దేశాభివృద్ధికి రెక్కలు తొడిగిన మోదీ!
ABN , Publish Date - Jul 31 , 2026 | 12:29 AM
‘హవాయి చెప్పులు వేసుకునే సామాన్యుడు కూడా హవాయి జహాజ్ (విమానం) ఎక్కాలి’ అన్నది ప్రధాని మోదీ ఆశయం. విమాన ప్రయాణం కేవలం సంపన్నులకే పరిమితమైన విలాస సాధనం మాత్రమే కాదు, అది దేశ ప్రగతికి...
‘హవాయి చెప్పులు వేసుకునే సామాన్యుడు కూడా హవాయి జహాజ్ (విమానం) ఎక్కాలి’ అన్నది ప్రధాని మోదీ ఆశయం. విమాన ప్రయాణం కేవలం సంపన్నులకే పరిమితమైన విలాస సాధనం మాత్రమే కాదు, అది దేశ ప్రగతికి చోదక శక్తి, ప్రతి సామాన్యుడి హక్కు అని నిరూపించడమే లక్ష్యంగా గత పన్నెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసింది. మోదీ నాయకత్వంలో వైమానిక రంగం రూపురేఖలు మారిన తీరు ఒక అపూర్వ విప్లవంగా నిలిచింది.
ఉత్తరాంధ్ర రూపురేఖలను సమూలంగా మార్చివేసే దిశగా రూపుదిద్దుకుంటున్న భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ ఆర్థిక ప్రగతికి సరికొత్త గేమ్ చేంజర్‌గా మారబోతోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఆర్థిక చిత్రాన్ని మార్చే ఈ బృహత్తర ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులను వేగవంతంగా మంజూరు చేసి, ప్రత్యేక సహకారాన్ని అందించింది. మొదటి దశలోనే ఏటా 60లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించే సామర్థ్యంతో, రూ. 4,500 కోట్లకు పైగా అంచనా వ్యయంతో నిర్మితమవుతున్న ఈ విమానాశ్రయం విశాఖ తీర ప్రాంతానికి, అంతర్జాతీయ కార్గో, ఫార్మా ఎగుమతులు, పర్యాటక రంగానికి ఆసియాలోనే అత్యంత కీలకమైన కనెక్టివిటీ హబ్‌గా నిలవనుంది.
గత పన్నెండేళ్ల కాలంలో ఏపీలో ఏవియేషన్ రంగానికి మోదీ ప్రభుత్వం అందించిన మద్దతు ఎనలేనిది. 2014కు ముందు పరిమిత సర్వీసులు, అరకొర సదుపాయాలతో వెలవెలబోయిన ప్రాంతీయ విమానాశ్రయాలు నేడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, పెరిగిన ప్రయాణికుల రద్దీతో కళకళలాడుతున్నాయి. రాజధాని అమరావతి ప్రాంతానికి తలమానికమైన విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో విదేశీ ప్రయాణాలకు వీలుగా పలు అభివృద్ధి పనులను వేగవంతం చేశారు. దీనికి తోడు తిరుపతికి వచ్చే అంతర్జాతీయ భక్తుల సౌకర్యార్థం పర్యావరణ అనుకూల గరుడ టెర్మినల్‌ను అందుబాటులోకి తెచ్చి, ఈ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించడం ద్వారా రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చివేశారు. కర్నూలు విమానాశ్రయాన్ని ఉడాన్ కింద త్వరితగతిన పూర్తిచేసి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించారు. అలాగే రాజమండ్రి, కడప విమానాశ్రయాల్లో రాత్రివేళల్లో సైతం విమానాలు సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్, రన్‌వేల పొడిగింపు పనులను ఆధునికీకరించారు. గతంలో కేవలం కొన్ని ప్రధాన నగరాలకే పరిమితమైన కార్గో, ప్యాసింజర్ సర్వీసులు ఇప్పుడు రాష్ట్రంలోని నలుమూలలకూ విస్తరించడం వెనుక కేంద్రం జారీ చేసిన నిధులు, స్పష్టమైన ప్రణాళికలు నిలిచాయి. వైమానిక రంగంలో వచ్చిన ఈ విప్లవాత్మక మార్పులు ఏపీ పారిశ్రామిక అభివృద్ధికి సరికొత్త ఊపిరులూదాయి. రాబోయే రోజుల్లో ఏపీని భారతదేశపు తూర్పు నౌకా ప్రాంగణానికి ఏవియేషన్ గేట్‌వేగా మార్చడం ఖాయంగా కనిపిస్తోంది.
