‘పరాభవ’ పోరాటాల్లో జాతీయ పక్షాలు
ABN , Publish Date - Apr 04 , 2026 | 02:44 AM
గ్రహగతులు, మానవ జీవితాలపై వాటి ప్రభావం గురించి నాకు ప్రాథమిక అవగాహన కూడా లేదు. అయితే ఇప్పుడు మన దేశంలో నెలకొనివున్న రాజకీయ పరిస్థితులను చూస్తుంటే ‘మనం చాలా ఆసక్తికర కాలంలో నివసిస్తున్నా’మని అనిపిస్తోంది.
కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ మూడూ హిందీభాషాయేతర రాష్ట్రాలు. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దక్షిణాదిలో బీజేపీ విస్తరణను, కాంగ్రెస్ పునరుజ్జీవాన్ని ప్రభావితం చేసే అవకాశమున్నది.
గ్రహగతులు, మానవ జీవితాలపై వాటి ప్రభావం గురించి నాకు ప్రాథమిక అవగాహన కూడా లేదు. అయితే ఇప్పుడు మన దేశంలో నెలకొనివున్న రాజకీయ పరిస్థితులను చూస్తుంటే ‘మనం చాలా ఆసక్తికర కాలంలో నివసిస్తున్నా’మని అనిపిస్తోంది.
అసోం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభలకు ఈ నెల 9, 23, 30 తేదీలలో ఎన్నికలు జరగనున్నాయి. భారతీయ జనతా పార్టీ ఇటీవలి సంవత్సరాలలో ప్రప్రథమంగా కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లోని మధ్యేవాద లేదా మధ్య– వామపక్ష రాజకీయ పక్షాల (లెఫ్ట్– ఆఫ్– సెంటర్ పొలిటికల్ పార్టీస్)ను భారతీయ జనతా పార్టీ సవాల్ చేస్తోంది. కేరళలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ రెండూ భావజాల వర్ణపటంలో ఎడమ వైపునే ఉన్నాయి. తమిళనాడులో డీఎంకే సారథ్యంలోని ఫ్రంట్ (కాంగ్రెస్ ఇందులో భాగస్వామి), పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ మధ్య– వామపక్షాలు అనేది స్పష్టం. ఈ రాజకీయ పక్షాలు అన్నీ భారత రాజ్యాంగానికి నిబద్ధమైవి. సమాఖ్య పాలనా విధానాన్ని, శాసన వ్యవస్థ సర్వోత్కృష్టత, సామాజిక న్యాయం, సమానత్వంతో కూడిన అభివృద్ధిని, సంక్షేమ చర్యలు, పత్రికా స్వాతంత్ర్యం, ఉదారవాద ఆర్థిక వ్యవస్థను ఔదలదాలుస్తున్నాయి. ఎల్‌డీఎఫ్, డీఎంకే, టీఎమ్‌సీ వరుసగా కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్నాయి.
ఈ పార్టీలను సవాల్ చేస్తున్న భారతీయ జనతా పార్టీ భావజాల వర్ణపటంలో కుడివైపు ఉండే రాజకీయ పక్షం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మాత్రమే భావజాల వర్ణపటంలో పూర్తిగా కుడివైపు ఉంటుందని నేను విశ్వసిస్తాను. అయితే తాను ఒక రాజకీయ పార్టీని కానేకానని ఆరెస్సెస్ గట్టిగా చెబుతోంది. అయితే తన ప్రముఖ నాయకులు అందరూ గతంలోనూ, ఇప్పుడు బీజేపీలో కీలక బాధ్యతల్లో ఉన్నారనే వాస్తవాన్ని ఆరెస్సెస్ అయిష్టంగా అంగీకరిస్తుంది. బీజేపీ ప్రభుత్వాలలోని చాలా మంది మంత్రులు సంఘ్ ప్రచారక్‌లు. ఇంకా స్వయం సేవక్‌లుగా కొనసాగుతున్నవారే. ఆరెస్సెస్‌ను తల్లిగాను, బీజేపీని బిడ్డగాను సామాన్య భారతీయులు భావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ విధానాలు, సిద్ధాంతాలు హిందూ ఆధిక్యతా భావన (హిందూత్వ)లో వేళ్లూనుకుని ఉన్నాయి; ఇవి కేంద్రీకరణ పాలనా పద్ధతులకు, హిందీ భాషకు ప్రాధాన్యమిస్తాయి. 2014 వరకు అనేక అంశాలపై ఉన్న ఏకాభిప్రాయాన్ని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ఉద్దేశపూర్వకంగా భగ్నం చేసింది.
కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ శాసనసభా ఎన్నికల పోరాటం వామపక్ష మధ్యేవాద, దక్షిణపక్ష మధ్యేవాద కూటముల మధ్య జరగనున్నది. కేరళలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్, సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ గత ఐదు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలలో ప్రాబల్యం వహిస్తున్నాయి. చిన్న పార్టీలు అన్నీ ఆ రెండు కూటములలో ఏదో ఒక దానిలో చేరడం అనివార్యమవుతోంది. యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్‌లు ఒక దాని తరువాత ఒకటి అధికారంలోకి రావడం కేరళ రాష్ట్ర రాజకీయాల విలక్షణతగా ఉన్నది. అయితే 2021లో కేరళ ఓటర్లు ఈ ఆనవాయితీకి తెరదించారు. 2016లో విజయం సాధించిన ఎల్‌డీఎఫ్‌కే 2021లో కూడా మళ్లీ అధికారమిచ్చారు. యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్ రెండూ శక్తిమంతమైన కూటములే. ఈసారి మరింత పదునైన, పటిష్ఠ వ్యూహాలతో ఎన్నికల గోదాలోకి దిగాయి. వయసు మీరిన పినరయి విజయన్ సారథ్యంలో ఎల్‌డీఎఫ్ గత పదేళ్లుగా అధికారంలో ఉందని, రాష్ట్ర పాలన, రాజకీయాలలో మార్పునకు సమయమాసన్నమయిందని కేరళ ప్రజలు భావిస్తున్నారు. 2018లో వరదల ఉపద్రవంలోను, 2024లో వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడిన విపత్తులోను పినరయి విజయన్ ప్రభుత్వం బాధితులను సమర్థంగా ఆదుకోలేదన్నది ప్రజాభిప్రాయంగా ఉన్నది. దీనివల్ల ఎల్‌డీఎఫ్‌కు భారీగా నష్టం వాటిల్లే అవకాశమున్నది. కాంగ్రెస్‌లో సమర్థులైన యువ నాయకులు చాలా మంది ఉన్నారు. యూడీఎఫ్ మంచి మెజారిటీతో విజయం సాధించగలదని వారు విశ్వసిస్తున్నారు. కేరళ ప్రజల మనోభావాలను బీజేపీ అర్థం చేసుకున్నట్టుగా కనిపించడం లేదు. ఎన్ని స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగలదనే విషయమై ఊహాగానాలు జరుగుతున్నాయి. ఏక సంఖ్యకు మించి రావని చాలా మంది పందెం కాస్తున్నారు.
తమిళనాడులో డీఎంకే నాయకత్వంలోని ఫ్రంట్ 2021 శాసనసభ, 2024 సార్వత్రక ఎన్నికలలో మంచి విజయాలు సాధించి సుస్థిరంగా ఉన్నది. ఓట్లు చీలిపోకుండా ఉండేందుకూ డీఎంకే చిహ్నంపై పోటీ చేసేలా చిన్న పార్టీలకు నచ్చజెప్పడంలో ఎమ్‌కె స్టాలిన్ సఫలమయ్యారు. అన్నాడీఎంకే నాయకత్వంలోని ఫ్రంట్‌కు 2021, 2024 ఎన్నికలలో ఓట్ల, సీట్ల నష్టం భారీగా వాటిల్లింది. అయితే ఈసారి చీలిక పక్షం ఏఎమ్‌ఎమ్‌కే మద్దతును అన్నాడీఎంకే సాధించుకున్నది. అయితే అన్నాడీఎంకే నాయకుడుగాను, కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పళనిస్వామిని ఎట్టి పరిస్థితులలోను అంగీకరించబోమని ఏఎమ్‌ఎమ్‌కే నెల రోజుల క్రితం ప్రకటించింది. అన్నాడీఎంకే ఫ్రంట్‌కు బీజేపీతో సమకూరిన మేలు ఏమిటి? కేంద్ర ప్రభుత్వ బాసట, ఎన్నికల సంఘం వ్యూహాత్మక మద్దతు, ప్రజల మధ్య మతవిభేదాలు సృష్టించే బీజేపీ జాతీయ నాయకుల వాచాలత. అయితే ఇవేవీ 2021లోను, 2024లోను అన్నాడీఎంకేకు తోడ్పడలేదు. 2026లోను తోడ్పడే అవకాశం లేదు. కేవలం 27 స్థానాలకు మాత్రమే బీజేపీ పోటీ చేస్తోంది. ఎంత బాగా గెలిచినా ఆ పార్టీకి వచ్చే స్థానాలు 10కి మించవని పలువురి అంచనా. సినీనటుడు విజయ్ నెలకొల్పిన టీవీకేకు, మరో కొత్త పార్టీ ఎన్‌టీకేకు ఓట్లు చీల్చగల సామర్థ్యం దండిగా ఉన్నది. ప్రతి నియోజకవర్గంలోనూ పోటీ తీవ్రంగా ఉంటుంది. డీఎంకే నేతృత్వంలోని కూటమే మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఎన్నికల పరిశీలకులు, అనుభవజ్ఞులైన పాత్రికేయులు గట్టిగా భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్‌లో పాలక తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్య దాదాపుగా ముఖాముఖి పోటీ జరగనున్నది. గతకాలపు పాలక పక్షాలైన కాంగ్రెస్, సీపీఎంలు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ అంతిమ ఫలితాలను ఆ మాజీ అధికార పక్షాలు ప్రభావితం చేయగలవని ఎవరూ భావించడం లేదు. బెంగాల్ ఎన్నికల సమరం నిత్య యోధురాలు మమతా బెనర్జీ, ఆమెను నిరంతరం సవాల్ చేస్తున్న నరేంద్ర మోదీ– అమిత్ షా ద్వయం మధ్య పోరుగా పరిణమించింది. ఇది రాజకీయ పరిధులను దాటి భౌతిక ఘర్షణలుగా రూపుదిద్దుకుంటోంది. మరో ముఖ్యమైన విషయమేమిటంటే ఈ పోరు బెంగాల్ ప్రజలను తీవ్ర భావావేశాలకు లోనుచేస్తోంది. తమ సంస్కృతి, సాహిత్యం, భాష వివక్షకు గురవుతున్నాయని బెంగాలీలు ఆవేదన, ఆందోళన చెందుతున్నారు. బెంగాలీ స్వాభిమానం ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలన్న తృణమూల్ కాంగ్రెస్ పిలుపునకు బెంగాలీ ఓటర్లు ప్రాధాన్యమిస్తే మమతా బెనర్జీ వరుసగా నాలుగోసారి అధికారంలోకి రాగలుగుతారు. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్– ఈ మూడూ హిందీ భాషాయేతర రాష్ట్రాలు. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ముఖ్యంగా జాతీయ పార్టీల భవితవ్యాన్ని ప్రభావితం చేసే అవకాశమున్నది.
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు)