మతంమారితే పోయే వివక్షా ఇది?
ABN , Publish Date - Apr 02 , 2026 | 05:21 AM
కారంచేడు, చుండూరు హత్యాకాండల్లో చనిపోయింది దళితులు. చంపినవాళ్ళు అగ్రకులాలకు చెందినవాళ్ళు. కారంచేడులో చనిపోయిన బాధితుల పేర్లు కొన్ని చూద్దాం: ఆలీసమ్మ, యెహోషువా...
కారంచేడు, చుండూరు హత్యాకాండల్లో చనిపోయింది దళితులు. చంపినవాళ్ళు అగ్రకులాలకు చెందినవాళ్ళు. కారంచేడులో చనిపోయిన బాధితుల పేర్లు కొన్ని చూద్దాం: ఆలీసమ్మ, యెహోషువా, అబ్రహాం, మోషే, మత్తయ్య... వగైరా. ఇక, చుండూరు బాధితులలో కొంతమంది పేర్లు చూద్దాం: ఇమాన్యుయేల్, ఇసాకు, సంసోను... వగైరా. వీళ్ళంతా దళిత క్రిస్టియన్‌లు. మతం మారినంత మాత్రాన వీళ్ళకు కులవివక్ష నుంచి ఎటువంటి మినహాయింపూ దొరకలేదు. కానీ, మొన్న మార్చి 24, 2026న– ‘క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా రద్దయినట్టే’నంటూ వెలువడిన సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈ దాడులేవీ కులవివక్షకు సంబంధించినవి కానట్టే! ఎందుకంటే, ఇక్కడ బాధితులెవరూ హిందువులు కాదు కాబట్టి.
2021లో చింతాడ ఆనంద్ అనే పాస్టర్‌పై దాడి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇది. క్రిస్టియన్లలో కులం లేదు కాబట్టి ఈ కేసు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కిందకు రాదు అని కోర్టు తేల్చేసింది. దీన్ని సమర్థిస్తూ బైబిల్‌లోని గలతీయులకు రాసిన పత్రిక, మూడో అధ్యాయం 28వ వచనాన్ని కూడా కోట్ చేసింది: ‘‘యూదులు గానీ గ్రీకులు గానీ లేరు, దాసులు గానీ స్వతంత్రులు గానీ లేరు, మగవారు గానీ ఆడవారు గానీ లేరు– మీరందరూ క్రీస్తు యేసులో ఒక్కటే’’ అన్న వచనాన్ని కోట్ చేస్తూ, క్రిస్టియానిటీలో ఇలాంటి భేదాలేవీ లేవు, అలాగే కులమూ లేదు అని సుప్రీంకోర్టు నిర్ధారించింది. దళిత క్రిస్టియన్ అనే కాన్సెప్ట్ లేదని, ఇది కేవలం క్రిస్టియన్ కేటగిరీ అని తేల్చిచెప్పింది.
క్రిస్టియానిటీలో కులం లేదు అన్నది నిజమే. కానీ, ఈ దేశంలో క్రిస్టియన్లతో వ్యవహరిస్తున్న సమాజంలో కులం ఉంది అన్న మౌలిక అవగాహన సుప్రీంకోర్టు తీర్పులో మిస్ అయ్యింది. కులవివక్షకు గురైన వాళ్ళు, కులం లేని సమాజాన్ని కోరుకుంటారు. ఆ సమాజాన్ని వాళ్లకు ఇవ్వాలా వద్దా అన్నది నిర్ణయించేది మాత్రం బయట కులస్థులు. కుల వివక్షకు గురైనవాళ్లు మతం మారినా గానీ వాళ్లను కులం ప్రకారం ట్రీట్ చేయాలా వద్దా అన్నది నిర్ణయించేది బయటనున్న కుల సమాజమే. కారంచేడులోనూ, చుండూరులోనూ జరిగింది ఇదే. ఇక్కడ బాధితులు క్రిస్టియన్‌లు అయినప్పటికీ వాళ్ళ కులాన్ని బట్టి వాళ్ళను ఊచకోతకు గురి చేసింది కుల సమాజం. దానికి క్రిస్టియానిటీకి ఏమీ సంబంధం లేదు.
ఇదే తీర్పులో సుప్రీంకోర్టు– ఎస్టీలకు బీసీలకు ఈ మత మార్పిడి వ్యవహారం వర్తించదని చెప్పింది. దీనికి సమర్థనగా ఎస్టీ అనేది సంస్కృతికి సంబంధించిన అంశం కాబట్టి దానికీ మతానికీ సంబంధం లేదు అని చెప్పింది. మరి బీసీలు కన్వర్ట్ అయ్యాక, వాళ్ళకు వాళ్ళ కులం ఎలా కంటిన్యూ అవుతుంది అన్నదానికి మనకు ఈ తీర్పులో సమాధానం దొరకదు. ఈ తీర్పు ప్రకారం– సిక్కులుగానో, బౌద్ధులుగానో మారితే మాత్రం ఎస్సీ హోదా కొనసాగుతూనే ఉంటుంది! సిక్కు మతగ్రంథం గురుగ్రంథ్ ప్రకారం మనుషుల మధ్య కులం ద్వారా గానీ, మరేయితర ప్రాతిపదిక ద్వారా గానీ ఎలాంటి విభజనలూ లేవు. మరి సుప్రీంకోర్టు లాజిక్ ఎలా సమర్థనీయమో అంతుచిక్కదు!
