ఈసారీ కుల లెక్కలు గట్టెక్కలేవా?
ABN , Publish Date - Aug 14 , 2026 | 03:45 AM
జరిగిన ఘటనలను పునరావృతం చేయాలని చాలా మంది అనుకుంటారు. ఆశించినట్లుగా వాటిని పునరావృతం చేయలేరు. అయినా ప్రయత్నాలను ఆపరు. మానవ ప్రవర్తనలో దీన్ని సహజమే అనుకోవచ్చు. వైఫల్యాలను పునరావృతం...
జరిగిన ఘటనలను పునరావృతం చేయాలని చాలా మంది అనుకుంటారు. ఆశించినట్లుగా వాటిని పునరావృతం చేయలేరు. అయినా ప్రయత్నాలను ఆపరు. మానవ ప్రవర్తనలో దీన్ని సహజమే అనుకోవచ్చు. వైఫల్యాలను పునరావృతం చేయాలని మనం ఎవ్వరమూ అనుకోం. కానీ కులాల లెక్కింపు విషయంలో మాత్రం ఇప్పుడు ఆ ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటివరకూ అనధికారికంగా వెల్లడైన సమాచారాన్ని పరిశీలిస్తే దీన్నంత తేలికగా కొట్టేయలేం. దేశంలో మంచు అధికంగా ఉండే ప్రాంతాల్లో రెండో దశ జనాభా లెక్కల ప్రక్రియ త్వరలో ప్రారంభం అవుతోంది. అక్కడ జనాభా సంఖ్యతో పాటు ఏ కులానికి చెందిన ప్రజలు ఎందరున్నారన్న సమాచారాన్ని కూడా సేకరించాలి. సెప్టెంబరు ఒకటి నుంచి లద్దాఖ్, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో కొన్ని ప్రాంతాల్లో ఇది జరగాలి. దాదాపు 15 రోజుల సమయమే ఇంకా మిగిలి ఉంది. ఇంతవరకూ కులాల సమాచారాన్ని ఏ విధంగా సేకరిస్తారన్న విషయాన్ని స్పష్టంచేస్తూ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. గతంలో ఎప్పుడూ ఇంత జాప్యం జరగలేదు. బహుశా ప్రక్రియ ప్రారంభానికి ముందు చాలా తక్కువ వ్యవధిలో దాన్ని జారీచేస్తే వివాదాలను బాగా పరిమితం చేయగలమన్న ఉద్దేశమే దానికి కారణం కావొచ్చు.
నోటిఫికేషన్ ఆలస్యం చేస్తున్నా జనాభాగణనలో పాల్గొనే సిబ్బందికి వివిధ అంశాలపై శిక్షణ ఇవ్వటం దాదాపుగా పూర్తయింది. శిక్షణ సందర్భంగా ఒక విషయాన్ని స్పష్టంచేశారు. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల (ఎస్సీ, ఎస్టీ) విషయంలో గతంలో చేసినట్టే ఆయా కులాల, తెగల సమాచారాన్ని సేకరిస్తారు. అంటే కేంద్ర ప్రభుత్వం గుర్తించిన రాష్ట్రాల వారీ ఎస్సీ, ఎస్టీ జాబితాను అనుసరించి ఎవరు ఏ కులానికి చెందితే అక్కడ వారి సమాచారాన్ని నమోదుచేస్తారు. తాము ఎస్సీ వర్గానికి చెందినవారమని ఒక కుటుంబం చెబితే ఆ వర్గంలో ఏ కులమో తెలుసుకుని ఫాంలో సంబంధిత బ్రాకెట్‌లో టిక్కు పెట్టుకుంటారు. ఎస్టీల విషయంలోనూ అదే చేస్తారు. మరి వెనుకబడిన కులాల (బీసీలు) విషయంలో దీన్నే చేస్తారా అంటే? ఇప్పటివరకూ వస్తున్న సమాచారం ప్రకారం అలా చేసే అవకాశం కనపడటం లేదు. కేంద్ర జాబితాలో బీసీ కులాల సంఖ్యకు, రాష్ట్రాల జాబితాలోని బీసీ కులాల సంఖ్యకు చాలా తేడా ఉంది. ఉదాహరణకు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం 133 కులాలను బీసీలుగా గుర్తిస్తే కేంద్ర జాబితాలో 90 కులాలు మాత్రమే ఉన్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం 346 కులాలను