High Court Orders: ‘మేడారం’ నష్టపరిహారం ఇవ్వాలి
ABN , Publish Date - Jan 09 , 2026 | 04:59 AM
మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరను 1996లో ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించడంతో రానురాను భక్తుల తాకిడి పెరుగుతోంది. దేశం నలుమూలల నుంచి ఆదివాసీలు...
మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరను 1996లో ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించడంతో రానురాను భక్తుల తాకిడి పెరుగుతోంది. దేశం నలుమూలల నుంచి ఆదివాసీలు, ఇతరులు ఈ జాతరకు తండోపతండాలుగా వస్తారు. భక్తుల వాహనాల పార్కింగ్ కోసం, వారు గుడారాలు ఏర్పాటు చేసుకుని మూడు రోజులు బస చేసేందుకోసం ప్రభుత్వ అధికారులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సమీప గ్రామాలైన మేడారం, రెడ్డిగూడెం, కొత్తూరు, ఊరట్టం, కన్నెపల్లి, నార్లాపూర్, వెంగళాపూర్ గ్రామాలకు చెందిన రైతులను బెదిరించి, పంటలు విత్తకుండా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు.
మేడారం జాతర సమయంలో ఆయా గ్రామాలలో వేలాది ఎకరాల్లో పంట వేయనీయకపోవడం వల్ల రైతులకు ఎకరానికి సుమారు రూ.యాభైవేలు నష్టం వాటిల్లుతోంది. ఈ విషయమై ఆదివాసీ రైతులు హైకోర్టులో కేసు వేశారు. ప్రభుత్వం పరిహారం అందించాలని హైకోర్టు ఆదేశించింది. అయినా అవినీతి అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో రైతులకు నష్టం కలిగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మేడారంలోని రైతుల జీవితాలు మారలేదు. ప్రస్తుత పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అయినా తక్షణమే స్పందించి మేడారం జాతర వల్ల పంట కోల్పోయిన వారికి పరిహారం ఇప్పించాలని రైతులు కోరుతున్నారు.
– వూకె రామకృష్ణ దొర