ఈ రోజుల్లో ‘భౌతికపరమైన అస్పృశ్యత’ తగ్గుముఖం పట్టిందన్నది నిజమే. కానీ నేడు భౌతిక అస్పృశ్యత కన్నా ‘నిర్మాణాత్మక అస్పృశ్యత’ అతిపెద్ద సమస్య. మనకు ఏ నిర్మాణంలోనూ క్యాస్ట్ హిందూస్ తప్ప మిగతావాళ్ళు కనిపించరు. ఈ రోజుకు కూడా సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో దళిత భాగస్వామ్యం 3శాతాన్ని మించి లేదు. సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లలో 5శాతానికి మించి లేరు. ఇదిలా ఉంటే– దేశంలో క్రిస్టియన్ల జనాభా సుమారు 3శాతం ఉండగా, అందులో 70శాతం దళిత క్రిస్టియన్లు ఉంటారని పలు సర్వే నివేదికలు అంచనా వేశాయి (ఇంటర్నేషనల్ దళిత్ సాలిడారిటీ నెట్‌వర్క్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్). సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదిక ప్రకారం తేలింది ఏమంటే– దళిత క్రిస్టియన్లలో గానీ, దళిత ముస్లింలలో గానీ మతం మారిన తర్వాత స్థితిగతులలో తేడా ఏమీ లేదు. మతం మారిన దళితులకు ఎస్సీ స్టేటస్ ఇవ్వాలా వద్దా అనే విషయంపై నివేదిక సమర్పించాలని 2022లో జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్‌ను ప్రభుత్వం కోరింది. ఆ నివేదిక డెడ్‌లైన్ క్రమంగా, ఏప్రిల్ 2026 దాకా జరుగుతూ వచ్చింది. కానీ ఈ నివేదికను పరిగణనలోకి తీసుకునేందుకు సుప్రీంకోర్టు అప్పటిదాకా ఆగలేదు.
‘మతగ్రంథాల్లో కులం ఉంటేనే కులాన్ని గుర్తించాలి’ అనే సుప్రీంకోర్టు లాజిక్ ప్రకారం చూసినా– హిందూ మతగ్రంథాలలో ఎక్కడా ఇవి కులాలు అని స్పష్టంగా వివరించే ప్రవచనాలు లేవు. మనుస్మృతి గానీ, వేదాలు గానీ, ఉపనిషత్తులు గానీ– వర్ణాల గురించి మాట్లాడతాయి కానీ, కులాల గురించి కాదు. ‘‘హిందూ మతం మారవద్దు. అప్పుడు మాత్రమే నీ దళిత స్థాయిని అలాగే ఉంచి, నీకు కావాల్సిన రిజర్వేషన్ కన్సెషన్స్ ఇస్తాం’’ అని ఇన్సెంటివైజ్ చేయడమే ఈ తీర్పు సారాంశంగా అర్థం చేసుకోవాల్సి వస్తున్నది. ఇది రాజ్యాంగ నైతికతకు వ్యతిరేకం.
చింతాడ ఆనంద్ కేసులో బాధితుడు క్రిస్టియనే కానీ, కులం పేరుతో దూషించబడటం అనేది వాస్తవం. ఈ వాస్తవం దిశగా పోలీసు వ్యవస్థ ఎంత ప్రభావవంతంగా దర్యాప్తు జరిపిందనేది ఏ కోర్టూ గమనించలేదు. అదే విధంగా– కోర్టు ఒక తమాషా విషయాన్ని ప్రస్తావనలోకి తెచ్చింది. ఎవరైనా తిరిగి హిందూ మతంలోకి మరలా కన్వర్ట్ అయితే– అతని ఎస్సీ హోదా పునరుద్ధరింపబడుతుంది అని తన తీర్పులో చెప్పింది. ఇది మత స్వాతంత్ర్యపు హక్కును కాపాడ్డంలో భాగంగా జరిగింది అని అనుకోవచ్చు (కుల వ్యవస్థ వేళ్ళూనుకుపోయిన ఈ దేశంలో ‘కుల స్వాతంత్ర్యపు హక్కు’ మాత్రం లేదు). కానీ ఇలా ఒక మనిషి ఎన్నిసార్లయినా మతం మార్చుకుని ముందుకూ వెనక్కూ వెళ్తూ ఉంటే అతని ఎస్సీ హోదా కూడా మారిపోతూ ఉండటమన్నది మాత్రం హాస్యాస్పదమైన విషయం. మతం మారగానే కులవివక్షకు సంబంధించిన న్యాయరక్షణ రద్దయిపోయేలా చేయడమంటే అది కులాన్ని ప్రొటెక్ట్ చేసే దిశగా అడుగులు వేయడమే. ఆర్టికల్ 17 అస్పృశ్యతను బేషరతుగా నిరోధిస్తున్నది. ఇప్పుడు ఈ తీర్పుతో దానికి కొన్ని షరతులు ఏర్పడిపోయాయి. మతం మారడం వల్ల కులం పోయేది నిజమే అయితే, కుల నిర్మూలన కోసం మత మార్పిడులను ప్రోత్సహించమని ఇదే సుప్రీంకోర్టు ప్రభుత్వానికి సిఫారసు చేయాలి కదా. కానీ ఈ తీర్పు అంత దూరం వెళ్లదు. సామాజిక వాస్తవాన్ని అంగీకరిస్తూనే, చట్టపరమైన న్యాయాన్ని నిరాకరించడమనేది ఈ తీర్పులోని వైరుధ్యం. ఇది మన సమాజంలో ‘కలెక్టివ్ హిపోక్రసీ’కి అద్దం పడుతున్నది.
పి. విక్టర్ విజయ్‌కుమార్
ఇవి కూడా చదవండి..
కాంగ్రెస్ ప్రిన్స్‌కు వందోసారి కూడా ఓటమి ఖాయం: మోదీ
ఎన్డీయే వస్తే తమిళనాడును దక్షిణ ప్రదేశ్‌గా మార్చేస్తారు: స్టాలిన్