కులంతో పనేంటి?
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:12 AM
తెలంగాణ రాష్ట్రంలో చదువుకొంటున్న ప్రతి విద్యార్థి తమ కులం, ఉప కులం వివరాలను ఇవ్వాలని, వాటిని గవర్నమెంట్ వెబ్‌సైట్‌లో పెట్టాలని, కొన్ని ప్రైవేటు విద్యాసంస్థల వారు అడుగుతున్నారు. కేవలం వివరాలు ఇస్తే సరిపోదట
తెలంగాణ రాష్ట్రంలో చదువుకొంటున్న ప్రతి విద్యార్థి తమ కులం, ఉప కులం వివరాలను ఇవ్వాలని, వాటిని గవర్నమెంట్ వెబ్‌సైట్‌లో పెట్టాలని, కొన్ని ప్రైవేటు విద్యాసంస్థల వారు అడుగుతున్నారు. కేవలం వివరాలు ఇస్తే సరిపోదట. ఆ వివరాలను విద్యార్థి డైరీలో కూడా రాసి పెట్టుకోవాలట. కాన్వెంట్ స్థాయి నుంచి ఈ వివరాలను నమోదు చేయాలని నిర్బంధం చేయడం ఎంతవరకు సమంజసం? ప్రైవేట్ స్కూళ్లలో గానీ, ప్రభుత్వ పాఠశాలల్లో గాని చదువుతున్న విద్యార్థులకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారని పాఠశాల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమా? అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలా? తమకి ఇష్టం లేకపోతే కులం వివరాలను నమోదు చేసుకోవాల్సిన పనిలేదు. ఓటు వేసేటప్పుడే, ఆ అభ్యర్థులలో తనకు నచ్చిన వాళ్ళు లేకపోతే ‘నోటా’ ఆప్షన్ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా కులం వివరాలు చెప్పడం ఇష్టం లేని వారి కోసం ఒక ఆప్షన్ పెట్టాలి.
ఒకటి, రెండవ తరగతులు చదువుతున్న పిల్లలు కూడా కులం అంటే ఏమిటి? ఉప కులం అంటే ఏమిటి? వాటిని డైరీలో రాయాలని టీచర్స్ చెప్తున్నారనీ అమాయకంగా అడుగుతున్నారు. పిల్లల్లో ఆ వయసు నుంచే కులాన్ని ఇంజెక్ట్ చేయడం దారుణమైన విషయం. ఒకవేళ ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలి. రాయితీలు తీసుకునేవాళ్లు ఎలాగూ కుల వివరాలను ఇస్తారు. ప్రైవేట్ పాఠశాలల్లో ముఖ్యంగా 10వ తరగతి లోపు విద్యార్థులలో ఈ రకమైన ఆలోచనలు కలిగించటం సమాజాన్ని కుల సమాజాలుగా తయారు చేయడమే.
కొన్నాళ్ల క్రితం వరకు సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్‌లో కూడా ఒక్కో కులానికి ఒక్కో స్టార్ పెట్టేవారు. అత్యధిక సంఖ్యలో విద్యార్థులు, అధ్యాపకులు ఆ పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత పాలకవర్గం దాన్ని ఉపసంహరించుకున్నది. తమకు అవసరమైన చోట్లనే ఆ వివరాలను నమోదు చేయాలి తప్ప, అన్నిచోట్లా బహిరంగంగా రాసే పద్ధతిని మానుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ఇటువంటి నిర్ణయం తీసుకుంటే విద్యార్థులు, తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలను అనుసరించి ఆ వివరాలను ఇవ్వడమా? ఇవ్వకపోవడమా అనేది వారి నిర్ణయానికే వదిలెయ్యాలి. నిర్బంధంగా ఆ వివరాలను సేకరించటం సరైనది కాదు. పిల్లల్లో చిన్ననాటి నుంచే కులానికి సంబంధించిన విష బీజాలు నాటడం సమాజానికి మంచిది కాదు. ఈ రోజు డైరీ వరకు రాయమని చెప్పిన వాళ్ళు తర్వాత కాలంలో వాళ్ళ ఐడెంటిటీ కార్డులోనూ, మెడల్లోనూ బోర్డులు వేయడానికి కూడా సిద్ధపడినా ఆశ్చర్యం లేదు. ఇటువంటి నిర్ణయాన్ని ఒకవేళ ప్రభుత్వం తీసుకుంటే దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి.
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్