Share News

యూపీ.. తుది యుద్ధానికి తొలి పోరాటం

ABN , Publish Date - Nov 04 , 2026 | 12:24 AM

నవంబర్ 1న దేశ రాజధానిలో కాంగ్రెస్ ర్యాలీ కోసం వచ్చిన పార్టీ కార్యకర్తలు, నాయకులను చూస్తే 12 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా ఆ జాతీయ రాజకీయ పార్టీ అధిష్ఠానం ఎంత శక్తిమంతమైనదో తెలుస్తోంది.

యూపీ.. తుది యుద్ధానికి తొలి పోరాటం

నవంబర్ 1న దేశ రాజధానిలో కాంగ్రెస్ ర్యాలీ కోసం వచ్చిన పార్టీ కార్యకర్తలు, నాయకులను చూస్తే 12 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా ఆ జాతీయ రాజకీయ పార్టీ అధిష్ఠానం ఎంత శక్తిమంతమైనదో తెలుస్తోంది. ముఖ్యమంత్రులు, మంత్రులు, పీసీసీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులందరికీ టార్గెట్ విధించి రకరకాల మార్గాల ద్వారా పార్టీ శ్రేణులను ఢిల్లీకి రప్పించారు. రామ్‌లీలా మైదానం పూర్తిగా నిండిందని కాంగ్రెస్ వర్గాలు, చాలా చోట్ల ఖాళీగా కనిపించిందని బీజేపీ వర్గాలు చెప్పుకున్నప్పటికీ కాంగ్రెస్ అధిష్ఠానం తన పూర్తి శక్తియుక్తుల్ని ప్రదర్శించిందని మాత్రం అర్థమవుతోంది. ఎన్ని లక్షల మంది జనం హాజరయ్యారో చర్చించడం ముఖ్యమే కావొచ్చు. కానీ ఎన్నికల అక్రమాలకు వ్యతిరేకంగా సందేశాన్ని ఎంత బలంగా పంపారన్నది అంతకంటే ముఖ్యం. మాక్ పార్లమెంట్, రామ్‌లీలా ర్యాలీ ద్వారా ప్రతిపక్షాలు సంఘటితం కావడం విస్మరించలేని విషయమే అయినా ఎమర్జెన్సీ సమయంలోనూ, యూపీఏ చివరి రోజుల్లోనూ రామ్‌లీలాలో నిర్వహించిన నిరసనలు చూపిన ప్రభావాన్ని ప్రతిపక్షాలు పునరావృతం చేయగలవా అన్నది కోటి రూకల ప్రశ్న.

ప్రతిపక్షాలు కోరినట్లు సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను జైలుకు పంపడం, ప్రధానమంత్రి నరేంద్రమోదీని గద్దె దించి ఆయనపై చట్టపరమైన చర్యలు చేపట్టడం సాధ్యమవుతుందా? మాక్ పార్లమెంట్ ద్వారా జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించినంత మాత్రాన నిజమైన పార్లమెంట్‌లో ఆయనను ఇంటికి పంపడం చేయగలరా? అవేవీ ఇప్పట్లో జరిగేవి కావని కాంగ్రెస్‌కూ, ఇతర ప్రతిపక్షాలకూ తెలియకపోలేదు. అసలైన యుద్ధంలో ఏమీ చేయలేనప్పుడు ఉత్తుత్తి యుద్ధంలో ఓడించామన్న సంతృప్తి మాత్రమే మిగులుతుందని, నిజమైన పోరాటం ఇంకా ముందున్నదని వారికి బాగా తెలుసు. ఈ లోపు ప్రజాభిప్రాయాన్ని సాధ్యమైనంత మేరకు తమ వైపుకు మళ్లించేందుకు ఇలాంటి ప్రతీకాత్మక పోరాటాలు ఎన్నో చేయాల్సి ఉంటుంది.


ఓటర్‌ జాబితాల సమగ్ర ప్రత్యేక సవరణ (సర్)పై దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన నిరసన ప్రదర్శనల ద్వారా ప్రతిపక్షాలు జాతీయ, అంతర్జాతీయ ప్రచారాన్ని సాధించి ఉండవచ్చు కానీ ఈ పోరాటాన్ని క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లనంత వరకూ కాంగ్రెస్ అనుకున్న ఫలితాలు సాధించలేదు. ‘కోట్లాది ప్రజల ఓటు హక్కును తొలగించారన్న మాట వాస్తవమైతే ఆ కోట్లాది ప్రజలు వీధుల్లోకి ఎందుకు రావడం లేదు?’ అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ప్రశ్నించారు. ఆయన మాటల్ని నిజం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లు కోల్పోయిన వారి వద్దకు వెళ్లాలి. ఆయా రాష్ట్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు కోసం పోరాడేలా చేయాలి. అది అంత సులభమైన విషయం కాదు. అలా చేయలేకపోయినా ఇప్పటి నుంచి జరిగే ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటర్లలో చైతన్యం తీసుకువచ్చి తమ వైపుకు తిప్పుకునేలా చేయగలగాలి. అంటే జరగాల్సింది తమపై ప్రజల్లో విశ్వసనీయతను పెంచే రాజకీయ పోరాటం మాత్రమే.

