Share News

శుభ సంకేతాలు

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:43 AM

బంగ్లాదేశ్‌ ఎన్నికల్లో తమ ఘోరపరాజయానికి మాజీ ప్రధాని షేక్‌హసీనా, భారతదేశం, ఇప్పుడు ఘనవిజయం సాధించిన తారీఖ్‌ రహ్మాన్‌ ఉమ్మడి కుట్ర కారణమని నేషనల్‌ సిటిజన్‌ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు నహీద్‌ ఇస్లామ్‌ గురువారం చేసిన ఆరోపణలో...

శుభ సంకేతాలు

బంగ్లాదేశ్‌ ఎన్నికల్లో తమ ఘోరపరాజయానికి మాజీ ప్రధాని షేక్‌హసీనా, భారతదేశం, ఇప్పుడు ఘనవిజయం సాధించిన తారీఖ్‌ రహ్మాన్‌ ఉమ్మడి కుట్ర కారణమని నేషనల్‌ సిటిజన్‌ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు నహీద్‌ ఇస్లామ్‌ గురువారం చేసిన ఆరోపణలో ఏ మాత్రం నిజం ఉన్నా సంతోషించాల్సిందే. ఆయన చెప్పినట్టుగా బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌పార్టీ ఘనవిజయంలో భారతదేశం కీలకహస్తం ఉన్నపక్షంలో తారీఖ్‌ రహ్మాన్‌ కొత్తప్రభుత్వంతో దౌత్యసంబంధాలకు ఇక తిరుగే ఉండదని అర్థం. హసీనాకు వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమాన్ని నడిపి, ఆమెను దేశంనుంచి వెళ్ళగొట్టిన ఈ నాయకుడు తమ కష్టమంతా సీట్లుగా మారనందుకు నిరాశలో ఏదో మాట్లాడుతున్నాడు. జమాత్‌ ఏ ఇస్లామీ కూటమి అద్భుతవిజయాలు సాధించి అధికారంలోకి రావాల్సివుండగా, ఈ కుట్రవల్లనే అది దూరంగా ఉండిపోవాల్సివచ్చిందని నహీద్‌ అంటున్నారు. ఎన్నికల్లో బీఎన్పీ ఘనవిజయం సాధించగానే దేశంలో చాలాచోట్ల స్థానిక అవామీలీగ్‌ నాయకులు తమ పార్టీ కార్యాలయాలు తెరిచారని, తామే ఎన్నికల్లో గెలిచినంత సంబరంగా నినాదాలు చేశారని, ఉమ్మడికుట్రకు ఇది బలమైన నిదర్శనమని ఈ యువనేత అంటున్నాడు. హసీనాను దేశంనుంచి తరిమివేసిన తరువాత ఆమె పార్టీ నాయకులమీదా, హిందువులతో సహా ఆమె మద్దతుదారులమీదా జమాతే దాడులు చేసిన సంగతి తెలిసిందే. నోబెల్‌ పురస్కార గ్రహీత మహ్మద్‌ యూనిస్‌ అండదండలతో బంగ్లాదేశ్‌లో జమాతే శక్తులు వరుస హత్యలకు తెగబడ్డాయి. హసీనా పేరెత్తడానికే వొణికిపోయే వాతావరణాన్ని తాము సృష్టిస్తే, ఇప్పుడు బీఎన్పీ రాగానే పరిస్థితులు మళ్ళీ మొదటికొచ్చాయని ఇతగాడి బాధ కాబోలు.


