కుప్పకూలిన ‘కాప్’
ABN , Publish Date - Nov 24 , 2026 | 01:12 AM
తుర్కియేలోని అంటాల్యాలో జరిగిన కాప్ 31 (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్) వాతావరణ సదస్సు ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిసింది.
తుర్కియేలోని అంటాల్యాలో జరిగిన కాప్ 31 (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్) వాతావరణ సదస్సు ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిసింది. రెండువందల దేశాల ప్రతినిధుల మధ్య రెండువారాలపాటు కొనసాగిన ఈ చర్చలు శుక్రవారమే ముగియాల్సి ఉన్నా, ఏకాభిప్రాయ సాధనకోసం ఆదివారం వరకూ అంటే, దాదాపు యాభైగంటలు పొడిగించినా అంతిమంగా ఫలితం లేకపోయింది. చరిత్రలోనే అత్యంత సుదీర్ఘంగా సాగి, తుది ఒప్పందం కుదరకుండా కూలిపోయినందున దీనిని 2009 కోపెన్హాగన్ సదస్సుతో పోల్చుతున్నారు. ఉష్ణోగ్రతల పెరుగుదల మీద తాము అదేపనిగా హెచ్చరిస్తున్నప్పటికీ ఇలా ఎవరికీ పట్టనందుకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌కు చాలా కోపం వచ్చింది. మీకు ఈ లెక్కలు పట్టనప్పటికీ, ఆ వాస్తవాలూ, వాటి ప్రభావాలు మారిపోవు అంటూ ఆయిల్ కంపెనీలను, వాటి పక్షాన పనిచేస్తున్న గ్రూపులనూ ఆయన విమర్శించారు. బడా పొగాకు కంపెనీలతో ఈ శక్తిమంతమైన శిలాజ ఇంధన కంపెనీలను పోల్చుతూ, ఇవి సైంటిఫిక్ డేటాను వక్రీకరిస్తున్నాయని, విధాననిర్ణయాలను ఆలస్యం చేస్తూ, చర్యలను అడ్డుకుంటున్నాయని, అవన్నీ భారీగా లాభాలు ఆర్జిస్తూంటే, అవి సృష్టిస్తున్న దుష్ప్రభావాలకు ప్రజలు మూల్యం చెల్లించాల్సి వస్తున్నదని వాపోయారు ఆయన.
భూతాపానికి ఎనభైశాతం కారణమైన బొగ్గు, చమురు, సహజ వాయువుల వినియోగాన్ని దశలవారీగా తగ్గించాలన్న ప్రస్తావన తుదిముసాయిదాలో పూర్తిగా మాయమైపోవడం వెనుక సౌదీ అరేబియావంటి చమురు ఉత్పత్తి దేశాల ఒత్తిడే కారణమంటున్నారు. యూరోపియన్ యూనియన్, బ్రిటన్ సహా దాదాపు 130 దేశాలు దీనిపై తీవ్ర అభ్యంతరం తెలియచేశాయి. శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడానికి బదులుగా, అత్యధిక ఖర్చుతో కూడుకున్న ‘కార్బన్ క్యాప్చర్, యుటిలైజేషన్ అండ్ స్టోరేజ్’ సాంకేతికతను ముసాయిదాలో చేర్చడం మరో ఆశ్చర్యకరమైన పరిణామం. వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్ విడుదల కాకుండా నిలువరించే సాంకేతికత ఇది. పవర్ ప్లాంట్లు, సిమెంట్, ఉక్కు వంటి భారీ పరిశ్రమల నుండి వెలువడే కర్బన ఉద్గారాలను సేకరించి, వివిధ రూపాల్లోకి మార్చి తిరిగి ఉపయోగించడమో, నిల్వచేయడమో ఈ విధానం ఉద్దేశం. మరో విధంగా చెప్పుకోవాలంటే, శిలాజ ఇంధనాల ఉత్పత్తికి చమురు కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, మరోపక్క వాతావరణంలోకి చిమ్ముతున్న విషాన్ని ఒడిసిపట్టే ప్రక్రియకు పెద్దపీట వేయడమన్నమాట. శిలాజ ఇంధనాల వినియోగాన్ని దశలవారీగా నిలిపివేయాలన్న హామీని ఒప్పందంలో చేర్చడాన్ని రష్యా ఎందుకు వ్యతిరేకించిందో, అదేపనిగా పట్టుబడుతున్న యూరోపియన్ యూనియన్ను ఎందుకు విమర్శించిందో తెలియనిదేమీ కాదు. ముసాయిదాలో శిలాజ ఇంధనాల ప్రస్తావన లేకుండా పోవడం వెనుక చమురు ఉత్పత్తి దేశాలున్నాయని రష్యాను ఈయూ తిట్టిపోసింది. సాంకేతిక పరిజ్ఞానం మీద అతిగా ఆధారపడే విధానాన్ని ముందుకు నెట్టి, చమురు, గ్యాస్ ఉత్పత్తికి ఏ ఆటంకాలు లేకుండా సదరు దేశాలు చేసుకున్నాయని దాని ఆరోపణ. వాతావరణ మార్పులు ఇంత భయానకంగా ఉన్నప్పుడు కూడా శిలాజ ఇంధనాల ప్రస్తావన చేయడానికి కూడా ఆయా దేశాలకు మనసొప్పకపోవడం, అన్ని దేశాలు ఏకతాటిపైకి రాకపోవడం విషాదం.
వాతావరణ మార్పుల వల్ల తీవ్రంగా నష్టపోతున్న పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సాయం అందించే విషయంలోనూ ధనికదేశాలు స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ముసాయిదాలో ప్రతిపాదించిన 120 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని కూడా చివరకు తొలగించివేయడం ఆఫ్రికా ఇత్యాది అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆగ్రహం తెప్పించింది. అడాప్టేషన్ నిధుల విషయంలో గత సదస్సులో ఇచ్చిన హామీలకు ఈసారి కచ్చితమైన కాలపరిమితి, కార్యాచరణ ప్రణాళిక సిద్ధమవుతాయని ఈ దేశాలు ఆశపడ్డాయి. అలాగే, కాప్ 28లో శిలాజ ఇంధనాల తగ్గింపు సంకల్పం కూడా ఈ మారు పట్టాలెక్కి పరుగులు తీస్తుందని అనుకున్నందువల్లనే దీనిని పర్యావరణ ప్రేమికులు ‘ఇంప్లిమెంటేషన్ కాప్’గా అభివర్ణించారు. ఎల్‌నినో ప్రభావాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తున్న రోజులివి. తీవ్రమైన ఎండలు, భీకరమైన వరదలు, విపరీతమైన చలి ఇత్యాది ప్రభావాలను ప్రపంచం చవిచూస్తోంది. ఈ కష్టకాలంలోనైనా దేశాలన్నీ ఏకమై కఠిన నిర్ణయాలు తీసుకుంటాయని పర్యావరణవేత్తలు నమ్మారు. అందుకు భిన్నంగా రెండు ప్రధాన యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దేశాల మధ్య ఐక్యతను దెబ్బతీశాయి, కొన్ని దేశాల వీటో బెదిరింపుల మధ్య మొత్తం సదస్సే కుప్పకూలింది. వచ్చే ఏడాది ఆఫ్రికాలో జరగబోతున్న కాప్–32 సదస్సులోనైనా అడుగు ముందుకు పడుతుందని ఆశించాలి.