Share News

యుద్ధం మీది, లాభం నాది

ABN , Publish Date - Apr 16 , 2026 | 01:01 AM

యుద్ధంలో ఇరాన్ బలహీనపడటం చైనాకు నష్టమే కావచ్చు, కానీ ఇరాన్ పూర్తిగా పతనమై, నాయకత్వం మారితే చైనాకు ఇంకా పెద్ద కష్టం. అమెరికా ఆధిపత్యానికి బీటలు వారుతున్నాయని బీజింగ్ చాలా ఏళ్లుగా ప్రపంచం ముందు వాదనను వినిపిస్తోంది.

యుద్ధం మీది, లాభం నాది

ఇరాన్ గెలవటం కంటే, అక్కడ అధికారం చేతులు మారకుంటే చైనాకు చాలు. ఎందుకంటే కొన ఊపిరితో ఉన్న ఇరాన్ అమెరికాకు ఎప్పటికీ తలనొప్పే. అమెరికా మధ్యప్రాచ్యంలో చిక్కుకుపోతే, చైనాకు ఇండో–పసిఫిక్‌లో తను అనుకున్నది చేయడానికి వీలవుతుంది.

యుద్ధంలో ఇరాన్ బలహీనపడటం చైనాకు నష్టమే కావచ్చు, కానీ ఇరాన్ పూర్తిగా పతనమై, నాయకత్వం మారితే చైనాకు ఇంకా పెద్ద కష్టం. అమెరికా ఆధిపత్యానికి బీటలు వారుతున్నాయని బీజింగ్ చాలా ఏళ్లుగా ప్రపంచం ముందు వాదనను వినిపిస్తోంది. ఒకవేళ ఇరాన్ పూర్తిగా నాశనమైతే, అమెరికా మరోసారి తన సైనిక శక్తి విశ్వరూపాన్ని ప్రదర్శిస్తే, ఆ వాదన వీగిపోతుంది. గ్లోబల్ సౌత్ దేశాలు, అమెరికా వ్యతిరేక కూటమి మళ్లీ వాషింగ్టన్ చంకన చేరే ప్రమాదం ఉంది. అదే బీజింగ్‌కు పెద్ద ఆందోళనకర అంశం.

గత ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలు చైనాను మరింత అప్రమత్తం చేశాయి. ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరిట ఇరాన్ అణు కేంద్రాలు, సైనిక స్థావరాలు, కమాండ్ సెంటర్లపై భారీ దాడులు చేసింది. అమెరికా నేరుగా రంగంలోకి దిగి బంకర్ బస్టర్లతో ఇరాన్ అణు సదుపాయాలను ధ్వంసం చేసింది. సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హతమయ్యాడు. ఇరాన్ కోలుకోలేనంత తీవ్రంగా దెబ్బతింది, కొన ఊపిరితో ఉంది. ఈ పరిస్థితిని చైనా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. చైనా ఇప్పుడు ఇరాన్‌కు అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు సరఫరా చేస్తోంది. రష్యన్ ఎస్–400కు దీటైన HQ–9 వ్యవస్థలు, తక్కువ దూరపు లక్ష్యాలను ఛేదించే షార్ట్–రేంజ్ సిస్టమ్‌లు చైనా నుంచి మూడో దేశం ద్వారా ఇరాన్‌కు చేరుతున్నాయి. వీటితో పాటు మ్యాన్‌పాడ్‌లు, అంటే భుజంపై మోసుకెళ్లే వ్యక్తిగత వైమానిక నిరోధక క్షిపణులనూ చైనా సరఫరా చేస్తోంది. ఇవి పట్టణ యుద్ధంలో హెజ్బొల్లా వంటి ప్రాక్సీ గ్రూపులకు అత్యంత ఉపయోగకరమైన ఆయుధాలు. ఇరాన్ వీటిని ఇజ్రాయెల్‌పై పోరాడుతున్న హెజ్బొల్లా షియా గ్రూపుకు తప్పక సరఫరా చేస్తుంది. దీనివల్ల ఇజ్రాయెల్ మునుపటిలా వైమానిక దాడులను నదురు బెదురు లేకుండా కొనసాగించలేదు.


నిఘా ఉపగ్రహాల ద్వారా సేకరించిన రియల్ టైమ్ సమాచారాన్ని టెహ్రాన్‌తో బీజింగ్ పంచుకుంటోంది. దీనివల్ల ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ విమానాల కదలికలు, నౌకాదళ మోహరింపులు, క్షిపణి ప్రయోగ వేదికల స్థానాలు ఇరాన్‌కు ముందే తెలుస్తున్నాయి. ఇది కేవలం సాంకేతిక సహాయం మాత్రమే కాదు. యుద్ధ రంగాన్నే మార్చే కీలక ఆయుధం. ఇరాన్ చమురు బావులు తగలబడినా, రిఫైనరీలు ధ్వంసమైనా ఇరాన్ ఆర్థిక వ్యవస్థను చైనా పూర్తిగా కుప్పకూలనివ్వడం లేదు. డాలర్‌కు బదులు యువాన్ ఆధారిత చెల్లింపుల ద్వారా వాణిజ్యం కొనసాగిస్తోంది. ఇరాన్ దగ్గర ఎంత చమురు మిగిలినా కొంటోంది. దీనివల్ల టెహ్రాన్ ఆర్థికంగా శ్వాసిస్తూనే ఉంది.

