Share News

క్యూబా ప్రభుత్వంలో చేగువేరా

ABN , Publish Date - Oct 09 , 2026 | 01:49 AM

అయాచిత భద్రజీవితాన్ని కాలదన్నుకుని ముళ్ల కిరీటాన్ని తలకెత్తుకున్న త్యాగజీవులకు బుద్ధుని కాలం నుంచి భూగోళంలో కొదవలేదు. అలాంటి మహానుభావులలో చేగువేరాది ఒక విశిష్ట స్థానం.

క్యూబా ప్రభుత్వంలో చేగువేరా

అయాచిత భద్రజీవితాన్ని కాలదన్నుకుని ముళ్ల కిరీటాన్ని తలకెత్తుకున్న త్యాగజీవులకు బుద్ధుని కాలం నుంచి భూగోళంలో కొదవలేదు. అలాంటి మహానుభావులలో చేగువేరాది ఒక విశిష్ట స్థానం. నిస్వార్థంగా... పలు దేశాల్లోని ప్రజల విముక్తి కోసం, అక్కడి పీడిత ప్రజలకు సౌకర్యవంతమైన జీవితాన్ని కలిగించటం కోసం కాంగో, పెరూ, గ్వాటెమాలా, క్యూబా, బొలీవియా దేశాల్లో గెరిల్లా పోరాటాలకు నాయకత్వం వహించారు. ఆ క్రమంలో క్యూబా పోరాటం విజయవంతమై తనకు మంత్రి పదవితో పాటు, అనేక ప్రధాన పదవులు లభించినా వాటిని వదిలేసి బొలీవియా విముక్తి కోసం అడవుల్లో, కొండల్లో గెరిల్లాలతో కలిసి పోరాడారు. నీరు, ఆహారం, స్థానిక ప్రజల మద్దతు లేక బొలీవియా సైన్యానికి, అమెరికా సీఐఏ ఏజెంట్లకు చిక్కి, 39 సంవత్సరాల వయస్సులోనే హత్యకు గురైన విశ్వనరుడు చేగువేరా.

అక్టోబర్ 9న అమరుడైన చేగువేరాది అర్జెంటీనా దేశం. క్యూబా విప్లవంలో పాల్గొన్న ఏకైక విదేశీయుడు. ఈ కారణంగా ఉద్యమపథంలో కొన్నిసార్లు అవమానాలకు గురయ్యారు. విప్లవం విజయవంతమైన తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వం 1959 ఫిబ్రవరి 7న ఒక చట్టం చేసింది. విదేశాల్లో పుట్టి పెరిగినా, సంవత్సరకాలానికి పైగా విప్లవోద్యమంలో పనిచేసిన వాళ్లందరికీ క్యూబన్ పౌరసత్వం లభిస్తుందనేది దాని సారాంశం. చేగువేరా కోసమే క్యాస్ర్టో ఈ చట్టం తెచ్చాడని అసమ్మతివాదులు గుసగుసలాడుతున్నా, అది పాక్షికంగానైనా సత్యమే.


విప్లవానంతరం ఏర్పడిన క్యాస్ర్టో ప్రభుత్వంలో ‘చే’ అనేక బాధ్యతలు నిర్వహించారు. సాయుధ దళాల శిక్షణా కేంద్రం డైరెక్టర్‌గా, విప్లవ సేనల విద్యా, సాంస్కృతిక శిక్షణ పర్యవేక్షణ, ‘వెర్దే ఒలీవో’ అనే పత్రిక బాధ్యత, సినిమా–కళా విభాగాల బాధ్యతలు నిర్వహించారు. లా కబానా మిలటరీ స్థానానికి కమాండర్‌గా, అగ్రేరియన్ రిఫార్మ్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహణ, క్యూబన్ నేషనల్ బ్యాంకు చైర్మన్‌గా, పరిశ్రమల మంత్రిగా ఏకకాలంలో పనిచేశారు.

