కాలాతీతాన్ని కాలంతో కొలవగలమా?
ABN , Publish Date - Jun 14 , 2026 | 12:04 AM
‘అన్ని మతాలూ సనాతనం వైపే’ శీర్షికతో నేను రాసిన (మే 24, 2026) వ్యాసానికి ప్రతిస్పందనగా ‘సనాతన ధర్మం, చరిత్ర ఒకటేనా?’ అంటూ రాణి శివశంకర శర్మ మే 31న వ్యాసం రాసినారు.
‘అన్ని మతాలూ సనాతనం వైపే’ శీర్షికతో నేను రాసిన (మే 24, 2026) వ్యాసానికి ప్రతిస్పందనగా ‘సనాతన ధర్మం, చరిత్ర ఒకటేనా?’ అంటూ రాణి శివశంకర శర్మ మే 31న వ్యాసం రాసినారు. కానీ ఆయన ప్రతిస్పందన నా వ్యాసంలోని ప్రధాన అంశాల గురించి లేదు. నా వ్యాసంలో నేను మూడు ప్రధాన అంశాలు ప్రతిపాదించినాను. 1. సనాతనం అంటే ఏమిటి? 2. అన్ని మతాలు ‘సనా’ అనబడే దేశకాలాతీత సత్యం వైపు పనిచేసేవే 3. ఒక తల్లికి పిల్లలు ఒకరు ముందు, మరొకరు తర్వాతా పుట్టినట్లు మతాలు కూడా సనాతనం నుంచి వెనకా ముందూ పుట్టినాయి. ఆ విధంగా అన్నీ సోదరమతాలే! అన్నీ సనాతన మతాలే! కానీ శివశంకర శర్మ వ్యాసంలో ఈ మూడు అంశాలకు ప్రతిస్పందన లోపించింది. ఈ అంశాలని ఆయన వ్యతిరేకించనూ లేదు, వీటిస్థానంలో కొత్త ప్రతిపాదనలూ చేయలేదు. మరి ఆయన ప్రతిస్పందనకు లక్ష్యం ఏమి? పైగా, ప్రతిపాదన అనే విజ్ఞప్తిని కూడా గౌరవించకుండా అసందర్భ పాండిత్యంతో, అభాండాలతో విజృంభించడంలో ఆయన ఉద్దేశం ఏమిటి? హిందూ ఫాసిస్ట్ అని లేబుల్ వేయడంలో మతలబు ఏమిటి? ఏ సాహిత్య సంస్థను తృప్తిపరచడానికి? ఏ సాహిత్య ముఠాను సంతోషపెట్టడానికి?
నేను ‘సనాతనం’ను భౌతికచరిత్రగా కుదించలేదు. కానీ మతాల చుట్టూ భౌతిక చరిత్ర వుంటుంది. దేశకాలాతీత సత్యాన్ని, దేశకాలబద్ధమైన చరిత్రలోకి కుదించే అవివేకమైన చర్యకు ఎవరైనా పాల్పడతారా? ‘మతాలన్నీ సనాతనం వైపే’ అన్న శీర్షికను చూసి, అది హిందూమత అహంకారం అని భావించినట్లు వున్నారు. కేవలం శీర్షికను బట్టి ప్రతిస్పందించడం అమాయకత్వం కాదా శర్మగారూ? శీర్షిక సరే, వ్యాసమంతా పరుచుకున్న విషయం మాటేమిటి? అది చదివితే మీ అపార్థం తొలగిపోయేది కాదా?