చైనా పాత్ర కేవలం ఇరాన్‌కు చాటుగా ఆయుధాలు అందించడానికే పరిమితం కాలేదు. పర్షియా గల్ఫ్ దేశాలపై ఇరాన్ చేసిన క్షిపణి దాడులకు వ్యూహాత్మక మార్గదర్శనం కూడా చైనా నుంచే వచ్చిందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రెయిన్, ఖతార్ దేశాలకు సొంతంగా సమర్థవంతమైన మిలటరీ బలగాలు లేవు. అధునాతన క్షిపణి నిరోధక వ్యవస్థలు లేవు. అమెరికా అండ లేకపోతే ఒక్క రోజు కూడా నిలబడటం కష్టం. ఈ పరిస్థితిని చైనా అనుకూలంగా వాడుకున్నది.


గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడి చేయగానే అమెరికాకు రెండు వైపుల నుంచి ఊపిరి సలపని ఒత్తిడి మొదలైంది. ఒకవైపు ఇరాన్‌ను నిస్తేజం చేయాలి, మరోవైపు గల్ఫ్‌లోని తన మిత్ర దేశాలను రక్షించుకోవాలి. పేట్రియాట్ క్షిపణి నిరోధక బ్యాటరీలు, థాడ్ వ్యవస్థలు, యుద్ధ విమానాలు, నౌకాదళం, అన్నీ ఒకేసారి రెండు దిశల్లో కదపాల్సి వస్తోంది. సైనిక వ్యూహకర్తలు దీన్ని ‘టూ–ఫ్రంట్ స్ట్రెచ్’ అంటారు. అంటే ఒకే సమయంలో రెండు చోట్ల యుద్ధం చేయాల్సి రావడం. అమెరికా వంటి అత్యంత శక్తిమంతమైన దేశానికి కూడా ఇది వనరులను, శక్తిని విపరీతంగా హరించే పరిస్థితి. చైనా ఈ పరిస్థితిని కావాలని సృష్టించింది. ఇరాన్‌కు గల్ఫ్ దేశాలపై దాడి చేసే సామర్థ్యాన్ని కల్పించడం ద్వారా అమెరికాను ఒకేసారి రెండు చోట్ల దృష్టి పెట్టేలా చేసింది. అమెరికా శక్తియుక్తులను రెండు వైపులా వినియోగించేలా చేయగలిగింది. ఈ పని చైనా ప్రధానంగా సొంత లాభాన్ని దృష్టిలో ఉంచుకునే చేసింది. అమెరికా విమాన వాహక యుద్ధ నౌకలు, క్షిపణులు, బలగాలు అన్నీ మధ్యప్రాచ్యంలో చిక్కుకుపోతే తైవాన్, సౌత్ చైనా సీలో దాని కదలికలు తగ్గుతాయి. సెంటర్ ఫర్ స్ట్రాటెజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) అంచనాల ప్రకారం, మొదటి యుద్ధానికే అమెరికా దాదాపు రూ.1.4 లక్షల కోట్లు వెచ్చించింది. రెండో యుద్ధం 40 రోజులు సాగింది. దీనివల్ల అమెరికా ఆయుధ నిల్వలు కరిగిపోయాయి. ఆర్థిక వనరులను నష్టపోయింది. జియో పాలిటిక్స్‌లో దాని స్థానం తగ్గింది. చైనాకు అదే కావాలి. చైనా ఇరాన్‌కు మద్దతు ఇస్తున్నది ఇంధనం కోసం కాదు. అమెరికాను సైనికపరంగా గందరగోళంలోకి నెట్టడం కోసమే.


ఇరాన్ గెలవటం కంటే, అక్కడ అధికారం చేతులు మారకుంటే చైనాకు చాలు. ఎందుకంటే కొన ఊపిరితో ఉన్న ఇరాన్ అమెరికాకు ఎప్పటికీ తలనొప్పే. అమెరికా మధ్యప్రాచ్యంలో చిక్కుకుపోతే, చైనాకు ఇండో–పసిఫిక్‌లో తను అనుకున్నది చేయడానికి వీలవుతుంది. తైవాన్ జలసంధి దగ్గర, దక్షిణ చైనా సముద్రంలో, ఫిలిప్పీన్స్ చుట్టూ, అన్నిచోట్లా చైనా నదురు బెదురు లేకుండా స్వేచ్ఛగా యుద్ధ నౌకల ఫ్లీట్‌ను తిప్పుతోంది. చదరంగంలో ఆటగాడు పావు కోల్పోయినా ఆటను వదిలిపెట్టడు. ఎందుకంటే అతని లక్ష్యం ఒక్క పావు కాదు. మొత్తం గెలుపు. ఇదే చైనా చెస్‌బోర్డ్‌ వ్యూహం.

- బి.టి.గోవిందరెడ్డి

సీనియర్ జర్నలిస్ట్

Updated Date - Apr 16 , 2026 | 01:04 AM