‘స్త్రీ శక్తి’ పథకంతో ప్రయాణం నరకం!
ABN , Publish Date - Nov 07 , 2026 | 01:53 AM
ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో బస్సు ప్రయాణం చాలా కష్టంగా మారిపోయింది. ముఖ్యంగా మగవాళ్లకు బస్సులో సీటు దొరకటం అదృష్టమైపోయింది. దాదాపు అన్ని రూట్లలో బస్సులు కిక్కిరిసిపోయి స్టేజీలలో ఆపటం కూడా మానేశారు.
ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో బస్సు ప్రయాణం చాలా కష్టంగా మారిపోయింది. ముఖ్యంగా మగవాళ్లకు బస్సులో సీటు దొరకటం అదృష్టమైపోయింది. దాదాపు అన్ని రూట్లలో బస్సులు కిక్కిరిసిపోయి స్టేజీలలో ఆపటం కూడా మానేశారు. దీంతో బస్సు ప్రయాణం మగవాళ్లకు భారమవుతోంది. చివరికి మహిళలు కూడా కూర్చోటానికి సీట్లు లేక అవస్థలు పడుతున్నారు. ఈ ఉపద్రవానికి ముఖ్య కారణం ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులోకి రావటమే!
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఎన్నికలలో చేసిన వాగ్దానంలో భాగంగా ‘స్త్రీ శక్తి’ పథకం పేరుతో రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించింది. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ.1,942 కోట్లు ఖర్చు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు ఈ పథకం వల్ల అయ్యే ప్రయాణ వ్యయాన్ని భర్తీ చేయడానికి ప్రభుత్వం ప్రతి నెలా సుమారు రూ.162 కోట్లు విడుదల చేస్తోంది. రాష్ట్రానికి చెందిన మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు అందరూ ఈ పథకానికి అర్హులు. దీనికోసం ఆధార్ కార్డ్ వంటి గుర్తింపు కార్డును చూపించి బస్సు కండక్టర్ వద్ద ఉచిత టికెట్ పొందవచ్చు. ఏపీఎస్‌ఆర్టీసీకి చెందిన పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులలో ఈ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు.
ఉచిత బస్సు పథకం వల్ల మగవాళ్లతో పాటు ఆడవాళ్లు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మగవాళ్ల సంగతి అలా ఉంచితే, బస్సులో సీట్లు దొరకక ఆడవాళ్లే జుట్లు పట్టుకుంటున్నారు. వృద్ధులు, గర్భిణులు, రోగులు ఈ ఉచిత బస్సులు ఎక్కే పరిస్థితి లేదు. వారంతా ఎక్కువ ఖర్చుపెట్టి నాన్‌స్టాప్, ఏసీ బస్సుల్లో వెళ్లాల్సి వస్తోంది. ఇది అదనపు భారంగా మారింది. ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రవేశపెట్టి ఇలాంటి పరిస్థితిని కల్పించాడని ఆడవాళ్లే అనుకుంటున్నారు. ఈ వింత పరిస్థితి రావడానికి కూటమి ప్రభుత్వ ఓట్ల రాజకీయమే కారణం. ఈ ఉచిత బస్సు పథకాన్ని మొదట కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వం ప్రారంభించింది. తరువాత తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించాయి. తమిళనాడులో జోసెఫ్ విజయ్ ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని తమ రాష్ట్రంలో మరింతగా విస్తరించింది. ఇక్కడ గమనించవలసినది ఏంటంటే ఏ రాష్ట్రంలోనూ మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని కోరలేదు.
నిజంగానే మహిళలకు ఆర్థిక తోడ్పాటు అందించటానికి ఈ పథకాన్ని అమలుచేయదలచుకుంటే తెల్ల రేషన్ కార్డుదారులకు అందించటం ఒక పద్ధతి. అంతేకానీ ఆర్థిక తారతమ్యాలు లేకుండా మహిళలందరికీ అమలు చేయటం రాష్ట్ర ఆర్థిక వనరులను విచక్షణ లేకుండా ఉపయోగించటమే. ఈ విధానం ఎక్కడి వరకు వెళ్లింది అంటే, ఇంట్లో వంట చేసుకోవటానికి కొత్తిమీర లేకపోతే దగ్గర్లో ఉన్న టౌన్‌కి వెళ్లి తెచ్చుకుంటున్న సందర్భాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉచిత బస్సు ప్రయాణ పథకం దుర్వినియోగం అవుతుందని చెప్పటానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. ఇంత కాలం ముఖ్యమైన అవసరాలు ఉంటేనే బస్సు ప్రయాణం చేసేవారు. ఇప్పుడు అవసరం ఉన్నా, లేకపోయినా ప్రయాణాలు చేసే వారి సంఖ్య పెరిగిపోయింది.
ఈనాటికీ మారుమూల గ్రామాలలో తగినన్ని బస్సులు లేక చాలాకాలంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమైన ఈ సమస్యను పరిష్కరించడాన్ని పక్కనపెట్టి మహిళల ఓట్లను రాబట్టుకోవటానికి ఈ పథకాన్ని ముందుకు తెచ్చారు. ఉచిత బస్సు పథకం పేరుతో వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడానికి బదులు, తగినన్ని బస్సులను కొనుగోలు చేసి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించవచ్చు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూపించి బస్సులు కొనుగోలు చేయలేక ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తున్న పాలకులు, చివరకు ఆర్టీసీని కూడా ప్రైవేటుపరం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.
నిజంగా మహిళలను ఉద్ధరించాలనుకుంటే ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఈ పథకాన్ని అమలు చేసి, వారు నిలదొక్కుకోవడానికి స్వయం సహాయక ఆర్థిక పథకాలను కూడా అమలు చేయవచ్చు. మధ్యతరగతి మహిళా పారిశ్రామికవేత్తలకు కూడా ఇలాంటి పథకాలను వర్తింపజేయాలి. ఉన్నవారిని, లేనివారిని అందరినీ ఒకే గాటన కట్టి రాష్ట్ర ఖజానాను దివాలా తీయించే విధానాలకు పాలకులు స్వస్తి పలకాలి. ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా వెలుగులోకి వచ్చిన ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడానికి, అలాగే ఈ పథకంపై ప్రజల నుంచి వస్తున్న తీవ్ర విమర్శలను పరిగణనలోకి తీసుకొని పాలకులు తగిన నిర్ణయాలను సత్వరం తీసుకోవాలి.
- ముప్పాళ్ల భార్గవ శ్రీ
సీపీఐ ఎంఎల్ నాయకులు