Share News

నినాదాలు కాదు.. బాలల జీవితాల్లో ఆనందం కావాలి

ABN , Publish Date - Nov 14 , 2026 | 01:35 AM

బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్‌ 14న పాఠశాలలు రంగులమయమవుతాయి. ఆటలు, పాటలు, పోటీలు, బహుమతులతో సందడి నెలకొంటుంది. పిల్లలే దేశ భవిష్యత్తు అని ప్రసంగాలు చేస్తాం.

నినాదాలు కాదు.. బాలల జీవితాల్లో ఆనందం కావాలి

బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్‌ 14న పాఠశాలలు రంగులమయమవుతాయి. ఆటలు, పాటలు, పోటీలు, బహుమతులతో సందడి నెలకొంటుంది. పిల్లలే దేశ భవిష్యత్తు అని ప్రసంగాలు చేస్తాం. కానీ పిల్లల ప్రస్తుత జీవన పరిస్థితులను కూడా అంతే శ్రద్ధగా పరిశీలిస్తున్నామా? 2026 బాలల హక్కుల ప్రచారంలో ముందుకు వచ్చిన ‘‘My Day, My Rights, My Future’’ (నా రోజు, నా హక్కులు, నా భవిష్యత్తు) అనే నినాదం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ప్రతి పిల్లవాడికి తనదైన బాల్యం, హక్కులపై అవగాహన, భవిష్యత్తును కలలు కనే స్వేచ్ఛ ఉండాలన్నది దీని సారాంశం. కానీ ఆకలితో నిద్రపోయే పిల్లవాడికి తన రోజు ఎక్కడుంది? పాఠశాలకు వెళ్లకుండా పనికి వెళ్లే బాలుడికి తన హక్కుల గురించి ఎవరు చెబుతారు? హింస, వివక్ష, బాల్యవివాహాలు, అక్రమ రవాణా మధ్య పెరుగుతున్న చిన్నారులకు ఈ నినాదం ఎంతవరకు వర్తిస్తుంది? నినాదాలు అందంగా ఉండవచ్చు. కానీ అవి పిల్లల జీవితాల్లో ప్రతిబింబించినప్పుడే వాటికి నిజమైన అర్థం ఉంటుంది.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) లెక్కల ప్రకారం, ఐదేళ్లలోపు పిల్లల్లో 19శాతం మంది తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఆడుకోవాల్సిన వయస్సులో పని చేయడం, చదువుకోవాల్సిన వయస్సులో కుటుంబ బాధ్యతలు మోయడం విషాదకరం. బాలల హక్కుల కేంద్రం విశ్లేషణ ప్రకారం, 2025–26 కేంద్ర బడ్జెట్‌లో బాలల కోసం కేటాయించిన నిధుల వాటా కేవలం 2.29శాతం! ఈ పరిస్థితి మారాలి.

బాలల దినోత్సవం ఒక్కరోజు వేడుకలకే పరిమితం కాకూడదు. ప్రతి చిన్నారికి పౌష్టికాహారం, నాణ్యమైన విద్య, భద్రత, ఆటపాటలకు అవకాశం, సమాన హక్కులు అందాలి. ప్రభుత్వాలు బాలల బడ్జెట్‌ను పెంచాలి. పాఠశాలలు, అంగన్‌వాడీలు, బాలల రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయాలి. పిల్లలు దేశ భవిష్యత్తు అని చెప్పడం కాదు, వారికి వర్తమానంలోనే మంచి జీవితాన్ని అందించడం మన బాధ్యత. పిల్లల కోసం మంచి భవిష్యత్తును నిర్మించాలంటే ముందుగా వారి వర్తమానాన్ని కాపాడాలి.

- డా. కె. రమాప్రభ (సామాజిక కార్యకర్త)

Updated Date - Nov 14 , 2026 | 01:38 AM