మాతృదేశంపై మానవీయ వెలుగులు
ABN , Publish Date - Sep 19 , 2026 | 01:20 AM
నా మేధో వ్యాసంగాలలో నేను చాలావరకు ఒంటరిగానే కృషి చేస్తాను. పూర్వ విద్యార్థుల సంఘాలకు దూరంగా ఉంటాను. వాట్సాప్ గ్రూపులలో చేరడం నాకు ఇష్టం లేదు. ప్రముఖ హాస్యనటుడు గ్రూచో మార్క్స్ ఆలోచనా విధానమే నాది కూడా..
నా మేధో వ్యాసంగాలలో నేను చాలావరకు ఒంటరిగానే కృషి చేస్తాను. పూర్వ విద్యార్థుల సంఘాలకు దూరంగా ఉంటాను. వాట్సాప్ గ్రూపులలో చేరడం నాకు ఇష్టం లేదు. ప్రముఖ హాస్యనటుడు గ్రూచో మార్క్స్ ఆలోచనా విధానమే నాది కూడా. ‘నన్ను సభ్యుడిగా చేర్చుకోవడానికి ఏ క్లబ్ అయితే సిద్ధంగా ఉంటుందో అలాంటి క్లబ్‌లో నేను ఎప్పటికీ చేరను’ అని గ్రూచో అన్నాడు. ఢిల్లీలో ఉన్నప్పుడు (1980ల్లో) కొన్ని సంవత్సరాల పాటు పీపుల్స్ యూనియన్ ఫర్ డెమొక్రాటిక్ రైట్స్ (పీయూడీఆర్)కు సన్నిహితంగా మెలిగేవాణ్ణి. ప్రతి శనివారం త్రివేణి కళా సంఘంలో జరిగే పీయూడీఆర్ సమావేశాలకు హాజరవుతుండేవాణ్ణి. పరిశోధక విద్యార్థిగా నాకు లభించే ఉపకార వేతనం నుంచి ఒక స్వల్ప మొత్తాన్ని ఆ హక్కుల సంఘానికి ఇస్తుండేవాణ్ణి. ఒక సందర్భంలో పీయూడీఆర్ ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ సంఘంలో సభ్యుడిగా కూడా ఉన్నాను.
ఆ హక్కుల సంఘంలో నేను ఎన్నడూ కీలక కార్యకర్తగా లేను. సహ ప్రయాణికుడిని, సానుభూతిపరుడిని మాత్రమే. పౌరహక్కుల పరిరక్షణలోను, ప్రజాస్వామిక చైతన్యాన్ని పెంపొందించడంలోనూ పీయూడీఆర్ కృషి పట్ల నాకు అపార గౌరవాభిమానాలు ఉన్నాయి. 1990ల్లో నేను ఢిల్లీ నుంచి బెంగళూరుకు మారాను. దీంతో ఆ హక్కుల సంఘంతో నా సన్నిహిత సంబంధం తెగిపోయింది. ఇటీవల ప్రచురితమైన అంకితా పాండే పుస్తకం ‘Becoming Allies: Civil Liberties Activism in India’ చదివినప్పుడు పీయూడీఆర్‌తో నా సంబంధాలు జ్ఞాపకమొచ్చాయి. ‘ally activism’కు ఉదాహరణగా పౌర హక్కుల సంఘాలను ఆమె పేర్కొన్నారు. ‘ప్రత్యక్ష, వ్యక్తిగత లేదా భౌతిక ప్రయోజన సంబంధం లేనివారు ఒక అణగారిన వర్గానికి మద్దతుగా చేపట్టే సామూహిక చర్య’గా ‘అల్లే యాక్టివిజం’ను ఆమె నిర్వచించారు. భారతదేశ పౌరహక్కుల ఉద్యమాల్లో రెండు విస్తృత ధోరణులు ఉన్నాయని అంకితా పాండే వివరించారు. ఒకటి– రాజ్యాంగంలో క్రోడీకరించిన పౌరుల హక్కుల రక్షణ కాగా, మరొకటి ప్రజల విస్తృత సామాజిక, ఆర్థిక హక్కుల సాధన.
