Share News

సమస్యల్లో భావి భారత పౌరులు!

ABN , Publish Date - Jan 31 , 2026 | 03:12 AM

ప్రపంచ జనాభాలో పిల్లలు 25శాతం ఉన్నారు. వీరిలో సుమారు 16.8 కోట్ల మంది బాల కార్మికులు ఉన్నారు. ప్రతి 10 మందిలో ఒకరు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉన్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ.....

సమస్యల్లో భావి భారత పౌరులు!

ప్రపంచ జనాభాలో పిల్లలు 25శాతం ఉన్నారు. వీరిలో సుమారు 16.8 కోట్ల మంది బాల కార్మికులు ఉన్నారు. ప్రతి 10 మందిలో ఒకరు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉన్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‌ఓ) అంచనా వేసింది. సుమారు 3.6 కోట్ల మంది పిల్లలు బానిస బతుకులు గడుపుతున్నారని ఆస్ట్రేలియాకు చెందిన మానవ హక్కుల బృందం ‘ద వాక్ ఫ్రీ ఫౌండేషన్’ నివేదిక పేర్కొంది. పేదరికం, నిరక్షరాస్యత, అక్రమ రవాణా వంటి వాటి వల్ల ఎంతో మంది పిల్లలు బాల కార్మికులుగా మగ్గిపోతున్నారు. బాల కార్మిక వ్యవస్థ వల్ల విద్య, ఆరోగ్యం వంటి ప్రాథమిక హక్కులు కూడా వారికి అందడం లేదు. బాలలు లైంగిక, ఆర్థిక దోపిడీకి గురవుతున్నారు.

భారతదేశంలో 23,68,17,000 మంది పిల్లలు ఉన్నారు. వీరిలో 11.45శాతం మంది పిల్లలు బడికి దూరంగా ఉన్నారని గణాంకాలు, కార్యక్రమాల మంత్రిత్వ శాఖ గత డిసెంబర్‌ 8న విడుదల చేసిన నివేదిక తెలిపింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక ప్రకారం భారతదేశంలో 5 నుంచి 14 ఏళ్ల మధ్య వయస్సులోని దాదాపు కోటి మందికి పైగా మంది పిల్లలు పనుల్లో కొనసాగుతున్నారు. బాల కార్మిక శ్రమశక్తిలో 14 నుంచి 17 సంవత్సరాల పిల్లలు సుమారు 63శాతం ఉన్నారని ‘సేవ్ ది చిల్ర్డన్’ సంస్థ తెలిపింది. యూనిసెఫ్ నివేదిక ప్రకారం పట్టణ ప్రాంతంలో 5–14 ఏళ్ల వయస్సులోని బాల కార్మికుల సంఖ్యలో 54శాతం పెరుగుదల కనిపించింది.

2025 నాటికి బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలన్న ఐక్యరాజ్యసమితి లక్ష్యం భారతదేశంలో ఆచరణ సాధ్యం కాదని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన 52వ నివేదికలో పేర్కొంది. ప్రతి బిడ్డకు సమాన అవకాశాలు, హక్కుల రక్షణ వంటి ఐక్యరాజ్యసమితి అన్ని తీర్మానాలపైనా భారతదేశం సంతకం చేసింది. కానీ అవి ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు భిన్నంగా భారత బాలల పరిస్థితులు ఉన్నాయి. దేశంలోని నలుగురు పిల్లల్లో ముగ్గురు రక్తహీనతతో బాధపడుతున్నారు. ప్రతి రెండవ బిడ్డ బరువు తక్కువగా ఉన్నాడు. ప్రాథమిక విద్యలోనే చదువు మానేసే పిల్లలు 71.01శాతం ఉన్నారు. ఇక, షెడ్యూల్డ్ కులాలు, తెగల బాలికలలో అక్షరాస్యత రేటు 42శాతం మాత్రమే. వంద మంది బాలికల్లో 30 మంది మాత్రమే ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. వీరిలో ఇంకా బాల్య వివాహాలు కొనసాగుతూనే ఉన్నాయి.


ప్రపంచ వ్యాప్తంగా ఎదుగుదల లోపంతో బాధపడుతున్న పిల్లల్లో దాదాపు 70శాతం మంది భారత్, ఆఫ్రికా దేశాల్లోనే ఉన్నారు. వీరిలో 35.7శాతం భారత్‌లో ఉంటే, ఆఫ్రికాలో 33.6శాతం ఉన్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యపూరిత విధానాలు, పేదరికం, పోషకాహార లోపం వల్ల పిల్లలు ఎదుగుదల సమస్యను ఎదుర్కొంటున్నారు. బాల కార్మికులుగా ప్రమాదకరమైన పనుల్లో పనిచేయడం, పోషకాహార లోపం వల్ల ప్రతి సంవత్సరం భారతదేశంలో లక్షలాది బాలలు చనిపోతున్నారు.

బడికి వెళ్లి ఆటపాటలతో జీవించాల్సిన పిల్లలు బాల కార్మికులుగా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకు వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితులే కారణం. గత ప్రభుత్వాలు.. ముఖ్యంగా నేటి మోదీ ప్రభుత్వం పేదల కోసం కాకుండా, బడా పెట్టుబడిదారుల, బడా భూస్వాముల, సంపన్న వర్గాల, సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నది. ఫలితంగా గ్రామీణులు పేదరికంలో మగ్గుతున్నారు. దాంతో బడికి దూరమై కుటుంబ పోషణలో పిల్లలు బాల కార్మికులుగా మారుతున్నారు. ఫ్యాక్టరీల ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారు. పిల్లలు ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే గ్రామీణ పేదలకు భూ పంపిణీ జరగాలి. ప్రజా అవసరాలను తీర్చే పరిశ్రమలు నెలకొల్పి శ్రామికులకు పని కల్పించాలి. పట్టణ పేదలకు ఉపాధి కల్పించాలి.

– బొల్లిముంత సాంబశివరావు

రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఏపీ రైతు కూలీ సంఘం

Updated Date - Jan 31 , 2026 | 03:12 AM