పిల్లలకూ గొంతున్నది, వినే సమాజమేది?
ABN , Publish Date - Oct 03 , 2026 | 12:05 AM
జెన్ ఆల్ఫా పిల్లలు తమ పాఠశాల సౌకర్యాలపై ప్రశ్నిస్తూ ఆందోళనలకు దిగుతున్న సందర్భాలు ఇటీవల కొన్ని జరగడంతో– పిల్లలు చదువుకోకుండా రోడ్డు ఎక్కడం ఏమిటి అన్న చర్చ మొదలైంది.
జెన్ ఆల్ఫా పిల్లలు తమ పాఠశాల సౌకర్యాలపై ప్రశ్నిస్తూ ఆందోళనలకు దిగుతున్న సందర్భాలు ఇటీవల కొన్ని జరగడంతో– పిల్లలు చదువుకోకుండా రోడ్డు ఎక్కడం ఏమిటి అన్న చర్చ మొదలైంది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో విద్యార్థులు పాఠశాలలో ఫ్యాన్లు, తాగునీరు, మరుగుదొడ్లు, బెంచీలు వంటి కనీస సౌకర్యాల కోసం ఆందోళన చేశారు. బిహార్‌లోని గయాలో విద్యార్థులు తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు నడిచారు. రాజస్థాన్‌లో విద్యార్థులు ఉపాధ్యాయుల కొరతను ప్రశ్నించారు. మధ్యప్రదేశ్‌లో విద్యార్థినులు తమ పాఠశాల తరలింపునకు సంబంధించిన నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. హమీర్‌పూర్‌లో విద్యార్థులు పాఠశాలకు వెళ్లే రహదారి కోసం అధికారులను ఆశ్రయించారు. ఇవి దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలన్నింటినీ ప్రతిబింబిస్తాయని చెప్పలేం. కానీ ఒక విషయాన్ని మాత్రం స్పష్టం చేస్తున్నాయి. పిల్లలకు సమస్య కనిపిస్తే వారు ప్రశ్నించగలరు, ప్రశ్నిస్తారు.
పిల్లలు ప్రధాన సామాజిక జీవితం నుంచి వేరుపడిన వారు కాదు. వారు సమాజంలో భాగం. వ్యవస్థీకరించుకోవడం, అభిప్రాయాలను ఏర్పరచుకోవడం, ఆలోచనలను వ్యక్తం చేయడం, ప్రశ్నించడం ఇవన్నీ వారి ఎదుగుదలలో భాగమే. ఈ హక్కులు అత్యంత స్పష్టంగా కనిపించాల్సిన ప్రదేశం పాఠశాల. పాఠశాలలోనే పిల్లలు మొదటిసారి ఒక పెద్ద సమూహంలో జీవించడం నేర్చుకుంటారు. నియమాలను తెలుసుకుంటారు. అసమానతలను చూస్తారు. అధికారాన్ని ఎదుర్కొంటారు. తనకు భిన్నమైన అభిప్రాయాలను కలిగిన వారిని కలుస్తారు. అక్కడే ప్రజాస్వామ్యానికి తొలి పాఠాలు మొదలవుతాయి. అలా కాకుండా పాఠశాల పిల్లల మాట వినకపోతే నిశ్శబ్దం అలవాటవుతుంది. విశ్వాసం తగ్గుతుంది. పౌరసత్వ భావన బలహీనపడుతుంది. కొందరు సర్దుకుపోవడం నేర్చుకుంటారు. మరికొందరు కోపాన్ని పెంచుకుంటారు. ఇంకొందరు తమకంటే బలహీనులపై అదే అధికారాన్ని ప్రయోగించడం నేర్చుకుంటారు. పాఠశాల వినకపోతే ఆ అసంతృప్తి మరోచోట వ్యక్తమవుతుంది– వీధిలో, సోషల్ మీడియాలో, కోపంలో.
పాఠశాలల్లో పార్లమెంట్లు, సైన్స్, సాహిత్య క్లబ్బులు, స్వచ్ఛంద సేవా దళాలు, బాల సంసద్, స్టూడెంట్ క్యాబినెట్, ఈకో క్లబ్బులు, మోడల్ యూత్ పార్లమెంట్ వంటి కార్యక్రమాల ఉద్దేశం పిల్లలను ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములను చేయడమే. జాతీయ విద్యా విధానం–2020 కూడా రాజ్యాంగ విలువలు, పౌర బాధ్యత, నాయకత్వ లక్షణాల పెంపుపై దృష్టి పెడుతున్నది. కానీ ఆచరణలో పరిస్థితి ఎలా ఉంది? చాలా చోట్ల బాల సంసద్ అంటే ఒక రోజు బ్యాడ్జ్‌లు పెట్టుకోవడం, ఫొటోలు దిగడం వరకే పరిమితమవుతోంది. నెలవారీ సమావేశాలు లేవు. పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ లేదు. పరిష్కారంలో వారి భాగస్వామ్యం లేదు. స్టూడెంట్ మినిస్టర్ అంటే యూనిఫాం చెక్ చేయడం, వరుసలో నిలబెట్టడం అనే స్థాయికి పరిమితమైతే, అది ప్రజాస్వామ్య శిక్షణ కాదు. ఒక విద్యార్థి ‘మా పాఠశాలలో తాగునీరు లేదు’ అని అడిగినప్పుడు, ‘నువ్వు విద్యార్థివి, ఇది నీ పని కాదు’ అని సమాధానం వస్తే, అక్కడ పార్లమెంట్ ఉన్నా ప్రజాస్వామ్యం లేనట్లే!
