బీసీ రిజర్వేషన్ల బిల్లుపై చిత్తశుద్ధి ఏదీ?
ABN , Publish Date - Apr 02 , 2026 | 05:19 AM
తొలి దశ జనగణన ఈ ఏడాది మొట్టమొదటగా డిజిటల్ విధానంలో చేపడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆరువేల కోట్లు కేటాయించి, 33 ప్రశ్నలతో కూడిన గెజిట్‌ను విడుదల చేసింది....
తొలి దశ జనగణన ఈ ఏడాది మొట్టమొదటగా డిజిటల్ విధానంలో చేపడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆరువేల కోట్లు కేటాయించి, 33 ప్రశ్నలతో కూడిన గెజిట్‌ను విడుదల చేసింది. ఆ ప్రశ్నావళిలోని 12వ కాలమ్‌లో ఎస్సీ, ఎస్టీ, ఇతరులు అని పేర్కొన్నారు. కానీ దేశంలో 60 శాతం ఉన్న ఓబీసీల జనాభా లెక్కింపు కోసం ప్రత్యేక కాలమ్ లేదు. ప్రజలు ఏ ఇంట్లో ఉంటున్నారు? ఆ ఇంటి నిర్మాణంలో ఏ మెటీరియల్ వాడారు? ఆ ఇంటి నేల, గోడ, పైకప్పు ఏ రకం? ఏ రకమైన ఆహారం తింటున్నారు? ఏ నీళ్లు తాగుతున్నారు? ఏ పొయ్యి వాడుతున్నారు? టీవీ, కంప్యూటర్, టూవీలర్స్, కార్లు, ఇంటర్నెట్ సౌకర్యాలు లాంటి డేటా సేకరిస్తున్నారు. మంచిదే కానీ, బీసీల డేటా సేకరించలేరా?
సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, వ్యాపారాల్లో తీవ్ర అసమానతలు ఎదుర్కొంటున్న, ఉత్పత్తి కులాలైన ఓబీసీలకు చట్టబద్ధంగా రావలసిన రిజర్వేషన్లు అందుకోవడానికి బీసీ సమాజం ఎందుకు ఇంకా బలహీనంగా పోరాడుతోంది? బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తే భవిష్యత్తులో గ్రామాలలో, పట్టణాలలో అగ్రకులాల ప్రాబల్యం, ఆధిపత్యం, పెత్తందారి నియంతృత్వానికి భారీగా గండిపడుతుంది. బీసీలు భవిష్యత్తులో చట్టసభలలోకి ప్రవేశిస్తే దేశ, రాష్ట్ర రాజకీయాలలో ఓబీసీల ఆధిపత్యం పెరుగుతుందనే భయం ఉంది. అందుకే అగ్రకులాలు రాజకీయంగా, కోర్టుల ద్వారా రిజర్వేషన్లను అడ్డుకుంటున్నాయి.
విచిత్రం ఏమిటంటే తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. బీజేపీ ఈసారైనా పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి మండల్ కమిషన్ చెప్పినట్లు వారికి విద్యా, ఉద్యోగ, రాజకీయాలలో 52శాతం రిజర్వేషన్లు ఇచ్చే విషయంపై చర్చ పెట్టాలి. రాష్ట్రస్థాయిలో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చని చెప్పింది బీజేపీ. ఆ బిల్లును రాష్ట్రపతి, ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఇంతవరకు ఆమోదించలేదు. ఇది పార్లమెంట్‌లో చట్టం చేయాల్సిన అంశమని, బీజేపీ రాష్ట్ర నాయకులు కేంద్రంలో పెద్దలకు ఎందుకు చెప్పి ఒప్పించలేకపోతున్నారు? 42శాతం బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అగ్రకులాలు కోర్టులో పిటిషన్ వేస్తే, బీసీలకు మద్దతుగా ఇంప్లీడ్ పిటిషన్లు కూడా వేయని పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ మాత్రమే.
ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు విద్య, ఉద్యోగాలలో మాత్రమే రిజర్వేషన్లు 50శాతం పరిమితి మించరాదని చెప్పింది. ఎక్కడా రాజకీయ రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రపతికి, గవర్నర్‌కు పంపిన బిల్లుల విషయంలో పరిమిత గడువులోపు వారు ఆమోదించడమో, వ్యతిరేకించడమో చేయాలి. లేకపోతే ఆ బిల్లు ఆటోమేటిక్‌గా చట్టంగా మారుతుంది. ఆ మార్గదర్శకాలను హైకోర్టు పాటించకపోవడం రాజ్యాంగ విరుద్ధం కాదా? సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చూస్తే రిజర్వేషన్లు 50శాతం పరిమితి దాటొద్దు కానీ కేంద్రంలో బీజేపీ, తెలంగాణలో కేసీఆర్ వల్ల విద్య, ఉద్యోగాల్లో 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వడంతో మొత్తంగా 60శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇక్కడ సుప్రీంకోర్టు గత తీర్పు వర్తించదా!
ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు తప్ప మిగతా మెజారిటీ సీట్లలో అగ్రకులాలదే ఆధిపత్యం. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50శాతం రాజకీయ రిజర్వేషన్లు ఉంటే, 10శాతం లేని ఓసీలు మిగిలిన సీట్లన్నీ అనుభవిస్తున్నారు. దీన్ని ఎలా అనుమతిస్తాయి కోర్టులు? ఇది రాజ్యాంగపరంగా సమన్యాయమేనా? ఓబీసీలకు 42శాతం, ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్లు ఇచ్చినా 67శాతం అవుతుంది. ఇక మిగిలిన 33శాతం సీట్లను 10 శాతం కూడా లేని ఓసీలే అనుభవిస్తారు కదా! ఏ రకంగా చూసినా ఎక్కువ ప్రయోజనం పొందేది అగ్రకులాలే! దీనిని కోర్టులు ఎందుకు గమనించడం లేదు?
ఇంకో విషయం ఏమిటంటే ట్రిపుల్ టెస్ట్ చేయాలి అంటున్నాయి కోర్టులు. అసలు ఈ ట్రిపుల్ టెస్ట్‌లో ఏముందంటే– 1) స్థానికంగా ఓబీసీల సమగ్ర వివరాలు సేకరించాలి, దానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. 2) కమిషన్ అధ్యయనం తర్వాత రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించాలి. 3) మొత్తం రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదు. మూడో పాయింట్‌కు సంబంధించి బీసీల ఎంపిరికల్ డేటా ప్రకారం పెంచాలని ఉన్నా, అది 50శాతం దాటొద్దు. మరి పెరిగిన బీసీల జనాభా డేటాతో రిజర్వేషన్లు పెంచకపోతే, సేకరించిన ఆ డేటాతో పని ఏం ఉంటుంది? 50శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వనప్పుడు ఆ ట్రిపుల్ టెస్ట్ అవసరమే లేదు. మిగతా సామాజికవర్గాలతో పాటు ఓసీలకు కూడా విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో వారి జనాభా ఎంతో అంత రిజర్వేషన్లు ఇవ్వాలి.
బీజేపీ తక్షణమే పార్లమెంటులో బీసీ బిల్లును తొమ్మిదో షెడ్యూల్లో పెట్టి, దేశవ్యాప్తంగా ఓబీసీల జనాభా ఎంత ఉందో, అంత శాతం రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగ, రాజకీయాలలో కల్పించాలి. లేకపోతే ఆ పార్టీ భవిష్యత్తును వారే ప్రమాదంలో పడవేసుకున్నట్టు అవుతుంది.
మండ్ల రవి
ఇవి కూడా చదవండి..
కాంగ్రెస్ ప్రిన్స్‌కు వందోసారి కూడా ఓటమి ఖాయం: మోదీ
ఎన్డీయే వస్తే తమిళనాడును దక్షిణ ప్రదేశ్‌గా మార్చేస్తారు: స్టాలిన్