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్‌తో పాటు ఏడు రాష్ట్రాల్లోను, 2028లో కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణతో పాటు 9 రాష్ట్రాల్లోనూ ఎన్నికలున్నాయి. మెజారిటీ రాష్ట్రాల్లోనూ, 2029లో జాతీయ స్థాయిలోనూ బీజేపీని తుడిచిపెట్టగలిగిన సత్తా కాంగ్రెస్, ప్రతిపక్షాలకు ఎంత మేరకు ఉన్నది? ప్రతిపక్షాలు ఢిల్లీలో నిరసన తెలుపుతున్న సమయంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఎన్నికల సంసిద్ధతను సమీక్షించారు. ఆ తర్వాత అమిత్ షా తెలంగాణలో కూడా పర్యటించి ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి– అరాచకత్వాన్ని నిర్మూలించండి’ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన పాదయాత్రలో స్వయంగా పాల్గొన్నారు. స్పష్టంగా చెప్పాలంటే ‘బీజేపీకి రాజకీయాలు చేయడం తెలుసు, కాంగ్రెస్‌కు నినాదాలు చేయడం మాత్రమే తెలుసు’ అన్న అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలోనూ నెలకొన్నది.


ఈ అపప్రథ పోవాలంటే కాంగ్రెస్ సంస్థాగతంగా బలోపేతమై, క్రింది స్థాయి వరకూ పార్టీని పటిష్ఠంగా పునర్నిర్మించాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది నిధుల సమస్య. ఎన్నికల కమిషన్‌పై ఢిల్లీలో పోరాటం మూలంగా భారీ ఎత్తున నిధులు ఖర్చుపెట్టాల్సి వచ్చింది. ఎన్ని పోరాటాలకని ముఖ్యమంత్రులు, మంత్రులు, పార్టీ నేతలు ఖర్చు పెట్టగలరు? ఇక రాబోయే రెండు సంవత్సరాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం కూడా పార్టీకి పెద్ద ఎత్తున నిధులు అవసరం. సార్వత్రక ఎన్నికల వరకు వచ్చేసరికి ఖజానా ఖాళీ అయి, మూటలు రాని పరిస్థితి ఏర్పడుతుంది. బీజేపీకి ఆ కొరత లేదు. బడా పారిశ్రామికవేత్తల అండతో ఎన్ని ఎన్నికల్లో అయినా సులభంగా పోరాడగలదు. ప్రతిపక్షాలను తిప్పికొట్టేందుకు ఎటువంటి ప్రచారాన్నయినా చేయగలదు.

కాంగ్రెస్‌కు మరో సమస్య ఆ పార్టీ సంస్కృతి. కర్ణాటకలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పదవి చేపట్టి వంద రోజులు పూర్తయ్యాయో లేదో, నాలుగు ఎమ్మెల్సీ సీట్లలో పార్టీ ఓడిపోయింది. ఓబీసీ నేత సిద్దరామయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడం, ఆయనపై పార్టీ నేతలే స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారన్న ప్రచారం సాగడం ఈ ఓటమికి కారణం కావచ్చు. ఓట్ చోరీ ర్యాలీ కోసం వచ్చిన తెలంగాణకు చెందిన ఒక మంత్రి, శాసనసభ్యుడు ఢిల్లీలోని ఒక హోటల్లో డీసీసీ నియామకాలపై దుర్భాషలాడుకున్నారు. పంజాబ్‌లో చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ, సుఖ్జిందర్ సింగ్ రంధావా, ప్రతాప్ సింగ్ బాజ్వాల మధ్య అంతర్గత విభేదాలను అరికట్టి, ఎన్నికల్లో ఏకతాటిపై నడిపించడం కాంగ్రెస్‌కు శక్తికి మించిన పని అవుతోంది. దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ పార్టీ నేతల మధ్య అంతర్గత కలహాలు ఉన్నాయి. ‘సర్’పై పార్టీ నేతలందర్నీ ఏక తాటిపై తీసుకురావడం గొప్ప విషయమే కావచ్చు కానీ, అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీపై పట్టు బిగించి, బీజేపీని ఎదుర్కొనేందుకు ఒక పటిష్ఠమైన యంత్రాంగాన్ని రూపొందించకపోతే ఎన్ని నిరసనలు నిర్వహించినా ఫలితం ఉండదు.


