Share News

సీతాఫలం సాగుపై దృష్టిసారించాలి

ABN , Publish Date - Nov 04 , 2026 | 12:10 AM

ఒకప్పుడు పల్లెల్లోని గుట్టలు, అడవుల్లో సహజంగా లభించే సీతాఫలం నేడు పట్టణ మార్కెట్లలో ఖరీదైన పండుగా మారుతోంది.

సీతాఫలం సాగుపై దృష్టిసారించాలి

ఒకప్పుడు పల్లెల్లోని గుట్టలు, అడవుల్లో సహజంగా లభించే సీతాఫలం నేడు పట్టణ మార్కెట్లలో ఖరీదైన పండుగా మారుతోంది. ఈ ప్రకృతి ఫలం వినియోగదారులకు భారంగా మారడం వెనుక వాతావరణ మార్పులు, దిగుబడి, సరఫరా, నిల్వ సదుపాయాల కొరత వంటి అనేక కారణాలున్నాయి. అనేక పోషక విలువలు, వాణిజ్య అవకాశాలున్న సీతాఫలాన్ని రైతులకు ఆదాయ వనరుగా మార్చడంలో ప్రభుత్వాలు వెనుకబడ్డాయి. సీతాఫలం ఉష్ణమండల ప్రాంతానికి చెందిన పండు. ఇది మధ్య అమెరికా, వెస్టిండీస్‌ ప్రాంతాల నుంచి శతాబ్దాల క్రితం వాణిజ్య మార్గాల ద్వారా భారతదేశంలో ప్రవేశించింది. ఈ పండులో సహజ చక్కెరలు, పీచు, మాంసకృత్తులు, విటమిన్‌ సి, విటమిన్‌ బి6, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి.

కరువు ప్రాంతాల్లో గ్రామీణ కుటుంబాలకు ఆదాయం అందించగల అవకాశమున్న ఉద్యాన సంపద సీతాఫలం. ఈ ఫలాన్ని రైతుల ఆదాయ వనరులుగా మార్చే బాధ్యత ప్రభుత్వానిదే. శాస్త్రీయ పరిశోధన, ప్రభుత్వ ప్రోత్సాహం, రైతుల భాగస్వామ్యం కలిస్తే జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఈ ఫలం రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపును తీసుకురాగలదు.

సీతాఫలం పక్వానికి వచ్చాక త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పండుగా విక్రయించడానికే పరిమితం కాకుండా సీతాఫలం గుజ్జుతో ఐస్‌క్రీమ్‌, పానీయాలు, ఇతర ఆహార ఉత్పత్తులు తయారు చేసే చిన్న పరిశ్రమలను ప్రోత్సహించాలి. గ్రామీణ మహిళా సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు పల్ప్‌ తయారీ, ప్యాకేజింగ్‌, నిల్వ సాంకేతికత అందించాలి. ఆహార భద్రత ప్రమాణాలు పాటిస్తూ నాణ్యమైన ఉత్పత్తులను దేశీయ, విదేశీ మార్కెట్లకు తీసుకెళ్లాలి. సీతాఫలాన్ని సాధారణ ఉద్యాన పథకాల్లో చేర్చడం మాత్రమే సరిపోదు. రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, భారత వ్యవసాయ పరిశోధనా మండలి అనుబంధ సంస్థలు కలిసి స్థానిక రకాల దిగుబడి, నాణ్యత, వాతావరణ ప్రభావం, నిల్వ సామర్థ్యాలపై పరిశోధనలు చేయాలి.

– శ్రీశైలం దూడం

Updated Date - Nov 04 , 2026 | 12:11 AM