Share News

నవ జగతీ యువవీరుడు

ABN , Publish Date - Mar 21 , 2026 | 03:45 AM

లారెన్స్ బిన్వన్ అనే ఇంగ్లీషు కవి రాసిన (TO THE FALLEN AND TO THE FREE– మరణించిన వీరులకు, స్వేచ్ఛ పొందిన వారికి ఈ విజయం అంకితం) వాక్యాలను 1947 ఆగస్టు 15న, నాటి ‘నేషనల్ హెరాల్డ్’ పత్రికలో రాసిన వ్యాసంలో మానికొండ చలపతిరావు ఉటంకించారు.

నవ జగతీ యువవీరుడు

లారెన్స్ బిన్వన్ అనే ఇంగ్లీషు కవి రాసిన (TO THE FALLEN AND TO THE FREE– మరణించిన వీరులకు, స్వేచ్ఛ పొందిన వారికి ఈ విజయం అంకితం) వాక్యాలను 1947 ఆగస్టు 15న, నాటి ‘నేషనల్ హెరాల్డ్’ పత్రికలో రాసిన వ్యాసంలో మానికొండ చలపతిరావు ఉటంకించారు. ఈ వాక్యాలు భగత్‌ సింగ్‌కు ఎంతో సరిగ్గా సరిపోతాయి.

సరిగ్గా 40 సంవత్సరాల క్రితం పాకిస్థాన్‌లోని లాహోర్ మహానగరంలో ప్రపంచ పంజాబీ మహాసభ జరిగింది. ఆ మహాసభ హాలులో ఏర్పాటైన ఏకైక చిత్రపటం భగత్‌సింగ్‌ది! అంటే, ప్రాంతాలకు, మతాలకు, అతీతంగా భగత్‌సింగ్‌ను తమ ఉమ్మడి ప్రతినిధిగా వారు ప్రతిష్ఠించుకున్నారు. ‘పంజాబ్ నేలలో పుట్టిన గొప్ప మానవతావాది భగత్‌సింగ్. అతడిని విభజన రాజకీయాలు విడగొట్టలేవు’ అని పంజాబ్ చరిత్రకారుడు అబ్దుల్లా మాలిక్ అభిప్రాయపడ్డారు. పట్టుమని పదేళ్ల రాజకీయ జీవితం కూడా లేని ఒక యువకుడికి అంత గుర్తింపు రావడం వెనక కేవలం అతని సాహసం, త్యాగం, ధీరోదాత్తత మాత్రమే కారణమా? ఇంకా ఏమైనా ఉన్నాయా అనేది పరిశీలించడం చారిత్రక అవసరం.

ఎంతో త్యాగపూరితంగా ఉరికంబాలెక్కెన తమకంటే ముందు తరాల విప్లవకారులు దాదాపుగా అందరూ తమ తమ మత విశ్వాసాలకు అనుగుణంగా ఏదో ఒక పవిత్ర గ్రంథాన్ని చేతిలో పట్టుకుని ఉరికంబాలెక్కారు. వారికి భిన్నంగా భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌లు ఎలాంటి మత చిహ్నాలూ లేకుండానే ‘‘బ్రిటిష్ సామ్రాజ్యవాదం నశించాలి!! విప్లవం వర్ధిల్లాలి!!’’ అనే నినాదాలతో, అదే తమ పవిత్ర ఆశయంగా, అత్యున్నత రాజకీయ విశ్వాసంగా ప్రకటిస్తూ అంతిమశ్వాస విడిచారు. విశిష్టమైన రాజకీయ లక్ష్యం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడిన ఈ ముగ్గురూ ‘రాజ కీయాలకు మతంతో ప్రమేయం ఉండకూడదు’ అనే లౌకిక దృక్పథానికి కట్టుబడి తమ అంతిమ క్షణాలలో కూడా తదనుగుణంగానే వ్యవహరించారు. భగత్‌సింగ్ రోజుల నాటి కంటే కూడా నేటి భారత ఉపఖండంలో ఉన్మాదపూరిత మతవిద్వేషాలు పెరిగినకొద్దీ భగత్‌సింగ్ ప్రాశస్త్యం పెరగడంలో ఆశ్చర్యం ఏముంది!


