Share News

ఉపాధి హామీపై ఉక్కుపాదం

ABN , Publish Date - Feb 07 , 2026 | 02:31 AM

భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వీబీ జీ రామ్‌ జీగా మారుస్తూ కేంద్రం ఇటీవల కొత్త చట్టాన్ని తెచ్చింది.

ఉపాధి హామీపై ఉక్కుపాదం

భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వీబీ జీ రామ్‌ జీగా మారుస్తూ కేంద్రం ఇటీవల కొత్త చట్టాన్ని తెచ్చింది. ఒక చట్టాన్ని రూపొందించేటప్పుడు విధివిధానాల రూపకల్పన సమగ్రంగా ఉండాలి. కానీ ఉన్న పథకానికి తూట్లు పొడుస్తూ తెచ్చిన కొత్త చట్టం నిరుపేదల పొట్టకొట్టడమే కాకుండా, రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపుతోంది.

దేశంలో ఆకలిచావులు ఉండకూడదనే మానవతా దృక్పథంతో, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చొరవతో– రెండు దశాబ్దాల క్రితమే మన్మోహన్‌సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం, వలసలను తగ్గించింది. అంతేకాదు, ఉపాధికి చట్టపరమైన హామీ కల్పించడం ద్వారా ఇది కుటుంబ ఆదాయాన్ని పెంచి, మహిళా సాధికారతకు, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడింది. గ్రామీణ పేదల పాలిట ఈ పథకం ఒక భద్రతా కవచంగా నిలుస్తోంది. ఇరవయ్యేళ్ల క్రితం– 2006, ఫిబ్రవరి 2న ఉమ్మడి రాష్ట్రంలోని అనంతపురం జిల్లా బండ్లపల్లికి వచ్చి, ప్రధాని మన్మోహన్ స్వయంగా ఈ పథకాన్ని ప్రారంభించారు.


‘కాంగ్రెస్ అంటే ఉపాధి హామీ.. ఉపాధి హామీ అంటేనే కాంగ్రెస్’ అనేలా నిరుపేదల గుండెల్లో ఈ పథకం చెరగని ముద్ర వేసింది. దానిని చెరిపివేసేందుకే మోదీ సర్కార్ అవకాశవాద రాజకీయాలకు తెరలేపింది. కొత్త చట్టం ద్వారా పని దినాలను 125కు పెంచడమే కాకుండా, రోజువారీ వేతనం పెంచుతున్నామని ప్రగల్భాలు పలుకుతున్న కేంద్రం, ఉపాధి హామీ కార్మికులకు చెల్లించే వేతనాల ఖర్చులో 40శాతం భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై మోపాలనుకోవడం ఆక్షేపణీయం. గతంలో 90శాతం ఖర్చును కేంద్రం భరించగా, కేవలం 10శాతం మాత్రమే రాష్ట్రాలు భరించేవి.

తెలంగాణ విషయానికి వస్తే.. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పనిదినాలను 8 కోట్ల నుంచి 6.5 కోట్లకు కేంద్రం కుదించింది. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ సర్కార్ 12 కోట్ల పనిదినాలు కోరితే, వాటిని సగానికి తగ్గించడమే కాకుండా రావాల్సిన నిధుల్లో కోత విధించడం గర్హనీయం. నిబంధనల పేరుతో కేంద్రం విధిస్తున్న ఆంక్షలు రాష్ట్ర ఉపాధి రంగాన్ని కుదిపేస్తున్నాయి. బడ్జెట్‌లో ఉపాధి హామీ నిధులను గణనీయంగా తగ్గించడమే కాకుండా, క్షేత్రస్థాయిలో అమలుకు అసాధ్యమైన నిబంధనలను రుద్దుతోంది. కొత్తగా ప్రవేశపెట్టిన నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టం యాప్ ద్వారా రోజుకు రెండుసార్లు ఫొటోలు తీయాలనే నిబంధన, సిగ్నల్ లేని మారుమూల ప్రాంతాల్లోని కూలీలకు శాపంగా మారింది. చిన్నపాటి సాంకేతిక కారణాలను సాకుగా చూపి, తెలంగాణకు రావాల్సిన వందల కోట్ల రూపాయల బకాయిలను కేంద్రం నిలిపివేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేసి, ‘కల్లాలు’ నిర్మించుకుంటే, దానిని నిబంధనల ఉల్లంఘనగా పేర్కొంటూ రూ.150 కోట్లకు పైగా నిధులను తిరిగి చెల్లించాలని రాష్ట్ర సర్కారుకు నోటీసులు ఇవ్వడం గమనార్హం. చెరువుల పూడికతీత, ఫీల్డ్ ఛానల్స్ వంటి పనుల ద్వారా రాష్ట్రం సాధించిన ప్రగతిని మెచ్చుకోవాల్సింది పోయి, రికవరీ నోటీసులు ఇవ్వడం తెలంగాణ రైతాంగాన్ని దెబ్బతీయడమే అవుతుంది.


కేంద్రం నిర్ణయాల వల్ల తెలంగాణలోని దాదాపు 1.2 కోట్ల మంది జాబ్‌కార్డ్ హోల్డర్లు ప్రభావితమవుతున్నారు. ఆధార్ అనుసంధాన చెల్లింపుల కారణంగా సామాన్య కూలీలకు సకాలంలో డబ్బులు అందక ఇబ్బందులు పడుతున్నారు.

దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించే ఉపాధి హామీ పథకాన్ని రాజకీయ కోణంలో కాకుండా, పేదల జీవనోపాధి కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. ఉపాధి హామీ పథకం పట్ల తాము అనుసరిస్తున్న కఠిన వైఖరిని సవరించుకోకపోతే మోదీ సర్కార్ భారీ మూల్యం చెల్లించుకోవడమే కాకుండా గ్రామీణ భారతం కోలుకోలేని దెబ్బతింటుందని కేంద్ర ప్రభుత్వ పెద్దలు గ్రహించాలి.

- ఇందిరా శోభన్

కాంగ్రెస్ సీనియర్ నేత

Updated Date - Feb 07 , 2026 | 02:33 AM