1970ల్లో కలకత్తా కేంద్రంగా పనిచేసిన అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమొక్రాటిక్ రైట్స్ (ఏపీడీఆర్) స్వతంత్ర భారతదేశంలో ప్రప్రథమ పౌర హక్కుల సంఘం. నక్సలైట్ ఉద్యమంతో సంబంధమున్న జైలు ఖైదీలపట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ తొలి పౌరహక్కుల సంఘం విశేష కృషి చేసింది.
కాలక్రమానుసారంగా ఏపీడీఆర్ మొట్టమొదటి హక్కుల సంఘం అయినప్పటికీ విస్తృత కృషి చేసిన హక్కుల సంఘం మాత్రం పీయూడీఆర్ అని చెప్పవచ్చు. పలు దశాబ్దాల పాటు చేసిన కృషిలో దాదాపు 300 నివేదికలను ఈ సంఘం ప్రచురించింది. విచారణలో ఉన్న ఖైదీలపై పోలీసుల క్రౌర్యం, ఎన్‌కౌంటర్ మరణాలు, అసంఘటితరంగ కార్మికుల దుస్థితి, అడవులపై ఆదివాసీల హక్కులకు ఎసరు పెట్టిన చట్టాలు, మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, దళితులపై దురాగతాలు, మతపరమైన మైనారిటీలపై వివక్ష మొదలైన అంశాలపై ఏపీడీఆర్ నివేదికలు పథ నిర్దేశకమైనవి. ఆ నివేదికల్లో అనేకం ఇప్పుడు ఏపీడీఆర్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసిన పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (పీయూసీఎల్) మరో ప్రముఖ హక్కుల సంఘం. న్యాయకోవిదుడు జస్టిస్ వీఎం తార్కుండే సారథ్యంలో ఇది పలు రాష్ట్రాల్లో పనిచేసింది. ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ కమిటీ, హ్యూమన్ రైట్స్ ఫోరమ్ ఉభయ తెలుగు రాష్ట్రాలలో క్రియాశీలకంగా ఉన్నాయి. మహారాష్ట్రలో క్రియాశీలకంగా ఉన్న కమిటీ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ డెమొక్రాటిక్ రైట్స్ వ్యవస్థాపకులలో అస్ఘర్ అలీ ఇంజినీర్ ఒకరు.
అంకితా పాండే పుస్తకంలోని ఒక అధ్యాయం భారతదేశంలోని పౌరహక్కుల సంఘాల ప్రధాన కార్యాచరణ రూపమైన ‘నిజనిర్ధారణ నివేదికల (ఫ్యాక్ట్–ఫైండింగ్ రిపోర్ట్స్)పై దృష్టి సారించింది. హింసను ప్రేరేపించడంలోనూ, తద్వారా పౌరుల భద్రత, రక్షణ, ప్రజాస్వామ్య హక్కులను ఉల్లంఘించడంలోనూ ప్రభుత్వాధికారుల నేరపూరిత బాధ్యతను నిరూపించడానికి ఈ నివేదికలు ప్రయత్నిస్తాయి. ఈ నివేదికలు మూడు ముఖ్యమైన విధులు నిర్వర్తించాయని అంకితా పాండే వివరించారు. మొదటిది– ప్రజల జ్ఞాపకాలను చట్టపరంగా ఉపయోగపడే ఆధారాలుగా మార్చాయి. నిజ నిర్ధారణ సంఘాలు ప్రజల వాంగ్మూలాలను క్రమబద్ధీకరించి, ధ్రువీకరించి ఒక నివేదిక రూపంలో భద్రపరిచాయి. తద్వారా వాటిని న్యాయస్థానాలు అంగీకరించేలా చేశాయి; రెండోది– సంఘటనల పూర్వాపరాల చరిత్రను సవివరంగా నమోదు చేయడం; మూడోది– పోలీసు రికార్డులు, పరిపాలనా పరమైన పత్రాలు, నివేదికలలోని లోపాలను గుర్తించడం, పరస్పర విరుద్ధ విషయాలను ఎత్తిచూపడం, తద్వారా వాస్తవాలను తారుమారు చేసిన రికార్డులను బయటపెట్టడం.