'నవ్ జవాన్ భారత్ సభ’ పేరుతో స్థాపించబడిన చట్టబద్ధ సంస్థకు భగత్‌సింగ్ ప్రధాన కార్యదర్శి కాగా, దుర్గా బాబీ భర్త భగవతి చరణ్ ఓహ్రా ప్రచార కార్యదర్శి. చెల్లాచెదురైన విప్లవకారులను కూడగట్టి, 1928 సెప్టెంబర్‌లో రెండు రోజులపాటు ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్‌లో ‘సోషలిస్ట్’ అనే పదాన్ని చేర్చాలని ప్రతిపాదించి, వారి ప్రణాళికలో మౌలికమైన మార్పుకు ఆమోదం పొందేట్లు చేసిన కృషిలో భగత్‌సింగ్‌ది కీలక పాత్ర. తద్వారా తాము కోరుకుంటున్న స్వతంత్ర భారతం కొద్దిమంది సంపన్నుల కోసం కాదనీ, కోట్లాది శ్రమజీవుల కోసమని ప్రజలకు సూటిగా అర్థమయ్యేలా చేయడం ఎంతో చారిత్రక ప్రాముఖ్యం కలిగిన ఘటన. భగత్‌సింగ్ బృందం కొత్తగా కూర్చిన సోషలిస్టు పదాన్ని సుమారు 50 ఏళ్లకు భారత రాజ్యాంగంలో చేరిస్తే, మరొక ౫0 ఏళ్లకు– తమకు తీవ్రమైన ఉలికిపాటు కలిగిస్తున్న ఆ పదాన్ని తొలగించటం ఎలాగా అని నేటి పాలకవర్గాలు కిందా మీదా పడుతున్నాయి. ఇలాంటివారే భగత్‌సింగ్‌ను నోటితో పొగుడుతూ, ఆచరణలో ఆయన బోధించిన లౌకికవాదాన్ని, సోషలిస్టు సమాజ లక్ష్యాన్ని నొసటితో వెక్కిరిస్తున్నారు!

నేడు కనుమరుగవుతున్న మత సామరస్యం, లౌకికవాదాన్ని నిలబెట్టుకోవాలని బలంగా కోరుకునే వారిలో కొందరు గాంధీ, అంబేడ్కర్‌ల చిత్రాలు వాడతారు. కానీ భగత్‌సింగ్‌ను జోడించడానికి బెరుకుపడుతూ ఉంటారు. దానికి కారణం, తాను నాస్తికుడనని అనుమానానికి తావు లేకుండా భగత్‌సింగ్ ప్రకటించుకుని ఉండటం కావచ్చు. ‘‘ఈనాడు మేం యువకులను పిస్టళ్లు, బాంబులు చేపట్టమని చెప్పడం లేదు. నేడు విద్యార్థులపై అంతకుమించిన గురుతర బాధ్యత ఉన్నది. యువత విప్లవ సందేశాన్ని దేశం నలుమూలలకూ వ్యాపింపజేయాలి. ఫ్యాక్టరీలలో, కార్ఖానాలలో, మురికివాడలలో, గ్రామాల్లో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పూరి గుడిసెల్లో నివసిస్తున్న కోట్లాది ప్రజానీకంలో ఈ విప్లవ చైతన్యం జాగృతం చేయాలి. అప్పుడే ఒక మనిషి మరో మనిషిని దోపిడీ చేసే సామాజిక వ్యవస్థ మనుగడ అసంభవమవుతుంది.’’ అని 1929 అక్టోబర్ 19న పంజాబ్ విద్యార్థి మహాసభలో భగత్‌సింగ్‌ పిలుపునిచ్చాడు.


ఉరికంబం ఎక్కడానికి సరిగా యాభై రోజుల ముందు జాతికి ఇచ్చిన సందేశంలో టెర్రరిజం గురించి భగత్‌సింగ్‌ ఇలా చెప్పాడు. ‘‘విప్లవకారులు నిరర్థక వ్యక్తిగత ఆత్మ త్యాగాల విష వలయంలో దెబ్బలు తింటూ తిరగడం అంత మంచి పని కాదు. ఒక్కొక్క కార్యకర్తకు లక్ష్యసాధన కోసం మరణించడం ప్రేరణతో కూడిన ఆదర్శం కారాదు. పైగా లక్ష్యసాధన కోసం వారు జీవిస్తూనే ఉండాలి. అంతేకాదు, ఉపయోగకరమైన సార్థకమైన పద్ధతిలో వారు జీవిస్తూ ఉండాలి. టెర్రరిస్టు కార్యాచరణను మనం ఏమాత్రం అంగీకరించడం లేదని వేరే చెప్పనవసరం లేదనుకుంటాను. మనం శ్రామికవర్గ దృక్పథంతో టెర్రరిజాన్ని సరిగ్గా విశ్లేషిస్తున్నాం’’ అని తెలిపాడు.

లాహోర్‌లో శాండర్స్‌ను చంపిన తరువాత పారిపోతున్న విప్లవకారులను చూసిన వారిలో ప్రఖ్యాత ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ కూడా ఉన్నారు. ఆయన భగత్‌సింగ్‌ను దృష్టిలో పెట్టుకుని ‘‘ప్రాణానిది ఏముంది, పుడుతుంది గిడుతుంది. కానీ, ఒక వ్యక్తి ఎంత హుందాగా మరణించాడు అన్నది మాత్రమే అందరి జ్ఞాపకాల్లో మిగిలి ఉంటుంది’’ అన్నాడు. అర్థవంతమైన మరణాన్ని ఆహ్వానిస్తూ గడిపిన వ్యక్తిత్వం భగత్‌సింగ్‌ది. అదే ఆయనను నిత్య యవ్వనశీలిగా ప్రపంచం పరిగణించేట్లు చేసింది.

- చెరుకూరి జ్యోతి

(మార్చి 23: భగత్‌సింగ్‌ అమరుడైన రోజు)

Updated Date - Mar 21 , 2026 | 03:47 AM