Share News

బ్రెజిల్‌ భరోసా..!

ABN , Publish Date - Oct 28 , 2026 | 12:02 AM

బ్రెజిల్‌ అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష లూలా మరోమారు ఎన్నిక కావడం, డోనాల్డ్‌ ట్రంప్‌ అనుకూల ఫ్లేవియో బొల్సనారో ఓడిపోవడం లాటిన్‌ అమెరికాలో మితవాదం దూకుడుకు ఓ అడ్డుకట్ట.

బ్రెజిల్‌ భరోసా..!

బ్రెజిల్‌ అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష లూలా మరోమారు ఎన్నిక కావడం, డోనాల్డ్‌ ట్రంప్‌ అనుకూల ఫ్లేవియో బొల్సనారో ఓడిపోవడం లాటిన్‌ అమెరికాలో మితవాదం దూకుడుకు ఓ అడ్డుకట్ట. సుమారు మూడున్నరశాతం ఓట్లతేడాతో ప్రత్యర్థిమీద విజయం సాధించి, ౮0 ఏళ్ళ వయసులో నాలుగోసారి లూలా దేశాధ్యక్షుడైనారు. మొదటి విడత పోలింగ్‌లో రెండుశాతం ఆధిక్యంలో ఉంటూ, పలుసర్వేలు విజేతగా భావించిన జూనియర్‌ బొల్సనారో పోలింగ్‌శాతం బాగా హెచ్చిన రెండోరౌండ్‌లో గణనీయంగా ఓట్లు తగ్గి ఓటమిపాలైనారు. ప్రమాదం ముంచుకొస్తున్నదని బ్రెజిల్‌వాసులు గ్రహించినందునే ఆఖరుక్షణంలో ఈ మార్పు సాధ్యమైందని వామపక్ష విశ్లేషకులు అంటున్నారు. బొల్సనారో మాత్రం ఈ ఫలితాలను అనూహ్యం, అక్రమం అంటూ ఎన్నిక రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. ఫ్లావియో తండ్రి జైర్‌ బొల్సనారో కూడా నాలుగేళ్ళక్రితం లూలా విజయాన్ని ఇలాగే గుర్తించ నిరాకరించి, ఆ తరువాత ట్రంప్‌ తరహాలో తిరుగుబాటును ప్రోత్సహించి ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్నారు. లూలా తిరిగి ఎన్నిక కావడం కంటే లాటిన్‌ అమెరికాలో అతిపెద్ద ప్రజాస్వామ్యదేశమైన బ్రెజిల్‌లో ట్రంప్‌ ఓడిపోవడం ప్రపంచవ్యాప్త వామపక్ష సానుభూతిపరులకు అధిక సంతృప్తినిస్తోంది.


లాటిన్‌ అమెరికా దేశాల్లో మితవాదశక్తులు పుంజుకుంటున్న కాలంలో, లూలా విజయం ఒక ముఖ్య పరిణామం. 2003–2010 మధ్యకాలంలో వరుసగా రెండుసార్లు అధ్యక్షుడై, 2022లో మళ్ళీ అధికారంలోకి వచ్చింది కూడా ఇప్పటికంటే తక్కువ తేడాతోనే. అయితే, బొల్సనారో వంటి గట్టిమితవాద నాయకుడిని అక్కడి ప్రజలు ఒక విడతకంటే ఎక్కువ భరించలేకపోవడం విశేషం. బ్రెజిల్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగిన తరువాత, ఒక పదవీకాలంలోనే అధ్యక్షుడు ఓటమిపాలవడం మూడుదశాబ్దాల్లో అదే మొదటిసారి. విద్వేషపూరిత వ్యాఖ్యలు, కొవిడ్‌ వైఫల్యాలు, అమెజాన్‌ విధ్వంసం ఇత్యాదివి ఆ ఎన్నికల్లో పనిచేశాయి. అమెజాన్ అడవులను ఆయన అమ్మకానికి పెట్టేయడంతో యావత్ ప్రపంచానికి నిజస్వరూపం తెలిసివచ్చింది. అడవుల పరిరక్షణలో స్థానిక సమాజాలకు అధిక భాగస్వామ్యాన్నిచ్చే చట్టాలను మార్చేసి, ధనికులు, పారిశ్రామికవేత్తలు అడవులను కొల్లగొట్టేందుకు వీలుకల్పించడమే కాక, అమెజాన్ ప్రపంచ సొత్తు కాదనీ, బ్రెజిల్ ఆస్తి కనుక ఇష్టం వచ్చినట్టు చేసుకుంటానని ప్రకటించాడాయన. తమ అధ్యక్షుడు మాటకారే కానీ, చేతలమనిషి కాదని అర్థమైన జనం తమను గతంలో రెండుపర్యాయాలు ఏలిన వర్కర్స్ పార్టీ పాలనే బాగుందని భావించి లూలాకు మళ్ళీ పట్టంకట్టారు. మితవాదం, మార్కెట్ అనుకూల విధానాలను కాదని, లూలా అనుసరిస్తున్న సంక్షేమం, సంఘటిత సుస్థిర అభివృద్ధిని ప్రజలు తిరిగికోరుకున్నారు.


