Share News

నైతికతకు మతం సరిపోదా?

ABN , Publish Date - Jul 03 , 2026 | 01:01 AM

మానవజీవితంలో మతం పాత్ర గురించి ఘనంగా చెప్పి రాజకీయాలను దాని చుట్టూ తిప్పేవారికి సవాళ్లు బయటి నుంచి కంటే లోపల నుంచే ఎక్కువగా వస్తాయి. అయోధ్య రామాలయ నిధుల దుర్వినియోగ వ్యవహారమే...

నైతికతకు మతం సరిపోదా?

మానవజీవితంలో మతం పాత్ర గురించి ఘనంగా చెప్పి రాజకీయాలను దాని చుట్టూ తిప్పేవారికి సవాళ్లు బయటి నుంచి కంటే లోపల నుంచే ఎక్కువగా వస్తాయి. అయోధ్య రామాలయ నిధుల దుర్వినియోగ వ్యవహారమే ఇందుకు నిదర్శనం. దేశ రాజకీయాలను మత ఆలోచనలతో విపరీతంగా ప్రభావితం చేసిన రామాలయ ఉద్యమం చివరికి అవినీతిలో ఇంతగా చిక్కుకుపోతుందని ఎవరూ ఊహించలేదు. దశాబ్దాల ఆందోళనలు, వివాదాల అనంతరం సుప్రీంకోర్టు తీర్పుతో ఆలయ నిర్మాణానికి మార్గం సుగమమైన తర్వాత కేంద్ర ప్రభుత్వం అవినీతికి ఆస్కారం లేకుండా సమగ్ర ఏర్పాట్లు చేస్తుందని భక్తకోటి విశ్వసించింది. వందల వేలకోట్ల ఆదాయం వచ్చే ఆలయాల నిర్వహణపై కట్టుదిట్టమైన చట్టపరమైన ఏర్పాట్లు లేకపోతే పరిస్థితి ఏమవుతుందనటానికి రామాలయ వ్యవహారానికి మించిన ఉదాహరణ మరొకటి ఉండదు. ఆలయాలపై ప్రభుత్వాల పర్యవేక్షణ ఉండకూడదని వాదించే వారికి ఇప్పుడు ఎటూ పాలుపోవటం లేదు. రామాలయ నిధుల దుర్వినియోగంపై కొన్ని నెలలకైనా ఏదోవిధంగా దర్యాప్తు పూర్తి అవుతుంది. దోషులుగా తేలిన వారికి ఏదోరకమైన శిక్షలూ పడతాయి. అంతటితో ఈ సమస్య ముగిసిపోతుంది. కేంద్రంతో పాటు యూపీ ప్రభుత్వం కూడా చట్టపరంగా చేయగలిగినదంతా చేసి నైతిక ధర్మాన్ని నిలబెట్టామని గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ నైతికధర్మం, నైతిక ప్రవర్తనలో మనం చాలా దిగజారిపోతున్నామని గుర్తించటానికి రామాలయ నిధుల దుర్వినియోగం ఒక సందర్భాన్ని సమకూర్చుతోంది.

మతంతోనే మానవజీవితంలో నైతికత పుట్టలేదు. మనుషులు మనుగడకోసమే నైతిక నియమాలను ఏర్పరచుకున్నారు. రాతకోతలు తెలియని, మతగ్రంథాల్లేని వేల ఏళ్ల నాటి ఆదిమసమాజాల్లో కూడా మంచిచెడులను నిర్దేశించే నైతిక నియమాలు ఉన్నాయి. మతాలు పుట్టి వ్యవస్థీకృతం అయిన తర్వాత నైతిక నియమాలను దేవుళ్లే నిర్దేశించారనీ, వాటిని ఉల్లంఘించే వారిని ఇహలోకంలోనూ పరలోకంలోనూ కఠినంగా శిక్షిస్తారనే భావాలకు చాలా ప్రాధాన్యం వచ్చింది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని హిందూమతం అవిచ్ఛిన్నంగా బలంగా కొనసాగుతోందని మనం ఎంతైనా చెప్పుకోవచ్చు. కానీ అది నైతికతనూ, చట్టబద్ధ నడవడినీ ప్రజల్లో నెలకొల్పేవిధంగా ప్రేరేపిస్తోందా? అంటే గట్టిగా చెప్పలేం. మతనమ్మకాలనూ విధులనూ నిష్ఠగా ఆచరించటానికీ రోజువారీ జీవితంలో నైతికప్రవర్తనకూ మధ్య లంకె కుదరటం లేదు. 1982లో ప్రముఖ రచయిత, చరిత్రకారుడు, పాత్రికేయుడైన కుష్వంత్‌ సింగ్‌ ‘ఉయ్‌ ఇండియన్స్‌’ అనే పుస్తకాన్ని రాశారు. అప్పటికే ఆయన మతానికీ నైతిక ప్రవర్తనకూ మధ్య సంబంధం ఎంత బలహీనంగా మారిపోయిందో స్పష్టంగా తెలిపారు. మతానికి కేంద్రంగా ఉండాల్సిన నైతికత ఆచరణలో తొలగిపోయిందనీ దాని స్థానంలో వట్టి ఆచారాలు, సంప్రదాయాలు మాత్రమే మిగిలిపోయాయనీ వ్యాఖ్యానించారు. కులవ్యవస్థలో ప్రజలు ఒదిగి ఉండటానికి, గోసంరక్షణలాంటి విషయాలకు ప్రాధాన్యం ఇవ్వటానికి మాత్రమే మతం పరిమితం అయిపోతోందనీ విమర్శించారు.


