Chief PR Officer: చంద్రబాబుతో... ఆ తొమ్మిదేళ్లూ!
ABN , Publish Date - Jan 09 , 2026 | 05:09 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు 1995 సెప్టెంబర్ 1న ప్రమాణ స్వీకారం చేశారు. నేనూ అదే రోజున చీఫ్ పీఆర్‌ఓగా బాధ్యతలు చేపట్టాను. ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి చంద్రబాబుకు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు 1995 సెప్టెంబర్ 1న ప్రమాణ స్వీకారం చేశారు. నేనూ అదే రోజున చీఫ్ పీఆర్‌ఓగా బాధ్యతలు చేపట్టాను. ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి చంద్రబాబుకు రాష్ట్రాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టాలని, దేశదేశాల్లో ఉన్న అభివృద్ధి నమూనాలను రాష్ట్రంలో అమలు చేయాలని ఉండేది. అందుకే మొదట్లో ఆయన ఎన్నో విదేశీ పర్యటనలు చేశారు. ఆ దేశాల్లో తాను చూసిన అభివృద్ధి గురించి పత్రికల ద్వారా ప్రజలకు చేరవేయాలి అన్న తపన ఆయనలో ఎక్కువగా ఉండేది. ఆయనతో పాటు ఎన్నో దేశాలు తిరిగిన నేను ఆ వార్తలను రాష్ట్ర ప్రజానీకానికి అందించడంలో నూరుశాతం సఫలం అయ్యానని భావిస్తాను.
అప్పట్లో ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు. సెల్‌ఫోన్లు లేవు. ఇన్ని టీవీ చానెళ్లు లేవు. అలాంటి కాలంలో సమాచార నిర్వహణలో నేను పడ్డ అవస్థలు అన్నీ ఇన్నీ కావు. 1995– 2004 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మలేషియా, సింగపూర్, అమెరికా, చైనా, జపాన్, హాంకాంగ్, దుబాయ్, ఇటలీ, లండన్ దేశాల్లో పర్యటించారు. ఈ పర్యటనల సమాచారాన్ని ఏ రోజుకు ఆ రోజు పత్రికలకు పంపి ప్రచారాన్ని కల్పించడం నా పని.
ముఖ్యంగా అమెరికా పర్యటనలు నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి. చంద్రబాబు నాయుడు ఉదయం లేచిన దగ్గర నుంచి ఏవో మీటింగ్స్‌లో, పారిశ్రామికవేత్తలతో సమావేశాల్లో పాల్గొనేవారు. ఒక్కోసారి అవి రాత్రి 10 గంటల వరకు జరిగేవి. నేను ప్రతి మీటింగ్‌కూ హాజరై నోట్ చేసుకునేవాడిని, ఫొటోలు తీసుకునేవాడిని. గంపెడు వార్తలు ముందేసుకొని ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలకు మేం దిగిన హోటల్లోని బిజినెస్ సెంటర్‌కు వెళ్లి, వైట్ పేపర్‌పై న్యూస్ రాసుకొని వరుసగా హైదరాబాద్‌లోని మా కార్యాలయానికి ఫ్యాక్స్ పంపేవాడిని. ఆ కార్యక్రమం రాత్రి ఒంటిగంట వరకు ఒక్కోసారి ఉదయం నాలుగు వరకు కూడా జరిగేది. మా ఆఫీసులో పీఆర్‌ఓలు నాగేశ్వరరావు, చంద్రమోహన్, గోపీనాథ్ తెల్లవారేసరికి ఆఫీసుకు చేరుకుని