Share News

ఓబీసీలకు మరో పోరాటం తప్పదు!

ABN , Publish Date - Sep 19 , 2026 | 12:59 AM

భారతదేశంలో అసమానత గురించి మాట్లాడినప్పుడల్లా పేదరికం, నిరుద్యోగం, ఆదాయం వంటి అంశాలే ఎక్కువగా చర్చకు వస్తాయి. కానీ అంతకంటే ముఖ్యమైన ప్రశ్నలు వేరే ఉన్నాయి.

ఓబీసీలకు మరో పోరాటం తప్పదు!

భారతదేశంలో అసమానత గురించి మాట్లాడినప్పుడల్లా పేదరికం, నిరుద్యోగం, ఆదాయం వంటి అంశాలే ఎక్కువగా చర్చకు వస్తాయి. కానీ అంతకంటే ముఖ్యమైన ప్రశ్నలు వేరే ఉన్నాయి. దేశ సంపద ఎవరి చేతుల్లో ఉంది? పెద్ద వ్యాపారాలు, ప్రైవేటు విద్యాసంస్థలు, ఆసుపత్రులు, మీడియా సంస్థలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? భారీ మైనింగ్, రోడ్లు, విద్యుత్, రక్షణ, సాగునీటి కాంట్రాక్టులు ఎవరికి దక్కుతున్నాయి? సుప్రీంకోర్టు, హైకోర్టులు, విశ్వవిద్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ అత్యున్నత అధికార పదవుల్లో ఎవరి ప్రాతినిధ్యం ఎంత?– ఈ అంశాలు పెద్దగా చర్చకు రావటం లేదు.

దేశంలోని అత్యంత ధనికులైన ఒక శాతం మంది దాదాపు 40శాతం సంపదను కలిగి ఉండగా, దిగువన ఉన్న 50శాతం ప్రజల చేతుల్లో కేవలం 3శాతం సంపద మాత్రమే ఉన్నది. కానీ ఈ ఆర్థిక అసమానతకు సామాజిక రూపం ఏమిటో సమగ్ర సమాచారం లేదు. సంపదలో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, ఇతర సామాజిక వర్గాల వాటా ఎంత? అవకాశాల్లో వారి శాతం ఎంత? అధికార వ్యవస్థల్లో ఎవరు ముందున్నారు? ఎవరు వెనుకబడ్డారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగేదే నిజమైన కులగణన. అందుకే కులగణనను కేవలం ‘ఎవరు ఏ కులానికి చెందినవారు? వారి మొత్తం జనాభా ఎంత?’ అనే ఫక్తు సంఖ్యగా చూడటం పొరపాటు. సమగ్ర సామాజిక, ఆర్థిక ప్రాతిపదిక దృష్టితో చేపట్టే కులగణనే భారత సమాజానికి ఒక ఎక్స్‌రేలా ఉపయోగపడుతుంది.


ఈ అంశాన్ని గత కొన్నేళ్లుగా రాహుల్‌గాంధీ జాతీయ రాజకీయ చర్చలోకి తెచ్చారు. కుల గణనను కేవలం జనాభా లెక్కల అంశంగా కాకుండా ప్రాతినిధ్యం, అవకాశాలు, అధికారంలో వాటా అనే ప్రశ్నగా ఆయన నిలబెట్టారు. దేశ జనాభాలో ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు ఎంతమంది? ప్రభుత్వంలో, ఉన్నత విద్యలో, న్యాయవ్యవస్థలో, మీడియా, కార్పొరేట్ రంగాల్లో వారి వాటా ఎంత? అనే ప్రశ్నలను ఆయన పదేపదే సంధిస్తున్నారు. ‘దేశానికి ఎక్స్‌రే అవసరం’ అన్న రాహుల్‌గాంధీ వాదన వెనకున్న భావన సరిగ్గా ఇదే. రాహుల్‌గాంధీ నిరంతరంగా కులగణన అవసరాన్ని నొక్కివక్కాణించడంతోపాటు, బిహార్, తెలంగాణ రాష్ట్రాలు కుల ఆధారిత సర్వేలు నిర్వహించడంతో రాబోయే జనగణనలో కులగణన చేపడతానని మోదీ ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చింది. అప్పటివరకూ కులగణనపై వ్యతిరేక వైఖరితో ఉన్న బీజేపీ తీసుకున్న ‘యూటర్న్‌’ ఇది. ఆనాడు బిహార్‌లోని ఓబీసీ–ఈబీసీ ఓటర్లను ఆకర్షించడం కూడా బీజేపీ నిర్ణయం వెనక రాజకీయ కారణాల్లో ఒకటి కావచ్చు.