పూజలు చేయటం, దేవాలయాలకు వెళ్లటం, ఉపవాసాలు పాటించటం, తీర్థయాత్రలకు తరలిపోవటం, శుభముహూర్తాలను ఆచరించటం కంటే నైతికవర్తనకు ఎక్కువగా మతం దోహదం చేయాలనీ, కానీ అదెక్కడా కనపడటం లేదని ఘాటుగా విమర్శించారు. మతానికీ నైతికతకూ ఉండాల్సిన సంబంధం గురించి కుష్వంత్‌సింగ్‌ ఒక్కరే చెప్పలేదు. ఆధునిక సామాజికశాస్త్రానికి ఆద్యుడుగా భావించే మాక్స్‌వెబర్‌ కూడా నైతికతకూ సమాజ అభివృద్ధికి మధ్య సంబంధాన్ని విశ్లేషించారు. శ్రామిక వృత్తులను పవిత్రమైనవిగా భావించటంతో పాటు కష్టపడి పనిచేయటాన్ని దేవుడికి సేవ చేసినట్లుగా పరిగణించటం, సమయపాలన, పొదుపు, ఒప్పందాలను గౌరవించటం లాంటివి ప్రొటెస్టంట్‌ మతంలో ప్రధాన నైతిక అంశాలుగా ఉన్నాయనీ, అవే పాశ్చాత్య దేశాల అభివృద్ధికి చోదకశక్తులుగా పనిచేశాయనీ వెబర్‌ సూత్రీకరించారు. దీంతో అందరూ ఏకీభవించకపోవచ్చు. కొన్ని ఆసియా దేశాల్లో కూడా ఇవి ఉన్నాయనీ వాదించొచ్చు. కానీ వృత్తులను తక్కువగా చూడటం, శ్రమచేసే వారిని హీనంగా పరిగణించటం మన సమాజంలో ఇప్పటికీ ఉంది. ఇదెంతగా గతంలో మన అభివృద్ధిని కుంగదీసిందో లోతుగా పరిశోధిస్తే గానీ పూర్తి నిజాలు తెలియవు. రాజ్యవంశాల ఘనతలను చెప్పుకోవటానికీ, ప్రజాస్వామ్యం మొదలుకుని అన్నిటికి మనమే ఆద్యులమని ప్రకటనలు చేయటానికీ చరిత్ర రచనను పరిమితం చేయాలని మనం గట్టిగా ప్రయత్నిస్తున్నాం. పాఠ్యపుస్తకాలను అటువంటి చరిత్రతో నింపటానికే కసరత్తులు జరుగుతున్నాయి. తమ శ్రమతో, నైపుణ్యంతో సమాజం నడవటానికి కారణమైన వారికంటే పైవర్గాలకు పెద్దపీటవేసి వాళ్లకే విగ్రహపూజలు చేయటం మనకు అలవాటు. అదిప్పుడు ఇంకా ఎక్కువవుతోంది.

అనైతిక ప్రవర్తనలను కట్టడిచేసే పదునును మతం కోల్పోతున్న దృశ్యం మనకు అడుగడుగునా కనపడుతుంది. ప్రతి పాపానికీ పరిహారం ఉంటుందనే ఆలోచన నైతికతను నిలదొక్కుకోనీయదు. ఘోరాలనూ నేరాలనూ రకరకాల ప్రాయశ్చిత్తాలతో కడిగేసుకుందామనే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అందుకే మనం అవినీతిని తగ్గించలేక పోతున్నాం. మన చట్టాలు ఘనంగా ఉంటాయి. హీనంగా అమలవుతాయి. ప్రపంచ దేశాల్లోని అవినీతిని అంచనా వేసే ‘ట్రాన్సపరన్సీ ఇంటర్‌నేషనల్‌’ అంచనాల ప్రకారం మన దేశంలో నైతికత ఏ మాత్రం మెరుగవ్వటం లేదు. 2016లో భారత్‌ ర్యాంకు 79 ఉంటే 2025 నాటికి అది 91కి పెరిగింది. ఓటర్లకు డబ్బులను పంచటంలో మనం ఎవ్వరికీ అందనంత స్థాయిలోకి వెళ్లిపోతున్నాం. ఎన్నికలప్పుడు ఒక్కో కుటుంబానికి వేల రూపాయలు చెల్లించటం దక్షిణాది రాష్ట్రాల్లో సర్వసాధారణమైంది. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో లక్ష నుంచి లక్షా ముప్పయి అయిదు వేల కోట్ల రూపాయలను ఖర్చుపెట్టినట్లు అంచనాలు ఉన్నాయి. ఇందులో అధికారికంగా, చట్టబద్ధంగా ఖర్చుపెట్టింది 10శాతం లోపుగానే ఉంటుంది. మిగతాదంతా అనైతికంగా ఖర్చుపెట్టిందే. ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ ఇంతగా ఎన్నికలపై అక్రమ ధనప్రభావం లేదు. అవినీతి సర్వవ్యాప్తం అవ్వటంతో అక్కడక్కడా నీతిగా వ్యవహరించే ఉద్యోగులనూ, పద్ధతి ప్రకారం పన్నులుకట్టే వ్యాపారులనూ, పారిశ్రామికవేత్తలనూ అనుమాన దృష్టితో చూడటమే కాదు.. వాళ్లను అబద్ధాలకోరులుగా భావించటమూ జరుగుతోంది. నిజాయితీగా వ్యవహరించేవారు.. మేం అలా ఉన్నామని.. అవసరార్థం ఎక్కడైనా చెప్పుకోవటం కూడా ఇబ్బందిగా మారటం కంటే దురవస్థ మరొకటి ఉండదు.


ట్రాన్సపరన్సీ ఇంటర్‌నేషనల్‌ లాంటివి పరిమిత సమాచారంతోనే అవినీతిపై ర్యాంకులు ఇస్తున్నాయి. అన్ని రంగాల్లో అవినీతినీ దానివల్ల పోగుపడిన నల్లధనాన్నీ అంచనా కట్టటం కూడా అంత తేలికగా వీలుకావటం లేదు. 2016లో ఆర్భాటంగా చేసిన నోట్ల రద్దు అవినీతిపై ఎలాంటి ప్రభావం చూపించలేదు. ఆర్థికవ్యవస్థను ఒడుదుడుకులకు గురిచేసి ప్రజలను ఇబ్బందుల పాలుచేయటం కంటే సాధించింది ఏమీ లేదు. 1985 నాటికే దేశంలో నల్లధనం జీడీపీ (దేశీయ స్థూల ఉత్పత్తి)లో 15 నుంచి 21శాతానికి సమానంగా ఉంటుందని అంచనాలు వచ్చాయి. 2000 నాటికి అది 23 నుంచి 26శాతానికి చేరుకుంది. ప్రముఖ ఆర్థికవేత్త అరుణ్‌కుమార్‌ అంచనాల ప్రకారం 2012–13 నాటికి అది జీడీపీలో 62శాతానికి సమానంగా ఉంది. అప్పుడు జీడీపీ రూ.93 లక్షల కోట్ల రూపాయలు. అంటే 57 లక్షల కోట్లు నల్లధనం రూపంలో ఉంది. 2025–26లో మన జీడీపీ రూ.323 లక్షల కోట్లు. అరుణ్‌కుమార్‌ అంచనాల ప్రకారం నల్లధనాన్ని లెక్కకడితే అది రూ.200 లక్షల కోట్లు అవుతుంది. నల్లధనం అంటే డబ్బురూపంలో ఉండేదే కాదు. నిజానికి డబ్బురూపంలో ఉండేది చాలా తక్కువ. భూములు, బంగారం, బినామీ ఆస్తులు, షెల్‌కంపెనీలు, విదేశాల్లోని ఆస్తులు లాంటి ఎన్నోరూపాల్లో అది ఉంటుంది.

