సివిల్ సర్వీసుల్లో అగ్నిపరీక్షలు
ABN , Publish Date - Jan 31 , 2026 | 03:37 AM
జీవితంలో ఎప్పుడూ రెండు దార్లు మన ముందుంటాయి. ఒకటి విశాలమైనది– సులభంగా వెళ్ళగలిగినదే కానీ వినాశనం వైపు నడిపిస్తుంది. రెండవది ఇరుకైన దారి– వెళ్ళడం కష్టమే అయినా జీవితాన్ని గౌరవప్రదంగా, ప్రశాంతంగా సాగించే అవకాశాన్నిస్తుంది...
జీవితంలో ఎప్పుడూ రెండు దార్లు మన ముందుంటాయి. ఒకటి విశాలమైనది– సులభంగా వెళ్ళగలిగినదే కానీ వినాశనం వైపు నడిపిస్తుంది. రెండవది ఇరుకైన దారి– వెళ్ళడం కష్టమే అయినా జీవితాన్ని గౌరవప్రదంగా, ప్రశాంతంగా సాగించే అవకాశాన్నిస్తుంది.
నేను పదవీ విరమణ చేసి పదిహేనేళ్ళు అయ్యింది. ఈ కాలంలో నాకు బాగా సంతృప్తినిచ్చిన పని– సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమయిన మార్గదర్శనం చేయడం. ఆ ప్రయత్నాల్లో భాగంగా నేను వాళ్ళకు ప్రధానంగా చేసే సూచన– నిజాయితీ, నైతిక ప్రవర్తనల గురించే. ఆకర్షణీయమైన జీతభత్యాలు, సమాజంలో హోదా, గుర్తింపులు మాత్రమే కాదు, మరే ఇతర వృత్తిలో లేని విధంగా– ఒక మంచి పని చేసే అవకాశం, అధికారం సివిల్ సర్వీసు ఉద్యోగికి ఎప్పుడూ చేతిలో ఉంటాయి.
అఖిల భారత సర్వీసు ప్రాముఖ్యాన్ని మన రాజ్యాంగం మాత్రమే ప్రస్తావించింది. ప్రపంచంలో మరే దేశ రాజ్యాంగంలో కనపడని ప్రత్యేకత ఇది. ఇంత తిరుగులేని ఆకర్షణ, దానికి తోడు పూర్తి భద్రత మీకు అండగా ఉన్నప్పుడు... ఇక భయమెందుకు? ప్రలోభాల కోసం కక్కుర్తి ఎందుకు? అని అడుగుతుంటా ఆ యువతీయువకులను, కాబోయే సివిల్ సర్వీస్ అధికారులని. రాజకీయాలు, అకౌంటెన్సీ, న్యాయ వ్యవహారాలు, వైద్యం, వ్యాపారం, పరిశ్రమలు, వైజ్ఞానిక రంగం... సివిల్స్ మాత్రమే కాదు... ఏ రంగంలో అయినా ఈ రెండు అడ్డంకులూ అనుక్షణం అగ్నిపరీక్షలు పెడుతూనే ఉంటాయి. ఈ సవాళ్ళను అధిగమించే సామర్థ్యం మీరు ప్రదర్శిస్తే... అది మీ వృత్తి జీవితాన్ని ఫలప్రదం చేయడంతో పాటూ సమాజంలో మీకో ఉన్నత స్థానం కల్పిస్తుంది, అని వాళ్ళకి చెబుతూ ఉంటాను.
మన దేశం చేసుకున్న అదృష్టం ఏమిటంటే... ప్రతి రంగంలోనూ ఎక్కువ మంది బాగా కష్టపడతారు. నీతి, నిజాయితీతో మెలగుతుంటారు. దేశం పట్ల, ప్రజల పట్ల ప్రేమాభిమానాలతో పనిచేసే వాళ్ళయి ఉంటారు. అదృష్టవశాత్తూ నేను కూడా ఈ కోవకు చెందినవాడిగానే భావించుకుంటా. ప్రలోభాలు, ఒత్తిడులు నా ఉద్యోగ జీవితంలో ఎన్నోసార్లు నాకు అగ్నిపరీక్ష పెట్టాయి.
