Share News

బదులుగా ఏమంటావ్

ABN , Publish Date - Oct 26 , 2026 | 02:18 AM

నీ ప్రమేయమే లేని ఓ ఉనికి నీ ఆజ్ఞ అక్కరలేని ఆ శక్తి జోలపాటగా నీకు ఊపిరులందిస్తూనే ఉంటుంది...

బదులుగా ఏమంటావ్

నీ ప్రమేయమే లేని ఓ ఉనికి

నీ ఆజ్ఞ అక్కరలేని ఆ శక్తి

జోలపాటగా నీకు

ఊపిరులందిస్తూనే ఉంటుంది.

నీకు నువ్వే అర్థంకాని వెర్రివాడివైనా

నిశి వేళల్లో నీ కాపు కాస్తుంది.

నీలో నీకు పొసగని కుంపటివైనా

నిన్ను నిన్నుగా నిలబెడుతుంది.

కవ్వించి

తెగించి

కొన్నిసార్లు నీలోపలే ఉన్నానంటుంది.

అందుకే

భౌతికతకి తర్కం రంగు పూసి

మంచుపడ్డ దినాల్లో

ప్రపంచం బరువైపోదు అని అనుకుంటావ్

నదుల ఉధృతానికి

భూమి తత్తరపడిపోదు అని తీర్మానిస్తావ్.

సత్యంగా

ఏ పుట్టుకైనా కొత్తదేమీ కాదు.

కానీ నీ లోపలే ఒక అకారణ సంబరం

బదులుగా ఒక కొత్త కిటికీ తెరుచుకోగానే

అకాలమరణమై

హక్కుగా హత్తుకుంటుంది

తేరుకుని కుదురుకునేలోపు

అద్వితీయ ఆనందాలిచ్చి పురిగొల్పుతుంది

ఓర్వలేని బరువులిచ్చి తూకాన్ని చూడమంటుంది.

కళ్ళు మూయమంటుంది

కాంతులన్నీ పరుస్తుంది

రోదసి తివాచీపై

కాలాల్ని దాటేస్తుంది.

గ్రహాలన్నీ గుళికలై

దూరాలన్నీ మాయలై

ఉనికి మొత్తాన్ని

నీ వేకువ వాకిట వాల్చి...

‘‘ఇప్పుడు చెప్పు

నువ్వు మనిషివా

సనాతన జీవానివా

సమస్త విశ్వానివా’’ అని అడుగుతుంది.

ధీరజ్‌ కశ్యప్‌ వేముగంటి

ఈ వార్తలూ చదవండి

అభిజీత్ దీప్కే లాంటి వాళ్లు వస్తారు.. సీజేపీ నేతపై పీయూష్ గోయల్ వ్యాఖ్యలు..

గ్రీకు రెస్టారెంట్‌లో తొలి పరిచయం.. రాజీవ్‌ గాంధీతో ప్రేమకథను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ..

Updated Date - Oct 26 , 2026 | 02:36 AM