బీసీలుగా గుర్తిస్తే కేంద్రం మాత్రం 261నే పరిగణనలోకి తీసుకుంది. కాబట్టి తన జాబితా ప్రకారం బీసీల జనాభాను కులాల వారీగా గుర్తించటానికి కేంద్రానికి ఇబ్బందులు ఉన్నాయి. ఒకవేళ అలా చేస్తే కొన్ని వందల కులాలు ఆ జాబితాకు బయటే ఉండిపోతాయి. పోనీ రాష్ట్రాల వారీ బీసీల జాబితాను పరిగణనలోకి తీసుకుని వాటి ప్రకారం విడివిడి కులాల జనాభా లెక్కలను సేకరిస్తే వాళ్లందరినీ కేంద్ర బీసీ జాబితాలో చేర్చాలనే డిమాండు వెంటనే ఊపందుకుంటుంది. దాన్ని ఎదుర్కొని సమస్యను పరిష్కరించటానికి కేంద్రం సిద్ధంగా లేదు. బీసీల వర్గీకరణకు ఏర్పాటుచేసిన జస్టిస్ రోహిణి కమిషన్ ఇచ్చిన నివేదికకే ఇంతవరకూ అతీగతీ లేదు. 2017లో ఏర్పాటైన ఆ కమిషన్‌కు నివేదిక ఇవ్వటానికే ఆరేళ్లు పట్టింది. దాని సిఫార్సులు ఏమిటో ఇప్పటికీ బయటపెట్టలేదు. రిజర్వేషన్లకు బయట ఉన్న కులాలన్నిటినీ అగ్రకులాలే అనుకుంటే అవన్నీ వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు పేర్లతో ఉన్నాయి. అక్కడి ఎస్సీ, ఎస్టీ, బీసీ జాబితాలను పరిగణనలోకి తీసుకుని ప్రతి రాష్ట్రానికి నిర్దిష్టంగా అగ్రకుల జాబితానో, నాన్ రిజర్వేషన్ కేటగిరీ జాబితానో రూపొందించాలి. దీనికి కేంద్రం ఆమోదముద్ర వేయాలి. దానికీ ఇప్పటికిప్పుడు సిద్ధంగా లేదని తెలుస్తోంది.
ఈ సమస్యలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని గతాన్నే పునరావృతం చేయాలన్న నిర్ణయానికి కేంద్రం వచ్చినట్లు తెలుస్తోంది. 2011లో ఆనాటి యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) ప్రభుత్వం బీసీ జనాభా ఎంతో తేల్చాలన్న డిమాండుకు తలవొగ్గి సామాజిక, ఆర్థిక, కుల గణన (ఎస్‌ఈసీసీ)ను చేపట్టింది. ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబ పెద్దను తమ కులం ఏమిటో చెప్పాల్సిందిగా కోరింది. తమ కులం పేరు గురించి తాము ఏమనుకుంటున్నారో అదే పొల్లుపోకుండా వారు చెప్పారు. వారు ఏది చెబితే దాన్ని గణన సిబ్బంది రాసుకున్నారు. కొందరు ప్రధాన కులం పేరు చెప్పారు. మరికొందరు ఉపకులం పేరు చెప్పారు. కులానికి చెందిన ప్రాంతనామాన్ని చెప్పినవారూ ఉన్నారు. గోత్రాన్ని చెప్పటానికే కొందరు పరిమితమయ్యారు. చాలామంది తాము ఫలానా వారమని ఇంటిపేర్లు చెప్పారు. ఇట్లా ప్రజలు ఏది చెబితే దాన్ని నమోదుచేసుకున్నారు. వాటన్నిటినీ పరిశీలిస్తే 45 లక్షల పైచిలుకు పేర్లు వచ్చాయి. ఇవన్నీ మీ కులం ఏమిటి? అన్న సాధారణ ప్రశ్నకు వచ్చిన స్పందనలు. ఇట్లా ఎందుకు నమోదు చేసారంటే, ప్రజలు తమ కులం గురించి తాము చెప్పుకున్న దాన్నే ప్రామాణికంగా తీసుకోవాలనీ, మీది ఫలానా కులమని చెప్పాలని ప్రభుత్వం వారిని బలవంతం చేయలేదనీ సమర్థించుకున్నారు. ప్రజలు చెప్పినదాన్ని యథాతథంగా నమోదుచేస్తే చిక్కులు రావా? అన్న ప్రశ్న ఆనాడూ వచ్చింది. ఆ చిక్కులను విడదీసి ప్రామాణికంగా కులాల లెక్కలను తేల్చటానికి నిపుణుల