ఆస్పత్రిలో అపాయం !
ABN , Publish Date - Mar 21 , 2026 | 03:38 AM
కటక్ ఎస్సీబీ వైద్యకళాశాల ఐసీయులో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో మరణించినవారి సంఖ్య పన్నెండుకు చేరింది. తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతున్నవారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని కూడా వింటున్నాం.
కటక్ ఎస్సీబీ వైద్యకళాశాల ఐసీయులో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో మరణించినవారి సంఖ్య పన్నెండుకు చేరింది. తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతున్నవారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని కూడా వింటున్నాం. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించడం, జరిగిన ఘోరంమీద విచారణకు ఆదేశించడం వంటి చర్యలతో తాను వేగంగా స్పందించానని ఒడిశా ప్రభుత్వం చెబుతోంది. జుడీషియల్ కమిషన్ ఏర్పాటు ద్వారా ఈ ప్రమాదానికి దారితీసిన కారణాలను, పరిస్థితులను, బాధ్యులను గుర్తించి మరిన్ని చర్యలకు సిద్ధంగా ఉన్నానని కూడా అంటోంది. స్వాతంత్ర్యానికి ముందు ఏర్పడిన ఈ ప్రభుత్వాసుపత్రి దేశంలోనే అతిపెద్ద, పురాతన వైద్యశాలల్లో ఒకటి కనుక, భద్రత, సదుపాయాల విషయంలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దేందుకు దీనిని ఆధునికీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఏడేళ్ళ క్రితమే గట్టి నిర్ణయం తీసుకుంది. నాయకుల పరిభాషలో చెప్పుకోవాలంటే, అంతర్జాతీయ ప్రమాణాలతో, ప్రపంచస్థాయిలో, ఎయిమ్స్‌ను సైతం తలదన్నే రీతిలో ఈ ఆస్పత్రిని అభివృద్ధిపరచాలని అనుకున్నారు. నాలుగున్నరవేల కోట్లు ఖర్చవుతుందని కూడా అంచనా వేశారు. అయితే, ప్రాజెక్టు డెడ్‌లైన్లు మారిపోతూ, ఉద్ధరణ అనుకున్నట్టుగా కాకపోవడంతో ఒడిశా హైకోర్టు ప్రభుత్వానికి ఇటీవల చీవాట్లు కూడా పెట్టింది. పాలకుల దృష్టిలో సామాన్య ప్రజల ప్రాణాలకు పెద్దగా విలువ ఉండదనడానికి ఈ ఆస్పత్రి ప్రమాదం మరో నిదర్శనం.
ఈ వైద్యశాలలో గత ఏడాది ఫైర్‌సేఫ్టీ ఆడిట్ జరిగినప్పుడు, అగ్నిమాపకశాఖ కొన్ని లోపాలను గుర్తించి, పరిష్కారాలను సూచించిందని, అవి పూర్తిగా అమలు కాకపోవడంతోపాటు, కొన్ని ప్రాథమిక నిబంధనల ఉల్లంఘనలు కూడా ఈ ఘోరానికి కారణమైనాయని తెలుస్తోంది. ఫైర్ అలారమ్ ఆపివేయడం, స్ప్రింక్లర్ వ్యవస్థ పనిచేయకపోవడం ఇత్యాది లోపాలు అనేకం క్రమంగా బయటపడుతున్నాయి. ఆస్పత్రికి అనుబంధంగా అగ్నిమాపక వ్యవస్థ ఒకటి ఉన్నప్పటికీ, వైద్యసిబ్బంది సకాలంలో ఈ ప్రమాదాన్ని గుర్తించి, హెచ్చరికలు చేయకపోవడంతో సహాయక యంత్రాంగం కూడా అరగంట ఆలస్యంగా అక్కడకు చేరుకున్నదట. ప్రత్యేకంగా, ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాల నివారణ నిమిత్తం గత ఏడాది రాష్ట్రప్రభుత్వం 330కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ, ఈ ఘోరాన్ని నిలువరించలేకపోవడం మరింత విషాదం.
ఆస్పత్రుల్లో 90శాతం అగ్నిప్రమాదాలకు షార్ట్‌సర్క్యూట్ కారణమని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇవి సమానంగా జరుగుతున్నాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో, అందులోనూ ఐసీయూల్లో జరిగే ప్రమాదాలు ఇటీవలికాలంలో అనేకం చూశాం. గత అక్టోబర్‌లో రాజస్థాన్‌లో ఆరుగురు, దానికి ముందు ఝాన్సీలో పదిమంది పసికందులు మరణించడం వంటి ఘటనలు నివారించగలిగేవే. పాతకాలపు వైరింగ్, విద్యుత్ లోడ్ భరించలేని ఉపకరణాలు ప్రమాదానికి కారణమవుతున్నాయి. ఐసీయూల్లో ఆక్సిజన్ గరిష్ఠస్థాయిలో ఉండటంతో మంటలు అతివేగంగా వ్యాపిస్తాయి. పరికరాలు, యంత్రాలు రోజంతా పనిచేసినందున వేడెక్కి ఉండటమూ సహజం. మిగతా చోట్ల జరిగే అగ్నిప్రమాదాల్లో ప్రజలు తమను తాము కాపాడుకొనేందుకు ప్రయత్నించడమో, అగ్నిమాపక సిబ్బంది సహకారంతో బయటపడటమో జరుగుతుంది. కానీ, ఆస్పత్రుల్లో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. ఐసీయూల్లో ఉన్నవారైతే అచేతనస్థితిలో, ట్యూబులూ వైర్లతో మెషీన్లకు అనుసంధానించి మరీ ఉంటారు. అందువల్ల, ఇటువంటి అగ్నిప్రమాదాల సందర్భంలో రోగులను ఏ విధంగా రక్షించుకోవాలన్న విషయంలో వైద్యసిబ్బంది, ఆస్పత్రిలోని ఇతర సిబ్బందికి ఎప్పటికప్పుడు ప్రత్యేక శిక్షణలు అవసరం. పీల్చే ఆక్సిజన్ నుంచి వాడే పరుపుల వరకూ ప్రతీదీ మంటలు త్వరితగతిన వ్యాపింపచేసే అవకాశం ఉన్నందున, అంతటి బీభత్స వాతావరణంలో సైతం రోగులను రక్షించగలిగే వ్యక్తులూ వ్యవస్థలూ సన్నద్ధంగా ఉండాలి. ప్రాణం నిలబెడతారన్న ఆశతో ఆస్పత్రిలో చేరిన రోగి ప్రాణాలను ప్రమాదం పేరిట హరించడం అన్యాయం. ఆస్పత్రిలో జరిగే అగ్నిప్రమాదాలను తీవ్రమైన నేరంగా పరిగణించాలి. ప్రభుత్వ, ప్రైవేటు తేడాలేకుండా భవనం పునాదుల నుంచి మెట్లదారుల వరకూ ప్రతీదానినీ పరీక్షించాలి. పోలీసు, అగ్నిమాపక, విద్యుత్ తదితర అన్ని ప్రభుత్వ శాఖల తనిఖీలతో, సమన్వయంతో నిరంతర పర్యవేక్షణ కొనసాగాలి. రాబోయే రోజుల్లో భయానకమైన ఎండలను కూడా చవిచూడబోతున్న తరుణంలో, కటక్ తరహా ప్రమాదాలను నివారించడానికి దేశం సర్వసన్నద్ధం కావాలి.