించడంతో... నెహ్రూ అంతటి వారు ‘సర్‌’ అని సంబోధించి అధ్యక్ష స్థానంలో కూర్చోమనడంతో సంజీవయ్యకు ఆనంద బాష్పాలు వచ్చాయని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. నెహ్రూ మంత్రివర్గంలో, లాల్‌బహుదూర్‌ శాస్త్రి మంత్రివర్గంలో పనిచేశారు. ఇందిరాగాంధీ మంత్రివర్గంలో భారీ పరిశ్రమలశాఖ మంత్రిగా, కార్మిక, పునరావాసశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కార్మికశాఖ మంత్రిగా జెనీవాలో, ఐక్యరాజ్య సమితి అనుబంధ అంతర్జాతీయ కార్మిక సదస్సులో ప్రసంగించిన ఆయన... కంపెనీలు, ఫ్యాక్టరీలు తమ సిబ్బందికి తప్పనిసరిగా ఒక నెల జీతం బోనస్‌గా ఇవ్వాలనే చట్టం తీసుకురావడంతో... సంజీవయ్య పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ఢిల్లీ కేంద్రంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను సమైక్యం చేసేలా ‘సేవా స్తంభ్‌’ అనే వేదికను ప్రారంభించారు. 1971 మార్చి 18న ఏఐసీసీ అధ్యక్షుడిగా రెండో పర్యాయం బాధ్యతలు చేపట్టిన ఆయన, ఆ పదవిలో ఉంటూనే 51 ఏళ్ల వయసులో అనారోగ్యంతో 1972 మే 7న ఢిల్లీలో మరణించారు. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ ఒడ్డున ఉన్న ఉద్యానవనంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన స్మారకార్థం ఆ ఉద్యానవనానికి ఆయన పేరు పెట్టారు.

సంజీవయ్య రాజనీతిజ్ఞుడే కాక, సాహిత్యం, సంగీతం, రచనల్లో కూడా ప్రవేశం ఉన్నవారు. సంజీవయ్య రాసిన ‘లేబర్‌ ప్రాబ్లమ్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌’ అనే పుస్తకాన్ని ఆక్స్‌ఫర్డ్‌ ప్రచురించింది. విశాఖపట్నంలో స్థాపించిన ఆంధ్రప్రదేశ్‌ నేషనల్‌ లా యూనివర్సిటీకి 2012లోనూ, నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికీ సంజీవయ్య పేరు పెట్టారు. విలువలు చెప్పడమే కాదు, వాటిని ఆచరణలో పెట్టి చూపించిన రాజనీతిజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి దామోదరం సంజీవయ్య.

-గోరంట్ల కొండప్ప

Updated Date - Feb 14 , 2026 | 01:08 AM