ఈ దేశంలోకి ఇస్లాం ప్రవేశం గురించి నేను మాట్లాడలేదు. గాంధార దేశం ఇస్లామీకరణ, గోవా క్రైస్తవీకరణ గురించి పేర్కొన్నాను. విదేశీమతాలు అనే భావన అంబేడ్కర్ కాలం నుంచీ వుంది. అతడు ఇస్లాం, క్రిస్టియానిటీని స్వీకరించకుండా బౌద్ధం స్వీకరించడంలో ఆంతర్యం ఏమిటి? ఇంకా అనేక కారణాలు వున్నాయికానీ ఇక్కడ అప్రస్తుతం. అయిననూ విదేశీమతాలను అబ్రహామిక్ మతాలు అని పిలవడానికి నాకు ఏ అభ్యంతరమూ లేదు. ఒక మతం ఎక్కువ, ఒక మతం తక్కువ అని నా వ్యాసంలో ఎక్కడైనా రాసివున్నానా? నేను అబ్రహామిక్ మతాలను కురచ మతాలు అని ఎక్కడా రాయలేదు. హిందూమతంతో పోల్చినపుడు వాటి ‘చారిత్రక కాలాలు’ కురచగా (వయసు రీత్యా) వుంటాయి అన్నాను. మరోసారి చదవండి. ఇది అనవసరమైన నింద కాదా?
ఈ దేశానికి– ఒకే దేవుడు వుండాలని, అది రాముడు అనీ! ఒకే గ్రంథం వుండాలని, అది భగవద్గీత అనీ! ఒకే భాష వుండాలని, అది హిందీ అనీ! బోధించే భారతీయ జనతాపార్టీ రాజకీయాలకు నేను దూరం. ఇది పూర్తిగా పాకిస్థాన్ ఇస్లామిక్ స్టేట్‌కు అనుకరణ! శిలాసదృశమైన మతాన్నిగానీ, సమాజాన్నిగానీ భారతీయ బహుళత్వం కోరుకోదు! నిజమే.. నేను వర్ణధర్మాన్ని తిరస్కరిస్తాను. మీరు భుజం మీద మోస్తారా? పుట్టుకతో మనిషి శూద్రుడు అంటాయట వేదాలు! గుణకర్మలతో ముడిపడిన వర్ణధర్మాన్ని ‘పుట్టుక’తో ముడిపెట్టడం నేను వ్యతిరేకిస్తాను.
నేను నిష్ఠురమైన సంగతులు మాట్లాడుతున్నానని తెలుసు. అంతమాత్రంచేత ముస్లిం వ్యతిరేకత ఆపాదించడం దుడుకుతనం కాదా? నా పొరుగింటి అల్లాబక్ష్‌ను ఎందుకు వ్యతిరేకిస్తాను? నా బాల్యమిత్రుడు ఖాసీంపీరాను ఎందుకు వ్యతిరేకిస్తాను? కానీ తీవ్రవాదుల జిహాద్ చర్యలకు పులకించిపోయే ముస్లింలను కూడా ప్రేమించమంటారా? జిహాద్‌ను ఖండించే ధైర్యం చేయలేని సెక్యులరిస్టులను ప్రేమించమంటారా? జిహాద్‌ను ఖండింప నిరాకరించే ముస్లిం ఉద్యమకారుల రహస్య అజెండాను మన్నించమంటారా?
నేను ప్రస్తావించిన జాతి గురించి మీరు అభ్యంతరం తెలిపారు. హిందూ ముస్లిం, క్రిస్టియన్ మతాలన్నిటినీ ఒక సుహృద్భావ వాతావరణంలోకి తెచ్చే జాతిస్పృహ, మన మధ్యయుగాల వర్ణధర్మం కంటే గొప్పది కాదా? కులనిర్మూలన వాదులలో ముస్లిం వ్యతిరేకత వుందన్న మీ సూత్రీకరణ చదివి ఆశ్చర్యపోయాను. ప్రతిదానినీ ఘర్షణాత్మకంగా చూడటం హిందుత్వ ఫాసిజంలో ఒక భాగం అన్నారు. దానిని నేనెందుకు వ్యతిరేకిస్తాను? ‘మతాలు, మతాల కాన్సెప్టులు సనాతనాలు కావు’ అన్నారు. అవన్నీ సనాతనం అని అన్నానా లేక ‘సనాతనం’ మతాలకు అతీతం అన్నానా? అబ్రహామిక్ మతాలతో పోల్చినప్పుడు హిందూ మతమే ప్రాచీన మతం అవుతుంది. అది గుర్తించడమేగానీ, గొప్పలు చెప్పుకోవడం అవుతుందా?