రాష్ట్రపతిగా ఉన్న జ్ఞానీ జైల్‌సింగ్ గుండె ఆపరేషన్ కారణంగా 45 రోజులు విధులకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అప్పుడు ఉప రాష్ట్రపతిగా ఉన్న హిదాయతుల్లాని ఆయన స్థానంలో పనిచేయమన్నారు. అంటే రాష్ట్రపతి హోదాలో.. అని హిదాయతుల్లా గారి భావన. (గతంలో ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు.. రాష్ట్రపతి పదవికి వి.వి.గిరి రాజీనామాతో ఖాళీ ఏర్పడింది. అప్పుడు హిదాయతుల్లాను తాత్కాలిక రాష్ట్రపతిగా విధులు నిర్వర్తించమన్నారు. తాత్కాలిక రాష్ట్రపతి.. అన్న పదవి రాజ్యాంగంలో ఉండదు అని చెప్పి... రాష్ట్రపతి హోదాలోనే ఆ విధులు నిర్వర్తించారు. దాంతో ఇది కూడా అలాగే అని ఆయన అభిప్రాయపడి ఉండవచ్చు.) అప్పుడు ఆయనకు సెక్రటరీగా ఉన్న నేను దానితో విభేదించాను. గతంలో లాగా ఇప్పుడా పదవి ఖాళీ కాలేదు, కాబట్టి జైల్ సింగ్ తిరిగొచ్చేదాకానే కాబట్టి.. ‘రాష్ట్రపతి విధులు నిర్వర్తించే ఉపరాష్ట్రపతి’ గానే మీరుంటారు... అని స్పష్టం చేసాను. దానికి ఆయన వెటకారంగా ‘‘అంటే నేను వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిస్చార్జింగ్ ది డ్యూటీస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా... అని రబ్బరు స్టాంపు తయారు చేయించుకుని సంతకాలు పెట్టాలా?’’ అని అడిగారు. అప్పుడు నేను– ‘‘జైల్ సింగ్ పదవిలో ఉన్నప్పుడే మీరు కూడా రాష్ట్రపతి హోదాలో ఉండడం.. అంటే ఇద్దరు రాష్ట్రపతులు ఉన్నట్లు కదా.. దానికి రాజ్యాంగం ఒప్పుకోదు కదా!’’ అని చెప్పి వచ్చేసాను. అప్పుడు లా సెక్రటరీగా ఉన్న పేరిశాస్త్రిని ఉపరాష్ట్రపతి సంప్రదిస్తే.. ‘‘ఈ విషయంలో ఈ అధికారి తెలిపిందే కరెక్ట్’’ అని చెప్పారు.
హిదాయతుల్లాకు నా సలహా రుచించకపోవచ్చు, ఆయన నొచ్చుకుని కూడా ఉండవచ్చు. కానీ ఆయనంటే నాకు అపారమైన గౌరవం. ఆయన పండితుడు, పెద్దమనిషి, నిజాయితీపరుడు... అయినా మేం రూల్స్‌కు బందీలం కదా! రేపు చరిత్రకారులు హిదాయతుల్లా వంటి వారిని నిందించకుండా కాపాడవలసిన గురుతర బాధ్యత మామీదే ఉంటుంది కదా!
ఒకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు పిలిపిస్తే కేంద్ర సర్వీసులో ఉన్న నేను రాష్ట్రానికి తిరిగివచ్చి ప్రధాన కార్యదర్శిగా పదవిని చేపట్టిన మొదటి వారంలోనే.. ఒక చిన్న విషయంపై ఆయనతో ముఖాముఖి తలపడాల్సి వచ్చింది. అలవాటు ప్రకారం ఆయన చాలా విసుగ్గా ‘‘మీ హనీమూన్ (పదవి తాలూకు కొత్తదనం) ముగిసింది. ఇక పనిమీద శ్రద్ధపెడితే మంచిది. ఇక్కడ ప్రతిదీ తలాతోక లేకుండా గందరగోళంగా ఉంది’’ అనడంతో అవాక్కయ్యా.