అధికారిక కథనాలను నిరాకరించి, వాటిలోని అసంగతాలు, పరస్పర వైరుధ్యాలను బహిర్గతం చేసి, తద్వారా ప్రజల, పత్రికల దృష్టిలో వాటి విశ్వసనీయతను ప్రభావదాయకంగా ప్రశ్నించడమే ఈ ‘నిజ నిర్ధారణ’ నివేదికల లక్ష్యం. ప్రభుత్వం పాల్పడిన తప్పుడు పనులపై అవి వెలుగులు ప్రసరించాయి. ప్రభుత్వాధికారుల పక్షపాతాలు, పాక్షికాభిప్రాయాలను అవి బాహాటపరిచాయి.
ఈ పౌరహక్కుల సంఘాల కార్యకర్తలు అందరూ స్వచ్ఛంద సేవకులే. రాజ్యాంగ స్ఫూర్తితో సముదాత్త ఆశయాల సాధనకు అంకితమై సమాజ శ్రేయస్సుకు నిస్వార్థంగా శ్రమిస్తున్న ఉదాత్త వ్యక్తులు. విదేశీ, కార్పొరేట్ నిధులు ఏ విధంగానూ తీసుకోరు. సమాజ దురభిప్రాయాలు, ప్రభుత్వాల వ్యతిరేకత నెదుర్కొంటూ అవిరామంగా, అవిశ్రాంతంగా పనిచేస్తున్న నిజమైన ప్రజా సేవకులు. బాహ్య ఒత్తిళ్లతో పాటు ఒక అంతర్గత సవాల్‌ను కూడా వారు ఎదుర్కొన్నారు: రాజ్యం పట్ల విమర్శనాత్మక వైఖరిని పాటిస్తూ అదే సమయంలో రాజకీయ పక్షాల ప్రభావం లేకుండా స్వతంత్రంగా వ్యవహరించడం. దీనితో పాటు జెండర్ న్యాయానికి సంబంధించిన ప్రశ్న కూడా వారిని వెంటాడింది. పీయూడీఆర్, ఏపీసీఎల్‌సీ ప్రముఖ కార్యకర్తల్లో పలువురు మహిళలు ఉన్నారు. పౌరులకు వ్యతిరేకంగా రాజ్య వ్యవస్థ పాల్పడుతున్న హింసాత్మక కార్యకలాపాలపైనే హక్కుల సంఘాలు తమ దృష్టిని కేంద్రీకరించాలని వారి పురుష సహచరుల వాదన.. మహిళా కార్యకర్తలు వారితో ఏకీభవించడం లేదు. కుటుంబ జీవిత పరిధిలో చోటు చేసుకుంటున్న హింస గురించి కూడా హక్కుల సంఘాలు పట్టించుకోవాలనేది మహిళా ఉద్యమకారుల వాదన. ప్రజాస్వామిక హక్కుల విస్తృత చట్రంలో ఒక ప్రధాన భాగంగా మహిళా హక్కులను అంతిమంగా హక్కుల సంఘాలు అంగీకరించాయి. పౌరహక్కుల ఉద్యమంలో పనిచేస్తున్న వారిలో విద్యావేత్తలు, పాత్రికేయులు, న్యాయవాదులు ప్రధానంగా ఉన్నారని అంకితా పాండే పేర్కొన్నారు. వేతన జీవులు అయిన ఈ మధ్యతరగతి విద్యావంతులు తమ మాతృదేశాన్ని మరింత న్యాయమైన, మానవీయ సమాజంగా రూపొందించేందుకు అంకితమైన ఆదర్శవాదులు. భారత రాజ్య వ్యవస్థ అభియోగాల మేరకు సుదీర్ఘకాలం జైలు నిర్బంధంలో ఉన్న న్యాయవాది, హక్కుల కార్యకర్త సుధా భరద్వాజ్ అభిప్రాయాన్ని పాండే తన పుస్తకంలో ఉటంకించారు: ‘నేను జైలులో మూడు సంవత్సరాలు గడిపాను. నా జైలు జీవితం చాలా బాధాకరంగా ఉన్నదనడంలో సందేహమేమీ లేదు. అయితే నాకంటే దురదృష్టవంతులు చాలామంది ఉన్నారు. వారి దుస్థితికి రోదించాను. నా హృదయం ద్రవించింది. మీరు అటువంటి దుష్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీ గురించి మీరు బాధపడడం కష్టం. బాధల్లో ఉన్న ఇతరులకు మీరు సహాయం చేయాల్సి ఉంటుంది.’