నేను హిందూ తాత్విక గ్రంథాలు చదివినానుగానీ హిందూవాదులు రాసిన చరిత్ర చదవలేదు. నేను సావర్కర్‌నూ చదవలేదు, వేదమూ చదవలేదు. సావర్కర్‌తో నాకు సామీప్యత ఏమిటి? ఆధ్యాత్మికతకు చరిత్రను ప్రాతిపదికగా స్వీకరించడం అనేదే చాలా అసంబద్ధమైన విషయం. అది, కాలాతీతాన్ని కాలంతో కొలవబోయే అవివేకం. అటువంటి బైరప్పతో నాకేమిటి సామీప్యత?
మ్లేచ్ఛ శబ్దానికి మీరు చెప్పిన అర్థాన్ని వ్యతిరేకించలేదే! వ్యాసంలో ఆ పదమే నేను ప్రస్తావించలేదే! మీకు గుర్తుకొచ్చిన పాండిత్యమంతా వెళ్లగక్కేదేనా సందర్భశుద్ధి లేకుండా? క్రైస్తవ మిస్టిక్ జ్ఞానానికి, అద్వైతానికి పోలికలు వున్నాయన్నారు. నేను చెప్పినది కూడా అదేకదా! శంకులో పోస్తేనే తీర్థమా శర్మగారూ! ‘నేను, నా తండ్రి ఒకరే’ ఇందులో వున్నది అద్వైతమే కదా!
ద్విజాతి సిద్ధాంతం హిందువులలో లేదు. దానిని సనాతన ధర్మానికి ఆపాదించే దురదృష్ట ఘడియలు ఎప్పటికీ రావు. హిందూ, పాకిస్థానీ ఒక్కటే డీఎన్ఏ మూలాలు కలిగివున్నాయని ఆధునిక జన్యుశాస్త్రం రుజువు చేసింది కదా. ఇక్కడ సనాతనం అంటే కాలాతీత సత్యం అనీ, సనాతన ధర్మం అంటే మతం అనీ భావించకపోతే పొరపాటు పడతారు.
ఈ బండి నారాయణస్వామి అనే జీవి– పాతబస్తీలో ఖామోషీబాబా దర్గాలో కూర్చున్నవాడు; చార్మినార్ పక్కన మక్కామసీదులో ప్రాచీన సమాధుల్ని ప్రేమగా తడిమినవాడు; సూఫీతత్వాన్ని కొంత అధ్యయనం చేసి ‘కడపటి యుద్ధం’ నవల రాసినవాడు; గుడి, చర్చి, మసీదు... ఎక్కడ దైవస్పృహ కలిగితే, అక్కడ సాగిలబడి మొక్కేవాడు. కాలాతీత సత్యం గురించి మాట్లాడటానికి హిందూవాదుల చరిత్రలు అవసరం అవుతాయా? శర్మగారూ.. మీ పాండిత్యం సమాజానికి ఉపయోగపడవలెనంటే ఆ పాండిత్యంలో నుంచి ఏదో మినహాయించుకోవలసిన అవసరం వుంది. అదేదో మీరే కనుక్కోండి. హిందూఫాసిస్టుగా ముద్రకొట్టడం వెనుక ఏ అభ్యుదయ, ఏ కమ్యూనిస్టు, ఏ సెక్యులర్, ఏ బ్రాహ్మణ భావజాల అహంకారం పనిచేసిందో మీకే తెలియవలె!సెక్యులరిజం అంటే– ముస్లింలను బుజ్జగించడమా? లేక ముస్లింలను ప్రేమించడమా?
- బండి నారాయణస్వామి