Share News

సీబీఎస్ఈ నిబంధన మార్చాలి

ABN , Publish Date - Apr 14 , 2026 | 12:25 AM

ప్రస్తుత విద్యా సంవత్సరం పూర్తి కాకముందే వచ్చే సంవత్సరానికి వేరే పాఠశాలలో చేరుతారేమోననే అనుమానంతో ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు ముందే కట్టించుకుంటున్నారు.

సీబీఎస్ఈ నిబంధన మార్చాలి

ప్రస్తుత విద్యా సంవత్సరం పూర్తి కాకముందే వచ్చే సంవత్సరానికి వేరే పాఠశాలలో చేరుతారేమోననే అనుమానంతో ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు ముందే కట్టించుకుంటున్నారు. అంతేకాకుండా పిల్లలకి ఏ మాత్రం విశ్రాంతి లేకుండా పై తరగతి పాఠాలు మొదలుపెడుతున్నారు. దీనికితోడు ఈ మధ్య సీబీఎస్‌ఈ చేసిన నిబంధనల ప్రకారం ఒక తరగతిలో విద్యార్థి ఆ తరగతికి సరిపడా వయసు కచ్చితంగా ఉంటేనే ప్రవేశం ఇవ్వాలి. రెండు మూడు నెలలు తక్కువగా ఉన్నా, మళ్లీ ఆ తరగతి చదవాలనో, లేక భవిష్యత్తులో వయసు తక్కువ ఉందని పదవ తరగతి పరీక్షలు రాయనీయకపోతే మమ్మల్ని బాధ్యుల్ని చేయొద్దని ప్రైవేట్ స్కూళ్లు డిక్లరేషన్ తీసుకుంటున్నాయి. మూడవ తరగతికే రెండు లక్షల ఫీజు వసూలు చేస్తున్నారు. అలాంటిది ఒకే తరగతిలో రెండేళ్లు చదవాలంటే ఎంత కష్టం. ఇవేవీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇటీవలి వరకు పల్లెటూళ్లు, చిన్న పట్టణాలలో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ చదవకుండానే నేరుగా మొదటి తరగతిలో చేర్చుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి విద్యార్థి ప్రీ ప్రైమరీ చదువుతున్నాడు. సగటున విద్యార్థుల మేధాశక్తి, గ్రహణ సామర్థ్యాలు పెరిగాయి. అలాంటప్పుడు వయసు తక్కువని మళ్లీ అదే తరగతి చదవాలన్న నిబంధన అసమంజసం. కాబట్టి కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై దృష్టి సారించి ఆరు నెలల వరకు తక్కువ వయసు ఉన్నా, ఉన్నత తరగతులకు ముఖ్యంగా పదవ తరగతి పరీక్షలకు అవకాశం కల్పించాలి. ఒకవేళ బోర్డు ఎగ్జామినేషన్ ఉన్న తరగతులకు ఉండవలసిన వయసు కన్నా ఆరు నెలలు తక్కువగా ఉంటే అంతకుముందు తరగతిలో అన్ని సబ్జెక్టులలో 60 శాతం, అంతకన్నా ఎక్కువ మార్కులు వస్తే అలాంటి వారిని పరీక్షలకు అనుమతించాలి.

– డాక్టర్ ఎంహెచ్ ప్రసాద్‌రావు

Updated Date - Apr 14 , 2026 | 12:27 AM