మతం నైతిక ప్రవర్తనకు తోడ్పడకపోతే జరిగే అనర్థం అంతా ఇంతాకాదు. సమాజంలో లౌకిక, హేతువాద, ఆధునికతత్వ భావాలున్నా, వాటి ఆధారంగా నైతిక ప్రవర్తనతో వ్యవహరించే వారి సంఖ్య చాలా స్వల్పం. మతనమ్మకాలే అత్యధికులను ప్రభావితం చేస్తున్నాయి. ఆ నమ్మకాల్లో నుంచి వచ్చే పాపపుణ్యాల వివేచనా, ధర్మాధర్మ విచక్షణ.. మన నైతికతను బలోపేతం చేయలేకపోతే ఆలయాలు, మసీదులు, చర్చిలు అవినీతికి ఆలవాలంగా మారిపోతాయి. అయోధ్య రామాలయంలో నిధులను మింగేసిన వారికి దైవభక్తి నిండుగా ఉన్నా పాపపుణ్యాలనూ నైతికతనూ వదిలేశారు. ఇప్పటి ప్రభుత్వాలు పోటీలుపడి గుడులు, గోశాల అభివృద్ధికి నిధులు ఖర్చుపెడుతున్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ నిధులను మతకార్యక్రమాలకు వాడాలంటే ఒక బెదురు ఉండేది. ఇప్పుడదేమీ లేదు. పన్నుల నుంచి వచ్చే ఆదాయం నుంచి వందల కోట్లను అలవోకగా ఖర్చుపెట్టేస్తున్నారు. ఇతర మతాల వారూ మాకూ అలా భారీగా నిధులు కేటాయించాలని కోరితే ఏంచేస్తారో తెలియదు. అసలు లౌకిక రాజ్యాంగపాలనలో ఇలా ఖర్చుపెట్టటం సబబా? కాదా? అన్న ఆలోచన చేయటాన్నే పాలకులు మర్చిపోతున్నారు. కోర్టులూ వాటిని పట్టించుకోవటం లేదు. ఒకప్పుడు రాజులు, నవాబులు తాము తలచినదే తడవుగా ఆలయాలు, మసీదుల నిర్మాణాలకు పూనుకొనేవారు. ప్రజాస్వామ్యంలోనూ మళ్లీ ఆ పోకడలు కనపడుతున్నాయి.


ధర్మార్థకామమోక్షాలను సమతూకంలో పాటించటం అనేది హిందూమతసారంగా చెప్పటాన్ని చాలా తరచుగా మనం వింటాం. అర్థం (ధనార్జన) కోసం నైతిక ధర్మాన్ని వదలివేయటం ఇప్పుడు తేలికగా జరిగిపోతోంది. నైతికతను పెంచే రీతిలో మతం ఎందుకు వ్యవహరించలేకపోతోందని ప్రశ్న వేసుకుని విరుగుడు చర్యలకు ఉపక్రమించకపోతే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. అన్ని మతాల్లో మంచిని పెంచేవీ తుంచేవీ రెండూ ఉంటాయి. నైతిక ప్రవర్తనకు దోహదం చేయని వాటిని వదలివేయలేని అశక్తత చివరికి సమాజాన్ని కుంగదీస్తుంది. ఆర్థికాభివృద్ధిని మందగింపజేస్తుంది. మతం మహోన్నత శక్తిగా కొనసాగాలనుకునేవారు ఈ దిశగా ఆలోచించటం కనీస కర్తవ్యంగా పరిగణించాలి. నైతికతను పెంపొందించనిది అది మతమైనా, మరోతత్వమైనా ఎప్పటికీ మహోన్నతమైంది కాదు. మత ఉద్రేకాలతో ఓట్లను పొందటం తేలికే కావచ్చు. ఒక మత వర్గంపై ద్వేషం ఆత్మానందాన్ని ఇవ్చొచ్చు. కానీ నైతికతను పెంచేరీతిలో మతాన్ని మలచటమే అసలుసిసలైన సవాల్‌. ఆ శక్తి ఇప్పటి మతంలో లేకపోతే నైతికతను పెంచే కొత్త భావాలనైనా ఆహ్వానించాలి. మధ్యేమార్గం ఉందని అనుకోలేం! విశ్వాసాల పాటింపులో నిష్ఠత–నైతికవర్తనలో అనిష్ఠతను మించిన ప్రమాదం మరొకటి లేదు! ద్వంద్వ ప్రమాణాలతో విశ్వగురు పీఠాన్ని పొందలేం!

రాహుల్ కుమార్

(ఆంధ్రజ్యోతి ఎడిటర్‌)

ఇవి కూడా చదవండి

టీ తాగడం మంచిదే.. కానీ ఈ 6 పొరపాట్లు చేస్తే సమస్యలు తప్పవు

కోళ్లు అరుస్తున్నాయని వెళ్లి చూస్తే.. మృత్యువు వెంటాడింది

Updated Date - Jul 03 , 2026 | 01:01 AM