నాటి బీజేపీ విమర్శలే నేటి కాంగ్రెస్ నినాదాలా?
ABN , Publish Date - Oct 28 , 2026 | 12:34 AM
‘ఓట్ల చోరీపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని మనం తిప్పికొట్టాలి. విలేఖరుల సమావేశాలు, పాదయాత్రలు, పురప్రముఖులు, మేధావులు, యువత, విద్యార్థులతో భేటీలు నిర్వహించాలి’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
‘ఓట్ల చోరీపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని మనం తిప్పికొట్టాలి. విలేఖరుల సమావేశాలు, పాదయాత్రలు, పురప్రముఖులు, మేధావులు, యువత, విద్యార్థులతో భేటీలు నిర్వహించాలి’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రెండు రోజుల క్రితం బీజేపీ కీలక నేతల భేటీలో ఆయన చేసిన నిర్దేశమది. ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు వీధి పోరాటాలు నిర్వహించిన ఎన్నో రోజులకు గానీ బీజేపీ అగ్రనేతలు పార్టీని దేశవ్యాప్తంగా కార్యాచరణకు పురిగొల్పకపోవడాన్ని బట్టి సమస్య తీవ్రతను అంచనా వేయడంలో కేంద్రం ఎంతో జాప్యం చేసినట్లే కనిపిస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన నిరసన ప్రదర్శనలను అణచివేయడం, వారిని జైళ్లకు పంపడం, భయభ్రాంతులకు గురిచేయడంలో విజయవంతం కావచ్చు. సోషల్ మీడియాలో నిరసన ప్రదర్శనలు, విమర్శలు ప్రచారం కాకుండా అడ్డుకట్టలు వేయవచ్చు. కానీ రాజకీయ పార్టీలను మాట్లాడకుండా చేయడం అంత సులభం కాదు. జంతర్ మంతర్‌లో నిరసన తెలపడానికి వీలులేదని ఆదేశాలు జారీచేయవచ్చు కానీ ప్రవాహం తన దారిని తాను వెతుక్కున్నట్లు, నిరసన కూడా తన దారిని కూడా తాను వెతుక్కుంటుంది. నవరాత్రి ఉత్సవాలు ముగిశాయో లేదో కాంగ్రెస్ పార్టీ ఇక జాప్యం చేయకూడదన్నట్లుగా నవంబర్ 1న రామ్ లీలా మైదాన్‌లో భారీ ర్యాలీకి ఏర్పాట్లు చేసింది. దేశం నలుమూలల నుంచీ లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీని ముంచెత్తనున్నారు. మరో వైపు రకరకాల శక్తులు వివిధ రాష్ట్రాల్లోనే కాదు, వివిధ దేశాల్లో కూడా ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా ఊరేగింపులు కొనసాగిస్తున్నారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ అమెరికా, కెనడా, ఇంగ్లండ్, ఐర్లాండ్, జర్మనీ, స్పెయిన్, నెదర్లాండ్స్, జెక్, ఆస్ట్రేలియాలో కూడా ప్రవాస భారతీయ విద్యాధికులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ నేతలు జనంలోకి వెళ్లి, అసలు ఓట్ల చోరీయే జరగలేదని ప్రచారం చేయడం వల్ల ఎంత వరకు విజయం సాధించగలుగుతారు? ఇది చెప్పడం కష్టమే.
ఎవరూ తమకు తాముగా సమస్యలను తెచ్చిపెట్టుకోలేరు. ఒక్కోసారి అతి ఆత్మవిశ్వాసం, లెక్కలేనితనం, అతిగా ఇతరులపై ఆధారపడడం మూలంగా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం కూడా సమస్యలను తెచ్చిపెడుతుంది. ఇలాంటి స్వయంకృతాపరాధాలే కాదు, మన అదుపులోలేని విషయాలు కూడా మనకు సమస్యలు తెచ్చిపెడతాయి. అజేయ శక్తిగా భావించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీని కూడా ఇవాళ పరిపాలన, పార్టీ పరంగా మాత్రమే కాదు, అంతర్జాతీయ సమస్యలు కూడా చుట్టుముడుతున్నాయి. మోదీకి ఎదురవుతున్న సవాళ్లు, ఎదుర్కొంటున్న ఆరోపణలు ఆయన ప్రతిష్ఠకే కాదు, దేశ ప్రతిష్ఠకు కూడా సంబంధించినవి.