తెలంగాణలో సర్వేకు ముందుగా వివిధ సామాజిక వర్గాలు, సంఘాలు, నిపుణులు, సంబంధిత వర్గాలతో విస్తృతంగా సంప్రదింపులు జరిగాయి. ఏ ప్రశ్నలు అడగాలి? ఏయే సామాజిక–ఆర్థిక అంశాలను నమోదు చేయాలి? కుల గుర్తింపును ఎలా నమోదు చేయాలి? అనే విషయాలపై సూచనలు తీసుకున్నారు. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన గెజిట్లలో ఉన్న కులాల జాబితాలను ఆధారంగా తీసుకుని వాటిని పద్ధతిగా వర్గీకరించారు. ప్రతి కులానికి ఒక ప్రత్యేక కోడ్ కేటాయించారు. ఒకే కులానికి ప్రాంతాల వారీగా వాడే వేర్వేరు పేర్లు, ఉపకులాల పేర్లు, స్థానిక పేర్లు, సమానార్థక పేర్లను గుర్తించి అవన్నీ సంబంధిత కులానికి కేటాయించిన అదే కోడ్ కిందకు వచ్చేలా వ్యవస్థ రూపొందించారు. ఉదాహరణకు రజక, చాకలి, వన్నార్ వంటి వేర్వేరు పేర్లు ఒకే సామాజిక వర్గానికి సంబంధించినవిగా గుర్తించినప్పుడు అవి వేర్వేరు లెక్కలుగా విడిపోకుండా ఒకే ప్రామాణిక కోడ్ కింద నమోదయ్యేలా చేశారు. తెలంగాణలో సేకరించిన డేటాను కేవలం జనాభా లెక్కలుగా కాకుండా విద్య, ఉపాధి, జీవనోపాధి, ఆస్తులు, వ్యాపార యాజమాన్యం, సామాజిక స్థితి, ప్రాతినిధ్యం వంటి సూచికలతో విశ్లేషించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన నిపుణుల కమిటీ ఈ విశ్లేషణను చేపట్టి నివేదికను విడుదల చేసింది.


2026 ఆగస్టు 14న కేంద్రం విడుదల చేసిన సెన్సెస్ 2027 షెడ్యూలులోని కులం ప్రశ్న రూపకల్పనలోనే ప్రధాన సమస్య (లోపం) ఉంది. ఎస్సీ, ఎస్టీల విషయంలో అధికారికంగా గుర్తించిన జాబితాల ఆధారంగా క్రమబద్ధమైన వర్గీకరణకు అవకాశం ఉండగా, ఓబీసీలూ ఇతర కులాల విషయంలో మాత్రం వ్యక్తి చెప్పిన కులం పేరును ఓపెన్ టెక్స్ట్‌గా నమోదు చేసే విధానాన్ని ప్రతిపాదించారు. ఇది ఓబీసీలకు అన్యాయం చేసే కపట నాటకంగా కనిపిస్తున్నది. 2011 సామాజిక, ఆర్థిక కుల సర్వేలో 46 లక్షలకు పైగా వేర్వేరు కులాలు నమోదు కావడం ఇందుకు ఉదాహరణ. భారతదేశంలో 46 లక్షల కులాలు లేవు. ఒకే కులం వేర్వేరు పేర్లతో, ఉపకులాల పేర్లతో, ప్రాంతీయ పేర్లతో, సమానార్థక పేర్లతో నమోదు కావడంతో లెక్కలు విపరీతంగా చీలిపోయాయి.

