Share News

బహుజన బతుకమ్మ.. ఉత్సవం కాదు ఉద్యమం

ABN , Publish Date - Oct 13 , 2026 | 01:03 AM

పదహారవ ఏటకు చేరిన బహుజన బతుకమ్మ ఈ ఏడాది దాశరథి స్వగ్రామమైన మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ వర్షాభావం వల్ల గూడూరు చెరువు నిండలేదు.

బహుజన బతుకమ్మ.. ఉత్సవం కాదు ఉద్యమం

పదహారవ ఏటకు చేరిన బహుజన బతుకమ్మ ఈ ఏడాది దాశరథి స్వగ్రామమైన మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ వర్షాభావం వల్ల గూడూరు చెరువు నిండలేదు. అందుకే బహుజన బతుకమ్మను ఒక పంటల పండుగగా జరుపుకోవాలని ఎల్లంపేటకు మార్చాల్సి వచ్చింది.

అమెరికా–భారత్‌ మధ్య అసమాన వాణిజ్య ఒప్పందాలతో మన దేశ మార్కెట్లోకి ప్రవాహం లాగా వచ్చి పడుతున్న పాల ఉత్పత్తులు, చీజ్, సోయాబీన్‌.. మన రైతుల వెన్నెముక విరవనున్నాయి. అందుకే రైతాంగంతో భుజం కలుపుతూ ఆహార స్వావలంబన కోసం తెలంగాణ నవధాన్యాల సంస్కృతిని పునరుద్ధరించడమే సరైన ప్రత్యామ్నాయం అవుతుంది. తెలంగాణలోని వైవిధ్య పంటలు, చిన్న చిన్న కమతాలు, బహుజన సమూహాలు చిన్ననీటి వనరులను ఎత్తిపడితేనే కార్పొరేటీకరణను ప్రతిఘటించగలుగుతాం. ఇందుకోసం శ్రమజీవులైన దళిత బహుజనులను ఐక్యం చేయడానికి ఆటంకంగా ఉన్న సాంస్కృతిక సామాజిక అసమానతలపై బహుజన బతుకమ్మ పోరాడుతున్నది. బతుకమ్మకు ఎవరూ అంటరానివారు కాదని చెబుతూ దళితవాడలోంచి బయలుదేరుతున్నది. ‘దళితులను ఐక్యం చేయండి–దళితులతో ఐక్యంకండి’ అనే ఒక విప్లవ నినాదాన్ని ఊరూవాడల ఐక్యతగా అభివర్ణిస్తూ ఆచరిస్తున్నది. బతుకమ్మ ఒక పంటల పండుగ. బహుజన బతుకమ్మ ఒక సాంస్కృతిక ఉద్యమం అని చెబుతున్నాం.


బతుకమ్మ పంటల పండుగ అని చెప్పడం... గతించిన పెద్దలకు పితరుల అమావాస్య (పెత్తరామాస) నాడు కొత్త పంట బియ్యం సమర్పించడంతో మొదలవుతుంది. కుటుంబ పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని వండి, వారికి నైవేద్యంగా సమర్పించి దానిని బతికున్న ఇంటి పెద్ద ఆరగించడంతో ఎంగిలిపూల బతుకమ్మ ప్రారంభమవుతుంది. ఆ విధంగా ఎంగిలిపూల బతుకమ్మలకు ముందు బాలికలు తొమ్మిది రోజులు ఆడుకునే మట్టి బొడ్డెమ్మలు కేరళంలో జరిగే ఓనం పండుగ అలంకరణలతో పోలి ఉంటాయి. భూమిలోకి తొక్కేసిన బలి చక్రవర్తిని కేరళం ప్రజలు ఆ భూమిలో నుంచి తీసుకున్న మట్టిబొడ్డెమ్మలుగా (అవన్నీ అమరుల స్తూపాకారాల్లా ఉంటాయి) అలంకరించి అయిదు రోజులకు నీళ్లలో నిమజ్జనం చేస్తారు. మట్టి బొడ్డెమ్మ, పూల బతుకమ్మ, నీళ్లు, సద్దులు... ఇవన్నీ వ్యవసాయ నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లే. వీటికి తోడు బోనాలు. ఇవన్నీ స్త్రీల ఆధారిత పండుగలుగా ఎందుకున్నాయి? స్త్రీల పునరుత్పత్తికి–వ్యవసాయోత్పత్తికి ఉన్న సంబంధం ఏమిటి? స్త్రీల పునరుత్పత్తి మాత్రమే కొనసాగిన మాతృస్వామిక సమాజం తర్వాత మొదలైన తొలి సమాజమే వ్యవసాయోత్పత్తితో ప్రారంభమైంది. అది పారిశ్రామికోత్పత్తిగా మారి, కృత్రిమ మేధ (ఏఐ) రంగంగా మారినా, మనిషి ఆహారాన్ని తినడం మానలేదు. ఆహారంగా అందివచ్చిన పంటలకు పండుగను చేయడం ఆగలేదు.