ధరలపెరుగుదల, అవినీతి ఆరోపణలు, ప్రభుత్వపనితీరుపై అసంతృప్తి వంటి అంశాలు ఈ ఎన్నికల్లో లూలాకు వ్యతిరేకంగా బలంగా పనిచేసినప్పటికీ, జైర్‌ ఏలుబడిని రుచిచూసిన జనం అతని కుమారుడికి పట్టంకట్టేందుకు సాహసించలేదు. తెలియని నాయకుడిని గద్దెనెక్కించేకంటే, హక్కులు, సంక్షేమం, సామాజికభద్రత కొనసాగుతాయనే నమ్మకం కల్పించిన లూలా మీద ఓటర్లు అధిక విశ్వాసం ఉంచినట్టుంది. ఎన్నికల ప్రచారంలో ఆయన తాను చేసింది చెప్పుకున్నారు, బొల్సనారో కుటుంబం మళ్ళీ అధికారంలోకి వస్తే అంధకారమేనని, సంక్షేమం సన్నగిల్లి, ధనికుల రాజ్యం వస్తుందని, అమెరికా పంచన పడివుండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరించారు. అధ్యక్షుడు కాగలిగారు కానీ లూలా ప్రత్యర్థి బలహీనంగా ఏమీ లేడు. లిబరల్‌ పార్టీ, దాని మిత్రపక్షాలు పార్లమెంట్‌లో అతిబలంగా ఉంటూ ఆయన నిర్ణయాలకు అడ్డుపడబోతున్నాయి. ఎన్నికల ప్రచారంలో లూలా ప్రజలకు విరివిగా హామీలు ఇచ్చారు, సంక్షేమంమీద మరింత ఖర్చుచేస్తానని ప్రమాణం చేశారు. అవన్నీ అమలైతే దేశం మరింత అప్పులపాలవుతుందని విమర్శించిన విపక్షం ఇకమీదట ఆయన ప్రతీ నిర్ణయాన్ని చట్టసభల్లో తిప్పికొడుతుంది. న్యాయమూర్తుల నియామకాలు సహా చాలా కీలకమైన అంశాల్లో లూలా ఎదురుదెబ్బలు తినవచ్చునని, అవిశ్వాసం కూడా ఎదుర్కోవలసిరావచ్చునని అంటున్నారు. లాటిన్‌ అమెరికాలో భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి బ్రెజిల్‌. ‘బ్రిక్స్‌’ లోనూ అది కీలకపాత్ర పోషిస్తోంది. ఇంధనం, ఖనిజాలు ఇత్యాది పలురంగాల్లో ఇరుదేశాలూ మరింత సాన్నిహిత్యం పెంచుకోవడానికి లూలా విజయం మనకు అవకాశాన్నిస్తోంది.

Updated Date - Oct 28 , 2026 | 12:04 AM