ఆర్టెమిస్ సందేశం!
ABN , Publish Date - Apr 04 , 2026 | 02:34 AM
చందమామ రావే అని పిలవడానికి అలవాటుపడిన మనకు, మేమే వస్తున్నామని చెప్పడం గర్వంగా ఉంటుంది. నేలమీదనుంచి నెలవంకను చూడటమే తెలిసిన మనకు
చందమామ రావే అని పిలవడానికి అలవాటుపడిన మనకు, మేమే వస్తున్నామని చెప్పడం గర్వంగా ఉంటుంది. నేలమీదనుంచి నెలవంకను చూడటమే తెలిసిన మనకు, అంత ఎత్తునుంచి భూగోళమే నెలవంకలా కనిపిస్తున్నందుకు ఆనందం కలుగుతుంది. ఆర్టెమిస్ ప్రయాణంలో మరెన్ని అద్భుతాలు చూడబోతున్నామో తెలియదు కానీ, ఆ నలుగురినీ మోసుకుంటూ, నిప్పులు చిమ్ముతూ నింగికెగసిన ఆ దృశ్యమే ప్రపంచాన్ని సంభ్రమంలో ముంచెత్తింది. అంతరిక్షం నుంచి అందుతున్న ఆ పుడమి చిత్రాలు మనసు పులకరింపచేస్తున్నాయి. చంద్రుడి మీదకు ఉరికేందుకు భూమి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఆ యాత్రికులకు వెనుకగా భూగోళం ఎంతో అందంగా కనిపించిందట. పదిరోజుల పాటు ఈ యాత్ర సేకరించబోయే జ్ఞానం, అందించబోయే అనుభవం చంద్రుడి మీద మరో రెండేళ్ళలో కాలూనడానికీ, ఆవాసాలు ఏర్పాటు చేసుకొని, గురుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికీ ఉపకరిస్తాయి.
వారంలో వెనక్కువస్తానని బయలుదేరిన సునీతా విలియమ్స్, నెలల తరబడి అంతరిక్ష కేంద్రంలో చిక్కుకొని, మళ్ళీ నేలమీద కాలూనుతానో లేదో తెలియనిస్థితిలో, తాను అక్కడనుంచి తెలుసుకున్న సత్యాలు కొన్ని ఆ తరువాత మనకు తెలియచెప్పింది. మొత్తం సౌరవ్యవస్థలో ఈ భూమి చాలా చిన్నదని చెబుతూ, మనకే అంతా తెలుసునన్నది పచ్చి అబద్ధమనీ, తెలిసినదానికంటే తెలియందే ఎక్కువని ఆమె గుర్తుచేసింది. అంతరిక్షం నుంచి భూమిని చూసిన తరువాత జీవితం పట్ల తన దృక్పథమే మారిపోయిందన్నారు ఆమె. అది నిర్వేదం కాదు. అక్కడనుంచి ఎంతో అందంగా, ఒకటిగా కనిపించే ఈ భూమిమీద దేశాల మధ్య ఉన్న చీలికలు, అడ్డుగోడలు, ఆధిపత్యపోరాటాలు ఆమెకు తుచ్ఛమైనవిగా అనిపించాయి. అంతరిక్షం నుంచి మన గ్రహాన్ని చూస్తే అంతా ఒకటిగానే ఉంటుంది, అదే నేల, అదే నీరు, అదే గాలి.. సాటి మనుషులపై ద్వేషం ఊహకు కూడా అందనిది, అర్థంలేనిది ఆన్నారామె.
చందమామను చుట్టిరావడానికి ఆర్టెమిస్ తన అంతరిక్షయాత్ర ఆరంభించిన వేళలోనే, ప్రస్తుతం భూగోళం మీద జరుగుతున్న యుద్ధాలన్నింటినీ దయుంచి ఆపివేయమంటూ నాలుగువేలమంది శాస్త్రవేత్తలు ఓ బహిరంగలేఖ రాశారు. నోబెల్ సహా అంతర్జాతీయస్థాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు పొందిన అనేకులు దీనిమీద సంతకాలు చేశారు. సాటిమనిషిని ప్రేమించలేనివాడు, మానవజాతి మనుగడను కాంక్షించలేనివాడు శాస్త్రవేత్త కాలేడని అంటారు. కాస్తంత మానవత్వంతో వ్యవహరించి ఈ యుద్ధాన్ని ఆపాలని వారంతా ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమీన్ నెతాన్యాహూను, ఐక్యరాజ్యసమితి అధినేతను ఈ లేఖలో కోరారు. ప్రపంచాన్ని ఆధునికయుగంలోకి తీసుకుపోవాలని శాస్త్రవేత్తలంతా కృషిచేస్తుంటే, కొందరు స్వార్థపరులైన దేశాధినేతలు ఈ భూమండలాన్ని వేలాది సంవత్సరాల వెనక్కు నెట్టేస్తున్నారని, యుద్ధాలు ఇలాగే కొనసాగితే దాని దుష్ర్పభావం ఈ గ్రహం మీద తీవ్రంగా ఉంటుందని వారు హెచ్చరించారు. ఒకపక్క యుద్ధాల్లో దేశాలు ధ్వంసమైపోతూ, వేలాదిమంది కన్నుమూస్తూ, లక్షలమంది నిరాశ్రయులైపోతూంటే, మిగతా ప్రపంచమంతా యుద్ధం సృష్టించిన విపరీత పరిస్థితులకు బలైపోతోంది.
సుదీర్ఘకాలంలో మానవ ఆవాసాల ఏర్పాటుకు ఆర్టిమెస్ యాత్ర ఉపకరిస్తుందని విశ్లేషకులు లెక్కలు కడుతున్నారు. యుద్ధాలతోనూ, ప్రకృతి విధ్వంసంతోనూ ఈ భూమండలాన్ని సర్వనాశనం చేస్తున్నవారు తమ భావితరాల ఉనికికోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారని కొందరు ఎగతాళి చేస్తున్నారు. చంద్రుడిమీద ప్రయోగాల్లో ముందంజలో ఉన్న చైనాను వెనక్కునెట్టేందుకు ఆర్టిమెస్ యాత్ర అమెరికాకు ఉపకరిస్తుంది. నాసా తన ఇతర ప్రణాళికలన్నీ పక్కనబెట్టి, యాభైయేళ్ళ తరువాత మళ్ళీ చంద్రుడి దగ్గరకు పరుగులు పెట్టడానికి చైనాతో పోటీ ప్రధానకారణం. స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజాన్ వంటి సంస్థలను సైతం నాసా తనకు సాయంగా రంగంలోకి దించి, సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకొని మరో రెండేళ్ళలో ఆర్టెమిస్–4 మిషన్ ద్వారా అమెరికన్లను అక్కడ దింపేందుకు సిద్ధపడుతోంది. మొన్న ఫిబ్రవరిలో చైనా తన శక్తిమంతమైన మార్చ్–10 రాకెట్‌కు పరీక్షలు విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో, అది కూడా మరో నాలుగేళ్ళలోపే చైనీయులను అక్కడ దింపే అవకాశాలున్నాయి. ఈ పరుగుపందెంలో ఎవరు ముందుగా చందమామ మీద కీలకప్రాంతాల్లో మకాం వేస్తారన్నది అటుంచితే, ప్రపంచశాస్త్రవేత్తలంతా అభ్యర్థించినట్టుగా అన్ని యుద్ధాలకు స్వస్తిచెప్పి, ముందు మానవసమాజాన్ని రక్షించుకోవడం ముఖ్యం.