Share News

సమాజంతో జగడమేసుకున్న బోయ జంగయ్య

ABN , Publish Date - Sep 30 , 2026 | 12:12 AM

తను రాసిన కథలు, కవిత్వం, నవలలు, బాలసాహిత్యం, మహనీయుల జీవిత చరిత్రలు, నాటకాల సృజనతో తెలుగు సాహిత్యానికి తెలంగాణ దళిత జీవితాన్ని జతపరిచి, విస్తరించిన సాహితీ స్రష్ట డాక్టర్ బోయ జంగయ్య.

సమాజంతో జగడమేసుకున్న బోయ జంగయ్య

తను రాసిన కథలు, కవిత్వం, నవలలు, బాలసాహిత్యం, మహనీయుల జీవిత చరిత్రలు, నాటకాల సృజనతో తెలుగు సాహిత్యానికి తెలంగాణ దళిత జీవితాన్ని జతపరిచి, విస్తరించిన సాహితీ స్రష్ట డాక్టర్ బోయ జంగయ్య.

1964లో బోయ జంగయ్య సాహితీ ప్రస్థానం మొదలైంది. వందకు పైగా కథలు రాశారాయన. పద్నాలుగు కథా సంపుటాలు, ఐదు కవితా సంపుటాలు, నాలుగు నాటికలు, మూడు నవలలు, ఆరు మహనీయుల జీవిత చరిత్రలు, తొమ్మిది బాల సాహిత్య పుస్తకాలను వెలువరించారు. తన రచనల ద్వారా అణగారిన సామాజిక వర్గాల్లో మూఢ నమ్మకాల నిర్మూలన, సామాజిక వివక్షలకు వ్యతిరేకమైన చైతన్యం, శాస్త్రీయ భావాలను పెంచడానికి బోయ జంగయ్య నిరంతరం కృషి చేశారు. సాహిత్యంలోనూ, జీవితంలోనూ అణగారిన వర్గాలు, ప్రధానంగా ఆ వర్గాల్లోని మహిళల పక్షపాతి బోయ జంగయ్య. పీడితుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి, తనలాగే స్వయంకృషితో తన పాత్రలనూ గెలుపు మార్గాలలో నడిపించిన రచయిత జంగయ్య. నిశితంగా పరిశీలిస్తే, వీరి సాహిత్యం తెలంగాణ సామాజిక చరిత్రగా, భారతీయ సంస్కృతిగా రూపుదిద్దుకోవడాన్ని చూడగలం.


ఉమ్మడి నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం, పంతంగి బోయ జంగయ్య స్వగ్రామం. 1942 అక్టోబర్ 1న జంగయ్య జన్మించారు. ఎల్లమ్మ, మల్లయ్య ఆయన తల్లిదండ్రులు. జంగయ్య డిగ్రీ పూర్తి చేసి, ప్రభుత్వ అధికారిగా ఉద్యోగం నిర్వహించారు. 1992లో ఆదివారం ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘‘అంబేడ్కర్ నా పెంపుడు తండ్రి’’ అని డాక్టర్ బోయ జంగయ్య తన సామాజిక దృక్పథాన్ని ప్రకటించుకున్నారు. మహాకవి గుఱ్ఱం జాషువాతో కలిసి, తన పద్దెనిమిదో ఏటనే నల్లగొండ పురవీధుల్లో సంచరించారు. నిరంతరాయంగా సాహితీ సృజన చేస్తూనే, ‘నల్లగొండ సాహితీ మిత్రులు’ సంస్థకు అధ్యక్షులుగా, ‘నల్లగొండ విజ్ఞాన సమితి’కి ప్రధాన కార్యదర్శిగా, ‘నల్లగొండ జిల్లా రచయితల సంఘం’ అధ్యక్షులుగా బోయ జంగయ్య నిర్మాణాత్మక కార్యక్రమాలు నిర్వహించారు.

కవి, రచయిత, ఐఏఎస్ అధికారి ఎ.విద్యాసాగర్, మరో ఐఏఎస్ అధికారిణి వాణీ ప్రసాద్, రచయిత, ఐఏఎస్‌ అధికారి ఫణికుమార్ వంటి వారు నల్లగొండలో పని చేసినప్పుడు వారు బోయ జంగయ్యతో కలిసి, సాహిత్యానికి ఎంతో సేవ చేశారు. ప్రముఖ రచయితలు రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు నల్లగొండకు వచ్చినపుడు జంగయ్య ఇంట్లోనే ఉండేవారు. అంతేకాదు, కాళోజీ, శ్రీశ్రీ, సినారె, జి.వి.సుబ్రహ్మణ్యం, ఆవంత్స సోమసుందరం, శివారెడ్డి, అంపశయ్య నవీన్, పురాణం సుబ్రహ్మణ్యశర్మ, కొలకలూరి ఇనాక్, బి.ఎస్.రాములు, కాలువ మల్లయ్య మొదలైన ప్రముఖులతోనూ, దళిత కవులు, రచయితలు, మేధావుల ఐక్య వేదిక వారితోనూ, అరసం, విరసం సభ్యులతోనూ బోయ జంగయ్య సాహితీ చర్చలు నిర్వహించేవారు.


అధికార, అనధికార సాహిత్య సభల్లో పాల్గొనడానికి దేశంలో విస్తృతంగా పర్యటించారు జంగయ్య. అఖిల భారత అభ్యుదయ రచయితల సదస్సులో; నేషనల్ బుక్ ట్రస్ట్, కేంద్ర సాహిత్య అకాడమీ వారి సాహిత్య కార్యక్రమాల్లో అతిథిగా అనేకసార్లు పాల్గొని, వివిధ సాహిత్యాంశాలపై జంగయ్య ప్రసంగించారు.

బోయ జంగయ్య రాసిన ‘జాతర’ నవలను మైసూరు విశ్వవిద్యాలయంలో ఉపవాచకంగా, ‘జగడం’ నవలను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పాఠ్యాంశంగా, ‘గొర్రెలు’ కథా సంపుటిని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పాఠ్యాంశంగా, ‘దున్న’ కథా సంపుటిని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పాఠ్యాంశంగా పెట్టుకున్నారు. పరిశోధక విద్యార్థులు పదుల సంఖ్యలో బోయ జంగయ్య రచనలపై పీహెచ్‌డీలు చేశారు. తన జీవితకాలంలో పదికి పైగా సాహిత్య పురస్కారాలను అందుకున్న బోయ జంగయ్యను 2003లో తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సన్మానించింది.

ప్రభుత్వ ట్రెజరీ శాఖలో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి, 2000 సంవత్సరం వరంగల్‌లో జంగయ్య ఉద్యోగ విరమణ చేశారు. అదే ఏడాది సెప్టెంబర్ 30న వరంగల్‌లో నిర్వహించిన ఉద్యోగ విరమణ సభలో కాళోజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2016 మే ౭వ తేదీన తన 74వ ఏట బోయ జంగయ్య పరినిర్వాణం చెందారు.


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బోయ జంగయ్య జయంతి, వర్ధంతులను ప్రతి ఏటా అధికారికంగా నిర్వహించాలి. ఆయన పేరుతో సాహిత్య పురస్కారాన్ని నెలకొల్పాలి. ఏదైనా ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ సంస్థకు బోయ జంగయ్య పేరును పెట్టాలి. లోగడ ఆరుసార్లు ఆయనకు పద్మశ్రీ పురస్కారం కోసం ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇప్పుడు దాన్ని సాకారం చేయడానికి ప్రభుత్వం కృషి చెయ్యాలి. ఆయన సమగ్ర రచనలను ప్రభుత్వం ముద్రించి, అందుబాటులోకి తీసుకురావాలి. రవీంద్రభారతి ప్రాంగణంలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. ఈ ప్రతిపాదనలను పూర్తి చేయడం ద్వారా... అణగారిన ప్రజల సాధికారాన్ని కలలుగని, అందుకోసం కృషి చేసిన బోయ జంగయ్యకు తెలంగాణ సాహిత్య, సంస్కృతుల చరిత్రలో సగౌరవ స్థానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి.

- కృపాకర్ మాదిగ

(తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో బోయ జంగయ్య

84వ జయంతి సభ రేపు సాయంత్రం 5 గంటలకు రవీంద్రభారతి,

హైదరాబాద్‌లో జరుగుతుంది. అకాడమీ త్రైమాసిక పత్రిక ‘పునాస’

అక్టోబర్–డిసెంబర్ 2026 సంచిక జంగయ్య స్మృతిలో వస్తున్నది.)

Updated Date - Sep 30 , 2026 | 12:15 AM