1960 అక్టోబర్ 13 నుంచి క్యూబాతో సమస్త ఆర్థిక లావాదేవీలు అమెరికా రద్దు చేసుకోగా, చెకోస్లేవియా, రష్యా, చైనా, ఉత్తర కొరియా, తూర్పు జర్మనీ, డమాస్కస్, ఈజిప్టు, అలెగ్జాండ్రియా, ఇండియా, జపాన్, ఇండోనేసియా, సింగపూర్, హాంకాంగ్, సిలోన్ వంటి దేశాల్లో చేగువేరా పర్యటించి క్యూబాకు గట్టి మద్దతు సంపాదించారు.

ఎంత అలసిపోయినా, అనారోగ్యంతో ఉన్నా సరే, రోజుకు ఆరు గంటలకు మించి విశ్రాంతి తీసుకోకూడదని ‘చే’ నియమం పెట్టుకున్నారు. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు నిర్వహించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు అన్ని జీతాలూ తీసుకోవచ్చనే విధానం ఉన్నా, సైనిక కమాండర్‌గా వచ్చే జీతం 440 పెసోలు మాత్రమే తీసుకొనేవారు. ఇంటి అద్దె 50 పెసోలు, వాయిదాల పద్ధతిలో కొనుక్కున్న సెకండ్‌హ్యాండ్ కారుకు 50 పెసోలు పోగా, మిగిలిన దానితోనే కుటుంబాన్ని పోషించుకునేవారు. చివరకు... తాను చదవాలనుకున్న పుస్తకం కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉండేవి కావు. ఈ సంగతి తెలుసుకున్న మిత్రులు, ప్రజలు ఆయనకు రకరకాల పుస్తకాలు బహూకరించేవారు. రోజుకు ఇరవై గంటలు పనిచేస్తున్నా కొత్త సమస్యలు వస్తూనే ఉండేవి. పని పెరుగుతూనే ఉండేది. ఎప్పుడైనా కొంచెం సమయం దొరికితే కూతురు అలైదాతో కలిసి (భార్య పేరు కూడా అలైదానే) సినిమాకి వెళ్లేవారు. ఆయన టికెట్ కొనడానికి థియేటర్ నిర్వాహకులు ఒప్పుకునేవారు కాదు. వారితో తగాదా పడి, చివరకు టికెట్ డబ్బు చెల్లించే లోనికెళ్లేవారు ఆయన. ప్రతిసారీ ఇదే తంతు జరుగుతుండటంతో అసలు సినిమాలకు వెళ్లటమే మానుకున్నారు చేగువేరా.


లంచ్‌ టైంలో క్యాంటీన్ ముందు క్యూలో నిలబడి, ఓ అల్యూమినియం పళ్లెంలో ‘చే’ తన కోటా భోజనం తెచ్చుకునేవారు. ఆదివారాల్లో స్వచ్ఛంద శ్రమదానంలో అందరితో పోటీపడి పనిచేసేవారు. ఉబ్బసం పేషెంట్ అయిన చేగువేరాకు ధాన్యాన్ని గిడ్డంగుల్లోకి చేర్చే పని దుర్భరంగా ఉండేది. అయినా అవస్థ పడుతూనే పనిచేసేవారు. ‘చేగువేరా నివాసం ఒక చిన్న గది. అందులో ఒక వార్డ్‌రోబ్, ఓ టేబుల్, మూడు చెక్క కుర్చీలు ఉండేవి. కిటికీలకు కర్టెన్లుగానీ, టేబుల్‌పై క్లాత్ గానీ లేవు. సీలింగ్ నుంచి షేడ్ కూడా లేని ఒక బల్బు వేలాడుతూ ఉంది’ అని రష్యా నుంచి వచ్చిన ఆర్థిక శాస్త్రవేత్త నికోలాయ్ కుదిన్ రాశారు.

- చెరుకూరి సత్యనారాయణ

(నేడు చేగువేరా వర్ధంతి)

Updated Date - Oct 09 , 2026 | 01:52 AM