మన స్వాతంత్య్ర పోరాటంలోనూ పిల్లలు తమ వంతు పాత్ర పోషించిన సందర్భాలు ఉన్నాయి. కరపత్రాలు పంచడం, సందేశాలు చేరవేయడం, జెండాలు ఎగరవేయడం వంటి కార్యక్రమాల్లో పిల్లలు పాల్గొన్నారు. బాజీ రౌట్ చిన్న వయసులోనే బ్రిటిష్ పోలీసులకు వ్యతిరేకంగా నిలబడి ప్రాణాలు కోల్పోయాడు. ఉషా మెహతా చిన్న వయసు నుంచే జాతీయోద్యమ వాతావరణంలో పెరిగింది. పార్వతీ గిరి కూడా చిన్న వయసులోనే ఉద్యమ కార్యకలాపాల్లో పాల్గొంది. స్వాతంత్య్రం తర్వాత బాలల హక్కుల కోసం జరిగిన ఉద్యమాల్లో బచ్‌పన్ బచావో ఆందోళన ఒక ముఖ్యమైన ఉదాహరణ.
ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పెరుగుతున్నారు. తమ చుట్టూ జరిగే విషయాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేయడం వారి సామాజిక అనుభవంలో భాగంగా మారుతోంది. పిల్లవాడు తన జీవితాన్ని ప్రభావితం చేస్తున్న విషయాల గురించి మాట్లాడటం సహజం. తన చుట్టూ కనిపిస్తున్న నిరుద్యోగం, పోలీసు చర్యలు, విద్యా సమస్యలు, సామాజిక అసమానతలను గురించి ప్రశ్నించడం కూడా ఆ అనుభవంలో భాగమే. అయితే ఇక్కడ సమాజానికి ఒక బాధ్యత ఉంది. పిల్లల గొంతును రక్షించాలి. దాన్ని రాజకీయ నినాదంగా మార్చకూడదు. తల్లిదండ్రులు పిల్లలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు. మీడియా పిల్లలను సంచలనానికి సాధనంగా మార్చకూడదు. అధికారులు లేదా పోలీసులు ‘భద్రత’ పేరుతో పిల్లలను బెదిరించకూడదు. పిల్లల ప్రశ్నల్లో రాజకీయాన్ని వెతకడం కంటే, ఆ ప్రశ్న వెనుక ఉన్న వారి అనుభవాన్ని వినాలి.
మనకు కావాల్సింది మౌనంగా ఉండే పిల్లలు కాదు. ప్రశ్నించే పిల్లలు. అయితే ప్రశ్నించడం అంటే కేవలం వ్యతిరేకించడం కాదు. పిల్లలు స్పష్టంగా, ధైర్యంగా, నిజాలతో, గౌరవంతో ప్రశ్నించాలి. సంఘటితం కావాలి. కానీ గుంపు మనస్తత్వంతో కాదు. తమ అభిప్రాయాలను సమాచారంపై ఆధారపడి నిర్మించుకోవాలి. ఒక రీల్, ఒక మీమ్, ఒక సోషల్ మీడియా పోస్టుతోనే అభిప్రాయం ఏర్పడితే అది స్వతంత్ర ఆలోచన కాకపోవచ్చు. అందుకే డిజిటల్ పౌరసత్వాన్ని కూడా పిల్లలకు నేర్పాలి. అబద్ధాలను పంచకుండా ఉండడం, ఇతరులను హేళన చేయకుండా మాట్లాడడం, తన సమస్యను స్పష్టంగా చెప్పడం, భిన్నాభిప్రాయాన్ని గౌరవించడం ఇవన్నీ ప్రజాస్వామ్య పౌరసత్వంలోని భాగాలే. తెగువ అంటే ఎప్పుడూ పెద్ద పోరాటమే కాదు. తరగతిలో ఉపాధ్యాయుడు ఎందుకు లేరని అడగడం కూడా తెగువే. అన్యాయాన్ని డైరీలో రాయడం కూడా తెగువే. తోటి విద్యార్థిని కాపాడటం కూడా తెగువే.
పిల్లలు చిన్నవాళ్లే కావచ్చు. కానీ వారి అనుభవాలు చిన్నవి కావు. తమ చుట్టూ జరిగే విషయాలను వారు గమనిస్తారు. వాటి గురించి ఆలోచిస్తారు. తమ భాషలో ప్రశ్నిస్తారు. ఒక చిన్న పిల్లవాడు పరీక్షలు, నిరుద్యోగం, పోలీసు చర్యలు వంటి విషయాల గురించి మాట్లాడితే మనం ముందుగా ‘ఈ వయసులో ఇవన్నీ ఎలా తెలుసుకున్నాడు?’ అని ఆశ్చర్యపడవచ్చు. కానీ మరో ప్రశ్న కూడా మనం వేసుకోవాలి, ‘అతని చుట్టూ సమాజం అతనికి ఈ ప్రశ్నలు ఎందుకు నేర్పింది?’ అని. ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది.
పిల్లలు ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నను ‘చదువుకో... మాట్లాడకు’ అంటూ నొక్కిపెడితే, పిల్లలు మరో వేదికను వెతుక్కుంటారు. అప్పుడు వారు వీధిలో కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒక పిల్లవాడి అనుభవాన్ని నిజాయితీగా విన్నప్పుడు సమాజం తనను తాను అద్దంలో చూసుకోగలుగుతుంది. మన పిల్లలకు అలాంటి గొంతు అవసరం. దాన్ని మనం చెవొగ్గి వినడం అంతకంటే ముఖ్యం.
- డా. కె.రమాప్రభ
సామాజిక కార్యకర్త