పంటల పండుగలో ఆ పంటలకు మూలమైన శ్రమజీవుల్లో కొందరిని అంటరానివారిగా చూసే దురాచారాలు ఇప్పటికీ ఉన్నాయి. వాటిని మార్చాలి. దొరల గడీల ముందు ఆడే కాలం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ పతాకగా ఎగరేసి విజయం సాధించేదాకా బతుకమ్మలతో ఎన్నో అనుభవాలున్నాయి. స్వరాష్ట్రంలో దీనిని రాష్ట్ర పండుగగా, తంగేడు పువ్వును రాష్ట్ర పుష్పంగా ప్రకటించే వరకు ఎన్నో పరిణామాలున్నాయి. పితృస్వామ్యాన్ని ప్రశ్నించడం, సామాజిక న్యాయాన్ని సాధించడం, ఆచారాలను ప్రజాస్వామీకరించడం, ఆహార స్వావలంబన కోసం నవధాన్య సంస్కృతిని ఎత్తిపట్టడం, సామ్రాజ్యవాద జోక్యాన్ని ఎదిరించడం, పర్యావరణాన్ని రక్షించడం వంటి అనేక అంశాలను బహుజన బతుకమ్మ గత పదిహేనేళ్లుగా లేవనెత్తుతోంది. భారతదేశపు విశిష్ట దోపిడీ రూపంగా ఉన్న కుల వ్యవస్థతో బహుజన బతుకమ్మ దాదాపు తలపడుతున్నది.

పదహారేళ్లుగా 250కు పైగా కేంద్రాల్లో మేం చేస్తున్న పోరాటం ఇప్పటికీ ఒక ప్రజా ఉద్యమ రూపం తీసుకోలేదు. ఈ పోరాటాన్ని విస్తృతపరచడానికి ప్రతి గ్రామానికొక కార్యకర్త అవసరం. అలాగే దీని కొనసాగింపుగా అందుకోవడానికి రైతు–కూలీ రంగం, స్త్రీ విముక్తి రంగం, కుల నిర్మూలనా రంగం, ప్రత్యేకించి జెన్ జీ తరం ముందుకు రావడం కూడా అవసరం. గ్రామీణ స్వయం సమృద్ధి అనే అంశాన్ని లేవనెత్తుతూ ఈ దఫా భూముల పంపకం–నీటి పెంపకం–పర్యావరణ పరిరక్షణ లాంటి అంశాలను లేవనెత్తుతున్నాం. ఆదివాసులు డిమాండ్ చేస్తున్నట్టు నాగరిక సమాజం కూడా జల్–జంగల్–జమీన్ లాంటి అంశాలను, ఆహార స్వావలంబనను లేవనెత్తాలి. సాంస్కృతిక రంగంలో జరిగే కుల, వర్గ పోరాటాలను సమాజంలో జరిగే కుల, వర్గ పోరాటాలతో అనుసంధానం చేసే దిశగా ఆలోచనాపరులు ముందడుగు వేయాలి.


తెలంగాణ బతుకమ్మ ‘సద్దుల్లో’ నవధాన్యాలున్నట్లే, కేరళం ఓనం ‘సద్య’లో కొబ్బరి వంటకాలుంటాయి. అయితే ఓనం కుల–మతాలకతీతంగా లౌకిక పండుగగా జరుపుకుంటారు. విశ్వవ్యాప్తమైన బతుకమ్మను లౌకిక పండుగగా తీర్చిదిద్దుకోవాల్సిన సమయంలో, బతుకమ్మను నిలువెత్తు దేవతగా చిత్రించి, మరింత మతమయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏకత్వంలో భిన్నత్వంగా, గంగా–జమునా తహజీబ్‌గా ప్రసిద్ధిగాంచిన తెలంగాణ సమాజం వివేకంతో అడుగులేయాల్సిన సందర్భం ఇది. బహుజన బతుకమ్మ కేవలం ఉత్సవం మాత్రమే కాదు–ఉద్యమం కూడా.

- అరుణోదయ విమలక్క

బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ

Updated Date - Oct 13 , 2026 | 01:06 AM