కమిటీని వేయాలని కూడా నిర్ణయించుకున్నారు. అట్లా ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ పనగారియ సారథ్యంలో (2015 జూలై) కమిటీని వేశారు. పార్లమెంటులో అడిగిన ఒక ప్రశ్నకు జవాబిస్తూ పనగారియా కమిటీ దాదాపుగా తనకు అప్పగించిన పనిని పూర్తిచేసిందని కేంద్ర ప్రభుత్వం సమాధానం కూడా ఇచ్చింది. ఇంతగా ఊరించి చివరికి 45 లక్షల పైచిలుకు పేర్లు ఎందుకూ పనికిరావని స్వయంగా సుప్రీంకోర్టుకు కేంద్రం తెలియచేసింది. ప్రజలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రామాణిక కులాల జాబితాను తయారుచేయలేమనీ కనీసం బీసీల సంఖ్యను కూడా తేల్చలేమని ఒక అఫిడవిట్‌ను సమర్పించింది. తమ దగ్గర ఉన్న జాబితా తప్పులతడక అని కేంద్రమే స్వయంగా చెప్పటంతో ఎస్‌ఈసీసీ నివేదిక కావాలని మహారాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రూ. 5,000 కోట్లకు పైగా ఖర్చుపెట్టి చేసిన దేశవ్యాప్త కులగణన ఎందుకూ పనికిరాకుండా పోయింది. అయితే కులాన్ని మినహాయించి ఆర్థిక, సామాజిక పరిస్థితులపై ఎస్‌ఈసీసీలో లభ్యమైన సమాచారం.. ప్రభుత్వ పథకాల అమలుకు బాగా పనికివస్తుందని పేర్కొంటూ దాన్ని అందరికీ అందుబాటులో ఉంచింది. ప్రజలు తమ కులం ఏదో తమంతట తాము చెప్పేదాన్నే పరిగణనలోకి తీసుకోవటం వల్ల ఎస్‌ఈసీసీ విఫలమైందని గట్టిగా వాదించిన కేంద్రం మరి ఇప్పుడు అదే విధానాన్ని ఎందుకు అవలంబిస్తోందన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. కృత్రిమమేధతో పాటు సంక్లిష్ట సమాచారాన్ని విశ్లేషించటానికి ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఆ తరహా చిక్కుముడుల నుంచీ గట్టెక్కుతామని కేంద్ర అధికారులు చెబుతున్నారు.
భవిష్యత్తులో చిక్కుముడులు వీడతాయా? చరిత్ర పునరావృతం అవుతుందా? అన్నది సాంకేతిక పరిజ్ఞానంపైనే ఆధారపడి ఉండదు. రాజకీయ ప్రయోజనాలే సమాచార విశ్లేషణలను నిర్దేశిస్తాయి. కులగణను చాలా కాలం బీజేపీతో పాటు ఆరెస్సెస్ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి కులగణననూ, ఆయా కులాల జనాభా సంఖ్యకు అనుగుణంగా రిజర్వేషన్లు ఉండాలనే డిమాండ్లనూ కాంగ్రెస్ పార్టీ బలంగా ముందుకు తేవటంతో బీజేపీ దృక్పథంలో మార్పు వచ్చింది. అనూహ్యంగానే కేంద్ర మంత్రివర్గం జనాభా లెక్కలతో పాటు కులగణనను కూడా చేపట్టాలని నిర్ణయించింది. అంతకుముందు కేరళలో జరిగిన ఆరెస్సెస్ సమావేశంలో కూడా కులగణనపై సాగిన సానుకూల చర్చలూ అందుకు దోహదం చేశాయి. హిందూత్వ భావన పునాదిగా ప్రజల్లో ఏకీకరణ రావటానికి కులాలు అడ్డంకిగా ఉన్నాయన్న అంచనా ఆరెస్సెస్‌లో ఒకప్పుడు బలంగా ఉండేది. కులంపోవాలి.. మతం మిగలాలి.. ప్రజల మధ్య సాంస్కృతిక ఐక్యత మతం ఆధారంగా జరగాలి.. అన్నదే సంఘ్ పరివార్ సిద్ధాంత భూమికగా చలామణి అయింది. దీనికి భిన్నంగా ఏ విశ్లేషణ వచ్చినా, ఏ సమాచారం ఉన్నా దాన్ని హిందువుల ఏకీకరణకు అడ్డంకిగానే భావించింది. మరిప్పుడు కుల లెక్కలు ఆ ఏకీకరణకు ఇబ్బందిగా మారటాన్ని అంత తేలికగా తీసుకోకపోవచ్చు. మార్గాంతరాలనూ అన్వేషించవచ్చు. జనాభా లెక్కలు వచ్చే ఏడాది చివరినాటికి తేలినా కుల లెక్కలు మాత్రం అంత తొందరగా బయటకు రావు. రాజకీయంగా ఎన్నో సమీకరణాలను పరిశీలించిన తర్వాతే అవి ఏ రూపంలో వస్తాయన్నది నిర్ణయం అవుతుంది. బిహార్, తెలంగాణల్లో జరిపిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, కులగణన సర్వేల్లో విడివిడిగా కులాల లెక్కలను సేకరించారు. బిహార్ ప్రభుత్వం సర్వే పూర్తయిన వెంటనే కులాల లెక్కలను బయటపెట్టింది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల వారీగా లెక్కలను ప్రకటించి విడివిడి కులాల సమాచారాన్ని చాలా కాలం గోప్యంగా ఉంచింది. బీజేపీకి వ్యతిరేకంగా ఢిల్లీ కేంద్రంగా జరిపిన రాజకీయపోరాటంలో ఒక ప్రచార ఆయుధంగానే ఆ తర్వాత వాటిని ప్రజల ముందు ఉంచింది. తెలంగాణ ప్రభుత్వం అనుసరించినట్లే కేంద్రం కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ లెక్కల ప్రకటనకే కొంతకాలం పరిమితమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు.
కృత్రిమ మేధను ఉపయోగించి కులాల లెక్కల చిక్కులను విప్పినా కలిగే ప్రయోజనం ఏమిటో కచ్చితంగా చెప్పలేం. ప్రతి కులానికి సంబంధించిన సామాజిక ఆర్థిక పరిస్థితిని మదింపువేయకుండా స్థూల లెక్కలను ఇవ్వటం ద్వారా అసలు పరిస్థితి తెలియదు. ప్రభుత్వ–ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు, భూములు, ఇతర కీలక ఆస్తులపరంగా ఏ కులం ఎక్కడుందో తేల్చకుండా కేవలం కుల శాతాలు ఇవ్వటం వల్ల సాధించేదేమీ ఉండదు. అలాగే ఒక కులంలో ఆర్థిక అంతరాలను అంచనా వేయకుండా అసమానతల స్థాయి అర్థంకాదు. విచిత్రం ఏమిటంటే ‘మేమెంతో మాకంత కావాలి’ అనే నినాదంతో జనాభాను బట్టి పదవులూ ఉద్యోగాలూ ఉండాలని డిమాండు చేసేవారు కూడా లోతైన ఆర్థిక వివరాలను గట్టిగా కోరుకోవటం లేదు. సామాజిక పరిస్థితిని తీవ్రంగా కలగాపులగం చేస్తున్న ఆర్థిక అంతరాలపై ఎక్కువ దృష్టిపెడితే కులాల చుట్టూ తిప్పుతున్న రాజకీయాలను కూడా చాలా మార్చుకోవల్సి వస్తుంది. అందుకు సిద్ధంగా లేకపోవటంతో ప్రత్యామ్నాయ రాజకీయాలు అనేవి కూడా ఒకస్థాయి దాటి ముందుకు వెళ్లటం లేదు. ఈ నేపథ్యంలోనే కేవలం కులాల శాతాలు ఇవ్వటం వల్ల ఇబ్బందేమీ లేదన్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చి ఉండొచ్చు. అయితే వాటినైనా ఇవ్వగలుగుతుందా? కులాల చిక్కుముడులు విప్పలేని ఎస్‌ఈసీసీ చరిత్ర పునరావృతం చేస్తుందా? అన్నది ఇప్పటికీ సశేషమే!
రాహుల్ కుమార్
(ఆంధ్రజ్యోతి ఎడిటర్)
ఇవి కూడా చదవండి..
మావోయిస్టు క్యాంప్ నుంచి మోడలింగ్ ర్యాంప్ వరకు.. మారిన మాజీ మహిళా నక్సల్స్ జీవితాలు..
మీరు చేయలేకపోతే మేమే చేస్తాం.. లేబుల్స్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు హెచ్చరిక..