హింస, క్రూరత్వం, కుట్రలు.. వైసీపీ అజెండా!
ABN , Publish Date - Feb 07 , 2026 | 02:54 AM
ప్రభుత్వాలు మారినప్పుడు కక్షసాధింపు చర్యలు సహజమని భావించే కాలంలో, చట్టాన్ని గౌరవిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం...
ప్రభుత్వాలు మారినప్పుడు కక్షసాధింపు చర్యలు సహజమని భావించే కాలంలో, చట్టాన్ని గౌరవిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్లడాన్ని కొందరు అలుసుగా తీసుకుంటున్నారు. చట్టబద్ధమైన పాలన దిశగా అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వ పాలననూ చేతగానితనం అనుకోవడం వైసీపీ అవివేకానికి తార్కాణం. గతంలో విపక్ష నేతలపై దాడులు జరిగినప్పుడు భావప్రకటన స్వేచ్ఛ అని సమర్థించుకున్నవారు, ఇప్పుడు అదే స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ హద్దులు దాటుతున్నారు.
చట్టమన్నా, న్యాయస్థానాలన్నా వైసీపీ నేతలకు గౌరవం ఎప్పుడూ లేదు. అందుకే అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడితనానికి అలవాటుపడ్డారు. సాక్షాత్తూ చంద్రబాబుపై దాడి చేసి, డీజీపీతో భావవ్యక్తీకరణ అని చెప్పించారు. అంత ఘోరమైన పరిపాలన చేసి, దారుణంగా ఓడిపోయినా వారు ప్రశాంతంగా ఉన్నారు. తాము ఎన్నో చిత్రహింసలు పెట్టినా అధికార పార్టీ ఏమీ చేయడం లేదని అలుసుగా తీసుకుంటున్నారు. చట్టాన్ని అనుసరిస్తూ సాగుతున్న ప్రభుత్వ తీరును చేతగానితనంగా తీసుకున్నారు. అడ్డగోలుగా తిట్లు ప్రారంభించారు. ఇలాంటి వారికి సరైన రీతిలో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది.
వైసీపీ 15 ఏళ్ల ప్రస్థానంలో... అయిదేళ్లు మాత్రమే ఆ పార్టీ అధికారంలో ఉంది. మిగిలిన కాలంలో ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారు. అయితే దానిపై వారు ఎంత మాత్రం ఆలోచన చేయడం లేదు. బూతు మాటలు, కవ్వింపు చర్యలతో వైసీపీ 2.0 కోసం కలలు కంటున్నారు జగన్మోహన్ రెడ్డి. తాను సుపరిపాలన అందించానని, తన హయాంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లను రాజకీయ అవసరాలకు వాడుకుని రోడ్డున పడేసిన జగన్, ఇప్పుడు తన సొంత పార్టీ నేతలను కూడా అదే బాటలో నడిపిస్తున్నారు. బూతులు మాట్లాడితేనే పదవులు, గుర్తింపు దక్కుతాయనే భ్రమలో ఉన్న నేతలు... ఆ భాష వల్లే ప్రజల్లో చీదరింపునకు గురవుతున్నారు. వ్యక్తిగత ప్రతిష్ఠను పణంగా పెట్టి, పార్టీ కోసం తిట్లు తింటున్నా, కనీసం నైతిక మద్దతు ఇచ్చే నాథుడు లేకపోవడం వైసీపీ నేతల దుస్థితికి అద్దంపడుతోంది.
పల్నాడులో బోండా ఉమామహేశ్వరరావు కారుపై జరిగిన దాడి ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది. అప్పట్లో ఇనుప రాడ్లతో దాడి చేశారు. దానిని ప్రోత్సహించింది అప్పటి వైసీపీ పాలకులు కాదా? అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై జోగి రమేశ్ దండయాత్ర చేశారు. కర్రలతో దాడికి దిగారు. అయినా అందులో తప్పేముంది అని ప్రశ్నించి జగన్ సమర్థించుకున్నారు. అనంతబాబు డోర్ డెలివరీ అరాచకాలు, గోరంట్ల మాధవ్ విశ్వరూపాలు వంటి వాటిని ఆస్వాదించిన జగన్, ఇప్పుడు అరవ శ్రీధర్ విషయంలో, విలువలు అంటూ ఉపన్యాసాలు చేస్తున్నారు. తాను చేస్తే నీతి.. ఎదుటివాడు చేస్తే బూతు అన్నట్టు హంగామా చేస్తున్నారు. నాడు చంద్రబాబు అరెస్టు సక్రమం అన్నారు. ఇప్పుడు మాత్రం అరెస్టులు అక్రమం అంటున్నారు. అయితే జనాలు అన్నీ గమనిస్తున్నారన్న విషయాన్ని మరిచిపోతున్నారు. రాజకీయ విమర్శలు సిద్ధాంతపరంగా ఉండాలి కానీ, వ్యక్తిగత దూషణలుగా మారకూడదు. వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా వాడుతున్న భాష రాష్ట్ర రాజకీయ సంస్కృతిని దిగజారుస్తోంది. దీన్ని ఆదిలోనే అరికట్టకపోతే, భవిష్యత్ తరాలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి. గతంలో డీజీపీ వంటి వారిని కూడా రాజకీయ అవసరాలకు వాడుకున్న తీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యవస్థలను మళ్లీ గాడిలో పెట్టే ప్రయత్నం జరుగుతోంది. చట్టం తన పని తాను చేయనివ్వడం అంటే అధికారులకు స్వేచ్ఛనివ్వడం. దీన్ని ప్రభుత్వం బలహీనతగా భావించడం వైసీపీ నేతల అవివేకం. ప్రజాస్వామ్యంలో ఓర్పుకు కూడా ఒక హద్దు ఉంటుంది. అడ్డగోలుగా తిడుతూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిని ఉపేక్షించడం అంటే, పరోక్షంగా వారిని ప్రోత్సహించడమే అవుతుంది. ఇటువంటి వారిపై కఠినంగా వ్యవహరించాలి.
- వాసంశెట్టి సుభాష్
కార్మికశాఖ మంత్రి