Share News

జనగణనకు ముందే రిజర్వేషన్ ప్రతిపాదనా?!

ABN , Publish Date - Apr 16 , 2026 | 01:06 AM

జాతీయ స్థాయి జనగణన పూర్తవక మునుపే మహిళా రిజర్వేషన్ల అమలుకు పూనుకుంటే అది లోపభూయిష్ఠంగా ఉంటుంది. జనగణనతో ముడిపడిన కులగణన, నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత మహిళలకు న్యాయంగా దక్కాల్సిన వాటా గురించి కార్యాచరణ చేపట్టాలి.

జనగణనకు ముందే రిజర్వేషన్ ప్రతిపాదనా?!

జాతీయ స్థాయి జనగణన పూర్తవక మునుపే మహిళా రిజర్వేషన్ల అమలుకు పూనుకుంటే అది లోపభూయిష్ఠంగా ఉంటుంది. జనగణనతో ముడిపడిన కులగణన, నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత మహిళలకు న్యాయంగా దక్కాల్సిన వాటా గురించి కార్యాచరణ చేపట్టాలి.

భారత్‌ వంటి దేశాల్లో చట్టసభలైన పార్లమెంట్, అసెంబ్లీలలో మహిళలకు అధిక ప్రాతినిధ్యం కల్పించడం అనేది అత్యంత కీలకమైన అంశం. ఇది కేవలం ఒక చట్టంగా ప్రవేశపెట్టడమే కాదు; సమానత్వం, సమగ్రత, నిజమైన ప్రజాస్వామ్యం పట్ల దేశం ఎంత నిబద్ధతతో ఉందో చెప్పే కీలకాంశం కూడా. ఎన్నో దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని బలంగా సమర్థిస్తోంది. గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లను మొదటగా తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీయే. ఈ పార్టీ ఉన్నత స్థాయి రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలని ఎప్పటికప్పుడు పోరాడింది. అయితే, తాజా జనగణన, సమగ్ర కులగణన, ఓబీసీలకు న్యాయం, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) పూర్తికాక ముందే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలనే ప్రస్తుత ప్రణాళిక పలు సందేహాలకు కారణమవుతున్నది.


మొదటగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్‌ను పూర్తిగా సమర్థిస్తోంది. మహిళలు రాజకీయ అధికారంలో తమ సముచిత వాటా పొందేందుకు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇది నైతికంగా సరైనదే కాకుండా ప్రజాస్వామ్య పటిష్ఠతకు అత్యవసరం కూడా. కానీ, రిజర్వేషన్ల అమలు ప్రతిపాదనకు మద్దతు అంటే ఏ విధానాన్నైనా అంగీకరించడం కాదు. అమలు చేసే సమయం, విధానం కూడా అంతే కీలకం. సమగ్ర కార్యాచరణ లేకుండా రిజర్వేషన్లను అమలు చేస్తే, మహిళా సాధికారత లక్ష్యానికే భంగం కలిగే ప్రమాదం ఉంది. వీటన్నింటికీ మూలమైన జనగణన ప్రజాస్వామ్యానికి మూలాధారం. అది దేశ జనాభా నిర్మాణాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. ఏ ప్రాంతంలో ఎంత జనాభా ఉందో, ఎలా మార్పులు సంతరించుకుంటున్నాయో జనగణన ఊతంగా అర్థమవుతుంది. ఈ జనగణన ఆధారంగా ప్రస్తుత ప్రాంతాలను డీలిమిటేషన్ చేసి, నియోజకవర్గాలను పునర్నిర్మాణం చేస్తారు. తద్వారా ప్రతి ప్రాంతానికి సముచితమైన ప్రాతినిధ్యం లభిస్తుంది.

తాజా జనగణన లేకుండా మహిళా రిజర్వేషన్ అమలు చేస్తే, అది 1971 నాటి పాత గణాంకాల ఆధారంగా జరుగుతుంది. చివరి పూర్తి జనగణన 2011 తర్వాత దేశంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్రం ఇప్పుడు ఆ జనగణనను ప్రాతిపదికగా తీసుకోబోతున్నది. ఆ జనగణన తర్వాత కూడా కొన్ని రాష్ట్రాల్లో జనాభా విపరీతంగా పెరిగింది; మరికొన్ని చోట్ల స్థిరంగా ఉంది. పాత డేటాతో రిజర్వేషన్ అమలు చేస్తే, కొన్ని ప్రాంతాలకు అన్యాయం జరుగుతుంది. ‘ఒక వ్యక్తి–ఒక ఓటు’ అనే ప్రాథమిక ప్రజాస్వామిక సూత్రానికే ఇది విరుద్ధంగా మారుతుంది.


ఇప్పటికిప్పుడు రిజర్వేషన్ల ప్రతిపాదన ముందుకొస్తే ఇంకా ముఖ్యంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల మహిళల విషయమై తీవ్ర ఆందోళన చెలరేగుతుంది. సమాజంలోని ఇతర వర్గాల్లోని మహిళలు కూడా ఒకే వర్గానికి చెందినవారు కాదు. వారు– కులాలు, వర్గాలు, ఆర్థిక పరిస్థితుల ప్రకారం విభిన్నంగా ఉంటారు. ఇప్పుడున్న స్థితిలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన వర్గాల మహిళలు మరింతగా సవాళ్లను ఎదుర్కొంటున్నారు. తాజా జనగణన, కుల గణాంకాలు లేకుండా రిజర్వేషన్ అమలు చేస్తే, ప్రయోజనం ప్రధానంగా కొన్ని ప్రత్యేక వర్గాల మహిళలకే చేరే అవకాశం ఉంది. ఇది స్వాతంత్ర్యం తర్వాత నుంచి భారతదేశం అనుసరిస్తున్న సామాజిక న్యాయ సూత్రాలకు విరుద్ధం. నిజమైన సాధికారత అంటే ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పించడం.

కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సమగ్ర అభివృద్ధినే నమ్మింది. కేవలం సీట్లు కేటాయించడమే సరిపోదు. రాజకీయాల్లోకి వచ్చిన మహిళలకు సరైన శిక్షణ, నాయకత్వ నైపుణ్యాలు, చట్టాలపై అవగాహన, నియోజకవర్గ నిర్వహణలో నైపుణ్యం కల్పించటమనే మౌలిక సూత్రాలపై కాంగ్రెస్‌కు దృఢమైన విశ్వాసం ఉంది. పార్టీల అంతర్గత వ్యవస్థల్లో మార్పులు లేకపోతే, మహిళలు సీట్లు పొందినా వాస్తవ అధికారాన్ని పొందలేరు. నిధుల కొరత, వ్యవస్థీకృత భావనలను పుణికిపుచ్చుకున్న మనస్తత్వాలు, పురుషాధిక్య వ్యవస్థలు కూడా రిజర్వేషన్లను సమగ్ర పరిశీలనతో చేపట్టనప్పుడు అడ్డంకులుగా మారే ప్రమాదం ఉంది. అప్పుడు రిజర్వేషన్ కేవలం గణాంకంగా మిగిలిపోతుంది.


ఇంకో కీలక ప్రశ్న– మహిళా రిజర్వేషన్ అమలు ఉద్దేశ్యం, ఆ ఉద్దేశ్యాన్ని ఆచరణాత్మకం చేయటానికి ఎంచుకున్న సమయం. జనగణన పూర్తి కాకముందే రిజర్వేషన్ అమలు చేయడంలో ప్రభుత్వం ఎందుకంత తొందరపడుతోంది? స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక లేకపోవడం కూడా పలు అనుమానాలకు దారితీస్తోంది. ఇది నిజంగా మహిళా సాధికారత కోసమా? లేక ఎన్నికల రాజకీయాల కోసమా? అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పార్టీలు, ప్రభుత్వాలు ఈ నేపథ్యంలో మహిళల సమస్యలను తాత్కాలిక లాభాల కోసం వినియోగించకూడదు. అయితే, ఈ సంస్కరణను నిరంతరం వాయిదా వేయడం కూడా సమంజసం కాదు. దేశంలో మహిళల ప్రాతినిధ్యం ఇప్పటికీ చాలా తక్కువగానే ఉంది. జనాభాలో వారి శాతానికి సరిపడా ప్రాతినిధ్యం రాజకీయాల్లో లేదు. ఇది భారత్‌ వంటి ప్రజాస్వామ్య దేశానికి ఆరోగ్యకరం కాదు. విద్య, ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ, భద్రత వంటి కీలక అంశాల్లో మహిళల స్వరం మరింత బలంగా వినిపించాలి. దీనిని ఆచరణ రూపంలో పెట్టడానికి సరైన మార్గం మనముందే స్పష్టంగా ఉంది.

ప్రభుత్వం తక్షణమే సమగ్ర జనగణన చేపట్టాలి. అందులో కుల గణాంకాలు కూడా ఉండాలి. అనంతరం డీలిమిటేషన్‌ను నిర్దిష్ట కాలవ్యవధిలో పూర్తి చేయాలి. ఆ తర్వాత మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి. ఇలా చేస్తేనే ఈ సంస్కరణ న్యాయసమ్మతంగా, సమగ్రంగా ఉంటుంది. అవసరమైతే, ఈ మూడు దశలకు కచ్చితమైన గడువును చట్టబద్ధంగా నిర్ణయించవచ్చు.


రాజకీయ పార్టీల పైనా మహిళా రిజర్వేషన్ అమలు అనే గురుతర బాధ్యత ఉంది. జనగణన లాంటి కీలక సాంకేతిక అంశాలకు కాలవ్యవధి ఎక్కువగా పట్టే అవకాశం ఉండడం వల్ల మహిళా రిజర్వేషన్ చట్టం రాకముందే మహిళలకు ఎక్కువ టికెట్లు ఇవ్వాలి. పార్టీల నిర్ణయాధికార వ్యవస్థల్లో వారికి సముచిత స్థానం కల్పించాలి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఈ దిశగా చర్యలు తీసుకుంటూ వచ్చింది; భవిష్యత్తులో కూడా కొనసాగిస్తుంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్‌కు కట్టుబడి ఉంది. అయితే అది అర్థవంతంగా, సమానంగా, దీర్ఘకాల ప్రయోజనం కలిగించేలా అమలుకావాలి. సరైన జనగణన, డీలిమిటేషన్ లేకుండా అమలు చేస్తే, ఇది అసంపూర్ణ సంస్కరణగా మిగిలే ప్రమాదం ఉంది.

మహిళలకు కేవలం ప్రాతినిధ్యం కాదు, నిజమైన అధికార భాగస్వామ్యం అవసరం. చట్టం వేగంగా ఆమోదించడం మాత్రమే న్యాయం కాదు; సరైన విధంగా అమలు చేయడమే నిజమైన న్యాయం. అప్పుడే భారతదేశం సమానత్వం, సమగ్ర ప్రజాస్వామ్య లక్ష్యాల వైపు దృఢంగా ముందుకు సాగుతుంది.

- డాక్టర్ కడియం కావ్య

ఎంపీ, వరంగల్

Updated Date - Apr 16 , 2026 | 01:08 AM