ఈ సమస్య కేంద్ర ప్రభుత్వానికి తెలియదని అనుకోవడానికి లేదు. 2021లో సుప్రీంకోర్టుకు కేంద్రం స్వయంగా ఇదే సమస్యలను వివరించింది. గత అనుభవంలో ఏ లోపాలు వచ్చాయో ప్రభుత్వానికి తెలుసు. వాటికి పరిష్కారం ఏమిటో కూడా తెలుసు. సామాజిక వర్గం, కులం రెండింటినీ విడిగా నమోదు చేయాలి (బీసీ–యాదవ మాదిరి). రాష్ట్రాలవారీగా అధికారికంగా గుర్తించిన కుల జాబితాలను ఉపయోగించాలి. ఒకే కులానికి ఉన్న వేర్వేరు పేర్లు, ఉపకులాలు, ప్రాంతీయ పేర్లను ఒకే కోడ్ కింద నమోదు చేయాలి. జాబితాలో లేని పేర్లకే స్వేచ్ఛగా నమోదు చేసే అవకాశం (ఓపెన్ టెక్స్ట్‌గా) ఇవ్వాలి. ఓబీసీల కులాలను సరైన జాబితాలు, కోడ్‌లు లేకుండా నమోదు చేస్తే ఒకే కులం వేర్వేరు పేర్లతో చీలిపోవచ్చు. అప్పుడు ఆ కులం జనాభా, దాని సామాజిక స్థితి, విద్య, ఉద్యోగాల్లో దాని ప్రాతినిధ్యం స్పష్టంగా తేలవు. ఇది తర్వాత పెద్ద సమస్యగా మారుతుంది. రిజర్వేషన్లు, ప్రాతినిధ్యం, సంక్షేమ విధానాల విషయంలో కోర్టులు నమ్మదగిన గణాంకాలను కోరుతున్నాయి. కానీ ఈ కులగణన పద్ధతి ఆదిలోనే బలహీనంగా ఉంటే విశ్వసనీయమైన డేటా ఎలా వస్తుంది? అప్పుడు నష్టపోయేది ఓబీసీలే!


అందుకే కులగణన చేస్తామని కేంద్రం ప్రకటించడంతో ఓబీసీల పోరాటం ముగిసిపోలేదు. అసలైన రెండోదశ పోరాటం ఆవశ్యకత ఇప్పుడు ఎంతగానో ఉన్నది. కేవలం కులగణన జరగడం మాత్రమే కాదు. అది సరైన పద్ధతిలో సమగ్రంగా జరగాలి. ఎన్నికల సమయంలో ఓబీసీలను హిందూ ఐక్యత పేరుతో బీజేపీ తన రాజకీయ వ్యూహంలో భాగం చేస్తున్నది. కానీ అదే ఓబీసీలు విద్య, ఉద్యోగాలు, రిజర్వేషన్లు, అధికారంలో ప్రాతినిధ్యం, వనరుల్లో వాటా గురించి ప్రశ్నిస్తే మాత్రం కపటత్వంతో కూడిన కొత్త షరతులను ముందుకు తెస్తున్నది. ఓబీసీ రిజర్వేషన్ల ప్రయోజనాలు అన్ని వర్గాలకు సమానంగా అందుతున్నాయా, అత్యంత వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతోందా అన్నది పరిశీలించేందుకు రోహిణి కమిషన్‌ ఏర్పాటైంది. ఈ కమిషన్ తన నివేదికను 2023లో సమర్పించినా అది ఇప్పటికీ బహిరంగ చర్చకు రాలేదు. ఓబీసీలలో అంతర్గత అసమానతలపై ప్రభుత్వం స్వయంగా అధ్యయనం చేయించి ఆ ఫలితాలను ప్రజల ముందుకు తీసుకురాకపోవడం అనేక ప్రశ్నలకు, అనుమానాలకు దారితీస్తోంది. ఇంతకాలం కులగణన కోసం పోరాడిన ఓబీసీలు కేవలం జనాభా శాతం గణనతో సంతృప్తిచెంది మౌనంగా ఉంటే భవిష్యత్‌లో సామాజిక న్యాయం పొందలేరు. వారి సంఖ్య సరిగ్గా లెక్కించడంతోపాటు వారి సామాజిక, ఆర్థిక స్థితి దేశం ముందుకు స్పష్టంగా రావాలి. అప్పుడే ఆ గణాంకాల ఆధారంగా విద్య, ఉద్యోగాలు, ప్రాతినిధ్యం, అవకాశాల్లో తమ సముచిత వాటా, న్యాయం గురించి ఓబీసీలు నినదించగలుగుతారు. పోరాడి న్యాయం పొందగలుగుతారు.

- కె. రాజు

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితులు

Updated Date - Sep 19 , 2026 | 01:01 AM