ఏజెన్సీలో ఆదివాసీల పాలనే సాగాలి
ABN , Publish Date - Sep 19 , 2026 | 12:54 AM
ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు, నిధులు నియామకాలు ఆంధ్రా వారు దోచుకున్నారు. తెలంగాణ వచ్చాక మైదాన ప్రాంతం వారు దోపిడీ చేస్తున్నారు. నేడు ఆదివాసీల రిజర్వేషన్లను కబ్జా చేయాలని కుట్రలు పన్నుతున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు, నిధులు నియామకాలు ఆంధ్రా వారు దోచుకున్నారు. తెలంగాణ వచ్చాక మైదాన ప్రాంతం వారు దోపిడీ చేస్తున్నారు. నేడు ఆదివాసీల రిజర్వేషన్లను కబ్జా చేయాలని కుట్రలు పన్నుతున్నారు. ఏజెన్సీలో చట్టవిరుద్ధంగా, రాజ్యంగ విరుద్ధంగా పీసా చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో జిల్లాల పునర్విభజన పేరుతో ఆదివాసీ ప్రాంతాలను మైదాన ప్రాంతాలలో కలిపారు. 90శాతం ఆదివాసుల రిజర్వేషన్ ఉద్యోగాలను లంబాడీలు చట్టవ్యతిరేకంగా దోచుకుంటున్నారు. మరోవైపు చెల్లప్ప కమిషన్ ద్వారా మరో మూడు కులాలను ఎస్టీ జాబితాలో కలిపి ఆదివాసులను నిర్వీర్యం చేస్తున్నారు. ఈ విధ్వంసంపై ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు, మేధావులు, రాజకీయ పార్టీలు నోరు మెదపటం లేదు.
బ్రిటీషు వారి కాలం నుంచి ఆదివాసీలకు అడవిపై హక్కు ఉంది. కానీ నేటి పాలకులు ఈ హక్కులను కాలరాస్తున్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వడం లేదు. ఉన్న భూములలో ట్రెంచ్ కొడుతున్నారు. బహుళజాతి కంపెనీలకు అడవినీ, అటవీ సంపదను, ఖనిజ వనురులను ధారాదత్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోకి గిరిజనేతరుల వలసలతో ఆదివాసీల చట్టాలు కనుమరుగు అవుతున్నాయి. పాల్వంచ కేటీపీఎస్‌లో నాలుగువేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. దీని నిర్మాణంలో ఆదివాసీలు భూములు, ఉపాధి కోల్పోయారు. భద్రాచలం బీపీఎల్ ఫ్యాక్టరీ నిర్మాణంలోనూ మణుగూరు బీటీపీఎస్ నిర్మాణంలోనూ, సింగరేణి సంస్థ కార్యకలాపాలలోనూ ఆదివాసీలు భూములు కోల్పోయారు. నిర్వాసితులకు ఉద్యోగాలు సైతం ఇవ్వడం లేదు.
గోదావరి జలాలను మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆదివాసీలకు తాగునీరు, సాగునీరు అందడం లేదు. గోదావరి ఇసుకను హైదరాబాద్, బెంగళూర్ తరలిస్తున్నారు. ఆదివాసీలు ఇళ్ళు కట్టుకోవడానికి ఇసుక ఇవ్వడానికి అటవీ శాఖ, పోలీస్ శాఖ ఎన్నో ఆంక్షలు పెడుతున్నాయి. 1/70 చట్టం రద్దు చేయడానికి భద్రాద్రి కొత్తగూడెం నుంచి 1700 మంది గిరిజనేతరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి.
ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని; ఐటీడీఏలో అటెండర్ నుంచి అధికారుల వరకు ఆదివాసీలనే నియమించాలని; ప్రభుత్వ ఉద్యోగాలన్నింటినీ ఐటీడీఏ ద్వారా భర్తీ చేయాలని; ఐటీడీఏ పరిధిలోని అన్ని ఏజెన్సీ మండలాల్లో ఆదివాసీలను తహసిల్దార్, ఎంపీడీవోలుగా నియమించాలని; ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, గిరిజనేతరుల పట్టాలు రద్దు చేయాలని; 1/70 చట్టం, పీసా చట్టం ఏజెన్సీలో పకడ్బందీగా అమలు చేయాలని ఆదివాసులు డిమాండ్ చేస్తున్నారు. చట్టాల అమలు కోసం, ఆదివాసీల అస్తిత్వం కోసం తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 21న భద్రాచలం ఐటీడీఏ ముట్టడి– ఆదివాసీ మార్చ్‌ను నిర్వహిస్తున్నారు.
- వూకె రామకృష్ణ దొర