ఆత్మాభిమానం దెబ్బతినడంతో రోషాన్ని నిగ్రహించుకుంటూ ‘‘నేనెప్పుడూ చీఫ్ సెక్రటరీ పదవి కావాలని తాపత్రయపడలేదు’’ అన్నాను. ఆయన ఏడేళ్ళ పదవీకాలంతో పోలిస్తే నేను అక్కడికి వెళ్ళి వారం రోజులు కూడా కాలేదు. అప్పటివరకూ నేనెప్పుడు మా అమ్మానాన్నలతో కానీ, టీచర్ల దగ్గర కూడా ఇలా మాటలు పడలేదు. ‘‘ఇప్పటికి నా సర్వీసు 35 ఏళ్ళు పూర్తయింది. మహా అయితే మరో రెండేళ్ళు మిగిలి ఉందేమో. దాన్ని కూడా వదులుకుని హాయిగా... గడచిన సర్వీసుకాలపు జ్ఞాపకాలతో రిటైరయిపోతా. ఇప్పటికిప్పుడే నా రాజీనామా ఇచ్చేస్తా’’ అని చాలా ప్రశాంతంగానే అయినా విస్పష్టంగా చెప్పి బయటకు వచ్చేశా. ఆయన నొచ్చుకున్నట్లున్నారు. వెంటనే ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి ఎస్వీ ప్రసాద్‌ను నా వెనకే పంపారు. ఆ చర్చలప్పుడు ప్రసాద్ కూడా అక్కడే ఉన్నారు. ప్రసాద్ నాకు సర్దిచెప్పి తిరిగి అక్కడికి తీసుకెళ్ళారు. ఇష్టం లేకపోయినా వెళ్ళా. ముఖ్యమంత్రి చిరునవ్వు నవ్వి, జరిగిన దానికి పశ్చాత్తాప ధోరణిలో.. ‘‘నాకు మరో ఉద్దేశం ఏదీ లేదు. ఆ మాటలను నేను మీరనుకున్న అర్థంలో అనలేదు. ఒకవేళ మిమ్మల్ని మనస్తాపానికి గురి చేసి ఉంటే సారీ. వాటిని పట్టించుకోకండి. మీ పని మీరు చేసుకోండి. నా సపోర్టు మీకు ఎంతగా ఉంటుందో మీరే చూస్తారు’’ అన్నారు. అప్పటికి నేను కూడా చల్లబడ్డా.. అంతకుముందు తొందరపడి నేనలా అతిగా ప్రవర్తించినందుకు నొచ్చుకున్నా. మేం షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాం. దాని తరువాతే ప్రధాన కార్యదర్శిగా నా అసలు విధి నిర్వహణ మొదలయింది.
సాధారణంగా ప్రభుత్వ ఫైళ్ళు రెండు రకాలుగా ఉంటాయి... ఒకటి కరెంట్ ఫైల్– అంటే నడుస్తున్న విషయానికి సంబంధించిన సంప్రదింపులతో ఉండేది. మరొకటి నోట్ ఫైల్– దానిని పరిశీలించిన వారి అభిప్రాయాలు, సిఫార్సులు, తుది నిర్ణయం వంటివి ఉంటాయి. నోట్ ఫైళ్లలో సెక్రటేరియట్‌లోని సంబంధిత విభాగంలో నాలుగు గోడల మధ్య జరిగే ఆంతరంగిక విషయాలు రికార్డయి ఉంటాయి. తప్పనిసరి పరిస్థితుల్లో మినహా వీటిని కోర్టులకు సమర్పించరు. ఒకసారి అలా కోర్టుకు ఎందుకో అనుమానం వచ్చి నోట్ ఫైల్ తెప్పించుకుని వాస్తవ పరిస్థితి అర్థం చేసుకుంది. ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా, పిటిషనర్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అంటే ఫైల్లో నేను చేసిన సిఫార్సును కోర్టు సరయినదిగా భావించి, నాకు వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీ చేసిన మంత్రి నిర్ణయాన్ని కొట్టివేసిందన్నమాట. నిజానికి నా అంచనాలకు భిన్నంగా తీర్పు వచ్చినా... నా విధులు నేను నిర్వర్తించా. న్యాయం జరిగింది. ప్రభుత్వ కార్యకలాపాలన్నీ అంత పకడ్బందీగా తనిఖీలకు అనుకూలమైన ఏర్పాట్లతో ఉంటాయి. మరో సందర్భంలో అదే మంత్రి ఒక ఉత్తర్వు ఇచ్చారు. అది ప్రజోపయోగకరం కాదని నాకు అనిపించింది. దాన్ని ఆయన దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో– పరిపాలనకు సంబంధించిన నిబంధనావళి(బిజినెస్ రూల్స్)ని ఆశ్రయించి ఆ మేరకు ప్రధాన కార్యదర్శి ద్వారా మంత్రి ఉత్తర్వులపై ‘సమీక్ష’ కోరా. తన ఉత్తర్వుల్లో బలం లేకపోవడం, పైగా ఆ ఫైలు ముఖ్యమంత్రి వద్దకు పోతుందన్న విషయం తెలిసి ఉండడంతో ఆయన కూడా చల్లబడ్డాడు. ఇవి ఇరుపక్షాలకీ మనసును కష్టపెట్టే విషయాలే అయినా... ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నేను అంత కచ్చితమైన వైఖరి చూపాల్సి వచ్చింది.
డా. మోహన్ కందా
విశ్రాంత ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి ఆం.ప్ర. ప్రభుత్వం