ప్రతిపక్షాలదేముంది! అవి తాము అధికారంలోకి తిరిగి రావడానికి చేయాల్సిన పనులన్నీ చేస్తాయి. సమస్యలను తీవ్రంగా చిత్రిస్తాయి. ఏ ఆధారం దొరికినా నానా హంగామా సృష్టిస్తాయి. గతంలో బీజేపీ కూడా ఇలాగే చేసింది. ఎన్నికల కమిషన్ బీజేపీని గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నదంటూ ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న ఆందోళన మాదిరే గతంలో బీజేపీ కూడా కాంగ్రెస్ ఎన్నికల అక్రమాలకు పాల్పడుతున్నదంటూ ఆరోపణలు చేసింది. ప్రధానంగా 2009–11 సంవత్సరాల మధ్య బీజేపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఈవీఎంల విశ్వసనీయతపై ఉధృతంగా రాజకీయ ప్రచారం చేసింది. 2009 ఎన్నికల ప్రచారంలో ఈవీఎంల విశ్వసనీయతపై బీజేపీ నేత లాల్ కృష్ణ ఆడ్వాణీ అనేక ప్రశ్నలు లేవనెత్తారు. జర్మనీ, అమెరికాలోనూ ఈవీఎంలు ఉపయోగించడం లేదన్నారు. 2010లో ఆనాటి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది’ అంటూ ఒక పుస్తకమే రాశారు. దానికి ఆడ్వాణీ ముందుమాట రచించారు. మళ్లీ బ్యాలట్ పేపర్లను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ అనేక విలేఖరుల సమావేశాలు నిర్వహించింది. ఈసీకి అనేకసార్లు విజ్ఞప్తి చేసింది. రాష్ట్రపతికి కూడా వినతిపత్రాలు సమర్పించింది. ఎమర్జెన్సీలో అనేక అకృత్యాలకు పాల్పడిన నవీన్ చావ్లాను ఎన్నికల కమిషనర్‌గా నియమించినందుకు నాడు బీజేపీ భూమ్యాకాశాలను ఏకం చేసింది. అయినా కాంగ్రెస్ పట్టించుకోకుండా ఆయనకు సీఈసీగా పదోన్నతి కల్పించింది. ఎన్నికల కమిషనర్ల నియామకంలో ప్రభుత్వానికే పూర్తి అధికారాలు ఉండరాదంటూ నాడు బీజేపీ బలంగా డిమాండ్ చేసింది. ప్రధానమంత్రి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రతిపక్ష నేతను ఎన్నికల కమిషనర్లను నియమించే కమిటీలో చేర్చాలని కోరింది. ఆడ్వాణీ తన బ్లాగులో ఈ విషయంపై విస్తృతంగా రాశారు. విచిత్రమేమంటే ఏ ఈవీఎంలను బీజేపీ తీవ్రంగా విమర్శించిందో అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఈవీఎంలను సమర్థించింది. ఎన్నికల కమిషనర్లను నియమించే కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తికి స్థానం లేకుండా చేసింది.
ఇవాళ చరిత్ర పునరావృతమవుతోంది. ఎన్నికల కమిషన్ బీజేపీ చేసిన ఆరోపణలనే ఇవాళ కాంగ్రెస్ మరింత ఉధృతంగా చేస్తోంది. నాడు నవీన్ చావ్లాకు ఉద్వాసన పలకాలని బీజేపీ సుప్రీంకోర్టుకు వెళితే, ఇప్పుడు కాంగ్రెస్ జ్ఞానేశ్‌కుమార్‌ను ఇంటికి పంపాలని కోర్టుకెక్కింది. ఎటొచ్చీ సర్ పేరుతో పెద్ద ఎత్తున ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారంటూ కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలు, కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో యువతీ యువకులు, ప్రజాసంఘాలు ఇప్పుడు నిర్వహిస్తున్న స్థాయిలో నాడు ఆందోళనలు జరగలేదు. ఎన్నికల అక్రమాల ద్వారానే బీజేపీ విజయాలు సాధిస్తున్నదంటూ జరుగుతున్న ప్రచారం ఊపందుకుని, ప్రతిపక్షాలకు, ఇతర వ్యతిరేక శక్తులకూ అదే ప్రధానాస్త్రమైన తర్వాత కానీ ఆ పార్టీ అగ్రనేతల్లో కదలిక రాలేదు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఇప్పుడు ఎన్నికల అక్రమాలపై ప్రతిపక్షాలు నిర్వహిస్తున్న ఆందోళనలే కాదు, ఇతరేతర పరిణామాలు కూడా సమస్యలను సృష్టిస్తున్నాయి. 2014లో కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు ఉన్న సానుకూల పరిస్థితులు ఇప్పుడు తగ్గిపోతున్నాయి. ఆర్థికశాస్త్రంలో క్రమక్షీణ ప్రయోజన సిద్ధాంతం (లా ఆఫ్ డిమినిష్డ్ యుటిలిటీ) మాదిరి ఆయన ప్రయోజనం తిరోగమన ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నట్లు కనపడుతోంది. వ్యూహాత్మక స్వతంత్రత సాధించాలన్న భారతదేశ ఆకాంక్షకు, భౌగోళిక రాజకీయ ప్రభావం, ఆర్థిక సాంకేతిక ఆధిపత్యం కోసం పోటీపడే అమెరికా, చైనా తదితర దేశాల నుంచి వస్తున్న ఒత్తిళ్లకూ, జాతీయవాదానికీ, ప్రజాస్వామ్య అసమ్మతికి మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఆర్థికాభివృద్ధికీ, పెరుగుతున్న ప్రజల ఆకాంక్షలు, యువత అవసరాలకూ మధ్య వ్యత్యాసం ఇవన్నీ భారత రాజకీయాల లోతైన బలహీనతలను ప్రస్ఫుటీకరిస్తున్నాయి.
