ఏపీ పురోగతికి అంతర్జాతీయ గుర్తింపు
ABN , Publish Date - May 05 , 2026 | 01:36 AM
ఒక దేశం లేదా రాష్ట్రం ఆర్థికంగా ఎదగాలంటే కేవలం వనరులు ఉంటే సరిపోదు, వాటిని సంపదగా మార్చగల విజన్ ఉన్న నాయకత్వం కావాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును...
ఒక దేశం లేదా రాష్ట్రం ఆర్థికంగా ఎదగాలంటే కేవలం వనరులు ఉంటే సరిపోదు, వాటిని సంపదగా మార్చగల విజన్ ఉన్న నాయకత్వం కావాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ప్రతిష్ఠాత్మక ‘ద ఎకనమిక్ టైమ్స్’ సంస్థ ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారంతో గౌరవించడం ఆ విజన్‌కు లభించిన అంతర్జాతీయ గుర్తింపు. ఇది కేవలం ఒక వ్యక్తికి దక్కిన గౌరవం కాదు; గత అయిదేళ్ల అనిశ్చితి నుంచి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ప్రగతిపథంలోకి మళ్లిందని, పెట్టుబడులకు మళ్ళీ సురక్షితమైన స్వర్గధామంగా మారిందని ప్రపంచానికి చాటిచెప్పే బలమైన సంకేతం. ఆధునిక భారతదేశ ఆర్థిక చరిత్రలో కొన్ని పేర్లు కేవలం పదవులకే పరిమితం కావు, అవి ఒక శకానికి నాంది పలుకుతాయి. అటువంటి పేర్లలో చంద్రబాబుది అగ్రస్థానం. విచ్ఛిన్నమైన ఆర్థిక వ్యవస్థను, అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని అతి తక్కువ కాలంలోనే తిరిగి పెట్టుబడుల స్వర్గధామంగా మార్చడం ఆయన పరిపాలనా దక్షతకు నిదర్శనం.
చంద్రబాబు సంస్కరణల ప్రస్థానం నేటిది కాదు. 1990వ దశకంలో ప్రపంచం ఇంకా గ్లోబలైజేషన్ వైపు అడుగులు వేస్తున్న తరుణంలోనే ఆయన హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చి భారతదేశాన్ని సాఫ్ట్‌వేర్ రంగంలో అగ్రగామిగా నిలిపారు. నేడు నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ముందున్న సవాలు మరింత పెద్దదైనా, అకుంఠిత దీక్షతో ముందుకు సాగుతున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ సులభతర వాణిజ్యంలో (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ప్రథమ స్థానంలో ఉండేది, కానీ నేడు ఆయన దానిని మరో మెట్టు ఎక్కించి ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అనే సరికొత్త లక్ష్యంతో ముందుకు వెడుతున్నారు. పారిశ్రామిక అనుమతుల ప్రక్రియలో ఎర్ర తివాచీ పరిచి, నిర్ణయాల్లో వేగాన్ని పెంచడం ద్వారా పెట్టుబడిదారులలో అచంచలమైన నమ్మకాన్ని కలిగించారు. ఈ నమ్మకమే కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలంలోనే సుమారు రూ.20 లక్షల కోట్ల మేర పెట్టుబడుల ఒప్పందాలు రాష్ట్రానికి వచ్చేలా చేసింది. ఇది ఒక నాయకుడిపై ఉన్న నమ్మకం మాత్రమే కాదు, ఆ నాయకుడు సృష్టించిన వ్యవస్థపై ఉన్న భరోసా.
చంద్రబాబు సంస్కరణలు కేవలం ఐటీ రంగమే కాకుండా, భవిష్యత్తు అవసరాలైన గ్రీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, తయారీ రంగాలను ఏపీకి రప్పించడంలో అసాధారణమైన చొరవను చూపుతున్నాయి. ఎకనమిక్ టైమ్స్ జ్యూరీ సైతం ఆయనలోని ‘టెక్నాలజీ బేస్డ్ గవర్నెన్స్’ను ప్రత్యేకంగా ప్రశంసించడం గమనార్హం. ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకత, జిల్లా కలెక్టర్లకు నిర్దిష్టమైన రేటింగ్ సిస్టమ్, పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు సకాలంలో అందేలా ‘ఎస్క్రో అకౌంట్’ల వంటి వినూత్న ఆలోచనలు భారతదేశంలోనే ఏపీని అగ్రగామిగా నిలబెట్టాయి. సునీల్ భారతీ మిట్టల్, సజ్జన్ జిందాల్, ఉదయ్ కోటక్ వంటి భారత పారిశ్రామిక దిగ్గజాలతో కూడిన జ్యూరీ ఏకగ్రీవంగా చంద్రబాబును ఎంపిక చేయడం వెనుక ఆయన పట్ల పారిశ్రామిక లోకంలో ఉన్న క్రెడిబిలిటీ స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో అరుణ్ జైట్లీ, ఎస్.జైశంకర్ వంటి జాతీయ స్థాయి మేధావులు అలంకరించిన ఈ వేదికపై ఇప్పుడు మన నాయకుడు నిలవడం ప్రతి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్లింది. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా, విశాఖను పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దాలనే ఆయన సంకల్పానికి ఈ ‘బిజినెస్ రిఫార్మర్’ అవార్డు ఒక శక్తిమంతమైన ఊతాన్నిస్తుంది. రాజకీయాలకు అతీతంగా, అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ ఈ గౌరవాన్ని రాష్ట్ర పునర్నిర్మాణానికి ఒక శుభసూచకంగా, ‘బ్రాండ్ ఆంధ్రప్రదేశ్’ పునరుజ్జీవంగా భావిస్తున్నారు.
చంద్రబాబు నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రథానికి ఇరుసు లాంటిది. ఒక నాయకుడికి విజన్ ఉంటే, ఆ విజన్ వెనుక ఒక జాతి కదిలితే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో ఆయన నిరూపిస్తున్నారు. ఈ అవార్డు కేవలం ఒక వేడుక కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శకానికి నాంది, రాష్ట్ర ప్రగతి ప్రయాణంలో ఒక మైలురాయి.
కలిశెట్టి అప్పలనాయుడు
లోక్‌సభ సభ్యులు, విజయనగరం
ఈ వార్తలు కూడా చదవండి
బెంగాల్‌లో చారిత్రక తీర్పు.. విజయోత్సవ సంబరాల్లో మోదీ
ఇది గెలుపు కాదు లూటీ.. మేం పుంజుకుంటాం.. బెంగాల్‌లో షాకింగ్ తీర్పుపై మమతా బెనర్జీ