గతంలో అహ్మద్ పటేల్, గులాంనబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, దిగ్విజయ్ సింగ్ వంటి హేమాహేమీలు పార్టీ కార్యాలయాలకు నిరంతరం హాజరవుతూ కార్యకర్తలు, నేతల గోడు వింటూ సరైన మార్గదర్శనం చేసేవారు. ఇప్పుడు అలా వినేవారూ లేరు. రాహుల్ ఎన్జీఓ సంస్కృతికి ప్రాధాన్యమిస్తే కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఏ కొందరికో మినహా మెజారిటీ నేతలకు లభ్యం కారనే విమర్శలు లేకపోలేదు. ఈ అభిప్రాయాన్ని మార్చి కాంగ్రెస్‌ను మళ్లీ కార్యకర్తల పార్టీగా మార్చాల్సిన అవసరం ఉన్నది.

మంచికో చెడుకో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాదు, ప్రతిపక్షాలకు కూడా రాహుల్ గాంధీ నాయకుడుగా కనపడడం ఒక పరిణామ క్రమంలో జరిగింది. అయితే రాహుల్ గాంధీ ప్రతిపక్షాల అభ్యర్థి అయితే, నరేంద్రమోదీ ఆయనను సులభంగా ఢీకొనగలరని బీజేపీ వర్గాలు ఇప్పటి వరకూ విశ్వాసంతో ఉన్నాయి. ఆ అభిప్రాయాన్ని మార్చేందుకు రాహుల్ పడుతున్న కష్టం సరిపోతుందని చెప్పలేం. బీజేపీ ఇప్పటి వరకూ అనేక రాష్ట్రాల్లో నరేంద్రమోదీనే ప్రధాననేతగా రంగంలోకి దించి ఎన్నికల విజయాలు సాధిస్తూ వచ్చింది. రాహుల్ మాత్రమే కాదు, స్థానిక కాంగ్రెస్ నేతలు కూడా మోదీ ధాటిని ఎదుర్కోలేకపోతున్నారు. దేశంలో నిరాశా నిస్పృహలకు గురైన శక్తులన్నిటికీ కాంగ్రెస్, ఇండియా కూటమి ఆశ్రయం కలిగించవచ్చు కానీ, అది వివిధ సామాజిక వర్గాలకు, ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలకు వేదికగా మారాల్సి ఉన్నది.


2024లో బీజేపీకి 240 సీట్లే వచ్చాయని ప్రతిపక్షాలు సంబరపడ్డాయి. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు దేశంలో ప్రతిపక్షాల ముఖచిత్రం మారింది. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ పరాజయం పాలయ్యారు. తమిళనాడులో ఎంకె స్టాలిన్‌కు ఉద్వాసన పలికారు. బిహార్‌లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ బలం 80 సీట్ల నుంచి 25 సీట్లకు పడిపోయింది. శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్దవ్‌ ఠాక్రే శివసేన ముక్కలయ్యాయి. వామపక్షాల ఉనికి రోజురోజుకూ ప్రశ్నార్థకమవుతోంది. ఇండియా కూటమిలో డీఎంకే లేకపోగా, ఆప్, బీఎస్పీ, వైసీపీ, బీజేడీ, బీఆర్‌ఎస్ లాంటి పార్టీలు కూడా దూరంగా ఉన్నాయి. మరి రాహుల్ సారథ్యంలో ఇండియా కూటమి బలమైన ఎన్డీఏకు ఏ విధంగా పోటీ ఇవ్వగలదు?

‘అంగదుడి పాదం లాంటిది బీజేపీ. దాన్నెవరూ కదల్చలేరు’ అని ఉత్తరప్రదేశ్‌లో అమిత్ షా నినదించారు. ‘రామ్‌లీలా మైదాన్‌లో మహాభారత యుద్ధం ప్రారంభమైంది. ఢిల్లీ రోడ్డు లక్నో గుండానే వెళుతుంది’ అని రామ్‌లీలా మైదాన్‌లో అఖిలేశ్‌ యాదవ్ ప్రకటించారు. 1991 లో యూపీలో విజయభేరి మోగించిన తర్వాతే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగలిగింది. ప్రతిపక్షాలు ఇప్పుడు అదే కలను కంటున్నాయి. ఆ కలను సార్థకం చేసుకోగల శక్తి వాటికి ఉన్నదా?

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Nov 04 , 2026 | 12:30 AM