ఫ్యాక్స్‌లు రిసీవ్ చేసుకుని, టైప్ చేయించి అన్ని పేపర్ ఆఫీసులకు పంపేవారు. అక్కడ పగలైతే ఇక్కడ రాత్రి కదా. అర్ధరాత్రి రూమ్ చేరుకొని కేవలం మూడు నాలుగు గంటలు కునుకు తీసి, మళ్ళీ గబగబా తయారై బాబు గారితో పాటు విమానం ఎక్కి మరో స్టేట్‌కు వెళ్లేవాడిని. ఆ రెండు వారాల పర్యటనలో రాత్రి భోజనం తిన్నది చాలా తక్కువ. చివరికొచ్చేసరికి బాగా అలసిపోయాను. సరైన నిద్ర, ఆహారం లేక బక్కచిక్కిపోయాను. షుగర్ లెవెల్స్ కొండెక్కాయి. అన్ని రోజులున్నా మేము అమెరికాలో పెద్ద పెద్ద బిల్డింగ్స్, హోటల్స్, ఏయిర్‌పోర్టులు తప్ప మరి ఇంకేమీ చూసింది లేదు. ఎలాగైనా అక్కడ ఆగి అమెరికా చూడాలన్న ఆశ కలిగింది. అదృష్టం కొద్దీ నా వెంట రాధాకృష్ణ, సుధాకర్‌రెడ్డి అనే పాత్రికేయ మిత్రులు కూడా వచ్చారు. వారే చంద్రబాబు దగ్గరకు వెళ్లి– ఇంకో రెండు వారాలు ఆగి ఇండియా వస్తామని అడిగారు. ఆయన సరేనంటూ తన దగ్గర మిగిలిన కొన్ని డాలర్స్ కూడా మాకు ఇచ్చేసి వెళ్లారు. మిత్రులు సీఎం రమేశ్ సౌజన్యంతో మరో రెండు వారాలు తిరిగాం!
సెల్‌ఫోన్ లేని ఆ కాలంలో అన్ని వ్యవహారాలు ల్యాండ్ ఫోన్‌లోనే. ముఖ్యమంత్రి కార్యక్రమాలు ఆ ముందు రోజు రాత్రి 10 గంటలకు, ఒక్కోసారి 12 గంటలకు, ఒక మెసెంజర్ తీసుకువచ్చి, ఇంటి డోర్ వద్ద వేసి వెళ్లేవాడు. ఆ లోపే ప్రధాన పత్రికా రిపోర్టర్లు– సీఎం మరుసటి రోజు కార్యక్రమాల గురించి తెలుసుకునేందుకు ఎడతెగకుండా ఫోన్లు చేసేవారు. అందరికీ జవాబులు చెబుతూ ఏ అర్ధరాత్రో పడుకొని వేకువజామున నాలుగు గంటలకు లేచేవాళ్ళం. సమాచారశాఖ వారు ఒక వాహనం ద్వారా ప్రధాన పత్రిక ఆఫీసులకు నేరుగా వెళ్లి, ఆ దినపత్రికలు తీసుకువచ్చి ఒక సెట్టు నాకు, ఆ తర్వాత ముఖ్యమంత్రి గృహానికి, ఆ తర్వాత సమాచార కమిషనర్ ఇంటికి ఇచ్చేవాళ్ళు. నేను వేకువజాము నుంచి ఒక్కో పత్రికను చూసి, అన్ని రకాల వార్తలు, ముఖ్యంగా సీఎం చర్య తీసుకోవాల్సిన వార్తలన్నీ ఓ పేపర్‌పై రాసుకునేవాడిని. ఉదయం 6:30 గంటలకల్లా ముఖ్యమంత్రి ఇల్లు చేరుకొని, అన్ని టైప్ చేయించి, తొమ్మిది గంటలకు కమిషనర్, నేనూ కలిసి ముఖ్యమంత్రికి వార్తలన్నీ బ్రీఫింగ్ ఇచ్చేవాళ్ళం. ఒక్కోసారి చంద్రబాబు తానే న్యూస్ పేపర్లు తిరగేసి, ఇంటి వద్ద నుంచే ఆ వార్తలకు సంబంధించి ఆయా అధికారులతో గానీ, కలెక్టర్లతో గానీ మాట్లాడేవారు. రానురాను మేం జిల్లా పేపర్లు కూడా తెప్పించుకొని కాస్త ఆలస్యమైనా ఆయనకు బ్రీఫింగ్ చేసేవాళ్లం. చంద్రబాబు గారికి రాష్ట్ర సమగ్ర సమాచారం మొత్తం ఏ రోజుకు ఆ రోజు తెలుసుకోవాలన్న ఆసక్తి వుండేది.