దక్షిణ భారతంలో ఐటీ, లైఫ్ సైన్సెస్, పరిశోధనలకు గ్లోబల్ హబ్‌గా నిలిచిన తెలంగాణలో విమానయాన రంగాన్ని విస్తరించేందుకు కేంద్రం విప్లవాత్మక అడుగులు వేస్తోంది. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రపంచ స్థాయి నగరాల సరసన నిలిపేలా ప్రయాణికుల సామర్థ్యాన్ని పెంచే బృహత్తర విస్తరణ ప్రాజెక్ట్‌కు కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ పూర్తి సాంకేతిక, మౌలిక సహకారాన్ని అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ద్వితీయ శ్రేణి నగరాలకు విమాన సేవలను తీసుకెళ్లే దిశగా ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇందులో భాగంగా వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా రూట్ క్లియరెన్స్‌లతో పాటు భూ సేకరణ నిబంధనలను వేగవంతం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్, జక్కంపేట ప్రాంతాలలో కార్గో, ప్యాసింజర్ విమానాల రాకపోకలకు వీలుగా స్థల పరిశీలన, టెక్నో–ఎకనామిక్ ఫీజిబిలిటీ అధ్యయనాలు శరవేగంగా జరుగుతున్నాయి.
స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి 2014 వరకు దేశంలో కార్యాచరణలో ఉన్న విమానాశ్రయాల సంఖ్య కేవలం 74 మాత్రమే. అయితే మోదీ నేతృత్వంలో ఈ సంఖ్య 150 దాటింది. అంటే గత పదేళ్లలోనే ఏవియేషన్ నెట్‌వర్క్ రెట్టింపు కంటే ఎక్కువ స్థాయికి పెరిగింది. ప్రయాణికుల రద్దీ కూడా ఏటా 6 కోట్ల నుంచి ఏకంగా 22 కోట్లకు పైగా పెరిగింది. విమాన సంస్థల సముదాయం 400 విమానాల నుంచి 800కు పైగా పెరగడమే కాక, భవిష్యత్తు అవసరాల కోసం భారతీయ సంస్థలు మరో 1,200కు పైగా కొత్త విమానాలకు ఆర్డర్లు ఇచ్చి అంతర్జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించాయి. యూపీఏ హయాంలో జాతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా నిరంతరం వేల కోట్ల నష్టాల ఊబిలో కూరుకుపోయి ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరైంది. కానీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించి లాభాల బాట పట్టించడమేకాక, రూ. 1.3 లక్షల కోట్లకు పైగా నిధులతో జాతీయ వైమానిక మౌలిక సదుపాయాలను ఆధునికీకరించింది. మరోవైపు ఉడాన్ పథకం ద్వారా రూపకల్పన చేసిన 500కు పైగా కొత్త ప్రాంతీయ మార్గాల్లో ఇప్పటికే 1.3 కోట్లకు పైగా సామాన్య ప్రయాణికులు అతి తక్కువ ధరలకే విమాన ప్రయాణం చేశారు. రాబోయే ఐదేళ్ల కాలంలో మరో రూ. 1 లక్ష కోట్లను కేవలం నూతన విమానాశ్రయాల నిర్మాణం, పాత వాటి విస్తరణ, గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం వెచ్చించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. భారత్‌ను ప్రపంచ వైమానిక శక్తిగా నిలపడంలో ఎన్డీఏ కృషి అనుపమానమైనది.
గత ప్రభుత్వాల హయాంలో అలక్ష్యానికి గురైన ప్రాంతీయ వైమానిక బీజాన్ని ప్రధాని మోదీ ఉడాన్ పథకం రూపంలో వటవృక్షంగా మార్చారు. ‘రూ.2,500కే గంట విమాన ప్రయాణం’ అనే ఆలోచనతో దేశంలో సరికొత్త రవాణా శకానికి శ్రీకారం చుట్టారు. ఈశాన్య భారత కొండ ప్రాంతాలు, జమ్మూ కశ్మీర్, దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల ప్రజలను వైమానిక నెట్‌వర్క్‌తో అనుసంధానించడం ద్వారా దశాబ్దాలుగా ఉన్న భౌగోళిక, ఆర్థిక దూరాలను చెరిపేశారు. ప్రాంతీయ అనుసంధానత పథకం ద్వారా ఉపయోగంలో లేని పాత రన్‌వేలను, సైనిక విమానాశ్రయాలను పూర్తిస్థాయి వాణిజ్య కేంద్రాలుగా తీర్చిదిద్దారు. ఫలితంగా.. ఒకప్పుడు విమానం ఎక్కడమే కలగా భావించిన సాధారణ మధ్యతరగతి రైతు, చిరు వ్యాపారి, విద్యార్థి కూడా నేడు సునాయాసంగా విమానాల్లో ప్రయాణిస్తున్నారు.
ప్రధానమంత్రి మోదీ, సీఎం చంద్రబాబు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖుల సమక్షంలో ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను జాతికి అంకితం చేయనున్నారు. ఇది కేవలం ఒక విమానాశ్రయం ప్రారంభం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అభివృద్ధికి, ప్రపంచ పెట్టుబడులకు, ప్రజల ఆకాంక్షలకు కొత్త ద్వారాలు తెరుచుకునే చరిత్రాత్మక ఘట్టమిది.
యస్. విష్ణువర్ధన్‌రెడ్డి
బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు
Also Read:
వర్షాకాలంలో ప్రయాణం.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
ఇంట్లో గులాబీ మొక్క పెంచుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి