ఆశాజీ
ABN , Publish Date - Apr 14 , 2026 | 12:29 AM
ఆశాజీ!అమర సంగీత లోకానికి వెళ్ళిపోయావు, సుమధుర గీతాలను మాకు వదిలేసి, ఇక్కడ ఉదయాస్తమయాల మధ్య....
ఆశాజీ!
అమర సంగీత లోకానికి వెళ్ళిపోయావు
సుమధుర గీతాలను మాకు వదిలేసి
ఇక్కడ ఉదయాస్తమయాల మధ్య
గాలి అలలు అశాంతితో
నీ విషాద గీతాలను
పలవరిస్తున్నాయి
‘అభీన జావో ఛోడ్‌కర్’
గీతం ఒక వ్యంగ్య శరాఘాతం
సంగీత ఉద్యానవనంలో
ఎనిమిది దశాబ్దాలుగా
నీవు వెదజల్లిన పల్లవులు
తీగలై సాగి
హృదయతంత్రుల మీద మోగినాయి
‘దమ్ మారో దమ్’లో నీతోపాటు
గొంతు కలిపిన శిథిలరాత్రి
కోరస్‌ను విన్నాను
కన్నీట తీసిన గంధంలాగా
వెన్నెలలో పూల పడవలాగా
కవోష్ణశీతలాల కలయికలాగా
గుడిగంటలాగా పెనుమంటలాగా
నీ పాట పలికించిన సందర్భాలు వేవేలు
నిన్ను వింటూ పెరిగిన మాకు
నీ పాటల్లోని ఊపిరి
సప్తస్వరాల్లో కలిసిపోయిందన్నది
నమ్మశక్యం కాదు
ఒక్కోసారి సత్యం కూడా
కాలానికి సవాలు విసురుతుందా?
– అమ్మంగి వేణుగోపాల్
(మహాగాయని ఆశాభోంస్లే మరణానికి సంతాపంతో)