డిఎస్‌సిలో అక్రమాలంటూ వ్యవస్థలపై దాడి
ABN , Publish Date - Oct 10 , 2026 | 01:12 AM
రాజకీయ స్వప్రయోజనాల కోసం డిఎస్‌సిలో అక్రమాల పేరిట గౌరవనీయ వృత్తిలో వున్న ఉపాధ్యాయలపైనా, విద్య, శాప్, పోలీసు వంటి వ్యవస్థలపైనా కూడా దాడి చేస్తున్నారు.
రాజకీయ స్వప్రయోజనాల కోసం డిఎస్‌సిలో అక్రమాల పేరిట గౌరవనీయ వృత్తిలో వున్న ఉపాధ్యాయలపైనా, విద్య, శాప్, పోలీసు వంటి వ్యవస్థలపైనా కూడా దాడి చేస్తున్నారు. స్వార్ధ రాజకీయాలకు వ్యవస్థలను బలిచేయడం సమాజానికి మంచిది కాదు. ఎంతో కష్టపడి డిఎస్‌సి పరీక్ష ద్వారా ఉత్తీర్ణులై తాము ఉద్యోగం సంపాదిస్తే, ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం సంపాదించినట్టు ఆరోపణలు చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు ప్రదర్శనగా ఇటీవల విజయవాడ శాప్ కార్యాలయానికి వస్తుండగా, వారిపై రౌడీమూకలు కోడిగుడ్లు, కర్రలతో దాడి చేసి, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాయి. ఒకవేళ అక్రమాలు జరిగినా ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలే కానీ, వ్యక్తులపై దాడి చేయకూడదు. న్యూఢిల్లీలో జరిగిన జెన్‌జీ ఉద్యమంలో కూడా నిజమైన విద్యార్థులపై కేసులు నమోదు చేయకుండా విద్యార్థుల ముసుగులో వున్న రౌడీలపై కేసులు కొనసాగించాలన్న సుప్రీంకోర్టు తీర్పును అనుసరించాలి. ఈ నేపథ్యంలో డిఎస్‌సిలో అక్రమాలు జరిగాయంటూ చట్టవ్యతిరేకంగా వ్యవహరించే వారిపై కేసులు నమోదు చేయడం సమంజసమే.
అసలు డిఎస్‌సితో సంబంధం లేని కొంతమంది నాయకులు అక్రమాలు జరిగాయంటూ హైకోర్టుకు వెళ్లగా, మీకేమి సంబంధం అంటూ న్యాయమూర్తులు ప్రశ్నించడంతో పాటు, నష్టపోయినవారు మాత్రమే ఆధారాలతో కోర్టుకు రావాలని పేర్కొన్నారు. అయితే అక్రమాలు జరిగాయంటూ ఆరోపించే నాయకులే కాదు.. డిఎస్‌సి పరీక్షలకు హాజరైన ఏ అభ్యర్థీ కోర్టుకు వెళ్లలేదు. కేవలం జిల్లా స్థాయిలో జరిగిన నియామకాలకు సంబంధించి దేశంలోనే అత్యున్నతమైన దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరడాన్ని బట్టి, డిఎస్‌సిని అడ్డుపెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలనే ఎత్తుగడ మాత్రమే కనిపిస్తోంది. తొలుత మొత్తంగా డిఎస్‌సి నిర్వహణలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన నేతలు, అధికారులు ఆధారాలతో సహా వివరణ ఇచ్చేసరికి, తాజాగా స్పోర్ట్సు కోటాలో అక్రమాలు జరిగాయంటూ గందరగోళం సృష్టిస్తున్నారు.
డిఎస్‌సి నిర్వహణలో అన్యాయం జరిగిందని నోటి మాటగా చెప్పేవారు ఎందుకు ఆధారాలతో కేసులు దాఖలు చేయడం లేదు? ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందారని ఆరోపణలకు గురైన ప్రతి ఉపాధ్యాయుడు తమ వద్ద ఉన్నవి నిజమైన సర్టిఫికెట్లు అంటూ వాటిని ప్రదర్శిస్తున్నారు. ఉదాహరణకి విశాఖపట్నానికి చెందిన యోగేశ్వరరావు అనే అభ్యర్థి అతని సోదరితో పాటుగా ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందారని, కనీసం టెట్ కూడా పాస్ కాలేదని వైసీపీ నేత జగన్మోహనరెడ్డి విలేకరుల సమావేశంలో ప్రస్తావించారు. దాంతో ఆ అన్నాచెల్లెళ్లు తమ సర్టిఫికెట్లు నకిలీవి కావని, రుజువు చేయడానికి ఎక్కడికైనా వస్తామని బహిరంగంగా ప్రకటించారు.
డిఎస్‌సిలో అక్రమాలు అంటూ నోటికి వచ్చిన ఆరోపణలు చేయడమే కాకుండా బ్రిడ్జి ఆట (వీరి దృష్టిలో పల్లెల్లో చెట్ల కింద కూర్చొని ఆడే పేకాట) ఆడినవారికి కూడా ఉద్యోగాలు ఇచ్చారంటూ ఒక ప్రబుద్ధుడు వ్యాఖ్యానించారు. బ్రిడ్జి ఆట కింద ఉద్యోగం పొందడం నిజమైతే రుజువు చేయాలి కదా? డిఎస్‌సి ఫలితాలను, ఏ కేటగిరీలో ఎవరు ఉద్యోగాలు పొందారు, వారికి వచ్చిన మార్కుల వివరాలను నెట్‌లో అందుబాటలో ఉంచారు. ఇదే సమయంలో డిఎస్‌సి నిర్వహణపై అసెంబ్లీలో చర్చించడానికి రావాల్సిందిగా సంబంధిత మంత్రి నారా లోకేష్ బహిరంగంగా ప్రకటించారు. నిజంగా డిఎస్‌సిలో అక్రమాలు జరిగివుంటే ఆ అన్నాచెల్లెళ్ల సర్టిఫికెట్లు నకిలీవని రుజువు చేస్తే చాలు.. అధికార పార్టీ పరువు పోతుంది. కానీ జగన్మోహన్‌రెడ్డి ఆ ప్రయత్నం చేయకుండా కేవలం సోషల్ మీడియాలో గందరగోళం సృష్టించడం ద్వారా ప్రభుత్వ వ్యవస్థలను అవహేళన చేస్తున్నారు.
వైసీపీ తరపున 11 మంది శాసనసభ్యులు విజయం సాధించినప్పటికీ ఏ ఒక్కరూ చట్టసభకు హాజరుకాకుండా ఆయా నియోజకవర్గాల ప్రజలను, సభను అగౌరపరుస్తున్నారు. డిఎస్‌సి వ్యవహారంలో చట్టసభనే గౌరవించనివారు చట్టబద్ధంగా వ్యవహరిస్తారని, ప్రభుత్వ వ్యవస్థలను గౌరవిస్తారని భావించడం అత్యాశ అవుతుందేమో!
- అన్నవరపు బ్రహ్మయ్య (జర్నలిస్ట్)