పోలవరం అక్రమాలపై కాగ్ చివాట్లు!
ABN , Publish Date - Mar 17 , 2026 | 02:36 AM
పోలవరం ప్రాజెక్టు అక్రమాలకు అడ్డాగా మారిందని చెబుతూ గత ప్రభుత్వ పనితీరును అద్దంలో చూపెట్టింది కాగ్. ఈ ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వంలో జరిగిన పరిణామాలను, ప్రాజెక్ట్ జాప్యానికి గల...
పోలవరం ప్రాజెక్టు అక్రమాలకు అడ్డాగా మారిందని చెబుతూ గత ప్రభుత్వ పనితీరును అద్దంలో చూపెట్టింది కాగ్. ఈ ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వంలో జరిగిన పరిణామాలను, ప్రాజెక్ట్ జాప్యానికి గల కారణాలను, ఆర్థిక అంశాలను కాగ్ నివేదిక క్షుణ్ణంగా విశ్లేషించింది. మూర్ఖత్వం, మొండితనం, మోసకారి తనంతో ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ప్రాణప్రదమైన బహుళార్థ సాధక ప్రాజెక్టును బలితీసుకున్న విధానాన్ని, జగన్ ప్రభుత్వ చేతకానితనాన్ని కాగ్ కడిగి పారేసింది. పోలవరం ప్రాజెక్టులో అత్యంత వివాదాస్పద అంశం రివర్స్ టెండరింగ్. 2019లో అప్పటి ప్రభుత్వం పాత కాంట్రాక్టులను రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలవడం వల్ల ఖజానాకు ఆశించిన స్థాయిలో భారీ పొదుపు జరగకపోగా, పనులలో తీవ్ర జాప్యం జరిగిందని కాగ్ అభిప్రాయపడింది. కొత్త కాంట్రాక్టర్లను నియమించే ప్రక్రియలో జరిగిన కాలయాపన వల్ల ప్రాజెక్ట్ అంచనా వ్యయం భారీగా పెరిగిందని పేర్కొంది.
ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం, అప్పర్–లోయర్ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేయకుండా వదిలేయడం వల్ల డయాఫ్రమ్ వాల్‌ను వరద నీటి ప్రవాహం దెబ్బతీసిందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. దీనివల్ల ప్రభుత్వానికి వందల కోట్ల అదనపు భారం పడటమే కాకుండా, ప్రాజెక్ట్ నిర్మాణం కొన్ని ఏళ్లు వెనక్కి పోయిందని విశ్లేషించింది. నిధుల మళ్ళింపు, అంచనాల పెంపు, పనుల్లో జాప్యం, నిబంధనల ప్రకారం ప్రాజెక్టు పనులకే వాడాల్సిన సొమ్మును పక్కదారి పట్టించడం వంటి వాటి వల్ల పనుల వేగం తగ్గిందని స్పష్టం చేసింది. రూ.400 కోట్లకు పైగా నిధులను ఇతర పథకాలకు వినియోగించారని పేర్కొన్నది. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయకపోవడం వల్ల వడ్డీ భారం, ముడిసరుకుల ధరలు పెరిగి ప్రాజెక్టు భారం పెరిగిందని, ముందస్తు ప్రణాళిక లేకుండా డిజైన్లను మార్చడం వల్ల ప్రజాధనం వృథా అయిందని, కాంట్రాక్టుల కేటాయింపులో పారదర్శకత లోపించిందని కాగ్ వేలెత్తి చూపింది. ముంపు బాధితులకు అందాల్సిన పునరావాస ప్యాకేజీ అమలులో తీవ్ర జాప్యం జరిగిందని చివాట్లు పెట్టింది.
గైడ్ బండ్ నిర్మాణానికి ముందు పునాది స్థిరత్వాన్ని సరిగ్గా అంచనా వేయలేదని కాగ్ పేర్కొంది. నేల స్వభావాన్ని పరిగణనలోకి తీసుకోకుండా నిర్మాణం చేపట్టడం వల్లనే అది కుంగిపోయిందని, సెంట్రల్ వాటర్ కమిషన్ ఆమోదించిన డిజైన్ల ప్రకారం పనులు జరగలేదని, క్షేత్రస్థాయి పరిస్థితులకు తగ్గట్టుగా మార్పులు చేయడంలో వైఫల్యం చెందారని వెల్లడించింది. ముఖ్యంగా ఎడమ గైడ్ బండ్ వద్ద తలెత్తిన సమస్యలు ప్రాజెక్టు భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. గైడ్ బండ్ కుంగిపోవడం వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చడానికి అదనపు నిధులు వెచ్చించాల్సి రావడంపై కాగ్ అసహనం వ్యక్తం చేసింది. పర్యవేక్షణలో లోపాల వల్ల ప్రభుత్వ ఖజానాపై అనవసర భారం పడిందని స్పష్టం చేసింది.
పోలవరం నిర్మాణంపై జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో ఏనాడూ అంకితభావం కనబరచలేదు. పోలవరం టెండర్ల రద్దును అత్యంత దుఃఖకరమైన విషయంగా లోక్‌సభలో కేంద్ర జలశక్తి మంత్రి అభివర్ణించారు. 2019 జూన్ నాటి అధికారిక నివేదిక ప్రకారం– మొత్తం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో అప్పటికి 71.2శాతం పూర్తయ్యాయి. 2023 మే 31 నాటికి అవి 79.61శాతానికి చేరాయి. అంటే జగన్ హయాంలో 8.4శాతం పనులే జరిగాయి. నిర్వాసితులకు పునరావాస కల్పనలోనూ పురోగతి పెద్దగా లేదు. అనుకున్నట్టుగా పోలవరం పూర్తయితే 7.2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చేది, 23.5 లక్షల ఎకరాలు స్థిరీకరణ జరిగేది. ౨8.5 లక్షల మంది దాహార్తి తీరేది. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత. కాగ్ సూచించిన విధంగా ఆడిట్ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, భవిష్యత్తులోనైనా పారదర్శకమైన విధానాలను అవలంబించాలి.
నీరుకొండ ప్రసాద్
ఇవి కూడా చదవండి..
ఆటో డ్రైవర్ అని తేలిగ్గా చూడకండి.. ఇతడు ఒక్క రోజులో ఎంత సంపాదిస్తాడో తెలిస్తే..
మీవి డేగ కళ్లు అయితే.. ఈ ఫొటోలో జింక ఎక్కడ దాక్కుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..