Share News

పునర్విభజనతో బీసీ తల్లులకేం లాభం?

ABN , Publish Date - Mar 31 , 2026 | 01:31 AM

చట్టసభల్లోకి ఇప్పటి వరకు పెద్దకులాల వాళ్లే వస్తున్నారు, మేమెప్పుడూ అసెంబ్లీ, పార్లమెంటు గడపల్లోకి వెళ్లలేదని గత 8 దశాబ్దాలుగా బీసీ సామాజిక వర్గాలు గొంతెత్తి అరుస్తున్నాయి.

పునర్విభజనతో బీసీ తల్లులకేం లాభం?

చట్టసభల్లోకి ఇప్పటి వరకు పెద్దకులాల వాళ్లే వస్తున్నారు, మేమెప్పుడూ అసెంబ్లీ, పార్లమెంటు గడపల్లోకి వెళ్లలేదని గత 8 దశాబ్దాలుగా బీసీ సామాజిక వర్గాలు గొంతెత్తి అరుస్తున్నాయి. దేశంలోని వేలాది బీసీ కులాల్లో ఉన్న వాళ్ళ నుంచి కొన్ని కులాల వాళ్లు మాత్రమే చట్టసభల్లోకి అడుగుపెట్టగలిగారు. స్వాతంత్య్రం వచ్చిన దగ్గర్నుంచి బీసీ కుల సర్వే చేయలేదు. చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు లేవు. బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలన్నది డిమాండ్‌గానే ఉండిపోయింది. కానీ ఇది దేశంలో సగం జనాభాగా ఉన్న వారి సామాజిక న్యాయానికి సంబంధించిన విషయమని మాత్రం నేటికీ పాలకులు గుర్తించటం లేదు. బీసీ జనాభా దామాషా పద్ధతిలో చట్టసభలకు వెళ్లాల్సిన వారి స్థానంలో ఆధిపత్య పెద్దకులాల పెత్తందార్లు వస్తున్నారు.

బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వకుండా దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు ఇవ్వడం దేశం గర్వించదగ్గదే కానీ, ఇందులో ఆకాశంలో సగం లాగా ఉన్న బీసీ మహిళలకు చోటులేదు. దాంతో పెద్దకులాల పెద్దలతో పాటుగా ఆధిపత్య కులాల మహిళలు కూడా చట్టసభలకు వస్తారు. (ఇది పెద్ద కుల మహిళలకు వ్యతిరేక వాదన కాదు. ఆ మహిళలతో పాటు కింద కులాల మహిళలకు చట్టబద్ధ రిజర్వేషన్లు లేకపోవడమే బాధాకరం.) ఇది బీసీ మహిళలకు ద్రోహం చేసినట్లే. ఈ మాట అన్నందుకే లాలూ ప్రసాద్, ములాయం సింగ్ యాదవ్‌లపై, ఆ వాదనను ముందుకు తెచ్చినవారిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు కూడా ఈ వాదన చేసేవారి పైన ఆరోపణలు చేసి తీరుతారు.


మహిళలకు 33శాతం రిజర్వేషన్లు రావటం ఎంత ఆనందకరమో, అదే సమయంలో అందులో బీసీ మహిళలకు రిజర్వేషన్లు రాకపోవడం మరింత బాధాకరం. చట్టసభల్లో బీసీ మహిళలకు రిజర్వేషన్లు లేకుండా 33శాతం అమలు జరిగితే, అది దేశానికి చెందిన సగం మంది మహిళలకు తీరని నష్టం చేసేదే అవుతుంది. తెలంగాణ శాసనసభ స్థానాల సంఖ్య 179కి, లోక్‌సభ స్థానాలు 26కు పెరిగితే అసెంబ్లీలో 60 స్థానాలు మహిళలకు వస్తాయి. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడంతో కింది కులాల మహిళలు తరతరాలుగా చేతివృత్తులు చేసే బీసీ తల్లులు అసెంబ్లీ, పార్లమెంట్‌లోకి రాలేరు. ఇప్పటివరకు మహిళల స్థానాలను పెద్ద కులాల పురుషులు ఎట్లా ఆక్రమించారో, ఇప్పుడు 33శాతం మహిళా రిజర్వేషన్ల నిండా పెద్ద కులాలు, ఇప్పటికే అధికారంలో ఉన్న కుటుంబికుల కులాల వారే ఆ స్థానాల్లోకి వస్తారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో మళ్లీ పెద్ద కులాల మహిళలకే అధికారం దక్కుతుంది తప్ప కంచరి, కమ్మరి, సాలెమగ్గాల, గంగపుత్రులు, బాలసంతు, బుడబుక్కల వంటి 130 బీసీ కులాలకు చెందినవాళ్లు అసెంబ్లీలోకి అడుగుపెట్టలేరు. గడిచిన 16అసెంబ్లీ ఎన్నికల్లో 95 మంది మహిళలు ఎన్నికయ్యారని లెక్కలు చెబుతున్నాయి.

నియోజకవర్గాల పునర్విభజనతో చేతి పనులు చేసే కులాలు, కాయకష్టం చేసి దేశ నిర్మాణం చేసే బడుగుల తల్లులు చట్టసభల్లోకి వచ్చినప్పుడు అది మొత్తం మహిళాలోకానికి పరిపూర్ణ స్వాతంత్య్రం వచ్చినట్టుగా భావించాలి. లేదంటే అది కింది కులాల వారికి అర్ధస్వాతంత్య్రమే అవుతుంది. పునర్విభజన జరగబోతుందనగానే మళ్లీ ఆధిపత్య వర్ణాల, వర్గాల వారే వారి సతీమణులను, కూతుళ్లను, కోడళ్లను, బంధువులను ఎట్లా నిలబెట్టుకోవాలా అనే తలంపులో ఉంటారు. కానీ కింది కులాల్లో వెట్టి చాకిరీ చేసే వర్గాల తల్లులను చట్టసభల్లోకి తేవాలని ఏ ఆధిపత్య వర్గాల నాయకత్వాలూ ఆలోచించవు. బీసీలు, ఎంబీసీలు, సంచార, అర్ధ సంచార విముక్త జాతుల తల్లులకు ఎలాంటి ప్రయోజనమూ చూపని నియోజకవర్గాల పునర్విభజన ఎండమావి వంటిదే. దేశంలోని ఉత్పత్తి శక్తుల తల్లులు చట్టసభల్లోకి వచ్చేలా ప్రత్యేకంగా రిజర్వేషన్లు తెచ్చినప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.

-జూలూరు గౌరీశంకర్

Updated Date - Mar 31 , 2026 | 01:32 AM