అధ్యక్షుడి అధికారిక నివాసం బంగభవన్‌లో కాక, పార్లమెంట్‌ భవనంలో పదవీ ప్రమాణం చేయడం ద్వారా తారీఖ్‌ రహ్మాన్‌ చక్కని సందేశం ఇచ్చారు. ఏడాదిన్నరపాటు అల్లకల్లోలంగా ఉన్న దేశం తిరిగి గాడినపడిన ధైర్యం బంగ్లాదేశీయులకు కచ్చితంగా కలిగివుంటుంది. ఇద్దరు బేగమ్‌ల మధ్య దశాబ్దాలపాటు సాగిన యుద్ధంలో బంగ్లాదేశ్‌ నలిగిపోయింది. సమస్త వ్యవస్థలూ ఆ గట్టూ ఈ గట్టూ లెక్కనే పనిచేశాయి. ఇప్పుడు ఖలీదా ఈ లోకంలో లేరు, హసీనా దేశంలోనే లేరు కనుక ఒక కొత్తశకం ఆరంభమైందని బంగ్లామేధావులు నమ్ముతున్నారు. తారీఖ్‌ రహ్మాన్‌ తన తీరులో, మాటలో ఇప్పటికైతే ప్రజాస్వామికంగానే కనిపిస్తున్నారు. బంగ్లాప్రజలకు అసలైన ప్రజాస్వామ్యాన్నీ, హక్కులనూ హామీ ఇస్తున్నారు. మత, జెండర్‌ వివక్షలు లేని సమాజం గురించి మాట్లాడుతున్నారు. ఒక రాజకీయ కుటుంబం వారసుడుగా కాక, దేశాన్ని ఉద్ధరించి, ఉచ్ఛస్థితిలో నిలపెట్టబోయే మహానాయకుడుగా జనానికి కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. దేశం మొత్తాన్ని ఒక్కటిగా ఉద్దేశించి మాట్లాడుతున్నారు. సంప్రదాయ బీఎన్పీ ఓటర్లతోపాటు అవామీలీగ్‌ ఓటర్లు, ముఖ్యంగా తమ రక్షణ గురించి తీవ్రంగా భయపడుతున్న హిందూ ఓటర్లతో సహా మైనారిటీలంతా ఆయనకే ఓటుచేశారు. యూనిస్‌ ఏలుబడిలో తమకు జరిగిన అన్యాయం ఇక పునరావృతం కాబోదని వారు ఆశపడుతున్నారు. తాలిబాన్‌ ఏలుబడిలో అఫ్ఘానిస్థాన్‌ మాదిరిగా తమ దేశం తయారు కాకూడదని కోరుకున్నవారంతా జమాతేను తారీఖ్‌ అదుపుచేయగలరని నమ్ముతున్నారు. తన రాజకీయమనుగడకోసం తారీఖ్‌ తీరు మార్చుకోరని అనుకుంటున్నారు.


ఖలేదాజియా అనారోగ్యంతో ఉన్నప్పుడూ, అనంతరకాలంలోనూ భారతదేశంనుచి తారీఖ్‌కు సానుకూల, సయోధ్య సందేశాలు అనేకం అందాయి. ఆయన కూడా చక్కగానే ప్రతిస్పందించాడు. అయితే, షేక్‌ హసీనా అప్పగింత వ్యవహారం ఉభయదేశాల మధ్యా ఒక కీలకమైన, వివాదాస్పద అంశంగా కొనసాగుతుందనడంలో సందేహం లేదు. కానీ, ఆ విషయంలో ఒత్తిడి కొనసాగిస్తున్నప్పటికీ, ఇతరత్రా అంశాల్లో సత్సంబంధాలతో దానిని ముడిపెట్టే ఆలోచన తమకు లేదని తారీఖ్‌ రహ్మాన్‌ పార్టీ తన ఘనవిజయం అనంతరం విస్పష్టంగా ప్రకటించడం పెద్ద ఊరట. హసీనాకాలం నాటి సాన్నిహిత్యం సాధ్యపడకపోయినా, యూనిస్‌ ఏలుబడిలో మాదిరిగా ఉభయదేశాల సంబంధాలు దిగజారవని అనుకోవచ్చు. అయితే, 208 స్థానాల్లో 68 గెలుచుకొని రెండవ అతిపెద్దపార్టీగా అవతరించిన జమాతే ఇస్లామీ, వాటిలో 58 స్థానాలు భారత్‌ సరిహద్దుల్లోనే సాధించిన విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రధానంగా పశ్చిమబెంగాల్‌, అసోం రాష్ట్రాలకు అటువైపున ఈ సంస్థ బలంగా ఉన్నందున, భారత్‌ అప్రమత్తంగా ఉండటంతో పాటు, మన నాయకుల మాటలూ చేష్టలూ అదుపులో ఉండటం కూడా అవసరం.

Updated Date - Feb 21 , 2026 | 12:44 AM