రాజకీయంగా కూడా మోదీ, అమిత్ షా నేతృత్వంలోని బీజేపీకి దేశంలో అంతా సవ్యంగా జరుగుతున్నట్లు కనిపించడం లేదు. గత ఏప్రిల్‌లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించినప్పటికీ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లుల ఆమోదానికి అవసరమైన మెజారిటీని ప్రభుత్వం సాధించలేకపోయింది. నీట్ పేపర్ లీక్ వివాదం, అయోధ్యలో రామమందిరంలో చోరీపై ప్రతిపక్షాలు సృష్టించిన దుమారంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొట్టుకుపోయాయి. నవంబర్ చివరి వారంలో ప్రారంభం కావాల్సిన శీతాకాల సమావేశాలలోపు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో వర్షాకాల సమావేశాలను ప్రోరోగ్ చేయనప్పటికీ ఇంతవరకు ఈ సమావేశాలను నిర్వహించలేకపోయింది. ఈ మధ్య కాలంలో సర్ ప్రక్రియపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు విభేదించినట్లు వార్తలు పొక్కడంతో కాంగ్రెస్, ఇతర వర్గాలు వీధిన పడ్డాయి. కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేస్తారని, అనేక ఖాళీలు పూరిస్తారని గత ఆరునెలలుగా వార్తలు వస్తున్నా, అనేక ఇబ్బందులు, వ్యతిరేకతల వల్ల మోదీ అడుగు ముందుకు వేయలేకపోతున్నారని తెలుస్తోంది.
సర్ ప్రక్రియపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడం, పార్లమెంట్లో అనుకున్న బిల్లులను ప్రవేశపెట్టడం, ప్రభుత్వంలో అనుకున్న మార్పులను చేయడం మాత్రమే కాదు, ప్రజల అభిప్రాయాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు మోదీ ప్రభుత్వం ఏమి చేయగలదన్నదే ప్రస్తుతం రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా పరిశీలిస్తున్న అంశం. ఎల్లకాలం వ్యవస్థలను చెప్పుచేతల్లో పెట్టుకుని అధికార బలంతో కొనసాగడం రాజకీయాల్లో ఆరోగ్య లక్షణం కాదు. వచ్చే ఫిబ్రవరి– మార్చి నెలల్లో జరిగే అయిదు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకం. ఈ అయిదు రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్‌లలో బీజేపీకి ఏమీ సానుకూల పరిస్థితులు లేవు. ఉత్తరప్రదేశ్‌లో 2022లో బీజేపీ 403 సీట్లలో 255 సీట్లు గెలిచింది. వీటిలో కేవలం 5 వేల కన్నా తక్కువ ఓట్లతో 23 సీట్లు, 3వేల కన్నా తక్కువ ఓట్లతో 3 సీట్లు, 2000 కన్నా తక్కువ ఓట్లతో 11 సీట్లు, వేయి ఓట్ల కన్నా తక్కువ ఓట్లతో 11 సీట్లు రాగా, 7 సీట్లలో 500 కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఈ 55 సీట్లే లేకపోతే బీజేపీ మెజారిటీ సాధించేదే కాదు. పైగా 2022లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేయలేదు. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ బలం 62 సీట్ల నుంచి 33 సీట్లకు పడిపోయింది. లోక్‌సభలోని 223 అసెంబ్లీ సెగ్మెంట్లలో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ తమ ఆధిక్యతను కనబరిచాయి.
ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రతల పరిస్థితిని అరికట్టడం, వ్యక్తిగత నిజాయితీ యోగి ఆదిత్యనాథ్‌కు సానుకూల అంశాలైతే పరిపాలనా పరంగా మార్కులు వేయాల్సిన అంశాలు పెద్దగా లేవు. క్రింది స్థాయిలో అవినీతి తీవ్రంగా ఉన్నదని, వేల కోట్లతో నిర్మించిన వంతెనలు కూలిపోవడం ఈ అవినీతికి నిదర్శనాలని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. అయోధ్యలో విరాళాల చోరీపై తలెత్తిన విమర్శలు, జెన్‌జీ ఆందోళనలో యూపీ నుంచి అనేకమంది యువతీ యువకులు చురుకుగా పాల్గొనడం మారుతున్న రాజకీయ పరిస్థితులకు సూచికలు. వీటికి తోడుగా ఢిల్లీకి–లక్నోకు మధ్య ఉన్న రాజకీయ విభేదాలు యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కావడం అగ్రనేతలకు ఉన్న అయిష్టత గురించి పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. అంతర్జాతీయ ఒత్తిళ్లను తట్టుకుని నిలదొక్కుకోవడం, దేశ రాజకీయాల్లో ఇంటా బయటా పెరుగుతున్న సమస్యలను ఎదుర్కోవడం మోదీకి ప్రస్తుత తరుణంలో కత్తిమీద సామే!
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)