కీర్తిశేషుడు సీవీ సుబ్బారావు (1౯53–94)దీ ఇటువంటి మానవీయ స్వభావమే. పీయూడీఆర్ కార్యకలాపాల్లో ఆయన చాలా సంవత్సరాల పాటు కీలకపాత్ర వహించారు. 1984లో సిక్కుల ఊచకోతపై పీయూడీఆర్ నివేదిక ‘హు ఆర్ ది గిల్టీ’తో అంకిత పుస్తకం ప్రారంభమైనా సుబ్బారావు గురించి ఆమె ప్రస్తావించలేదు. ఆ నివేదిక ప్రధాన రచయిత సుబ్బారావే. అంకితా పాండే కథనంలో సుబ్బారావు ప్రస్తావన లేకపోవడాన్ని ఆమె తప్పుగా భావించలేము. ఎందుకంటే ఇతరుల కోసం తాను చేసిన పనిని ఆయన ఎప్పుడూ ఏ విధంగానూ చెప్పుకునేవారు కాదు. పీయూడీఆర్ కృషిలో తన ప్రమేయం గురించిన ప్రస్తావన రావడాన్ని ఆయన నిరాకరించేవారు. సుబ్బారావును ప్రత్యక్షంగా కలిసి, గమనిస్తేనే ఆయన ఎటువంటి ఉదాత్తుడో అర్థమవుతుంది. భారత ప్రజాస్వామ్యానికి ఆయన నిశ్చయంగా ఒక నిజమైన హీరో.
చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ అంకితా పాండే పుస్తకం విశిష్టమైనది. పౌరహక్కుల ఉద్యమాన్ని స్థూలంగా సమీక్షించిన విలువైన గ్రంథమది. అంకిత పుస్తకంతో పాటు దివంగత నీలాంజన్ దత్తా పుస్తకం ‘సివిల్ లిబర్టీస్ మూవ్‌మెంట్ ఇన్ ఇండియా: ఫ్రమ్ కలోనియల్ టైమ్స్ టు ది ప్రజెంట్’ను కూడా చదవాలి. మీడియా ఉదాసీనత, పోలీసు వ్యవస్థ క్రూరత్వం, న్యాయవ్యవస్థ అలక్ష్యం, మోదీ ప్రభుత్వ క్రియాశీల వ్యతిరేకతతో సహా పలు అపాయాలు ప్రజాస్వామిక ఆలోచనాశీలురు అయిన పౌరులకు వాటిల్లుతున్న ప్రస్తుత సందర్భంలో ఆ రెండు పుస్తకాలకు మరింత ప్రాసంగికత ఉన్నది. పెరుగుతున్న కేంద్రీకృత అధికారం, నిరంకుశ పాలనా ధోరణులు, వేగంగా ప్రబలమవుతున్న మెజారిటీవాదం దృష్ట్యా భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు పౌరహక్కుల కార్యకర్తల అవసరం మరెప్పటికంటే మరింత ఎక్కువగా ఉంది.
(వ్యాసకర్త చరిత్రకారుడు)