పాఠకులకు, వీక్షకులకు మా తెరవెనుక కష్టం తెలిసేది కాదు. అయినా ఎవరి మెప్పు కోసమో కాకుండా పూర్తి కమిట్మెంట్‌తో పనిచేసేవాళ్ళం. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. భారతదేశానికి మొదటిసారిగా అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ వచ్చారు. ఆ సందర్భంగా ఆయనకు చంద్రబాబును కలవాలన్న కోరిక కలిగింది. దీనికి ఓ ఫ్లాష్‌బ్యాక్ ఉంది. ఒకసారి న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్ చంద్రబాబునాయుడితో ఇంటర్వ్యూ చేయాలని హైదరాబాద్ వస్తే, నేను అతణ్ని ఒకరోజు చంద్రబాబుతో టూర్‌కు హెలికాప్టర్ ఎక్కించాను. చంద్రబాబు కృషిని కళ్లారా చూసి, అతను న్యూయార్క్ టైమ్స్ పేపర్‌లో ఓ పెద్ద ఆర్టికల్ రాశాడు. ఆ ఆర్టికల్ చదివిన క్లింటన్ తన ప్రెస్ సెక్రెటరీని పిలిచి, ఇండియా టూర్‌లో చంద్రబాబును కలిసే ప్రోగ్రాం పెట్టాలని ఆదేశించారు. అలా ఆయన హైదరాబాద్ వచ్చారు. క్లింటన్, చంద్రబాబు కలిసి కారులో పర్యటిస్తూ, గంటకుపైగా వివిధ అంశాలను చర్చించుకున్నారు. ఆ రోజు క్లింటన్‌కు వీడ్కోలు చెప్పి, చంద్రబాబు ఇంటికి వెళుతూ నాకు ఫోన్ చేసి, వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను దాదాపు అరగంట పాటు వివరించారు. అప్పటికే చీకటి పడింది. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ప్రెస్‌నోట్ టైప్ చేసి అందరికీ పంపడం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరికీ ఫోన్ ద్వారా తెలియజేయాల్సిన పరిస్థితి. అలా నాలుగు గంటలపాటు ప్రతి ఒక్కరికీ, ఒక్క అంశం కూడా మిస్ కాకుండా ఫోన్లో చెప్పి ముగించాను. మరుసటి రోజు అన్ని పేపర్లలో బ్యానర్ వార్తగా ఆ అంశం కనిపించగానే ఆ సంతోషంలో వాయువేగంతో సీఎం ఇంటికి చేరుకున్నా. మా పేషీ వాళ్ల కళ్ళల్లో నేను పడిన కష్టం కనిపించింది. చంద్రబాబు మాత్రం తన ఆనందాన్ని పైకి కనిపించకుండా గుంభనంగా దాచుకున్నారు. నాకైతే ఆయన కళ్ళల్లో బిగబట్టిన ఆనందం కనిపించింది.
ఇప్పుడేముంది..! ఇంటర్నెట్, వైఫై ఫోన్లు, కెమెరా ఫోన్లు, స్పీచ్ డిక్టేషన్స్... ఇంకా ఇంకా ఎన్నో వస్తూనే ఉన్నాయి. నిమిషాల్లో ఒక వార్తను ప్రపంచంలోని అన్ని పత్రికలకు, అన్ని చానెల్స్‌కు పంపేయచ్చు. దేశవిదేశాల్లో చంద్రబాబు ప్రోగ్రాంను లైవ్ పెట్టుకొని ఇక్కడే ప్రెస్‌నోట్స్ తయారు చేసుకోవచ్చు. కానీ 1995 నుంచి 2004 వరకు ఆ తొమ్మిదేళ్ల పాటు మేము టెక్నాలజీ లేని కాలంలోనే సమాచార వెలుగులు నింపాం. బిల్ క్లింటన్, పుతిన్ వంటి ఎందరెందరో మహానుభావుల్ని హైదరాబాద్ గడ్డపై కాలు మోపేలా చేశాం.
-డాక్టర్ ఎస్.విజయ్‌కుమార్
మాజీ చీఫ్ పీఆర్‌ఓ